Wednesday, November 8, 2017

చోఢ్ ఆయే హమ్ వో గలియా

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-124
చోఢ్ ఆయే హమ్ వో గలియా!
(‘ఆ వీధులు వదిలివచ్చాము’)
మాచిస్ (1996)సినిమాలో పాట. హరిహరన్,సురేశ్ వాడ్కర్,వినోద్ సెహగల్,కే కే పాడిన పాట. విశాల్ భరద్వాజ్ సంగీతం.
ఐదు దశాబ్దాలుగా చిత్రసీమలో తన ప్రాభవాన్ని నిలుపుకుంటూనే ఉన్న గీత రచయిత ‘గుల్జార్’. సినిమాలలు గీతాలే కాదు, మాటలూ రాసాడు. దర్శకుడుగా నిలిచిఉండే సినిమాలూ తీసాడు.తీసిన సినిమాలు వివిధ తరహాలకు చెందినవి. దర్శకుడిగా మొదటి యత్నం (1971) నగర యువతలో రేగిన అశాంతి ని చూపాడు(మేరే అప్నే). పాతికేళ్ళతర్వాత మాచిస్ (1996)సినిమాలో లో ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత పంజాబ్ యువత ఉగ్రవాదంవైపు కదలికను చూపాడు.
గుల్జార్ పాకిస్థాన్ లో పుట్టాడు. దేశవిభజన క్లేశాలు అనుభవించాడు. రాసిన అనేకపాటల్లో ఏదో ఖాళీతనాన్ని వ్యధతో భర్తీ చేస్తున్నట్టు చూపుతాడు. అమీర్ ఖుశ్రో, గాలిబ్ లను తిరిగి పరిచయం చేస్తుంటాడు. కాలపు దారుల్లో దారి తప్పకుండా నడిచినట్టుంటాడు.నడిచిన దూరమెంతో తెలియనీయడు.
మాచిస్ లో ఈ పాటలో మొదటిచరణంలో వదిలివచ్చినవాటిపట్ల బెంగ,రెండవదానిలో అక్కడి స్థితి పట్ల విచారం ,మూడవదానిలో తన స్థితి పట్ల నిర్వేదం కనిపిస్తాయి.
“ఆ వీధులు వదిలివచ్చాము…..
నీ కమలాలవంటి కాళ్ళు ఎక్కడ జారిపడేవో
నీ నవ్విన బుగ్గలు సుడిగుండాల్లా సొట్టలు పడేవో
నీ నడుమువంపులు నదులు తీసుకునేవో
నీ నవ్వు విని పంటలు పక్వానికొచ్చేవో…
అలాంటి వీధులు వదిలివచ్చాము.
ఎక్కడ నీ పాదధూఌ రేగుతుండేదో
విన్నాను .. ఆ గుమ్మంలో సాయంసంజ అలుముకుందని
నీ కేశపాశాల్లో చిక్కుకున్న ఆ రాత్రి ని
తలగడపై అప్పుడప్పుడూ తిరిగి కలుస్తుంటాను
హృదయమొక బాధాశకలం, రాతి పెళ్ళ
ఒకచీకటి నుయ్యి, ఒక మూసి ఉన్నవీధి
గడవని ఒక చిరు క్షణం...
ఎంతో మండిస్తున్నాను ,ఐనా భస్మంకాదు”

Saturday, October 21, 2017

పర్ దేశీ !పర్ దేశీ ! జానా నహీ

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-122
పర్ దేశీ !పర్ దేశీ ! జానా నహీ
(పరదేశీ ...వెళ్ళిపోవద్దు)
రాజా హిందుస్తానీ (1996) లో ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్,సప్నా అవస్తీ పాడినపాట. నదీమ్ -శ్రవణ్ సంగీతం.సమీర్ రచన.
పరదేశి పదం ‘కాలరీస్ ‘ప్రాంతాలలో వాడుకలో ఉన్నపదం. పరభాష లేదా పరరాష్టాలకు(ఎక్కువగా ఉత్తరభారతదేశానికి) చెంది, ఇక్కడ స్థిరపడ్డవారిని అనేమాటది. పరదేశి /శ్ హిందీ సినిమాపాటల్లో విరివిగా ఉపయోగించారు. దూరవాసులు, ప్రయాణికులు,పరప్రాంతాలకు చెందినవారు,ఇక్కడ స్థిరంగా ఉండనివారు...ఇలాంటి వారినుద్దేశించి
‘పరదేశియోం సె అఖియా మిలానా’ పాట ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’(1965) సినిమాలోది. సినిమాలో కథానాయకుడు టూరిస్ట్ ప్లేస్ ఐన కాశ్మీర్ లోని ‘డాల్’ లో పడవ నడుపుకుంటున్నాడు.టూరిస్ట్ గా వచ్చిన ఓ ధనిక యువతి తో కళ్ళుకలిపాడు.కథ మలుపులు తిరిగి సుఖాంతమయ్యింది.
గోదావరిలో ఒక యువకుడు టూరిస్టులకోసం పడవ నడుపుతూ బ్రతుకుతున్నాడు. ఒక ‘రాణమ్మ ‘ ను చూసి ఆరాధించాడు. ఆ కథా సుఖాంతమయ్యింది. ఆ సినిమా ‘మా పల్లెలో గోపాలుడు.
అదే సినిమా హిందీలో ‘కత్ తక్ చుప్ రహూంగి’ పేరుతో వచ్చింది. ‘మిత్వా భూల న జానా’ పాటతో గుర్తుంది.
రాజా హిందుస్తానీ (సినిమా పేరూ ,హీరో పేరూ అదే) ఒక హిల్ స్టేషన్లో టాక్సీ నడుపుతున్నాడు. పెద్ద ఇంటి యువతి తన తల్లి గడిపిన ఆ ప్రాంతానికి వచ్చింది.టాక్సి డ్రైవర్ తో అనుబంధంపెంచుకుంది. అదే సమయానికి తండ్రి ఆమెను ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చాడు. తిరుగు ప్రయాణం లో ఒక డాభా దగ్గర ఆగారు.
అక్కడ ఒక సంచారిణి ,మనసు లో ఉన్న ఖాళీని మద్యంతో నింపుకుంటుంది. పాట మొదలుబెట్టింది.గొంతు కలిపిన కథానాయకుడ్ని విని పాటమధ్యలో ఈ మాటలు చెప్పింది.
“నీ గొంతులో ఎంత వ్యధ వుంది?
అంటారు…. గుండె పగిలినపుడు
పలికేది గొంతుకాదని.
కాని అది పగిలినపుడు
ప్రళయం వస్తుంది
తుఫాను వస్తుంది,భూకంపం వస్తుంది
నీ గొంతులో అలాంటి బాధ ఉంది
నీగొంతులో అలాంటి ప్రేమ ఉంది
కాని విను
నీ బాధ,ప్రేమ కు ఈ లోకులు
ఏమి న్యాయం చేస్తారు
నువ్వు తపిస్తూనే ఉంటావు
వాళ్ళు చూస్తూనే ఉంటారు
విను
నువ్వు ఇపడు పాడు
చాలాకాలం తర్వాత ఈ పిచ్చిది
మనసు విప్పి నాట్యం చేస్తుంది.”
ఈ పాట వింటుంటే పాడిన ఉదిత్ నారాయణ్ పాటకు తగిన న్యాయంచేసాడనిపిస్తుంది.
పాట :
“ప్రేమించవద్దని నేను చెప్పట్లేదు
కాని యాత్రికులపట్ల మాత్రం నమ్మకం పెంచుకోకు
పరదేశీ ...వెళ్ళిపోవద్దు
నన్నువదిలి.నన్ను వదిలి
పరదేశీ ..నా ప్రియతమా! ఇచ్చినమాట నిలుపుకో
నన్ను గుర్తుంచుకో ! ఎప్పుదూ మరువవద్దు
నేను నిన్ను కోరాను,నిన్ను ప్రేమించాను
నీకోసం అన్నీ వదులుకున్నాను
యోగినినయ్యానుప్రేమయోగం తీసుకున్నాను
ఏమీ ఆలోచించక మనోవ్యధ తెచ్చుకున్నాను
పరదేశి! నా ప్రియతమా! తిరిగి రా!
మరువకు,మరువకు, మరువకు
ప్రతిక్షణం నా తలపులు నిన్ను బాధిస్తాయి
నేను మేలుకుని ఉంటా! నీకూ నిదురరాదు
నన్ను ఇలా వదిలివెళ్ళితే
నిజం చెబుతున్నా! చాలా పశ్చాత్తాపపడతావు
పరదేశీ ! నా ప్రియా! నన్ను ఏడిపించకు”


ప్యార్ కియాతో డర్నా క్యా?

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-123
ప్యార్ కియాతో డర్నా క్యా?
(ప్రేమిస్తే భయపడేది దేనికి?)
‘మొఘల్ ఎ ఆజమ్’ సినిమా లో లతా మంగేష్కర్ పాడినపాట.షకీల్ బదాయుని రచన ,నౌషాద్ సంగీతం.
రసపుత్ర వనిత జోధాబాయిని ముసల్మాను ఐన అక్బర్ పాదుషా వివాహమాడాడు. తద్వారా శత్రువుల్ని తగ్గించుకున్నాడు.రాజ్య విస్తరణనూ చేయగలిగాడు. ఐతే సంతానంకోసం పరితపించాడు. అందుకోసం ఎడారిలో మండుటెండలో పాదరక్షలు లేకుండా నడిచి దర్గాను దర్శించి ప్రార్ధించాడు. భావి మొఘల్ సామ్రాట్ ను పొంది సఫలమనస్కుడయ్యాడు.
అలాంటి యువరాజు అస్థానంలో ని నర్తకితో ప్రేమలో పడ్డాడు. నర్తకిగా ఆమె ను అక్బర్ పాదుషా కూడా ప్రసంసించాడు. కాని ఆమెnu  భావి సామ్రాజ్ఞి గా అంగీకరించలేకపోయాడు. ఇప్పుడు తన ఎదుట నర్తిస్తూ గానంచేస్తున్న ఆమె తనపట్ల చూపిన నిరశన, ధిక్కారంలో తన సమస్త శత్రువుల్నీ చూసాడు. తనని ముప్పుతిప్పలు పెడుతున్న రాణా ప్రతాప్ ను అనార్కలి ని పక్కపక్కన ఉంచితే తన ప్రధాన శత్రువుగా అనార్కలీ నే ఎంచుకునేవాడేమో.
ఈ పాటలో అనార్కలి స్వరం, శరీర భాష ధిక్కారానికి పరాకాష్ట గా అనిపిస్తుంది. అదే అనార్కలి ,అదే ప్రేక్షకులు (అక్బర్,జోధా బాయి,సలీమ్) సమక్షంలో అంతకుమునుపు ఒక ప్రదర్శన ఇచ్చింది. (మొహే పన్ ఘట్ మే నంద్ లాల్ ఛేడ్ గయోరే ) అందులో అనార్కలి (దానిమ్మ మొగ్గ) సిగ్గులమొగ్గ గా కనిపిస్తుంది.ప్రేమయుద్ధంలో మొఘల్ సామ్రాజ్యాధినేత అక్బర్ తో తలపడ్డాక ఆమె స్వరం మారింది.ఆమె అగ్నికీల గా మారింది.
“మనిషన్నవారు లోకంలో ఒక్కసారే ప్రేమిస్తారు
ఆ బాధను తోడ్కొని జీవిస్తారు. ఆ బాధతోనే మరణిస్తారు
ప్రేమిస్తే భయపడేది దేనికి?
ప్రేమించానంతే! దొంగతనమేమీ చేయలేదు
చాటుగా నిట్టుర్చాల్సిందేముంది ?
నేడు చెబుతాను హృదయపుగాధ
లోకం కావాలంటే ప్రాణాలు తీసుకోనీ
లోకం చూసేదే మరణమనుకుంటే
వెక్కివెక్కి పడుతూ చనిపోయేదెందుకు
తనపై కోరిక మనసులో ఉంటుంది
దీపమ్ ఈ సభలో వెలుగుతూ ఉంటుంది
ప్రెమలోనే జీవించాలి,ప్రేమలోనే మరణించాలి
వేరిక చేసేదేముంది నాకు?
నా ప్రేమను దాచలేను
నలువైపులా అది కనపడుతూనే ఉంది
దేవుని ముందు ముసుగులేవీ ఉండనపుడు
మనుషులముందు ఈ ముసుగులెందుకు?”

కార్వా గుజర్ గయా ,,గుబార్ దేఖ్ తీ రహే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-121
కార్వా గుజర్ గయా ,,గుబార్ దేఖ్ తీ రహే
(బిడారు కదిలిపోయింది, రేగిన ధూళి ని చూస్తూ ఉన్నాను.)
నయీ ఉమర్ కి నయి ఫసల్ ( కొత్త కాలపు కొత్త పంట) 1966 సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట. రోషన్ సంగీతం. నీరజ్ రచన.
కవిత తోనో పాటతోనో స్పూర్తి పొంది సినిమా తీయటం అరుదుగా జరుగుతుంది. అలాజరిగిందంటే ఆ కవిత చాలా శక్తివంతమైనదైయ్యుండాలి. అప్పటికాలానికి , అప్పటి ప్రజల ఆశలకో ,ఆశా భంగాలకో అద్దం పట్టినదయ్యుండాలి.
ఆలిఘర్ ముస్లిమ్ యూనివర్సిటీ లో అధ్యాపకుడైన ‘నీరజ్’’ (కలంపేరు) ఆహ్వానం మేరకే చిత్రపరిశ్రమకు వచ్చాడు. అప్పటికే కవిగా లబ్దప్రతిష్టుడు.సినిమాల్లో రాసిన పాటలు సంఖ్య తక్కువే గానీ ఎక్కువభాగం సక్సెస్ అయ్యాయి.
ఆయన రాసిన ఈ పాట అధారంగా ‘నయీ ఉమర్ కి నయి ఫసల్’ సినిమా తెరకెక్కింది. సినిమా వచ్చివెళ్ళిపోయింది కానీ పాటలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఈ పాట.
పాటలోని ప్రతీప్రస్తావనను, పాట చిత్రీకరణలో చూడగలం.
“కలలు పువ్వుల్లా రాలాయి
మిత్రులు శూలంతో guచ్చారు
అలంకరణలన్నీ చెదిరిపోయాయి
తుమ్మ తోపుల్లో నిలిచి
నేను వసంతం కోసం ఎదురుచూస్తున్నాను
బిడారు కదిలిపోయింది, రేగిన ధూళి ని చూస్తూ ఉన్నాను.
జీవితం కన్ను తెరచేలోపే రోజు గడచిపోయింది
కాలుమోపే లోపే జీవితం జారిపోయింది
ఒక్కో ఆకూ రాలిపోయింది , ఒక్కో కొమ్మా కాలిపోయింది
ఆశలు మాత్రం మిగిలాయి కాలం గడచిపోయింది
గీతాలు అశృవులైనాయి కలలు సమాధి అయ్యాయి
తోడుండే దీపాలు కొడిగట్టాయి
నేను మాత్రం వంగిపోయి , మలుపు లో నిలిచి ఉన్నాను
కాలపు ఉత్థానంలో పతనాన్ని చూస్తూ ఉన్నాను
ఎలాంటి యవ్వన కాలమది , ప్రేమిస్తూ ప్రతిపువ్వూ వికసించింది.
ఏమి అద్భుతమది అద్దమే ఉత్తేజం కలిగించింది
ఈ వైపు భూమి ఆ వైపు ఆకాశం పొంగాయి
దానితో మనసు ,కలిసిన చూపు ఉప్పొంగింది..
ఒకప్పుడు ఇక్కడ అలాంటి గాలి వీచేది
మొగ్గలన్నీ నలిగిపోయాయి వీధులన్నీ ఉక్కిరి బిక్కిరయ్యాయి
నేను అన్ని కోల్పోయి , కాలాన్ని శోషిస్తూ
చూస్తూనే ఉన్నాను
ఇంకా దిగని సంగీతపు మైకాన్ని చూస్తూ ఉన్నాను.
బిడారు కదిలిపోయింది, రేగిన ధూళి ని చూస్తూ ఉన్నాను.
చేతులు ఉండుంటే కలిసే వెండి కురుల్ని సవరించేవాడిని
పెదవులు ఉండుంటే ప్రతి వసంతాన్ని పిలిచేవాడిని
బాధ ఉండుంటే దాని కారకుణ్ణి ప్రేమించే వాడిని
శ్వాస ఉంటే భూమికి స్వర్గాన్ని దింపేవాడిని
ఏదీ జరగట్లేదు .ఉదయమే సాయంత్రమైపోయింది,
లేచిన అలలు నా ఇసుక కోటను ముంచేశాయి
నేను భయం భయంగా కళ్ళనీరు నింపుకున్నాను
ముసుగు తీసి నాసమాధిని దర్శించాను
బిడారు కదిలిపోయింది, రేగిన ధూళి ని చూస్తూ ఉన్నాను.
పాపిడి నింపుతూ కొత్త కిరణం వచ్చినపుడు
ఆ లయబద్దపు ఢంకా మోతకు కాళ్ళు నర్తించాయి
నవ వధువు రాకడ సందడి తెలిపింది
గ్రామం కళ్ళలో కొత్త ఆశలు కదలాడాయి
అప్పుడే విషపుజల్లుతో పిడుగుపాటు
సిందూరం చెరిగిపోయింది,మేలి ముసుగు చిరిగిపోయింది
బోయీలు పల్లకీ మోసుకు పోతుంటే
దూరపు ఇంటినుండి నేను చూస్తూ ఉన్నాను
బిడారు కదిలిపోయింది, రేగిన ధూళి ని చూస్తూ ఉన్నాను.

