‘ఎక్ చమేలీ కీ మండ్వే తలే’
(ఒక మల్లె పందిరి నీడలో)
గానం మహమ్మద్ రఫీ,ఆశా భోన్స్లే),సినిమా పేరు ‘చ చ చ ‘(1964) (చ చ చ అనేది ఒక విదేశీ నృత్య శైలి)
‘మల్లె పందిరి నీడలోనా జాబిల్లీ’ అంటూ సాగే తెలుగు పాట ఉంది. హిందీ లో అలాంటి మాటలతో మొదలయ్యే పాటఒకటి ఉంది.ఆ పాట ‘ఎక్ చమేలీ కీ మండ్వే తలే’.
’చమేలీ కీ మండ్వా’ పదం విన్నది ఈ పాటతోనే కానీ, అది గుర్తుండటానికి మరో కారణం O వ్యాసంలో ఆ పదం ఎంఫటిక్ గా కనపడటం.
చమేలీ అంటే మల్లె అని అర్ధం. ‘మండ్వా’ అంటే మనదగ్గరి ‘మండువా’ (ఇంటి మధ్య సూర్యకాంతి పడే ఖాళీ ప్రదేశం) అనుకోవచ్చేమో!. అలాంటి చోట మల్లె పెరిగితే అది మల్లె మండువా ఔతుంది. అక్కడొక పందిరిపై మల్లె పాకిస్తే ‘మండువాలో మల్లె పందిరి’ ఔతుంది. ‘చమేలీ కి మండ్వా’ కు నా ఊహారూపం అది.
ఈ హిందీపాట వివిధ భారతి లో ఎక్కువగా వినపడేది. పాట వినటానికి బాగుండటమే కాదు,దానికి మరిన్ని ప్రత్యేకతలున్నాయి.
ఈ సినిమా హీరో ‘చంద్రశేఖర్ ‘. సినిమా దర్శకుడూ నిర్మాతా కూడా ఆయనే.చాలా కొద్ది సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. తర్వాత కారెక్టర్ నటుడు గా మారి గుర్తుపట్టగలిగే పాత్రలు చాలానే వేశాడు. అతను హైదరాబాదు నుండి హిందీ చిత్ర సీమకు వెళ్లిన కొద్దిమందిలో ఒకరు.
ఈ పాట రాసింది ‘ముఖ్దుమ్ మొహియుద్దీన్’.తెలంగాణా లో ప్రముఖ వామపక్ష నాయకుడు,అభ్యుదయ కవి.హైదరాబాద్ వాసి. బహుశా ఈ ఒక్క సినిమాలోనే ఆయన పాటలు ఉన్నాయనకుంటాను.ఈ పాట ఆయన సినిమా కోసం రాసింది కాదేమోనని కూడ ఆనిపిస్తుంది.
ఈ సినిమాకు సంగీత దర్శకుడు ‘ఇక్బాల్ ఖురేషి’ .ఈయనా హైదరాబాద్ లో పెరిగినవాడే.హిందీ సినిమారంగంలో చానాళ్ళు కొనసాగాడు కాని చిన్న తరహా సినిమాలకే పనిచేశాడు.
పై ముగ్గురూ హైదరాబాదు లో ముందునుండీ సన్నిహితులు, కలసి ఒక సాంస్కృతిక సంస్థలో పనిచేసినవారు.
పాట అర్ధం.
“ఒక మల్లె పందిరి నీడలో
పానశాలకు కొద్ది దూరపు మలుపు దగ్గర
రెండు తనువులు ప్రేమాగ్నిలో దగ్ధమౌతున్నాయి
ప్రేమ వారి స్థిరనమ్మిక,
ప్రేమ వారి దైవం
ప్రేమ వారి చితి
మంచులో తడిసారు
వెన్నెల్లో స్నానంచేసారు
మలిసంధ్యలో పూచిన తాజా పూలలా..
తోటలో వీచే చల్లటి గాలి
ఆగి మౌనందాల్చింది
నల్లనల్లని కురులు వేడి చెక్కిళ్ళపై
ఒక్కక్షణం ఆగాయి.
మేము వాళ్ళను చూశాము,
పగటి వేళా రాత్రి వేళా
వెలుతుర్లో చీకట్లో
మసీదు మినారుల్లో చూశాము వారిని
మందిర ద్వారాల్లో చూశాము వారిని
మధుశాల చుట్టుపక్కల చూశాము వారిని
రెండు తనువులు ప్రేమాగ్నిలో దగ్ధమయ్యాయి.”
-ముళ్ళపూడి సుబ్బారావు.