Showing posts with label Aaj Sajan Mohe Ang Lagalo. Show all posts
Showing posts with label Aaj Sajan Mohe Ang Lagalo. Show all posts

Wednesday, March 29, 2017

ఆజ్ సజన్ మొహె అంగ్ లగాలొ

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-56’
‘ఆజ్ సజన్ మొహె అంగ్ లగాలొ జనం సఫల్ హో జాయే’24 March at 19:05

(నీ బాహువుల్లోకి తీసుకో ఈవేళ నన్ను.జన్మ సఫలమయ్యేలా.)
...
ప్యాసా సినిమాలో గీతాదత్ పాడిన పాట ,సంగీతం ఎస్.డి.బర్మన్,రచన సాహిర్ లూధియాన్వి
హైస్కూల్లో ఉన్నప్పుడు పెద్దాళ్ళతో ఏలూరెళ్ళే అవకాశం వస్తే పండగే. కారణంకొత్త సినిమా చూసే అవకాశం దొరుకుతుందనే. అలాంటి అవకాశం ఒకసారి వచ్చింది. పోస్టర్లలో మురళి వాయిస్తూ ఎన్.టి.ఆర్ ‘ఆరాధన ‘కు రమ్మని పిలుస్తున్నాడు. నా ఇష్టానికి వ్యతిరేకంగా ‘మల్లె పూవు ‘ (1977)సినిమాకు తీసుకెళ్ళబడ్డాను.
శోభన్ బాబు పార్కులోపడుకుని రాలినపూవు మీద పాట పాడుతున్నాడు. ఇంతలో ఎవరో ఆ పూవు ను తొక్కేశారు. శోభన్ బాబు కోపంతో లేచి వెళ్ళిపోయాడు..సినిమా చివర్లోకూడా లోకం మీద కోపంతోనో,విరక్తితోనో తనంటే ఇష్టపడే ఆమెతో వేరే ఎక్కడికో దూరంగా వెళ్ళి పోదామని చెబుతాడు. సినిమా అర్ధమయ్యీ కానట్టుంది.
ఆ సినిమా కు ఆధారమైన హిందీ సినిమా ‘ప్యాసా ‘ పదిహేనేళ్ళతర్వాత చూసాను. చూసేటప్పటికే దానిగురించి చాలా విని ఉన్నాను. ఆ 'సినిమా'కు అభిమానులున్నారు. దానికో క్లాసిక్ హోదా ఉంది. సినిమాలో ప్రతిసన్నివేశం లోని వివరాలు వర్ణించి చెప్పే మిత్రులున్నారు.
చిత్రాన్ని నిర్మించిన ‘గురు దత్ ‘ చిత్ర కథానాయకుడు కూడా. నిర్మాతగా, దర్శకుడిగా ,నటుడుగా తనకో ప్రత్యేక గుర్తింపు,ముద్ర కలిగిఉన్నాడు. తన సినిమాల్లో సంగీతం, ఫొటోగ్రఫీ కి, ఈస్తటిక్స్ కు ప్రాధాన్యతనిచ్చాడు.
‘ప్యాసా ‘ సినిమా తగిన గుర్తింపు పొందలేకపోయిన ఒక కవి కథ. ఆ కవి సమకాలీన జీవితంలో ఇమడలేకపోయి పక్క పక్కకు జరిగిపోతున్నాడు. ప్రేయసికి దూరమయ్యాడు.కుటుంబసభ్యులుల ఈసడింపుకు లోనయ్యాడు.అతని కవిత్వం తూకపు సరుకయ్యింది. ఓ సంఘ
టనతో సమాజం దృష్టిలో మరణించాడు. అప్పుడు అతని రచనలు గొప్పకావ్యాలయ్యి ప్రచురణకర్తలకు సొమ్ములు కురిపించాయి. నేను బ్రతికున్నానని చెబితే అతడ్ని పిచ్చివాడన్నారు. ఈ క్రమంలో ఒక వేశ్య అతని పాటల్ని అభిమానించి అతన్ని అరాధించింది.
ఆమె ఆరాధన్ని తెలియచెప్పే పాట ఇది.
గాయని గీతా రాయ్ గురుదత్ ను పెళ్ళాడి గీతా దత్ గా మారింది. అలా ప్యాసా సినిమా ఆమెకూ సొంతసినిమానే.
భజన్ లా సాగే ఈ పాట ఓ భక్తురాలు భగవంతుడ్ని ఉద్దేశిస్తూ పాడుతుంది. ఆ పాట అర్ధం మొత్తం కథానాయకుడైన కవి పట్ల అతన్ని అభిమానించే వేశ్యకున్న ఆరాధన్ని తెలియజేస్తుంది. పాట మొత్తాన్ని తనలో ఆవహింపజేసుకున్నట్టు వహీదా రెహ్మాన్ నటన పాట విన్నపుడల్లా గుర్తుకొస్తుంది.
పాట అర్ధం...
విరహపు దుఃఖంతో బాధపడుతూ ఒక రోజు రాధ తన మన్మోహనుని దగ్గరకు వెళ్ళి చెప్పింది
“నీ బాహువుల్లోకి తీసుకో ఈవేళ నన్ను
జన్మ సఫలమయ్యేలా.
హృదయ వేదన,దేహ జ్వాల
శీతలమయ్యేలా..
ఎన్నోయుగాలుగా నిద్రకాచిఉన్నాను
నా కనులు అభాగినులు
నీవులేక మనసు దేనిపైనా లగ్నంకావటంలేదు
సుఖమేదీ ముందు కానరాదు
దుఃఖం వెనకనే వెంటాడుతుంది
నీవులేక జగమంతా శూన్యంగా కనిపిస్తుంది
నా ప్రియతమా…
ఇంత ప్రేమసుధ కురిపించవా
జగంఅంతా జలం తో తడిసేలా.
నన్ను నీదాన్ని చేసుకో
నా చేయి పట్టుకో
నేను జన్మజన్మల దాసిని
మనహర గిరిధారీ నా దాహం తీర్చు
నేనూ అంతరాంతరాలలో దాహంతో ఉన్నాను.
ఎంతో యత్నించించాను
మనసు తపన,దేహపు జ్వలన
పోనే పోవు.
నీపై మనసు ఎలా లగ్నమయ్యిందో, ఈ అగ్ని ఎలా పుట్టిందో?
మనసుకు ధైర్యం చిక్కదే

--------ముళ్ళపూడి సుబ్బారావు