మోరినీ బాగామా బోలే ఆధీ రాత్ మా

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-120
మోరినీ బాగామా బోలే ఆధీ రాత్ మా
(తోటలో నెమలి అర్ధరాత్రి పాడసాగింది)
లమ్హే (1991) సినిమాలో పాట
ఎడారిలో ఏదో ఆకర్షణ ఉంది. అది దూరంనుండి చూస్తేనే ఉంటుందా? అక్కడే బ్రతికేవారికి ఎలాఉంటుంది.
డిగ్రీ లో ‘కమర్షియల్ జాగ్రఫీ’ అని సబ్జెక్ట్ ఉండేది. అందులో ఎడారుల గురించి ఒక మాట బాగా గుర్తుండిపోయింది. “ఎడారుల్లో ఉండేవారికి చూచినమ్తమేరా ఇసుకే ఉండటంవల్ల తాత్విక చింతన పెరుగుతుంది”. ఇదేఅని చెప్పలేను కాని ఇలాంటి అర్ధం వచ్చే మాటే.అందులో నిజమెంతో తెలియదు కానీ ఎడారి ఒక కొత్తప్రపంచానికి తీసుకెళుతుంది.మౡ ‘ఏదో ప్రాచీనత గోచరిస్తుంది’ అన్న కవి మాట గుర్తుకు తెస్తుంది.
రాజస్థాన్ ,ప్రత్యేకంగా ఎడారి నేపధ్యంతో సినిమాలు, పాటలూ చాలా వచ్చాయి. అందులో చాలావరకూ ప్రేక్షకులకు దగ్గరయ్యాయి.
ఈ పాట జానపద గీతమనిపిస్తుంది .ఇలా అరుణ్ పాడేది రాజస్థానీ భాష అనుకుంటాను. లతామంగేష్కర్ పాడింది హిందీలోనే. అది ఆనంద్ బక్షి రాసారు.
ఇలా అరుణ్ స్వరానికి లతామంగేష్కర్ స్వరానికీ ఉన్నంత కాంట్రాస్ట్ ఇలా అరుణ్ కు శ్రీదేవి కి మధ్య ఉంది.
యశ్ చోప్రా తన సినిమాల్లో సంగీతానికి పెద్దపీట వేస్తాడు. కభీ కభీ సినిమా తర్వాత చాలా కాలం తనసినిమాలకు ‘ఖయ్యాం’ తో సంగీతం ఉపయోగించున్నాడు.తర్వాత ‘శివ్ -హరి’ తో పదేళ్ళపాటు జట్టుకట్టాడు. ఆ దశలో వచ్చిన ఒక పాట ఇది.
“మా రాజస్థాన్ లో
ఆవాల పంటపొలాలు లేవు
ఐనా బంగారంలా మెరుస్తుంది
మా ఎడారి ఇసుక
నా గుండెలో కత్తి దిగినట్టుంది
నెమలి పాట అర్ధరాత్రి వేళ మొదయ్యింది
నా గుండెలో కత్తి దిగినట్టుంది
తోటలో నెమలి అర్ధరాత్రి పాడసాగింది
గలగల గాజులు
చప్పుడు చేస్తున్నాయి చూడు
చేతికి ఉన్న గాజులు చప్పుడు చేస్తున్నాయి
నేను సిగ్గుతో చచ్చిపోతున్నాను,నీరైపోతున్నాను
నా ప్రేమకథ అంతా విన్నారు
మాటల్లోనే మాట జారిపోయింది. మాటల్లోనే
గలగల గాజులు
చప్పుడు చేస్తున్నాయి చూడు
చేతికి ఉన్న గాజులు చప్పుడు చేస్తున్నాయి
ప్రియుడు వెఌపోయాడు
ముసుగు నుండి చూస్తుంటే
నా కళ్ళు వర్షించాయి
ఏ ఘడియలో ప్రియుడు ఇంటినుండి వెళ్ళాడో
అప్పుడు ముసుగులోనే కాలిపోయాను,ఎంత వాన కురిసినా
వర్షంలోనూ నా దాహం తీరనే లేదు
ఖాళీ పడకమీద రాత్రంతా మేలుకునే ఉన్నాను
నీ వెనుకనే నా నిదుర పరుగెత్తింది
నా మనశ్శాంతి నీతో పాటే వెఌపోయింది
సహచరుడా!
నా కళ్ళు రోదిస్తున్నాయి..నా మనసు దుఃఖపడుతుంది..సహచరుడా!
పోవద్దు
పోవద్దు”

సమయ్ ఓ ధీరే చలో -

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-118
సమయ్ ఓ ధీరే చలో -
(కాలమా! నెమ్మదిగా కదులు)
రుడాలి సినిమాలో ఆశా భోన్స్లే పాడినపాట. గుల్జార్ గీతరచన, భుపేన్ హజారికా స్వర రచన.
రుడాలి(1993) పేరుతోనే వచ్చిన మహాశ్వేతాదేవి కథకు చిత్ర రూపం ఈ సినిమా. కల్పనాలాజ్మి దర్శకత్వం. 
కథానేపధ్యం ‘రాజస్థాన్’ లోని ఎడారి ప్రాంతం. కథ రాసిన కాలంసుమారు 1979. అదే కథాకాలమనుకోవచ్చు. సినిమాలో కథానాయిక వృత్తి పెద్దకుటుంబాలలో ‘చావు’లకు కుటుంబ సభ్యులబదులుగా ఏడ్చి పెట్టటం. ఇప్పటి మాటల్లో ‘ఔట్ సోర్సింగ్’ అనుకోవచ్చేమో.ఇతరులకోసం ఏడ్చి సొంతదుఃఖానికి ఏడుపు మిగుల్చుకోలేకపోవటం చిత్రమైన విషయం.
చిత్రంలో కథానాయిక గా డింపుల్ కపాడియా నటించింది. ఇరవై సంవత్సరాలక్రితం (1973లో)’బాబీ’ గా నటించి, రాజేష్ ఖన్నాను వివాహమాడి సినిమాలకు దూరమయ్యింది.అతన్నించి విడివడి సినిమాలపై దృష్టి సారించింది.'సాగర్’ (1985) సినిమాతోఆమె పునరాగమనంపై ఒక వర్గపుప్రేక్షకులు చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఆశలు సంగతేమోకాని ,ఒక గొప్పనటి మాత్రం తెరకు దొరికింది. ఆమె కు దొరకిన ఓ గొప్పపాత్ర ‘రుడాలి’.
రుడాలి సినిమా కళాత్మకం. శోకరసానికి కళాత్మక చిత్రరూపం. చిత్రీకరణకు, వడగాల్పు, సుడిగాలి వంటి హజారికా సంగీతం, దానికి గుల్జార్ సాహిత్యం తోడైనాయి. అవి వదలని పాటలైనాయి.
ఆశా భోన్స్లే, లతామంగేష్కర్, భూపెన్ హజారికా పాడిన మూడు వెర్షన్లు ఈ పాటకున్నాయి. ఇది ఆశా భోన్స్లే వెర్షన్.
“కాలమా! నెమ్మదిగా కదులు
దారులలో నీడలు కదిలిపోయాయి
ప్రియుని గ్రామం బహుదూరం
నెమ్మదిగా కదులు,నెమ్మదిగా కదులు
మనసును మభ్యపెట్టుకున్నాను
నువ్వు ఆశ నిరాశల ఆట ఆడావు
నాలుగునాళ్ళ బ్రతుకూ బ్రతుకేనా?
విషమనే శ్వాస ను తాగారా లేదా?
ఈ గాలి ,సమస్తాన్నిపట్టుకుపోయింది
యాత్రికుల జాడల్నీ తీసుకుపోయింది
వీచేగాలి వంటి వారిని కలిసేదెక్కడ?
ఎవరైనా చెప్పండి నా ప్రియుని జాడ”


జబ్ కోయి బాత్ బిగడ్ జాయే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-119
జబ్ కోయి బాత్ బిగడ్ జాయే,జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయే
(“కాలం విషమించినపుడు,కష్టాలు చుట్టుముట్టినపుడు)
జుర్మ్ (1990) సినిమాలో కుమార్ సాను పాడిన పాట. రాజేశ్ రోషన్ సంగీతం.ఇందీవర్ రచన.
అనుకరిస్తున్నారని తెలిస్తే అభిమానించటం కష్టమే. అలాంటివారినుంది కొన్ని మంచిపాటలు వచ్చినా.
88-89ప్రాంతంలో హిందీ పాటల్లో మెలొడి తిరిగి ప్రవేశించింది. కొత్తసంగీతదర్శకులతో పాటు కొత్త ‘రఫీ’లు ,కొత్త ‘కిశోర్ కుమార్’లు కూడావచ్చారు.
అలాంటివారిలో ఒక ‘కిశోర్ కుమార్’ ‘కుమార్ సాను’. అతను కిశోర్ పాటల్ని తిరిగి పాడాడు.అవి బానే మార్కెట్ అయ్యాయి. సినిమాలలో సొంతపాటలు కిశోర్ ను అనుకరిస్తూ పాడి సక్సెస్ అయ్యాడు. అతని పాటలు వినపడితే విన్నాను కాని వెతుక్కుని వినలేదు.
అలాంటి కుమార్ సాను గురించి ఒక మిత్రునిద్వారా విన్నమాట. నా మిత్రుని మిత్రుడొకరు హిందీపాటల అభిమాని. అతను కుమార్ సాను అభిమాని. ఎంత అభిమానమంటే చనిపోయేటపుడు కుమార్ సాను పాటలు వింటూండాలనేంత.
ఇదినాకు ఊహకు రాని విషయం.లోకోభిన్నరుచి.
నావరకు ‘కుమార సాను’ పాటల్లో నచ్చిందడిగితే నేను చెప్పేది ‘జుర్మ్’ సినిమాలో ఈ పాట.
సంగీతదర్శకుడు రాజేశ్ రోషన్ తన తండ్రి ‘రోషన్’ అడుగుజాడల్లో నడిచాడు. అప్పటికి పదిహేనేళ్ళుగా మెలొడీ తో నిండిన సంగీతం అందిస్తూ కొత్త సంగీతదర్శకులపోటీని తట్టుకున్నాడు.ఇప్పటికీ తన సోదరుడు రాకేశ్ రోషన్ సినిమాలకు సంగీతం సమకూరుస్తూనే ఉన్నాడు.
గీతరచయిత ఇందీవర్ తో కలిసి అనేక హిట్ గీతాలందించాడు.
వారికలయికలో వచ్చిన ఒక మధురగీతమిది.
“కాలం విషమించినపుడు
కష్టాలు చుట్టుముట్టినపుడు
నువ్వునాకు తోడు నివ్వు, ప్రియతమా!
లోకంలో నువ్వు మినహా
ఇంతకుముందు ,ఇప్పుడూ ఎవరూలేరు.
రాత్రి లో వెన్నెల ఉన్నంత సేపూ
ప్రతీఒక్కరూ తోడుంటారు
చిక్కని చీకటిలో,నువ్వన్నా
నాచేయి ని విడువకు.
విధేయత చూపమనే నియమాలను
పాటిస్తాను నీ తోడుగా
నా చేతిలో ఉన్న
చివరి శ్వాస వరకు
నా మనసు నమ్ముతుంది
ఇదివరకెక్కటిదో కలయిక ఇది
ఈ బంధం తరతరాలది
ఈ నాటి మాట కాదిది.”

వైష్ణవ జనతో తేనే కహియే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-117
వైష్ణవ జనతో తేనే కహియే పీడ్ పరాయా జాన్ రే
(విష్ణుభక్తుడనబడేవాడు వేరేవారి బాధను అర్ధంచేసుకుంటాడు)
‘గాంధీ మార్గం’ పేరుతో రేడియో లో శుక్రవారమో శనివారమో పావుగంట పాటు ఒక కార్యక్రమంవచ్చేది. ఆ కార్యక్రమంలో ఎక్కువసార్లు గాంధీఆత్మకథ చదివి వినిపించేవారు. ఆ చదవటం లోనూ చాలా ‘ఫీల్’ ఉండి క్రమక్రమంగా ఆ కార్యక్రమం నాకు దగ్గరయ్యింది. ఓ మాస్టారిద్వారా గాంధీ ఆత్మకథ ‘మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ‘ అని దానికి తెలుగు అనువాదముందని ,దానినే రేడియోలో ప్రసారంచేస్తున్నారని తెలిసింది.ఆ పుస్తకం మా స్కూల్ లైబ్రరీలో ఉంది. అనువాదం చేసిన వారు వి.(వేమూరి??) రాధాకృష్ణమూర్తి. సత్యశోధన పేరుతో పుస్తకంగా వచ్చి ఇప్పటికీ ప్రింట్ ఔతూనే ఉంది.
గాంధీమార్గం కార్యక్రమానికి ముందు వచ్చే సంగీతం ఆకర్షణీయమైనదే. అది గాంధీకి ఎంతో ప్రీతిపాత్రమైన ‘భజన్’ కు ట్యూను. ఆ ‘భజన్’ గాంధీ కి అంతగా నచ్చటానికి కారణం అందులోని భావమంతా గాంధీ ఆలోచన కావటమని నాకు గట్టిగా అనిపిస్తుంది.
ఈ భజన్ 5 శతాబ్దాలక్రితం గుజరాతీ భాషలో రాయబడిందట. నరసిన్హ్ మెహ్తా దీని రచయిత.
చాలా మంది పాడింది విన్నా ,నాకు లతా మంగేష్కర్ పాడింది బాగా నచ్చుతుంది.
విష్ణుభక్తుడనబడేవాడు
వేరేవారి బాధను అర్ధంచేసుకుంటాడు.
దుఃఖంలోఉన్నవారికి ఉపకారంచేస్తాడు
అందుకోసం తన గర్వాన్ని వదులుకుంటాడు.

అతడుసకల లోకుల మానాన్ని సహిస్తాడు
అతడుఎవరినీ కించపరచడు
అతడు మనసును,వాక్కును,కర్మను స్వచ్చంగా ఉంచుతాడు
అతని జనని ధన్యురాలు.
అతడు సమదృష్టి,కామనత్యాగి,
అతనికి పర స్త్రీ మాత
అతని జిహ్వ అసత్యం చెప్పనివ్వదు
అతనిచెయ్యి పరధనం తాకితే జ్వలిస్తుంది.
అతనిలో మోహ మాయలు వ్యాపించవు
అతనిలో వైరాగ్యం మనసులోలోపల పాదుకుంటుంది
అతను అనుక్షణం రామనామం వినాలనుకుంటాడు
అతని మనసులోనేసకలతీర్ధాలు ఉంటాయి
అతడు లోభి కాడు,కపట రహితుడు
అతడు కామ క్రోధాలను నివారించుకుంటాడు
అలాంటి వానిని దర్శించుకున్న నర్సయ
తరతరాలు వర్ధిల్లుతాయి "



ఓ బేకరార్ దిల్. హో చుకా ముఝే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-116
ఓ బేకరార్ దిల్. హో చుకా ముఝే ఆసువోసె ప్యార్- కొహ్రా
(ఓ కల్లోల హృదయమా..నాకు కన్నీటిపట్ల ప్రేమకలిగింది)
కొహ్రా (1964)సినిమాలో పాట.లతామంగేష్కర్ గానం, హేమంత్ కుమార్ సంగీతంగీత రచయిత కైఫి ఆజ్మి.
కొహ్ రా అంటే పొగమంచు. పొగమంచులో దృశ్యం కనీకనిపించకుండావుంటూంది. సస్పెన్స్ సినిమాకు తగినపేరే .ఈ సినిమాలో పాటలు అర్ధశతాబ్దంగా శ్రోతల్ని ఆనందింపపజేస్తూనే ఉన్నాయి. సంగీత దర్శకుడు హేమంత్ కుమార్ చిత్ర నిర్మాతకూడా. అతను గానంచేసిన రెండు హిట్ సాంగ్స్ సినిమాలో ఉన్నాయి.
గీత రచయిత ‘కైఫి ఆజ్మి’ ని ‘రెలుక్టెంట్ పోయెట్’ ( తప్పని సరి ఐతేనే రాసే రచయిత ????) అంటారని చదివాను. ఇది సినిమా పాటలగురించి మాత్రమే అయ్యుంటుంది. కైఫి ఆజ్మి రాసిన పాటలు పరిమితమైనవే. వాటిలో విని వదిలేయగలిగినవి తక్కువ. అవి మనని వదలవు. తను చదివిన పర్షియన్, ఉర్దూ భాషలు, తెలిసిన హిందీ భాష, తను నమ్మిన భావజాలం.. వీటిసాయం తో ఏ తరహా పాటలోనైనా తన బలమైన ముద్రవేస్తాడు.
పాట వేగంగా సాగుతుంది. పాడే ‘ వహీదా రెహ్మాన్’ నవ్వుతో కనిపిస్తుంది. పాట అర్ధాన్నిచూస్తే పాడే ఆమె ఆనందం కలిగించేవీ తనకివద్దంటుంది. కనపడని లోతుల్లో ఆమెకేదో బాధ ఉంది. స్పష్టత కు పొగమంచు తెరలుఅడ్డమైనట్టు ఆమె భావాలు ప్రేక్షకులకు అర్ధంకావటానికి ఏవో తెరలు అడ్డున్నాయి.

“ఓ కల్లోల హృదయమా
నాకు కన్నీటిపట్ల ప్రేమకలిగింది
నువ్వు నాకు సంతోషమివ్వవద్దు
కొత్తజీవితాన్ని ఇవ్వవద్దు
ఓ కల్లోల హృదయమా
తోటకు వసంతం దొరికింది
పూలకు నవ్వులు దొరికాయి
కోయిలకు పాట దొరికింది
నేను నిశ్శబ్దాన్ని పొందగలిగాను
నాకు మురళీరవం వద్దు రాగాలువద్దు
ఓ కల్లోల హృదయమా
నల్లని మబ్బులు కమ్ముకున్నాయి
మొగ్గలు దాహంతో,వ్యధతో జ్వలిస్తూ ఎదురుచూపుతో ఉన్నాయి
సదా నాలా ఉన్నట్టే
అదే నా ప్రపంచం
ప్రతిదినమూ చీకటే
నాలుగునాళ్ళ వెన్నెల
నాకు వెన్నెల ఇవ్వవద్దు,నాకు వెలుతురు ఇవ్వవద్దు
ఓ కల్లోలహృదయమా”

ఎక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-115
ఎక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా
(ఒక అమ్మాయిని చూసినపుడు ఎలా అనిపించిందంటే)
1994 లో వచ్చిన ‘1942 ఎ లవ్ స్టొరీ’ సినిమాలో పాట. కుమార్ సాను పాడిన పాట.
1942 కాలానికి చెందిన ( పీరీడ్) ఫిల్మ్ గా వచ్చిన ఆ సినిమాకి ఇప్పటి చిత్ర ప్రముఖులు విధు వినోద్ చోప్రా, సంజయ్ లీలా బన్సాలి పని చేసారు. ఆర్ డి బర్మన్ సంగీతదర్శకుడు. జావెద్ అఖ్తర్ గీత రచయిత.
అప్పటికి ఆర్ డి బర్మన్ సంగీత దర్శకుడిగా తన పునర్వైభవం పొందటానికి చాలానే కృషి చేస్తున్నాడు. ఆ కృషి ‘1942- ఎ- లవ్ స్టొరీ’ లో కనిపిస్తుంది. ఆ సినిమా సంగీతం అతనికి స్వయంగా నచ్చింది. అదే మాట తన పాత మిత్రులతో పంచుకున్నాడు. ఐతే అదే సినిమా అతని ‘హంస గీత’ మై పోయింది. సినిమా విడుదలై సంగీతం శ్రోతలకు చేరువయ్యేసరికి అతను మరణించాడు.
‘ఉపమ కాఌదాసస్య ‘ అంటారు. ఉపమాలంకారాన్ని వినియోగించటంలో అంతవారులేరని అర్ధమనుకుంటాను. కాఌదాసు ఉలిక్కిపడేట్టు జావెద్ అఖ్తర్ ఈ పాట రాసాడు. పాటలో చరణం తప్ప మిగతావన్నీ ఉపమానాలే. ఇరవై పైనే ‘ఎలా అనిపించింది’ అన్నదానికి సమాధానాలు. ఇన్ని ఉపమానాలు కాఌదాసు ఒకేచోట ఎప్పుడూ రాసిఉందక పోవచ్చు.
పాట పాడిన గాయకుడు ‘కుమార్ సాను’ ఎనభైల చివరి సంవత్సరాలలో ప్రముఖగాయకుడిగా గుర్తింపుపొందాడు. కిశోర్ కుమార్ అనుకరిస్తూ పాడిన అనేక గాయకుల్లో విజయవంతమైన గాయకుడు. కిశోర్ కుమార్ ను ఉన్నతశిఖరాల్లో నిలిపిన ఆర్ డి బర్మన్ ఎందువల్లో ‘కుమార్ సాను’ తో ఈ సినిమా వరకూ పాడించలేదు.
“ఒక అమ్మాయిని చూసినపుడు ఎలా అనిపించిందంటే
వికసించే గులాబీలా
కవి కన్న కలలా
వెలుతురు కిరణంలా
వనంలో హరిణిలా
వెన్నెల రాత్రిలా
చల్లని మాటలా
గుడిలో వెలుగుతున్న ఒక దీపంలా.
ఒక అమ్మాయిని చూసినపుడు ఎలా అనిపించిందంటే
అందమైన ఉదయంలా
శీతాకాలపు నీరెండలా
వీణానాదంలా
రంగుల రాణిలా
అల్లుకున్న తీగలా
కెరటాల ఖేఌలా
పరిమళాలతో వీచే చల్లని గాలిలా
ఒక అమ్మాయిని చూసినపుడు ఎలా అనిపించిందంటే
నాట్యంచేసే నెమలిలా
పట్టుదారంలా
దేవరాగంలా
చందనపు చిరుమంటలా
పదహారు రకాల అలంకరణలా
తెలిమంచులా
నెమ్మదిగా పెరుగుతున్న నిషాలా”


హమ్ న సంఝే థే బాత్ ఇత్నిసీ

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-113
‘హమ్ న సంఝే థే బాత్ ఇత్నిసీ’
(ఈ చిన్న విషయం నేను అర్ధం చేసుకోలేదు)
‘గర్దిష్ ‘ (1993) సినిమాలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.
ప్రభుత్వం, ఉద్యోగం ఇచ్చేముందు, అంటే అధికార వ్యవస్థ లోనికి రానిచ్చేముందు సదరు వ్యక్తి పై పోలీస్ ఎంక్వైరీ జరుపుతుంది. అతనిపై పోలీసు కేసులు, నేరపూరిత నేపధ్యం వగైరాలు లేవని తెలిసాక మాత్రమే ఉద్యోగం ఇస్తుంది. అదీ పోలీసు ఉద్యోగమైతే , మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. 
నిజాయితీ పరుడైన చిన్న స్థాయి పోలీసు ఉద్యోగికి తన కొడుకును పోలీసు ఇన్సపెక్టర్ గా చూడాలనికోరిక. కొడుకుకు చిన్నప్పటినుండి అందుకు తర్ఫీదు ఇస్తున్నాడు. అతని కల సాకారమౌతుందనుకున్న తరుణం లో పరిస్థితుల ప్రభావంవల్ల కొడుకు చట్టందృష్టిలో నేరమైన పని చేసాడు. తద్వారా పోలీసు ఉద్యోగి కావటానికి అనర్హుడయ్యాడు.
దర్శకుడు ‘ప్రియదర్శన్ ‘ అనేక మళయాళీ సినిమాలను 90 ల తర్వాత హిందీ లో తన ప్రత్యేకముద్రతో తీశాడు. అందులో ‘గర్దిష్’ సినిమా ఒకటి. అతడు నటుడు అమ్రిష్ పురి ని తన సినిమాలలో గొప్పగా వినియోగించు కున్నాడు. ఈ సినిమాలో పోలీసు కానిస్టేబుల్ గా అమ్రిష్ పురి ,అతని కొడుకుగా ‘జాకీ ష్రోఫ్’ నటించారు.
తండ్రీకొడుకులు క్రమంగా దూరం కావటం ఈ పాటలో కనపడుతుంది. ఆర్. డి. బర్మన్ చివరి సినిమాలలో ‘1942 ఎ లవ్ స్టోరీ’ బర్మన్ కు సంతృప్తి నిచ్చిందట. ‘గర్దిష్ ‘ సినిమా లో ఈ పాటా ఆయన అభిమానుల్ని అలరించింది.
ఎనభైల తర్వాత కథలు మాని పాటలు రాయటం మొదలుపెట్టిన ‘జావేద్ అఖ్తర్’ రచన ఇది.
“ఈ చిన్న విషయం నేను అర్ధం చేసుకోలేదు
స్వప్నం అద్ద మైతే
లోకం రాయిలాంటిదని.
ఈ చిన్న విషయం నేను అర్ధం చేసుకోలేదు
నేను కోరినది పొందినపుడు
వెలుతురు తనతో చీకటిని తెస్తుందని
చీకటి చిక్కనైనది
వెలుతురు పలుచనిది
ఈ చిన్న విషయం నేను అర్ధం చేసుకోలేదు
కేవలం విధ్వంసం, ఒంటరితనం
జీవితం నన్ను ఎక్కడికి తెచ్చింది.
గమ్యానికెళ్ళే దారులు తప్పాను
ఈ చిన్న విషయం నేను అర్ధం చేసుకోలేదు
ఒకరు అమ్మగలిగేదేమిటి? ఒకరు పంచగలిగేదేమిటి?
బజారులో పూల దుకాణాలు ఉన్నాయి”
నా దోసిట్లో కేవలం ముళ్ళు మాత్రమే ఉన్నాయి"

గగన్ యె సంఝా చాంద్ సుఖీ హై

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-114
“గగన్ యె సంఝా చాంద్ సుఖీ హై ,చాంద్ కహే సితారే”
(గగనం అనుకుంటుంది చంద్రుడు సుఖంగా ఉన్నాడని,చంద్రుడనుకుంటాడు తారలు సుఖంగాఉన్నవని)
సావన్ కో ఆనే దో (1979) సినిమాలో పాట. మదన్ భారతి రచన ,రాజ్ కమల్ సంగీతం, జస్పాల్ సింగ్ గానం.
“నీ ఆనందం ముసుగుతొలగిన నీ దుఃఖమే .
పొంగిపొర్లే ఇప్పటి ఆనందపు బావులు ,ఇంతకుమునుపు నీ కన్నీళ్ళతో నిండినవే…...
కొందరంటారు సంతోషం దుఃఖానికన్నా గొప్పదని.ఇంకొందరంటారు దుఃఖమే గొప్పదని.
నేనంటాను అవి అవిభాజ్యాలుఅని. అవి కలిసే వస్తాయి.ఒకటి నీతో కలిసి భోజనం చేస్తుంటే మరొకటి నీ పడక మీద నిద్రిస్తూఉంటుంది.”
ఇవి ఖలీల్ జిబ్రాన్ (ప్రాఫెట్ పుస్తకంలో )సంతోషం ,దుఃఖం గురించి చెప్పిన దానిలో కొన్ని వాక్యాలు.
ఈ సినిమా పాట పల్లవి లో ‘దుఃఖ్ మే హి సుఖ్ హై చిపారే’ పాదం వింటుంటే ఖలీల్ జిబ్రాన్ చెప్పింది మనసులో మెదులుతుంది.
అలాగే చివరి పదాలలో ‘ధన్ వాన్, నిర్ధన్, జగ్ కి మాయా’ విన్నపుడు
“మాయంటావా? అంతా మిధ్యంటావా?నా ముద్దుల వేదాంతీ” అన్న శ్రీ శ్రీ మాటలు గుర్తొస్తాయి.
సావన్ కో ఆనేదో సినిమాలో అన్ని పాటలూ ప్రజలకు చేరువైనవే. మిగతావాటితో పోల్చినపుడు ఈ పాటే తక్కువ వినపడేది. ఐతేనేం? గుర్తుండిపోయే పాటే!
“ గగనం అనుకుంటుంది చంద్రుడు సుఖంగా ఉన్నాడని,చంద్రుడనుకుంటాడు తారలు సుఖంగాఉన్నవని
సాగరలహరులనుకుంటాయి తమకన్నా తీరం సుఖంగాఉందని
ఓ మిత్రుడా! దుఃఖం లోనే సుఖం దాగిఉంది
దూరపుకొండ దూరంగా ఉన్నపుడు ప్రశాంతంగా కనపడుతుందందరికీ
దగ్గరకు పోయి చూస్తే రాళ్ళగుట్టలమయం
మొగ్గలనుకుంటాయి తోటసుఖంగా ఉందని ,తోట అంటుంది వసంతం సుఖం గా ఉందని
మిత్రుడా! దుఃఖం లోనే సుఖం దాగిఉంది
ఓ అన్నా! ఓ మిత్రుడా! ఓ రామా
చీకటి రాత్రి మనసులో అనుకుంటుంది పగటివేళ వెలుతురుంటుందని
వేడి పగలు అనుకుంటుంది చీకటి చల్లనైనదని
శిశిరమనుకుంటుంది వర్షాకాలం సుఖంగా ఉందని ,, వర్షాకాలం వేసవి సుఖంగా ఉందనుకుంటుంది.
ఓ మిత్రుడా! దుఃఖం లోనే సుఖం దాగిఉంది
బంధువా! మిత్రుడా! బంధువా!
నిర్ధనుడు ధనేచ్చ ను తోడ్కొని ఎక్కడెక్కడో తిరుగుతాడు
ధనవంతుడికి శాంతి ఉండదు . ఇది ఎలాంటి జగన్మాయ
ఒకరినొకరు సుఖి అనుకుంటూ అందరూ సుఖాన్ని పిలుస్తారు
ఓ మిత్రుడా! దుఃఖం లోనే సుఖం దాగిఉంది”

దిన్ హై యే బహార్ కె ఫూల్ చున్ లె ప్యార్ కా

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-112
“దిన్ హై యే బహార్ కె ఫూల్ చున్ లె ప్యార్ కా”
(“వసంతకాలమిది,ప్రేమపుష్పాలను సేకరించు”)
హనీ మూన్ (1973) సినిమాలో పాట.రఫీ గానం, ఉషాఖన్నా సంగీతం,యోగేష్ రచన.
నా స్నేహితుడొకరు తెలుగు సినిమా పాటల బాంక్ కోసం కృషి చేస్తున్నాడు.తెలుగులోవచ్చిన ప్రతిసినిమా పాట వివరాలతో(క్రెడీట్స్) సహా సేకరించాలని అతని కొరిక.
అందులో భాగం గా వివరాలు తెలియని పాటలు కొన్ని నాకుపంపాడు.నాకేమైనా తెలియొచ్చునేమోనని అతని ఆశ.
అందులో గాయకుడు రామకృష్ణ ఎల్లారీశ్వరి తోకలిసిన పాట ఒకటిఉంది .'సాగిపోవు నావలా అలా...ఓ డార్లింగ్ ఓ డార్లింగ్'అని సాగుతుంది.
ఆపాట ఎప్పుడూ వినలేదు...కానీ ఎక్కడో విన్నట్టుంది. తెలియని పాటేదో వెంటాడుతుంది.అలా చాలారోజులు గడచాయి
అనుకోకుండా ఒక రోజు మధ్యాహ్నం 'మన్ చాహే గీత్ ‘ ద్వారా సమాధానం దొరికింది.
ఆ పాట మహమ్మద్ రఫీ పాడారు. రాజశ్రీ సంస్థ నిర్మించిన ''హనీమూన్ (1973) సినిమాలోది.
డెబ్భయ్యవ దశకం లో మహమ్మద్ రఫీ సంగీతయానం ఒక కుదుపుకు లోనయ్యింది.ముఖ్యంగా 70-75 మధ్య అంతకుముందటి లా అతను నేపధ్య గాయకుడిగా 'తొలిఎంపిక కాదు (కొన్ని మినహాయింపులతో). తొలి ఎంపిక అంటే అప్పటి అగ్రనటులకు నేపధ్యగానం చేయటం లో, అగ్ర సంగీతదర్శకులతో పనిచేయటంలో.
ఆ దశలో రఫీ చిన్న సంగీతదర్శకులతో పనిచేశాడు. చిన్న నటులకు నేపధ్య గానం చేశాడు. అందులో కొన్ని ఆణిముత్యాలున్నాయి. అందులో ఒకటి ఈ పాట.
“వసంతకాలమిది
ప్రేమపుష్పాలను సేకరించు
ఓ సహచరీ,
నీ నవ్వే పెదవులనుండి పాట ఎందుకు దూరమయ్యింది?
కురిసే ప్రేమవానలో నీ మనసెందుకు తపిస్తుంది?
అలా ప్రేమజల్లులను అలా దూరం కానీయకు
తల్లడిల్లే నీ గుండె చెబుతుండవచ్చు
గడచిన జీవితం నిన్ను వెనక్కి లాగుతుండవచ్చు
ప్రేమించినవారు నిన్నలా బెదిరించరు
జీవితం వధువులా మారి నీతో కలసి నడుస్తుంది
చేతులు సాచి అందుకో! ఆగేది దేనికోసం?
ఇప్పుడీ దూరాలిక దేనికి?
ఈ అసహాయత దేనికి?
జరగాల్సింది జరిగిపోయింది
దానిగురించి ఆలోచించకు
మనసుకు సర్దిచెప్పి , బరువు తగ్గించుకో
ఈ మౌనం విడువు
ఈ బాధ వదులుకో”


జిందగీ హర్ కదమ్ ఎక్ నయీ జంగ్ హై

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-111
జిందగీ హర్ కదమ్ ఎక్ నయీ జంగ్ హై
(జీవితం లో ప్రతి అడుగూ ఒక కొత్త యుద్ధమే)
Meri జంగ్ (1985) లో లతా మంగేష్కర్, నితిన్ ముకేశ్ పాడిన పాట. ఆనంద్ బక్షి రచన, లక్ష్మీకామ్త్ ప్యారే లాల్ స్వర రచన.
మన్మోహన్ దేశాయి, ప్రకాశ్ మెహ్రా లవంటి దర్శక నిర్మాతల కోవలో ఎనభైల నాటికి సుభాష్ ఘయ్ చేరాడు. అతను డెబ్భైల మధ్యలో దర్శక ప్రస్థానం ప్రారంభించినా ప్రేక్షకులనాడి ఎనభైల మధ్యనాటికి దొరికింది. భారీతారాగణం, భావోద్వేగాలకు, కమర్శియల్ ఎలిమెంట్స్ కి ,సంగీతానికి ప్రాధాన్యమిస్తూ చిత్ర నిర్మాణం చేశాడు. అనిల్ కపూర్ స్టార్ గా ఎదిగే దశలో ఉన్నపుడు అతనితో చాలా సినిమాలు తీశాడు. అందులో ఒకటి మేరీ జంగ్.
ఈ పాట సినిమాలో పలుమార్లు రిపీట్ ఔతుంది. భిన్న గాయకులు పాడారు. సినిమా మొదట్లో వచ్చే పాట ఇది.
‘నాసిర్ హుస్సేన్’ అనేక సినిమాల్లో చిన్నప్పటి పాట పెద్దయ్యాక రిపీట్ అయ్యి మనుషుల్ని కలపటమో, పాత ఉద్వేగాల్ని తిరిగి కలించటమో చేస్తుంది.
అదీ అలాంటి కుటుంబగీతమే (ఫామిలీ సాంగ్). ఐతే పాట సారాంశం హీరోని మోటివేట్ అయ్యేందుకు దోహదపడేట్టు ఉంది.
“మనం గెలుస్తాం
మనం గెలుస్తాం నువ్వు తోడుంటే
జీవితం లో ప్రతి అడుగూ ఒక కొత్త యుద్ధమే
మనం గెలుస్తాం
మనం గెలుస్తాం నువ్వు తోడుంటే
నువ్వే నా పెదవులకు ఈ గీతాన్ని అలంకరించావు
నీ ప్రేమ జీవనాన్ని సంగీతమయం చేసింది
ప్రియతమా!నాదైన ప్రతీదీ నీవిచ్చినదే
నేనొక చిత్రాన్ని ..దాని రూపూ రంగూ నువ్వే
ధైర్యాన్ని వదలవద్దు ప్రపంచాన్ని ఎదుర్కో
చూడు ఆకాశం రంగు మారుతుంది
పరాజయాన్ని కాదు అది విజయాన్ని తెలిపే రంగు
సూర్యనికోసం చంద్రునికోసం చుక్కల కోసం రోజూ ఎక్కడ వెతుకుతావు?
కాగడా తో చీకటిని వెలుతురుమయం చేద్దాం.
ఆశయంతో ఉన్నంతవరకూ బాధనేది లేదు”


ఒహ్ రే తాల్ మిలే నదీకే జల్ మే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-110
‘ఒహ్ రే తాల్ మిలే నదీకే జల్ మే ,నదీ మిలే సాగర్ మే’
(“వాగుల నీరు నదిలో కలుస్తుంది,నది నీరు సాగరంలో కలుస్తుంది)
అనోఖీ రాత్ (1968) సినిమాలో ముకేశ్ పాడిన పాట. ఇందీవర్ రచన, రోషన్ సంగీతం.
‘సర్ గమ్ ‘ (1980) హిందీ సినిమాకు మాతృక తెలుగు లో వచ్చిన ‘సిరిసిరి మువ్వ’. సిరిసిరి మువ్వ సినిమాలో ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎవరు?’ పాట బదులుగా సర్ గమ్ లో ‘హమ్ తొ చలే’ పర్ దేశ్, పర్ దేశీ హోగయే ‘ పాట వస్తుంది.
రెండు పాటల్లోనూ సంగీతం, సాహిత్యం, గానం, చిత్రీకరణ గొప్పగా ఉంటాయి. తాత్వికతతో సాగే అనేక పాటల చిత్రీకరణ పడవల్లోనో, ఎద్దుల బండీలోనో, రైళ్ళలోనో, బస్సులలోనో సాగుతుంది. బహుశా జీవితానికీ ప్రయాణానికీ దగ్గర పోలిక ఉన్నట్టుంది. జీవితమ్ చలనశీలనమని చెబుతున్నారేమో.
తెలుగు పాట లిరిక్ ఇలా సాగుతుంది
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక?
ఏ దారెటూ పోతుందో ఎవరినీ అడగక?
వాన కురిసి కలిసేది వాగులో
వాగు వంక కలిసేది నదిలో
కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో
కాని ఆ కడలి కలిసేది ఎందులో?
ఒక హిందీ పాట ‘ఒహ్ రే తాల్ మిలే నదీ కె జల్ మే ‘ పాటవింటున్నప్పుడు పై తెలుగు పాట లిరిక్ గుర్తుకు వస్తుంది. దగ్గరగా గమనిస్తే హిందీ పాట ప్రభావం తోనే తెలుగు పాట రాసారని నమ్మకంగా అనిపిస్తుంది. ఐతే హిందీ పాట తర్వాత చరణాలలో మరింత లోతుగా ఉంటుంది.
హిందీ పాట అనువాదం:
“వాగుల నీరు నదిలో కలుస్తుంది
నది నీరు సాగరంలో కలుస్తుంది
సాగరం ఎందులో కలిస్తుందో
ఎవరికి ఎరుక?
సూర్యునికోసం ధరణి , ధరణి కోసం చంద్రుడు తపిస్తాయి.
నీటిలో ముత్యపుచిప్పలా ప్రతీ ఆత్మా దాహంతోనే ఉంటుంది
ఒ జతగాడా!
నీటిచుక్క ఏ మబ్బులోలో దాగిందో
ఎవరికి ఎరుక?
పరిచయంలేని పెదవులపై పరిచయమున్న పాటలు
నిన్నటివరకూ పరాయివారు,నేడు జన్మ జన్మల మిత్రులు
ఏ క్షణంలో ఏమౌతుందో
ఎవరికి ఎరుక?”

ఏక్ అకేలా ఇస్ షహర్ మే.రాత్ ఔర్ దోపహర్ మే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-109
“ఏక్ అకేలా ఇస్ షహర్ మే.రాత్ ఔర్ దోపహర్ మే”
(ఈ నగరంలో రాత్రింబవళ్ళు ఒకడు ఒంటరిగా,
‘ఘరోండా’(1977) సినిమాలో భుపేందర్ పాడిన పాటగుల్జార్ రచన జైదేవ్ సంగీతం.
‘ఇల్లు కొందరికి ఉండటానికి గూడు కొందరికి సంపాందిచవలసిన ఆస్తి’. అని ‘రావి శాస్త్రి’ తన ‘ఇల్లు ‘ నవలలో చెబుతారు.
ఈ సినిమాపేరు ‘గూడు’. బొంభాయి నగరం లో ఆవాసం దొరకటం కష్టం. ఇద్దరు మధ్యతరగతి ఉద్యోగులు తమకో గూడు ఏర్పాటు చేసుకుని వివాహంచేసుకుందామనుకున్నారు. తమ అన్ని వనరులూ కట్టబోయే అపార్ట్మెంట్ పై పెట్టారు. దానిపై కలలు కన్నారు. ఆశలల్లుకున్నారు. ఐతే బిల్డర్ మోసంచేశాడు. ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయింది. వారి తిరిగి మొదటికొచ్చారు. దాని కారణం గా వారు దూరమయ్యారు.
అవసరాలు,పరిస్థితులు మనుషులకు పరీక్ష పెడతాయి. అవి కొందర్ని దిగజారుస్తాయి., అడ్డదారులవైపు అడుగులు వేయిస్తాయి. కొందరు మాత్రం పరీక్షకు నిలబడగలుగుతారు.
అప్పటివరకూ కలిసున్న మనుషుల్ని అలాంటి పరీక్షాసమయాలు ఎవరిదారి వాళ్ళు చూసుకొనేట్లు చేస్తాయి.
1977 లో వచ్చిన ఈ సినిమా అప్పటి నగర ,మధ్యతరగతి జీవితాలని ప్రతిబింబిస్తుంది.
“ఈ నగరంలో రాత్రింబవళ్ళు ఒకడు ఒంటరిగా,
అన్నపానాలు వెతుకుతున్నాడు ,ఆశ్రయం వెతుకుతున్నాడు
పగలు ఖాళీ పాత్ర లా ఉంది, రాత్రి చీకటి నుయ్యిలా ఉంది
ఈ శూన్యమైన చీకటి కళ్ళలో , కన్నీటికి బదులు పొగ వస్తుంది
జీవితం సాగించటానికి కారణం కనపడదు. మరణించటానికి సాకు వెతుకుతున్నాడు
వయసుకన్నా దీర్ఘమైన దారుల్లో , గమ్యం చేరిక కానరాదు
పరుగిడుతూనే ఉన్నాడు, అతను ఆగటం చూడనే లేదు
ఈ అపరిచిత నగరంలో తెలిసినవారికోసం వెతుకుతున్నాడు”

కభి బేకసీ నే మారా! కభి బేబసీనే మారా!

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-108
కభి బేకసీ నే మారా! కభి బేబసీనే మారా!
( కొన్ని సార్లు అసహాయత చంపుతుంది,కొన్నిసార్లు నిరాశ్రయత చంపుతుంది)
అలగ్ -అలగ్ సినిమాలో కిశోర్ కుమార్ పాట. ఆనంద్ బక్షి రచన,ఆర్ డి బర్మ సంగీతం
ఎనభైలో ‘రఫీ’ మరణంతో హిందీ సినిమా సంగీతం ఏకధృవ ప్రపంచమైపోయిందనుకున్నారు. ఆ ధృవం కిశోర్ కుమార్. ఐతే ఎనభై తరువాత వచ్చిన కిశోర్ కుమార్ పాటల్లో అతని స్థాయిని పెంచినవి బహు తక్కువ, నిలబెట్టినవీ కొద్దిగానే. అనూహ్యంగా అతనితో ఏమాత్రం సరితూగని గాయకులతో అతను పోటీపడాల్సి వచ్చింది. కిశోర్ కుమార్ ను డెబ్భైలలో ఆకాశంలో నిలిపిన ఆర్ డి. బర్మన్ సైతం ఎనభైలలో కిశోర్ తో కాకుండా షబ్బీర్ కుమార్ వంటి కొత్త గాయకులతో పాటలు పాడించాడు. షబ్బీర్ కుమార్ ‘మహమ్మద్ రఫీ’ ని అనుకరించే గాయకుడు (క్లోన్) కావటం ఒక వైచిత్రి.
నటుడు రాజేశ్ ఖన్నా కిశోర్ కుమార్, ఆర్ డి.బర్మన్ బృందం ఎన్నో విజయాలను చవిచూసింది. వారి కాంబినేషన్ ను కూర్చిన దర్శకుడు శక్తి సామంతా. (1969లో)
పదహారేళ్ళతర్వాత (1985 లో) రాజేశ్ ఖన్నా నిర్మాతగా మారి పై కాంబినేషన్ ను మరోసారి ప్రయత్నించాడు. ఆ సినిమా ‘అలగ్ -అలగ్’. ఫలితం మాత్రం మరో ‘ఆరాధన’ గా రాలేదు. ఐతే కిశోర్ కుమార్ ద్వారా ఒక ఉత్తమ గీతాన్ని అందుకోగలిగాం.
“ఇది గజల్ కాదు గీతమూ కాదు
ఇది నా బాధల గాధ
నా గుండెలో కేవలం అగ్ని ఉంది
నా కళ్ళలో కేవలం నీరు ఉంది
కొన్ని సార్లు అసహాయత చంపుతుంది
కొన్నిసార్లు నిరాశ్రయత చంపుతుంది
మృత్యువుతో పేచీ లేదు
నన్ను జీవితమే చంపేసింది
విధి ని అనేందుకు లేదు
మారనిదల్లా కాలమే
అప్పుడప్పుడూ దురదృష్టం
కొన్నిసార్లు నా లేనితనం
వేటి పేర్లు చెప్పను?
నన్ను అన్నీ చంపాయి.
మృత్యువుతో పేచీ లేదు
నన్ను జీవితమే చంపేసింది
నరక ప్రాయపు,అపనమ్మకపు లోకమిది
ఇదే లోకమైతే ఇదేమిలోకం?
స్నేహితులకు కొదవలేదు
శత్రువులకు కొరత లేదు
కొన్నిసార్లు శత్రుత్వం దోచింది
కొన్నిసార్లు స్నేహం చంపింది.
మృత్యువుతో పేచీ లేదు
నన్ను జీవితమే చంపేసింది
వెలుతురు పట్ల విముఖత వచ్చింది
చీకటి అలవాటైపోయింది
చీకటి ఉన్నంత వరకూ
కాలం బాగానే గడచింది
నన్ను వెన్నెల దోచింది
వెలుతురు నన్ను చంపింది"

“న మై భగ్ వాన్ హు న మై సైతాన్ హు”

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-107
“న మై భగ్ వాన్ హు న మై సైతాన్ హు”
(“నేను దేవుణ్ణీ కాను దెయ్యాన్నీ కాను)
మదర్ ఇండియా లో పాట.షకీల్ బదాయుని రచన, నౌషాద్ సంగీతం, మహమ్మద్ రఫీ గానం
“లోకమిలాగే ఉంటుంది. దీనికి తగ్గట్టుగా మనం బ్రతకాలి “ అని కొందరనుకుంటారు. “లోకమిలా ఎందుకుంది? ఇందులో బ్రతకటానికి ఏంచేయాలి?” అనుకునే వారూ ఉంటారు. ‘ మదర్ ఇండియా’ సినిమాలో ఇద్దరి అన్నదమ్ముల ఆలోచనలు ఇలానే ఉన్నాయి. 
తమ్ముడికి రేగే ప్రశ్నలకు సమాధానం దొరకటంలేదు. అతనెలా బ్రతకాలో చెబుతున్నారు కాని అలాగే ఎందుకో చెప్పట్లేదు. ఈ పాటతో తనని తాను నిర్వచించుకుంటున్నాడు. ఐతే వినేవారికి అది తమందరి సంబంధించిన నిర్వచనమని అనిపిస్తుంది.
అతడు నటనలేని, భావాలని అణిచిపెట్టుకోని మనిషి. మంచి ముందు మొహం దాస్తాడు,సిగ్గుపడతాడు. దేవాలయాలదగ్గర సాధువుల చిలుముతో సమాధానపడడు. జూదం లాంటివి అతన్ని కట్టిపడేయవు. ఎద్దులా పొలంలో కష్టపడటం ,తీగపై నడకా, అకాశంలో గెడపై వేలాడటం ఇవన్నీ పొట్టనింపుకునే జాలం లో భాగాలని చెబుతాడు. అడ్డదిడ్డమైన వ్యవహారం అతన్ని గందరగోళపరస్తుంది.
“నేను దేవుణ్ణీ కాను దెయ్యాన్నీ కాను
లోకం ఇష్టమొచ్చింది అనుకోనీ ,నేను మాత్రం మనిషిని.
నాలో మంచీ ఉంది చెడ్డా ఉంది
మనసులో ఎంతో మురికి ఉంది కొద్దిగా స్వచ్చతా ఉంది
కొద్దిగా నమ్మదగినవాడిని కొంచెం మోసకారిని
లోకం ఇష్టమొచ్చింది అనుకోనీ ,నేను మాత్రం మనిషిని.
నేను రాజుని కాను నాతలమీద కిరీటంలేదు
ఐనా నా బ్రతుకులో భూమికున్నంత ఓర్పు ఉంది
పైకి పేదవాడిని మనసులో ధనికుడిని
లోకం ఇష్టమొచ్చింది అనుకోనీ ,నేను మాత్రం మనిషిని.
జీవితమనే పాటకి స్వరమూ లేదు తాళమూ లేదు
లోకమంతా గందరగోళంగా భుక్తి అనే వలలో ఉంది
ఎలాంటి అన్యాయమిది నాకు చిత్రమనిపిస్తుంది.
లోకం ఇష్టమొచ్చింది అనుకోనీ ,నేను మాత్రం మనిషిని. 

“కిసీ నజర్ కో తేరా ఇంతిజార్ ఆజ్ భి హై”

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-106
“కిసీ నజర్ కో తేరా ఇంతిజార్ ఆజ్ భి హై”
(“నీచూపు కోసం ,ఎదురు చూపు ఇప్పటికీ ఉంది)
ఐత్ బార్ (1985) సినిమాలో పాట. హసన్ కమాల్ రచన, భూపెందర్, ఆశాభోన్స్లే గానం.బప్పీలహిరి సంగీతం.
డెబ్భైలకు ముందు సినిమాలలో అనేక గజళ్ళు వున్నాయికానీ వాటి గాయకులూ మిగతా సినిమాపాటల గాయకులూ ఒక్కరే కావటంతో ప్రత్యేకంగా తెలిసేవికావు.
తర్వాత రోజుల్లో సినిమా గజళ్ళు జగ్ జిత్ సింగ్, పంకజ్ ఉధాస్ వంటి గజల్ గాయకులు పాడటం మొదలై ఆ ప్రక్రియ వేరుగా కనపడటం మొదలయ్యింది. గజళ్ళు ఉండే సినిమాలు కూడా ప్రత్యేక జానర్ గా ఉండేవి.
‘కిసీ నజర్ కో తేరా ‘ పాట వింటుంటే అలాంటి డిఫరెంట్ సినిమా చెందిన పాట అనిపిస్తుంది. పాట చిత్రీకరణకూడా అలానే అనిపిస్తుంది.
ఐతే ‘ఐత్ బార్ ‘ సినిమా ‘హత్య - రహస్యం’ చుట్టూ తిరిగే సినిమా. సస్పెన్స్ తో పాటు రెండు ‘సర్ప్రైజ్’ లు సినిమాలో ఉన్నాయి.
ఒకటి- క్రైమ్ సినిమాలో మనసుని ఆకట్టుకొనే లలితమైన గజల్లు (భూపేందర్ గానంతో)
రెండు- హోరెత్తించే సంగీతానికి మారుపేరైన బప్పీలహిరి వాటికి సంగీతమివ్వటం.
మొదటి రోజుల్లో రేడియో లోనూ , తర్వాత కాలంలో టీ.వీ. లోనూ బహుళ ప్రాచుర్యంలో ఉన్నపాట(గజల్).
“నీచూపు కోసం ,ఎదురు చూపు ఇప్పటికీ ఉంది
నువ్వెక్కడున్నవో నని ఈ మనసు ఆరాటం ఇప్పటికీ ఉంది
మనం కలిసితిరిగిన స్థలాలు, పరిసరాలో
నా నమ్మకపు జ్ఞాపక చిహ్నం ఇప్పటికీ ఉంది
నా మనసు ఇప్పటికీ తన అధీనంలోనే ఉందని
తనని చూసినపుడు ఎందుకు అనిపిస్తుందో తెలియదు
ఏప్రేమకోసం నేను నమ్మకపు దారుల్లో
ప్రపంచాన్ని వదులుకున్నానో ఆ ప్రేమ ఇప్పటికీ ఉంది
ఖచ్చిమనలేను కానీ ఇప్పటికీ అనిపిస్తుంది
నా అన్వేషణ లో తిరిగి వసంతం దొరుకుతుందని
ప్రేమలో ఎంత గాయపడ్డానని అడగవద్దు
ఆ తలపుతో మనసు బాధపడటం ఇప్పటికీ ఉంది “

‘బహుత్ షుక్రియా..బడీ మెహర్బానీ.ంఎరీ జిందగీ మే హుజూర్ ఆప్ ఆయి

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-105
‘బహుత్ షుక్రియా..బడీ మెహర్బానీ.ంఎరీ జిందగీ మే హుజూర్ ఆప్ ఆయి’
ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా (1962)లో పాట.ఎస్‌. హెచ్.బిహారి రచన,ఓ.పి. నయ్యర సంగీతం. రఫీ, ఆశాభోన్స్లే గానం.
హీరో జాయ్ ముఖర్జీ సినిమాలు థియేటర్లో చూడలేదు. అతని పేరు చెబితే గుర్తొచ్చేసినిమా ‘ఏక్ ముసాఫిర్ ఏక్ హసీన’. బహుళ ప్రాచుర్యంపొందిన పాటలు అందులో ఉండటం దానికి కారణం. ఆ పాటల్లో ఒకపాట ‘బహుత్ శుక్రియా’ మరింత నచ్చుతుంది.
సంగీతపరికరాల్లో నన్ను హార్మొనీ(యం) పట్టిలాగుతుంది. నేను మొదట విన్న,చూసిన వాయిద్యం అదే కావటం వల్ల కావచ్చు. భజనల్లో, పౌరాణిక నాటకాల్లో అది విస్తృతంగా వాడబడేది. అలాగే ‘డోలక్ సంతలో గారడీవాళ్ళు,పాములు ఆడించేవాళ్ళద్వారాపరిచయమే.వాటి శబ్దం వింటుంటే బాల్యమిత్రుల్ని కలిసినట్టో,బాల్యాన్ని తిరిగి అనుభవిస్తున్నట్టో ఉంటుంది.
ఆ రెండూ వాద్యాలు (హార్మొనియం, డోలక్) లు ఈ పాటలో వినపడటమే కాదు, కనపడతాయి కూడా.
కథాస్థలం కాశ్మీరం,కథాకాలం స్వతంత్ర అనంతరం. కథానాయకుడు సైనికుడు. హీరోయిన్ ను రక్షిస్తూ దెబ్బతిని గతం మరచిపోయాడు. అప్పట్నించీ ఆమె అతన్ని రక్షిస్తూ ఉంది. పాట చిత్రీకరణ ఒక నేల మాఌగ లాంటి చోటసాగుతుంది. కథానాయకుడ్ని దాచిఉంచినచోటది. కథానాయికకు జత ఓ కుర్రవాడు ,ఓ కుక్క. మంచిపాట.చక్కని సంగీతం. నాలాంటి సామాన్య సినీ ప్రేక్షకుడికి ఇంకేం కావాలి?
బహుశా లతా మంగేష్కర్ తో ఒక్క పాటా పాడించకుండా, ప్రముఖ సంగీతదర్శకుడిగా నిలబడింది ఓ. పి.నయ్యర్ మాత్రమేనేమో.

“బహు ధన్యవాదాలు.పెద్ద కృపచూపారు
నాజీవితంలోకి ప్రియతమా! మీరు వచ్చారు
పాదాలను చుంబించనా?ఎదురు చూస్తూ ఉండిపోనా?
ఏమిచేయాలో నాకు తోచటం లేదు
మనసు ను కథగా మలచి
నా హృదయాన్ని బహుమతిగా నీకర్పించనా?
ఇలాంటి మధుర ఘడియలు నాజీవితంలో
తిరిగివస్తాయా అన్నది దేవునికే ఎరుక
ఈ పొగడ్తలు విని నిజమనుకుని
నేను అహంకారి నౌతానని , ఆగర్వంతో
నృత్యం చేస్తానేమోననిభయంగా ఉంది
నీదానినై,నన్నునేను మరచిపోతానని కూడా
ఎంతో సంతోషం గా ఉంది ,కాని కొద్దిగా బాధా ఉంది
ఈ మన తోడు ఒకటి రెండు అడుగులేనని.
కాని ఈ ప్రయాణికుడు కోరుతున్నాడు
దేవుడు మరికొన్ని రోజులు మీతో నన్ను కలిపాలని"


లంబీ జుదాయీ

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-104
లంబీ జుదాయీ (దీర్ఘమైన ఎడబాటు)
హీరో సినిమాలో ‘రేష్మా ‘పాడిన పాట. ఆనంద్ బక్షి రచన లక్ష్మికాంత్ ప్యారేలాల్ స్వర రచన.
‘వాగ్దానం ‘ సినిమాలో హరికథలో ఒక పద్యం …’ఫెళ్ళు మనె విల్లు, గంటలు ఘల్లు మనె, గిభిల్లుమనె గుండె నృపులకు, ఝల్లుమనె జానకీ దేహము’ ఘంటసాల పాడుతారు.
అలాంటి స్థితి ‘రేష్మా ‘ పాట ప్రారంభంలో నాకు అనుభవానికి వస్తుంది.
జానపద గాయని ‘రేష్మా’ బికనేర్ (రాజస్థాన్) లో దేశ విభజన కాలంలోపుట్టింది. కుటుంబంతో పాకిస్తాన్ కు తరలింది. 1982 లో తొలిసారి(?) భారత్ కు వచ్చింది. హీరో సినిమాలో తొలిసారిగా తన గొంతు హిందీ సినీ సంగీత ప్రేమికులకు వినిపించింది.
ఆమె స్వరమైతే అప్పుడువిన్నారు కాని ఆమె సంగీత పవనాలు అప్పటికే తెరలు తెరలుగా భారత దేశంలోవ్యాపించి ఉన్నాయి.
అప్పటికి ఒక దశాబ్దంక్రితం ‘రాజ్ కపూర్’ తన ‘బాబీ’ సినిమాలో ఆమె పాటను ‘లతా మంగేష్కర్ ‘ స్వరంతో వినిపించాడు. ఆ పాట ‘అఖియోం కొ రెహనేదో ‘. ఆ సినిమా కు సంగీత దర్శకులు ‘లక్ష్మి కాంత్ ప్యారేలాల్’.
మరి కొన్నాళ్ళకు ‘లక్ష్మికాంత్ ప్యారేలాల్’’ మరోపాటతో రేష్మా ను గుర్తు తెచ్చారు. ఆ పాట బాలచందర్ హిందీ సినిమా ‘ఏక్ దూజే కేలియే’ లో అనూప్ జలోటా స్వరంతో ప్రారంభమయ్యే ‘కోశిష్ కర్ కే దేఖ్ లే దరియా సారే ,నదియా సారీ’ పాట.
ఆ తర్వాత ‘ లక్షి -ప్యారే’ లే ‘రేష్మా’ స్వరాన్ని ‘హీరో’ సినిమా ద్వారా వినిపించారు. ఆ పాట ‘లంబీ జుదాయీ’.
“మనం దూరమయ్యింది నిన్నా మొన్ననే
జీవించి ఎలాఉండను ఇలా సంవత్సరాల పాటు?
మృత్యువు రాదుకానీ నీ తలపులెందుకు వస్తున్నాయి?
దీర్ఘమైన ఎడబాటు...
నాలుగు రోజుల ప్రేమ! దేవుడా
బహు దీర్ఘమైన ఎడబాటు..
నా ప్రాణం ప్రార్ధన రూపంలో పెదవులు మీదకు వస్తుంది
దీర్ఘమైన ఎడబాటు…..
నాలుగు రోజుల ప్రేమ ! దేవుడా
బహు దీర్ఘమైన ఎడబాటు…..
మొదటిది ప్రియుడు నా చెంతలేడు
రెండోది కలుస్తాడన్న ఆశా లేదు
దానికి తోడు వర్షఋతువు వచ్చింది
వచ్చి నిప్పులు కురిపిస్తుంది
దీర్ఘమైన ఎడబాటు….
నీ చేతులతో నా ప్రపంచాన్ని ధ్వంసం చేసావు
నీ మనసు తో నా మనసు అద్దాన్ని పగలుగొట్టావు.
యుగాలను మించి ఎత్తైన గోడలు కట్టావు
దీర్ఘ మైన ఎడబాటు…...
పూయటానికి ముందే తోట నాశనమైపోయింది
కలవటానికి ముందే పక్షులు దూరమైపోయాయి
కోయిల కూత వేదన రేపుతుంది “

ఆయినా ముఝ్ కో మేరీ పెహ్లి సూరత్ మాంగి

‘ నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-103
“ఆయినా ముఝ్ కో మేరీ పెహ్లి సూరత్ మాంగి”
(దర్పణం నా తొలినాటి ముఖాన్ని కో రుతుంది)
-డాడి సినిమాలో తలత్ అజీజ్ పాడిన పాట(గజల్),రచన సూరజ్ సనిన్, సంగీతం ‘రాజేశ్ రోషన్’.
నా స్నేహితుడు ఒకాయన ‘ అద్దం అబద్ధం చెప్పదు’ పదాన్ని పదే పదే వాడేవాడు. అద్దంలో ముఖాన్ని యధాతధంగా చూసుకోవటానికి ధైర్యం కావాలి. వయసు తెచ్చేమార్పులే కాదు మనసు తెచ్చే మార్పులూ అద్దంచూపిస్తుంది.భౌతిక రూపాన్నే కాదు ,ఆంతరంగిక రూపాన్నీ చూపుతుంది.
ఆస్కార్ వైల్డ్ తన నవల ‘పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే’ లో దీనినే మరోలా చెబుతాడు. అందులో కథానాయకుడు సుందర రూపుడు. అతన్ని అభిమానించే ఒక కళాకారుడు అతని చిత్రాన్ని గీసాడు. ఐతే ఆ చిత్రం కథానాయకుని మానసిక మార్పులకు అద్దంపట్టేలా మార్పుచెందుతూ వస్తుంది. చివరికి ఆ చిత్రపు వికృతత్వాన్ని అతను భరించలేని స్థితికి అతను చేరుకుంటాడు.
వీటిగురించి ఆలోచనౌ రేపే పాట అప్పుడపుడు గుర్తుకొస్తుంది. పాట మరీ ప్రాచుర్యమయ్యింది కాదు. దర్శకుడు మహేశ్ భట్ తన కుమార్తె ‘పూజా భట్’ తో ‘డాడీ’ (1989) పేరుతో సినిమా తీశాడు.ఇది కొంతవరకూ అతని ఆత్మకథ అంటారు.
సినిమాలో నాయకుడు ఘజల్ గాయకుడు. ధనవంతుల ఇంటి పిల్ల ను ఆమె తండ్రి ఇష్టానికి వ్యతిరేకం గా ప్రేమ వివాహం చేసుకున్నాడు. పొరపొచ్చాలు పెద్దల ఇష్టముంటే సర్దుబాటౌతాయి , లేకుంటే పెద్దవౌతాయి. వివాహం విఫలమయ్యింది. అతను మద్యానికి బానిసై సంగీతానికి దూరమయ్యాడు.
పెద్దదైన కూతుర్ని కలిసాక అతను తిరిగి నిలబడే ప్రయత్నం చేసాడు. ఆ సందర్భం లో అతను పాడిన పాట ఇది.
“అద్దం నా తొలినాటి ముఖాన్ని కో రుతుంది
నా వాళ్ళు నన్ను తనవాడిననటానికి గుర్తులడిగారు
దుఃఖభరిత వనాల్లో తిరుగాడుతుంటే
కాలం నా ముఖంపైన లెక్క రాస్తూ ఉంది.
నా కీర్తి నా వెర్రితనానికి ????
నా పాటలపుస్తకాన్ని మద్యపుసీసా తాగేసింది
ఇప్పుడు తిరిగి వచ్చాక నవ్వటమే మరిచాను
ఈ నగరం నన్ను మరచింది ..నేనూ దీనిని మరచిపోయాను
నా వాళ్ళు నన్ను పోల్చటానికి గుర్తులడిగారు
అద్దం నా తొలినాటి ముఖాన్ని కోరుతుంది
నా కళ నన్ను తిరిగి రంగం మీదికి తెచ్చింది
ఇక్కడ ప్రేమ ,నమ్మకం అమ్మకమౌతాయి
తండ్రి అమ్ముడౌతాడు..ప్రియతములు అమ్ముడౌతారు
గర్భం అమ్మబడుతుంది. మనసు అమ్మబడుతుంది ..తల అమ్మబడుతుంది
ఈ మారుతుండే ప్రపంచం దేనిపైనా నమ్మకముంచదు
ఇక్కడరోజూ చౌకగా దేవుణ్ణి అమ్మేస్తారు
ప్రతీ ఖరీదుదారునికీ బజారులో ఖరీదు చేయబడతాడు
నేను పొందగలిగిందేమిటి ? వేరేవారు ఇక్కడ పొందిందేమిటి?
నా భావనా! నా పూజా!! వేరేచోటు కు పద"

గోరోం కి నా కాలోంకీ దునియా హై దిల్వాలో కె

‘నచ్చిన’పాటలు-’లోపలి’ మాటలు-102
“గోరోం కి నా కాలోంకీ దునియా హై దిల్వాలో కె”(తెల్లగా ఉన్నవారిదీ కాదు నల్లగా ఉన్నవారిదీ కాదు, గుండె ఉన్నవారిదే ఈ లోకం).
డిస్కో డాన్సర్ లో పాట అంజాన్ రచన, సురేశ్ వాడ్కర్, ఉషా మంగేష్కర్ గానం ,బప్పిలహిరి సంగీతం
శివ్ ఖేరా రాసిన ‘యు కెన్ విన్’ పుస్తకంలో ఒక చిన్న కథ.
మార్కెట్ లో ఒకతను బెలూన్లు అమ్ముతున్నాడు. కొనేవారిని ఆకర్షించటానికి కొన్నిబెలూన్లలో హీలియమ్(?) నింపి ఆకాశంలోకి వదులుతున్నాడు. అందులో రంగురంగులవివున్నాయి.
ఒక పిల్లవాడు అమ్మేఅతన్ని ప్రశ్నించాడు. నల్లరంగు బెలూను కూడా పైకి వెళుతుందా? అమ్మేఅతని సమాధానం. “ బెలూన్ రంగుకాదు. అందులో ఏమున్నదో అది ముఖ్యం”.
ఈ కథ చదివాక నాకు గుర్తుకొచ్చిన హిందీ పాట “గోరోం కి నా కాలోంకీ దునియా హై దిల్వాలో కె”
క్రీడారంగం,కళారంగం నేపధ్యంలో వచ్చే సినిమాల్లో చాలా చిన్నస్థాయి నుండి మొదలైన ఆటగాళ్ళు/కళాకారులు పైకి రావటం, దానికి అదేరంగంలో విఫలమైన సీనియర్లు వారికి సహాయపడటం ఎక్కువగా చూపబడుతుంది.వీటికి ప్రజాదరణ బాగానే లభిస్తుంది. డిస్కో డాన్సర్ సినిమా కూడా అలాటిదే.
1982 లో డిస్కో డాన్సర్ సినిమా చాలా హడావుడి చేసింది. అంతకుముందు బి గ్రేడ్ హీరోగా ఉన్న మిథున్ చక్రవర్తిని దాన్సింగ్ స్టార్ గా మార్చింది. బప్పీలహిరి ని ప్రధమశ్రేణి సంగీతదర్శకుడిగా మార్చింది.సినిమాలో కథ ఒక పేద పిల్లవాడు వీధి గాయకుడిగా మొదలై పెద్ద గాయకుడిగా ఎదగటం.
కథానాయకుడు చిన్నగా ఉన్నపుడు పాడిన పాట ఇది. ఇందులో కనిపించే బాలనటుడి డాన్స్ మూవ్ మెంట్స్ మిథున్ చక్రవర్తి కదలికల్ని గుర్తుచేస్తాయి. అతని పాటనచ్చి మేడమీదినుండి దిగిన అమ్మాయిచేసిన నృత్యం ధియేటర్లలో విజిల్స్ వేయించింది.కథానాయకుడ్ని ప్రభావితం చేసిన వీధి గాయకుడిగా రాజేశ్ ఖన్నా పాటలో కనిపిస్తారు.
“తెల్లగా ఉన్నవారిదీ కాదు నల్లగా ఉన్నవారిదీ
కాదు గుండె ఉన్నవారిదే ఈ లోకం
నవ్వుతూ బతికి నవ్వుతూ మరణించే
మనలాంటి గుండె కలవారిదే
ఉదయ సాయంత్రాలూ మన పాటలు వీధుల్లో మారుమోగుతాయి.
మనం పాటల బేహారులం అదే మన పని
బంగారం వెండి మీద కాదు పాటమీదే మన ప్రేమ
బ్రతికిన నాలుగు రోజులూ ఆనందం గా బ్రతుకు మిత్రమా
చేయాల్సింది ఉంటే మనస్పూర్తిగా చేయి మిత్రమా
నీదేమిటి? నాదేమిటి? మరచిపో మిత్రమా”

యే మెరే ఉధాస్ మన్ చల్ దోనో కహి దూర్ చలే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు -101
‘యే మెరే ఉధాస్ మన్ చల్ దోనో కహి దూర్ చలే’
కలతచెందిన నా హృదయమా,దూరంగా ఎక్కడికైనా మనిద్దరం పోదాం
మాన్ -అభిమాన్(1980) సినిమాలో జేసుదాస్ పాడిన పాట రవీంద్రజైన్ సంగీతం,సాహిత్యం అందించారు.
ఏ మనిషీ వేరే వారికి పూర్తిగా అర్ధంకారు.ఎవరికి వారైనా అర్ధమైతే కనీసం తమతో తామైనా మాటాడుకోవచ్చు. అలాంటి ఏకాంతం లో లోపలి సంభాషణతో కొంత సమాధానపడవచ్చు.
వేరేవారి సంగతి అటుంచి కొన్నిసార్లు ఎవరికి వారే పూర్తిగా అర్ధంకారు.అప్పుడు ఒంటరితనమే. అది మరింత వేదనాభరితం.
పై రెండు స్థితులూ అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురైయ్యే ఉంటాయి. చుట్టు ఉన్న పరిస్థితులతో ఇమడలేని సందర్భాలు,ఎవరికీ మనసు మాట చెప్పలేని చెప్పటానికిరాని ,ఏదోలా చెప్పినా దానిని విన్నవారు సంపూర్ణంగా అర్ధంచేసుకోలేని స్థితి.
అప్పుడు మనమే మనకి తోడు. మన మనసే మన మిత్రుడు. మనసు కలత చెందితే మనం దానిని ఓదారుస్తాం. కొన్నిసార్లు మనపట్ల మనసును సానుభూతి చూపమంటాం.
మనం విని ఉన్న పాట ఉంటుంది. చాలాసార్లే వినిఉంటాం. ఎప్పుడో ఓ సారి ఆ పాట మనసుకు బాగా దగ్గరైపోతుంది. అంటే ఆ పాటకు అవసరమైన మానసిక స్థితిలో మనమపుడు ఉండి ఉంటాం.
’ పాట అలా దగ్గరైన పాటల్లో ఒకటి.
‘ఉధాస్ ‘ హిందీ పదానికి ‘ఉదాసీనత ‘ తెలుగు పదం దగ్గరదేమోననుకుంటాను. మనసు ఉదాసీనంగా ఉన్నపుడు , జగమంతా పరాయిదైనట్టనిపించినపుడు మనదైన ప్రపంచం ఇదికాదు అది ఎక్కడో ఉన్నట్టనిపిస్తుంది.
జేసుదాసు తన గానంతో పాటకు ,భావానికీ మరింత సాంద్రత పెంచాడు.
“కలతచెందిన నా హృదయమా
దూరంగా ఎక్కడికైనా మనిద్దరం పోదాం
నా ప్రాణమా ! నీ గమ్యం
ఇది కాదు..ఇదికాదు ..వేరేదెక్కడో ఉంది
ఈ తోటలో ప్రతి పువ్వూ ముళ్ళతో గుచ్చుతుంది
స్వప్నాలు ధూ ళి గా మారుతుంటే ,వాటిగురించి చెప్పేదేముంది
నా మిత్రమా! నీ ప్రపంచం
ఇది కాదు..ఇదికాదు ..వేరేదెక్కడో ఉంది
ఎవరూ మరువలేపోతున్న నా తప్పు ఏమిటి ?
పశ్చాత్తాపంతో కళ్ళు, నిండా ఆశృవులు నింపి రోదిస్తున్నాయి!
ఓ వెర్రివాడా! నీ సొంతం అనుకోగలిగింది
ఇది కాదు ..ఇది కాదు . వేరేదేదో ఉంది.
రాయి కూడా ఒకనాటికి కరుగుతుంది
గడ్డకట్టిన నీరు జలపాతం గా మారుతుంది
నీ క్లేశం అలా కరిగేదా
కాదు కాదు అది వేరే ఉంది.”


Friday, June 30, 2017

మై పల్ దో పల్ కా శాయర్ హు

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు -100
1.మై పల్ దో పల్ కా శాయర్ హు, 2.మై హర్ ఎక్ పల్ కా శాయర్ హు
( నేను ఒకటి రెండు క్షణాలు నిలిచిఉండే కవిని) ( నేనుప్రతిక్షణం నిలిచిఉండే కవిని)
కభీ కబీ సినిమాలో ముకేశ్ పాడిన పాట. సాహిర్ లూధియాన్వి రచన, ఖయ్యామ్ సంగీతం.
ప్యాసా ,కభీ కభీ , రెండు సినిమాలూ సినీ ప్రేమికుల్ని, సినీ సంగీత ప్రేమికుల్నీ అలరించాయి. రెంటికీ కొన్ని సారూప్యాలు ఉన్నాయి. రెండు సినిమాల్లోనూ కథానాయకులు కవులు. ఇద్దరూ చదువుకునే రోజుల్లో ప్రేమలో పడ్డారు. ఇద్దరి ప్రేమ విఫలమయ్యింది. ఇద్దరి జీవితాలలోనూ తర్వాతి రోజుల్లో పాత ప్రేమికలు తారసపడ్డారు. ఐతే తర్వాత వారు సాగిన దారులు వేరు.
రెండు సినిమాలకు సాహిత్యం ‘సాహిర్ లూధియాన్వి’దే.నిజజీవితలో భగ్న మనస్కుడైన ‘సాహిర్ లూధియాన్వి’ కొన్ని పాటల్లో తాను నిజంగానే ప్రవేశిస్తాడు. కథానాయకుడు కూడా తనవంటి కవి ఐనప్పుడు ,పాత్ర మనసిక స్థితిలో కూడా సామాన్యత ఉన్నపుడు ‘సాహిర్ ‘ తనే ఆ పాత్ర ఐపోయాడు. ‘సాహిర్’ అలా పాత్రగా మారి సాహిత్యం అందించిన ఈ రెండు సినిమాలూ రెండు కళాఖండాలు గా నిలిచిపోయాయి.
‘ప్యాసా’ విషాదాంతం అనలేము ,అలాగే ప్రమోదాంతం అనలేము. చివర్లో కథానాయకుడు తన ప్రపంచాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు.
కభీ కభీ లో కథానాయకుడు ప్రేమను పొందలేని చోట ఆగిపోలేదు. అతనిది మరీ ప్రత్యేక ప్రపంచం కాదు. సమాజంతో మరీ ఫిర్యాదు లేదు.వేరే జీవితాన్ని నిర్మించుకున్నాడు. తండ్రి వ్యాపారాన్ని తను చూసుకుంటున్నాడు. పెళ్లి చేసుకుని కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు.
తన తొలినాళ్ళలో జీవితం పట్ల అతని ఆలోచనల్ని అతను గానంచేసాడు. తన జీవితం తనది మాత్రమే అనుకున్నాడు. తనతో పాటు అది అంతమౌతుందనుకున్నాడు. తనున్న రెండు క్షణాల జీవితం ఎవరికీ పట్టనిదనుకున్నాడు. తనని ‘రిప్లేస్’చేసేవారితో తనకేమీ సంబంధం లేదనుకున్నాడు.
అప్పటి రోజుల్లో అతని గానం:
“రేపు కొత్త మొగ్గలు తొడుగుతాయి.రేపు కొత్త పువ్వులు నవ్వుతాయి
కొత్తనేలమీద,కొత్త పచ్చికపై కొత్త పాదాలు నడయాడుతాయి
అవి నన్ను పట్టించుకోవు.నేనూ వాటిని పట్టించుకోను
వాటి ఉదయ సాయంత్రాలలో ఒక లిప్త కాలమైనా నాదిగా ఎలా చేసుకోగలను?
నేనూ ఒకటి రెండు క్షణాలు నిలిచిఉండే కవిని
ఒకటి రెండు క్షణాల సంతోషం నాది,ఒకటి రెండుక్షణాలు ఉండే యవ్వనం నాది
నాకంటే ముందు ఎంతమంది కవులు రాలేదు ? వచ్చి వెళ్లిపోలేదు
కొందరు నిట్టూర్పులు విడిచి వెళ్ళారు కొందరు పాటలు పాడి వెళ్ళారు
వారూ ఒక్క క్షణపు కథలే, నాదీ ఒక్క క్షణపు కథే
ఇప్పుడు మీలో భాగాన్నినేను ,రేపు మీనుండి దూరమౌతాను.
రేపు వికసించే పాటల మొగ్గల్ని ఏరుకునేవారు మరొకరు వస్తారు
నాకంటే ఉన్నతంగాగా చెప్పేవారు, మీకంటే ఉన్నతంగా వినేవారు
రేపెవరో నన్ను గుర్తుచేసుకుంటారు. ఐనా ఎందుకు గుర్తుచేసుకోవాలి?
తీరికలేని ప్రపంచం నాకోసం తన కాలాన్ని ఎందుకు వృధా చేసుకుంటుంది?”
సినిమా చివరిలో ఒకతరంలోని వ్యక్తులు తమ తర్వాతతరం వారిలో తమని తాము చూసుకుంటున్నారు. అపుడు
వినిపించే పాట మొదటి పాట వరుసలోనే మరొక అర్ధంతో వినపడుతుంది.
జీవితమంటే ఒకరి జీవితం కాదు. అది రూపాలు మార్ర్చుకుంటూ వేరే వారిని వాహిక చేసుకుని కొనసాగుతుంటుంది అని చెప్పే పాట అది. జీవితానికున్న ‘కొనసాగింపు’ ను తన జీవితానుభవాలద్వారా కథానాయకుడు గమనించగాడని అనిపిస్తుంది.
“ ప్రతిక్షణం నిలిచిఉండే కవిని నేను
కలకాలం నిలిచి ఉండే కథ నాది
ఎల్లవేళలా ఉండే సంతోషం నాది
అనుక్షణం ఉండే యవ్వనం నాది
అనుబంధాల రూపం మారుతూ ఉంటుంది
బంధాల పునాదులు నాశనం కావు
స్వప్నాలు, ఆకాంక్షలు నాశనం కావు.
ఒక పువ్వులో నీ రూపం నిలుస్తుంది
ఒక పువ్వులో నా యవ్వనం ఉంటుంది
ఒక ముఖం లో నీ గుర్తులుఉంటుంది
ఒక ముఖంలో నా గుర్తులుంటాయి
నువ్వు నేను జీవన అమృతాన్ని
ఈ చేతులతో తాగాలి
వీరి గుండె చప్పుడులో నివాసముండాలి
వీరి శ్వాస లో జీవించాలి
నీ సోయగాల్ని ఒకరికివ్వు
నేను నా నమ్మకాన్ని ఒకరికిస్తాను
ని కోసమే చేసిన ఆలోచనలు
అన్నింటినీ దీవెనలు చేస్తాను.”



ముఝే నవ్ లఖా మాంగాదే రే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు -99A
‘ముఝే నవ్ లఖా మాంగాదే రే ‘, ‘లోగ్ కెహతే హై మై షరాబీ హు’
(ప్రియా!నాకు (9 లక్షల విలువైన) హారం తెప్పించు.),( ‘లోకులనుకుంటారు నేను తాగుబోతునని’)
...
షరాబి సినిమాలో ఆశా భోన్స్లే, కిశోర్ కుమార్ పాడినపాట.రచయిత అంజాన్,సంగీతం బప్పిలహిరి.
నాకుతెలిసి లిరిక్ గా అతిపెద్ద పాట. రెండు పాటలుగా కూడా చెప్పవచ్చేమో.
పాట మొదటి భాగం ఆశాబోన్స్లే స్వరంతో ఏదో జానపద గీతం ఆధారంగా తయారయ్యిందనిపించేలా ఉంటుంది.
రెండో భాగం కిశోర్ స్వరంతో మనుషులంతా ఏదో ఒక మత్తులోనే ఉంటారని చెబుతూ సాగుతుంది.భానుమతి పాడిన ఒక తెలుగుపాట ‘పిచ్చి పిచ్చి పిచ్చి,రకరకాల పిచ్చి’ ని ఈ పాట గుర్తుచెస్తుంది.

డెబ్భైలలో దర్శక నిర్మాత ‘ప్రకాశ్ మెహ్రా’ కు అమితాబ్ తో అనేక విజయాలందాయి. తొలి ఎనభైలలో కూడా వీరి కాంబినేషన్ ఆర్ధిక విజయాలనిచ్చింది కానీ పాత కీర్తిని పెంచలేదు. ఎనభైల తర్వాతి వాటిలో నాకు నచ్చిన సినిమా ‘షరాబి’. అమితాబ్ ,అమితాబ్ గా కనపడిన అతికొద్ది సినిమాలలో ఇది ఒకటి(పూర్తి స్థాయి కథానాయకుడిగా).
ముకద్దర్ కా సికందర్ లో ‘సలామె ఇష్క మేరీ జాన్’ పాట ఆ సినిమాకు పెద్ద ఆకర్షణ. ఆ సినిమా ప్రకాశ్ మెహ్రాదే. ఆ పాట దారిలో ‘షరాబీ’లో కూడా ఒక పాట పెట్టారు.
సంగీత దర్శకుడు బప్పిలహిరి. బి గ్రేడ్ సినిమాలకు సంగీతమందిస్తూ ఎనభైలలో పెరిగి ప్రధాన సంగీతకారుడయ్యాడు. నమక్ హలాల్, షరాబి వంటి అమితాబ్ సినిమాలకు సంగీతమిచ్చి, అమితాబ్ -ఆర్ డి బర్మన్, అమితాబ్ - లక్ష్మి ప్యారే ల కాంబినేషన్ కన్నా ముందుకెళ్ళాడు.
పాట

తనువెల్లా అలంకరించుకుంటాను
గుండె చప్పుడు లా నా కాలి అందెలు మోగినప్పుడు
ప్రియా!నాకు (9 లక్షల విలువైన) హారం తెప్పించు.
నుదుట బొట్టు(?) చెవులకు జూకాలు
కాళ్ళకు పట్టీలు, చేతులకు గాజులు
నిన్ను చేతుల్లోకి తీసుకుంటాను,నాకు దుస్తులు కుట్టించు
నిన్ను తనువుకు హత్తుకుంటాను,మెరిసే చుక్కలతో చునిరీ
అవి కట్టుకుని వస్తే అందరి చూపులూ నాపైనే
నన్ను అలంకరించు
ఈ అందం ...ఈ వయసు తో
నీకోసం నాట్యం చేస్తున్నాను
సూర్యుడి నడిగి సౌందర్య సామగ్రి తెప్పించు నా కోసం
నీ పెదవులు స్పృశిస్తా ప్రియతమా
జీవితమంతా ఎదురు చూస్తూనే ఉన్నా
ప్రియుని కళ్ళలోని అల్లరి కోసం
నీప్రేమలో కోల్పోయిన
నా జన్మజన్మల కలల్ని అలంకరించుకుని కూర్చున్నా
ఇప్పుడు అర్ధంచేసుకుని ఒప్పుకున్నా
హృదయం అర్పిస్తే ఏమౌతుందో
ప్రపంచం ఏడ్వనీ, లోకులు కోపగించనీ
నేను ప్రియుని ఇంటికి వెళ్ళవలసిందే
పూలదండ నవ్వినట్టు
నువ్వు కళ్ళతో నవ్వినట్టు
కిరణాలను నా పాపిట్లో అలంకరించు
పున్నమి చంద్రుని నా నొసట బొట్టుగా తే
నిన్ను నా నుదుట దిద్దుకుంటాను
మొత్తం మద్యశాలను నీ పాదాలపై చిలకరిస్తాను
**************
“లోకులనుకుంటారు నేను తాగుబోతునని
నువ్వు ,బహుశా అదే అనుకును ఉంటావు
అవును, లోకులనుకుంటారు నేను తాగుబోతునని
కొందరిలో యౌవన సౌందర్యాల నిషా
కొందరిలోప్రేమతరంగాల నిషా
కొందరికి కొందర్ని చూస్తే శ్వాస నుండి ఉబికివస్తుంది నిషా
తాగనప్పటికీ హద్దులుదాటి నడిచే నిషా
నిషా లో లేని వారెవరో కొద్దిగా చెప్పునాకు
తెలివి తో ఉన్నఎవరినైనా నా ముందుకు తీసుకురా
అందరూ నిషాలోనే ఉన్నారు..తేడా వాటి రంగుల్లోనే
వెలుగురేఖల ఉదయానికి తుషారపు నిషా
పవనానికి సుగంధాల నిషా, మేఘానికి వాన చినుకుల నిషా
కొందరికి సుఖమే నిషా, కొందరి కి బాధే నిషా
నిషా అనేది మద్యంలో ఉంటే మద్యపు సీసా నాట్యం చేస్తుంది
మద్యశాల ఊగుతూ ??????
ప్రియతమా! కళ్ళతో మధువు తాగించు కొద్దిగా
ప్రియతమా! నిన్ను నేను , నా శ్వాసలో బస చేయిస్తాను
ప్రియతమా! నీకు (9 లక్షలవిలువైన ) హారం చేయిస్తాను”



బోలే రే పపి, పపిహరా

నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-99
బోలే రే పపి, పపిహరా
(‘కోయిల పాడుతూ ఉంది’)
గుడ్డి సినిమాలో వాణి జయరామ్ పాడిన పాట, వసంత్ దేశాయ్ సంగీతం,గుల్జార్ రచన.
...

‘గుడ్డి’ (1971) పేరు వినపడితే రాబోయేది ఈ పాటే అని ఎదురుచూపు ఉండేది.వాణీ జయరామ్ ,వసంత్ దేశాయ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ పాటతో తడవని చిత్ర సంగీత ప్రేమికులు అరుదు.
పాట ప్రారంభంనుండీ..చినుకులుగా కాదు ధారాపాతంగా వాన కురుస్తున్నట్టే ఉంటుంది. పాట నిండా ఆమె కంఠధ్వని పరచుకున్నట్టుంటుంది. వానకు గాలి తోడైతే వాన లయబద్ధంగా మెలికలు తిరుగుతుంది. పాట లో ఆమె స్వరంలో అలాంటివే కనిపిస్తాయి.
‘గుడ్డి’ అన్నా’పపి, పపిహరా అన్నా..నిజానికి పాటలో ఏ పదానికీ అర్ధంతెలియకున్నా ...పాట విన్నాక మనసు ఒక అనిర్వచనీయమైన అనుభూతి పొందేది.

తన కన్నీటి చుక్కను ను కొనిపోయి ప్రియమైన వారున్నచోట వర్షంలా కురవమని మేఘం/వర్షఋతువు కు ఒకామె వేడుకోలు. తిరిగి ఆ ఋతువు తెచ్చిన సందేశం కలిగించిన ఆనందంతో ఆమె అశ్రుకణం , కంటిలో ముత్యమయ్యింది.

పాట చిత్రీకరణ ఒక గుహ(ఎలిఫెంటా కేవ్స్??) లో జరిగింది. బైట వాన,గుహ లోపలి చీకటితో ‘డార్క్’ బాక్ గ్రౌండ్, ప్రకాశవంతమైన ఎరుపు,తెలుపు దుస్తుల్లో నటులు. ప్రతీ ఫ్రేమూ ఒక్కొక్క కలర్ పెయింటింగే.

వాణి జయరాం కు ఈ పాట హిందీ చిత్ర సంగీతసీమలో గొప్ప ప్రారంభానిచ్చింది. ఐతే అంత గొప్ప కొనసాగింపు ఉన్నట్టు కనపడదు. అలాగని ఆమె అక్కడ ‘వన్ డే వండర్’ కూడా కాదు. మదన్ మోహన్, నౌషాద్ ,ఓ.పి.నయ్యర్ వంటి ఉద్దండులతో పనిచేసింది.పండిట్ రవిశంకర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘మీరా’ సినిమాలో ఆమె గానం శ్రోతలకు కర్ణామృతమే.
బోలెరే పపి పాట:

‘కోయిల పాడుతూ ఉంది
నిత్యం జడివాన కురుస్తుంది. నిత్యం మనసుదాహంతోనే ఉంది
నిత్యం మనసు దాహంతో వుంది నిత్యం మనసు తపిస్తూనే ఉంది
కనుకొలకుల్లో ఒక చినుకు ను అలంకరించుకు వున్నాను ..
వర్షఋతువూ … తీసుకొని పో
వెళ్ళు .. ప్రియునిదేశంలో దీనిని వర్షించు
వెళ్ళు .. ప్రియునిదేశంలో దీనిని వర్షించు
నిత్యం జడివాన కురుస్తుంది. నిత్యం మనసుదాహంతోనే ఉంది
నిత్యం మనసు దాహంతో వుంది నిత్యం మనసు తపిస్తూనే ఉంది
కోయిల పాడుతూ ఉంది
వర్షర్తువు తెచ్చిన సందేశంతో
నాకళ్ళ లో చినుకు ముత్యమయ్యింది
ఇది దానంగా నా తండ్రిఇంటి నుండి వచ్చింది
నిత్యం మనసు దాహంతో వుంది నిత్యం మనసు తపిస్తూనే ఉంది’




మై జిందగీ క సాత్ నిభాతా చలా హువా

నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-98
‘మై జిందగీ క సాత్ నిభాతా చలా హువా’
(నేను జీవితంతో పాటే నడిచాను)
హమ్ దోనో సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట. జయ్ దేవ్ సంగీతం, సాహిర్ లూధియాన్వి రచన.
...
నా కవిత్వం ల్లో నేను దొరుకుతాను అంటాడు ‘తిలక్’ ‘అమృతం కురిసిన రాత్రి’ లో. నిజానికి చాలా మంది రచయితల్ని వాళ్ల రచనల్లో దొరకబట్టవచ్చు. ఐతే దేవానంద్, సాహిర్ లూధియాన్వి రాసిన తన సినిమా పాట ఒక దానిలో లో తనున్నానన్నాడు. ‘ఇట్ ఈజ్ మై ఫిలాసఫీ ఆఫ్ లైఫ్’ అని ఆ పాట నుద్దేశించి అన్నాడు. ఆ పాట ‘మై జిందగీ కా సాత్ నిభాతా చలా హువా’. సినిమా ‘హమ్ దోనో’.

ఇది దేవానంద్ సోదరుల సినిమా. సాధారణం గా వారి సినిమాలకు అప్పట్లో ఎస్. డి. బర్మన్ సంగీతమిచ్చేవారు. ఈ సినిమాకు మాత్రం బర్మన్ శిష్యుడు ‘జయ్ దేవ్’ సంగీత దర్శకుడు. ఈ సినిమాతోనే అతను తనను ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత సంఖ్యాపరంగా తక్కువైనా నిలిచిపోయే పాటలు చేశాడు.
హమ్ దోనో పాటలు ఇప్పటికీ రేడియో శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ పాట ‘జయ్ మాలా’ ప్రోగ్రామ్ లో ఎక్కువగా వినపడుతుంది. సినిమా నేపధ్యం మిలటరీ/ యుద్ధం కు చెందినది కావటం ఇందుకు కారణం కావచ్చు.పాట చూడటానికీ బాగుంటుంది.పాట కు తగిన ఆహార్యం అభినయం, కదలికలతో దేవానంద్ నటన పాట అర్ధం, మూడ్ ను తెరపై చూపింది.
సాహిర్ లూధియాన్వి మిగతా పాటలతో పోలిస్తే ఈ పాట తక్కువ, తేలికపాటి పదాలతో సాగింది.కాని చెప్పింది మాత్రం చాలా చిక్కనైనది.
దేవానంద్ పుస్తకం ‘రొమాన్సింగ్ విత్ లైఫ్’ చదివినప్పుడు ఈ పాట గురించి అతను అన్నది నిజమే అనిపించింది.
ఈ సినిమా పట్ల దేవానంద్ కు ప్రత్యేకమైన ఇష్టం ఉంది. దానికి సర్వకాలీనత ఉందనుకున్నాడు. అంచేతే ఆ సినిమా యాభై యేళ్ళ తర్వాత రంగులద్దాడు.
సినిమా కున్న సర్వకాలీనత సంగతి తెలియదుకాని ఈ పాటైకైతే అది ఉంది. పాట నిత్యనూతనమే.

“నేను జీవితంతో పాటే నడిచాను
ప్రతి ఆందోళననూ పొగలా ఊది వదిలాను
శిధిలమైన దానికోసం బాధపడటం వ్యర్ధం మనుకున్నాను
శైధిల్యాన్ని వేడుక చేసుకుంటూ నడిచాను
దేనిని పొందినా అదే అదృష్టమనుకున్నాను
ఏది పోగొట్టుకున్నా దానినీ మరుస్తూ నడిచాను
బాధ సంతోషం రెండూ ఎక్కడ వేరనిపించవో
మనసును అలాంటిచోటుకు తీసుకెళుతున్నాను.”



తుఝె సూరజ్ కహు యా చందా?

  1. నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-97

తుఝె సూరజ్ కహు యా చందా?
(నిన్ను సూర్యుడననా చంద్రుడననా?)
‘ఎక్ ఫూల్ దో మాలి’(1969) లో మన్నడే పాడిన పాట.సంగీతం రవి,ప్రేమ్ ధవన్ రచన
...
పిల్లల్ని లాలిస్తూ మగవారు పాడిన పాటలు కంపారటివ్ గా తక్కువ. ‘కహానియా సునాతి హై పవన్ ఆతీ జాతీ హై’( రాజ్ పూత్), ‘మై గావూ తూ సో జావూ’(బ్రహ్మచారి) ఇలా కొన్ని గుర్తొస్తాయి. తెలుగులోకూడా మరీ ఎక్కువలేవు.’చందురుని మించు’(రక్త సంబంధం), బుజ్జి బుజ్జి పాపాయి(ఆడ బ్రతుకు) , లాలి జో లాలీ జో(ఇంద్రుడు చంద్రుడు) వాటిలో కొన్ని.,
ఆ తరహా పాటల్లో నాకు ఇష్టమైన హిందీ పాట ‘తుఝె సూరజ్ కహు యా చందా?’. ఎక్కువసార్లు వినటంవల్ల ఫెమీలియర్ ఐన పాట. విన్న చాలా కాలానికి పాట చూసాను. చూసిన చాలారోజులతరవాత మనసుకు పట్టింది.
తండ్రీకొడుకుల మధ్యఅనుబంధాలు వాచ్యంగా ప్రకటితమవ్వటం మన సమాజంలో తక్కువనిపిస్తుంది.’చీకటి గదులు’ నవలలో ఈ సంబంధాలు, అనుబంధాలు ‘ఘనీభవించటం’ గురించి చదివినది గుర్తుంది.ప్రేమ వ్యక్తపరచటం,పిల్లల్ని లాలించటం పెద్దరికానికో,గంభీరతకో తగిందికాదని నా చిన్ననాటి సమాజంలో ఒక నమ్మకమేమో.

బలరాజ్ సహానీ నటించిన సినిమాలు సంఖ్యాపరంగా తక్కువే. నేను చూసిన అతని సినిమాలలో (పదిలోపు ) దేనిలోనూ నిరుత్సాహపరచలేదు. గ్రామీణ భారతీయునికి అచ్చమైన ప్రతిరూపం అనిపిస్తాడు. బంధువర్గంలో మనసుకు నచ్చిన మనిషి లాఉంటాడు. ఈ పాటలో అతను కొడుకు(?) ను ఆడిస్తూ పాడుతున్నాడు.

బలరాజ్ సహనీ కీ నేపధ్య గాయకుడిగా మన్నడే మినహా ఎవరినీ నేనూహించలేను. ఆయె మేరీ ప్యారే వతన్(కాబూలి వాలా),తూ ప్యార్ కా సాగర్ హో(సీమా),యె మేరె జొహర్ జబి తుఝె మాలూమ్ నహి(వక్త్), తుఝే సూరజ్ కహు యా చందా(ఎక్ ఫూల్ దో మాలి), ధర్తి కహే పుకార్ కె (నేపధ్యగీతం,దో భిగా జమిన్ )నాకు తెలిసినవి. ఐదు దశాబ్దాలు పైగా చిత్రరంగంలో ఉండి మన్నాడే పాడిన పాటలు కంపారటివ్ గా తక్కువ కావచ్చుకాని, సక్సెస్ శాతం లెక్కిస్తే చాలా ఎక్కువ. వాటిలో ఫిలసాఫికల్, శాస్త్రీయ , జానపద ఛాయలున్న పాటలు అధికం.
సంగీత దర్శకుడు రవి గురుదత్, బిఽఅర్. చోప్రాలను మినహాయించి పెద్ద బానర్లకు పనిచేసింది తక్కువ. చేసిన వాటిలోజనరంజకమైనవి చాలానే ఉన్నాయి. నాకు గుర్తుండిపోయిన అతని ఆఖరి హిందీ సినిమా ‘నిఖా’(1983). చిత్రంగా మళయాళ చిత్రాలకు సంగీతదర్శకుడై ‘బాంబే రవి’ పేరుతోచాలా సినిమాలకు పనిచేశాడు.
వైశాలి, సరిగమలు పేరుతో తెలుగులో వచ్చిన డబ్బింగు సినిమాలకు అతనే సంగీతదర్శకుడు.’ చౌద్వీ కా చాంద్ హో’ పాట చేసినాయనే ‘స్వర రాగ గంగా ప్రవాహమే’ అని తెలుగు పాట చేశాడని తెలిసినపుడు ‘ఓ’ అనిపించింది.

“నిన్ను సూర్యుడననా చంద్రుడననా?
నిన్ను దీపమననా నక్షత్రమననా?
నా ప్రియమైన బాబు
లోకంలో నా కీర్తిని పెంచుతాడు

నేను ఎప్పటినుండి ఎదురుచూస్తున్నాను
నా వాకిటిలో ఎవరైనా ఆడుకుంటారని
పసినవ్వుల బదులుగా
నా జీవితం మొత్తం తీసుకో
నా చేతులలో లోకమంతా
నీతో పాటు ఊయలూగుతున్నది

నీ వేలుపట్టుకుని ఇప్పుడు
నీకు నడక నేర్పుతాను
నేను పెద్దవాడినైనాక
రేపు నాకు చెయ్యందించు
జీవితానికి నువ్వు వచ్చాక
ఒక కొత్త ఆసరా దొరికింది
ఈ లోకంలో నా తరువాత కూడా
నా పేరు నిలిచి ఉంటుంది
నిన్ను చూసినవారంతా
నా కొడుకువని చెప్పుకుంటారు
నాకు మరోమారు జీవితం
నీ రూపంలో దొరుకుతుంది”




‘దేఖా ఏక్ ఖ్వాబ్ తొ యే సిల్ సిలే హుయే ‘

నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-96

‘దేఖా ఏక్ ఖ్వాబ్ తొ యే సిల్ సిలే హుయే ‘
(“ఒక సారి కన్న కల బంధాల పరంపర అయ్యింది)...
సిల్ సిలా సినిమాలో కిశోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడిన పాట.సంగీతం శివ్-హరి,సాహిత్యం జావేద్ అఖ్తర్
కాం పిటీటివ్ ఎగ్జామ్స్ కు తయారయ్యేక్రమంలో ‘హూ ఇస్ హు’ పుస్తకంచదవటం ఒకభాగం. అందులో కళాకారులు- వాద్యపరికరాలు ఒక చాప్టరు. బిస్మిల్లా ఖాన్- షెహనాయ్,అల్లారఖా- తబ్లా, పండిట్ రవిశంకర్- సితార్, శివ్ కుమార్ శర్మ- సంతూర్, హరిప్రసాద్ చౌరాసియా- ఫ్లూట్ ..ఇలా బట్టి వేయాలి. వాళ్ళ ను చూసిందిలేదు,విన్నది లేదు, ఆ పరికరాలు చాలా వరకూ తెలియనివి. అలా చదివిన చదువు వేరే రకంగా సార్ధకం అయ్యింది.
యశ్ చోప్రా తన సోదరుడు బి. ఆర్ . చోప్రా తో కలిసికొంత కాలం పనిచేసి, డెబ్భైలలో సొంతంగా సినిమాలు నిర్మించటం మొదలు పెట్టాడు. రాజేశ్ ఖన్నా మొదలుపెట్టి తర్వాత అమితాబ్ తో పలు చిత్రాలు నిర్మించాడు. వాటిలో ఎక్కువ చిత్రాలు మ్యూజికల్ హిట్లే.ఆర్.డి. బర్మన్, ఖయ్యాం, రాజేశ్ రోషన్ వంటి వారు ఆ సినిమాలకు స్వర రచన చేశారు. సాహిర్ లూఢియాన్వి ఉన్నంతకాలం (80 వరకు) వారికి పాటలు రాసారు.
ఎనభై నుండి యశ్ చోప్రా సంస్థకు రచయితతో పాటు సంగీత దర్శకులు కూడా మారారు. వారి సిల్ సిలా (1981) కు శివ్ హరి అనేవారు సంగిత దర్శకులు. సలీమ్ జావేద్ లలో ఒకరైన జావెద్ అఖ్తర్ తొలిసారిగా ఇందులో కొన్ని పాటలు రాసారు. అందులో పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి.
యశ్ చోప్రా తర్వాత సినిమాలకూ వారిదే సంగీతం. అందులో ‘చాందిని’, ‘లమ్హే’ సినిమాలు సంగీతపరంగా మంచి స్థాయి కలవి.
‘చాందిని’ సినిమాలో ఒక డ్యూయెట్ ‘తెరె మెరే హోటో పే మీఠే మీఠే గీత్ మిత్వా’ పాట వినటానికి హాయిగొలుపుతుంది. ఆ పాట మధ్యలో వచ్చే సంగీతం ఒక పాత పాట ను గుర్తుకు తెస్తుంది. ఆ పాత పాట ‘ దేఖ్ ఏక్ ఖ్వాబ్ తో యే సిల్ సిలే హుయే’. ఆ రెండు పాటల సంగీతం ‘శివ్ - హరి’ దే.
ఆ మధ్య కాలంలో ‘మ్యూజిక్ టు డె ‘వారివి ఇన్ స్ట్రుమెంటల్ సంగీతం చాలానేవచ్చింది.. అందులో ‘సౌండ్ స్కేప్స్ ’ ఒకటి. ఆ కాసెట్లో ఒకచోట ‘తెరే మెరే హోటో పే’ ని గుర్తుచేసే సంగీతం వినపడింది. ఆసంగీతం విద్వాంసుడు ‘ శివ్ కుమార్ శర్మ’దే . అతని వాయిద్యం ‘సంతూర్’.
వివరాలలోకి వెళ్తే శివ్- హరి అంటే శివకుమార్ శర్మ - హరి ప్రసాద్ చౌరాసియా లు. వారిరువురూ నాకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ద్వారా అంతకుముందెన్నడో పరిచితులు..

సినిమాలో పాటలో వందలాది ఎకరాల్లో తులిప్స్ పూలతోట. మంచుకొండలు, సెలయేర్లు, మంచుకమ్మిన సెలయేర్లు తొ పాట వర్ణమయం, సౌందర్యమయం. పాట లొకేషన్ మరో పాట ‘భవ్ రే నె ఖిలాయా ఫూల్’ (ప్రేమ్ రోగ్) ను గుర్తు తెస్తుంది.

“ఒక సారి కన్న కల బంధాల పరంపర అయ్యింది
చూపులు సాగినంత దూరం పూలు వికసించి ఉన్నాయి
నీ చూపులపై నాదో ఫిర్యాదు
ఇక్కడి పూలూ మన మధ్య దూరాన్ని పెంచుతున్నాయి
నా శ్వాస లో నీ సుగంధం నిలిచి ఉంది
అది నీ ప్రేమలో ఉన్న మాయాజాలం
నీ గాలుల్లో నీ పిలుపు వినవస్తుంది
గాలికెరటాల్లో ప్రేమ వర్ణాలున్నాయి
గుండె చప్పుడులో నీ గీతాలు కలిసి ఉన్నాయి
ఏమి చెప్పను . సిగ్గుతో పెదవులు తాళం పడి ఉన్నాయి
నీ సంరక్షణలో నా హృదయం ఉంది
రా ! నిన్ను నా చేతుల్లో దాచిఉంచుతాను
నా కంటిలో నీ చిత్తరువు ఉంది
దారుల్లో దూరం వరకూ కాంతి నిండి ఉంది.

రేపు ఈ వెలుగుల తోడు లేకుంటే?
వేయి ప్రేమదీపాలు వెలుగుతూ ఉంటాయి”