‘మై తో బాప్ హూన్ మేరా క్య హై తేరీ మాన్ క హాల్ బురా హై’(నేనైతే తండ్రిని..నా కేమౌతుందిలే ,మీ అమ్మ స్థితే బాగాలేదు) .
ఇది 'చిట్టి ఆయీ హై..ఆయీ హై వతన్ సె '(ఉత్తరం వచ్చింది,ఉత్తరం వచ్చింది దేశం నుండి) పాటలో ఒక భాగం.
'నామ్'(1986) సినిమాలో ఆనంద్ బక్షీ రచన,పంకజ్ ఉధాస్ స్వరం,లక్ష్మికాంత్ ప్యారేలాల్ సంగీతం.
పరదేశంలో ఉన్న కొడుకుకుతండ్రి దగ్గరనుండి ఉత్తరం వచ్చింది..చాలా రోజులతరువాత.ఆ ఉత్తరం చదివితే అతనికి దేశపు మట్టి అందులో వచ్చినట్టనిపించింది.అందులోఉన్న సందేశాన్ని తండ్రే చెబుతున్నట్టుందతనికి.
ఇదంతా ఒక పాటలోనిది.ఆ పాట 'చిట్టి ఆయీ హై..ఆయీ హై '.
ఇది తల్లి ,ఇద్దరు కొడుకుల కథ.అంతకుముందు ఇలాంటి పాత్రలతో మదర్ ఇండియా,గంగా జమున,దీవార్ వంటి సినిమాలు వచ్చి అన్నీ విజయవంతం అయ్యాయి. 1986 లో వచ్చిన ఈ సినిమాలో మదర్ ఇండియా లో నటించిన రాజేంద్ర కుమార్,సునీల్ దత్ కొడుకులు కుమార్ గౌరవ్,సంజయ్ దత్ లు అన్నదమ్ములుగా నటించారు.పాత్రలతీరూ అలాంటిదే.
ఒకకొడుకు కుటుంబబాధ్యత ఎక్కువ తీసుకున్నాడు.మరొకతను సరైన పంథా దొరక్క కంఫ్యూజన్ లో ఉన్నాడు. అదృష్టాన్ని దుబాయ్ లో వెతుక్కుందామనుకున్నాడు.ఐతే అక్కడికెళ్ళాక అతని అతనికి జీవితం అనుకున్నట్టు సాగలేదు.
కుటుంబానికిఅతను ఎక్కడ ఉన్నదీ ఎలా ఉన్నదీ తెలియట్లేదు. తమ్ముడిని వెతుక్కుంటూ అన్న పరదేశం వెళ్ళాడు.తమ్ముడు ఒక విషవలయంలో చిక్కుకుని ఉన్నాడు.
ఆ సందర్భంలో ఈ పాట. గజల్ గాయకుడు 'పంకజ్ ఉధాస్ 'గాయకుడిగా కనిపిస్తూ ఆలపించాడు. ఈ పాట వచ్చి ముఫ్ఫై యేళ్ళు దాటినా ఇప్పటికీ పంకజ్ ఉధాస్ ప్రోగ్రాం లో తప్పనిసరిగా ఉండే పాట (గజల్) ఇది.
దూరంగా వెళ్ళి ధనం సంపాదించి,ప్రాధాన్యతా క్రమంలో ఐనవారి సంబంధాలను నిర్లక్ష్యం చేయటంపై రాసిన పాట అనిపిస్తుంది.ఐతే వెళ్ళిన చోట కష్టపడుతూ ఆ కష్టాన్ని ఇక్కడివారితో చెప్పుకోలేక బాధపడే వాళ్ళూ ఉంటారు.
పాటలో రెండు రకాలవారి గుండెల్నీ స్పృశిస్తుంది.
ఉత్తరం వచ్చింది,ఉత్తరం వచ్చింది దేశం నుండి
చాలా రోజులతరువాత ,దూరమైన దేశం జ్ఞాపకాలు
దేశపు మట్టి వచ్చింది,ఉత్తరం వచ్చింది
పైన నా పేరు రాసి ఉంది,లోపల ఈ సందేశం ఉంది
పరదేశం పోయినవాడా ,తిరిగి వెనక్కి రానివాడా
సప్తసముద్రాలు దాటి వెళ్ళావు నువ్వు,మమ్మల్ని బ్రతికుండగానే చంపేశావు నువ్వు
రక్తబంధాన్ని తెంచుకెళ్ళావు,కళ్ళలో కన్నీరు వదిలి వెళ్ళావు
కొంచమేఎంగిలి కొంచమే నిదర,....ఏడ్చేది బహు ఎక్కువ
ఉత్తరం వచ్చింది..
వూరి వీధులు బోసిపోయి ఉన్నాయి,తోట లో మొగ్గలు ముళ్ళుగా మారాయి
శ్రావణపు ఊయల చెబుతుంది,నువ్వు మరచిపోయావు..మాకు మరుపు లేదు
నువ్వు లేని దీపావళి రోజు,దీపాలు కాదు మా ఖాళీ గుండెలు మండుతున్నాయి
నువ్వు లేని హోలీ వేళ,పిచికారీ గుళ్ళను వెళ్ళగక్కుతుంది
రావిచెట్టు వంటరిదయ్యింది,నూతిగట్టు ఖాళీ దయ్యింది
ఇల్లు వల్లకాటికి నమూనా అయ్యింది,
పంటకాలం అయ్యింది,వైశాఖి వచ్చింది
నీ రాకడే మిగిలింది,ఉత్తరం వచ్చింది..
ఉత్తరం వచ్చింది..
మునుపు నువ్వు ఉత్తరం రాసేవాడివి,కాగితంలో ముఖం కనపడెది
ఆమాదిరి కలయిక ఆగింది,ఆ ఆట కూడా ముగిసింది
పల్లకిలో కూర్చున్న చెల్లి,కళ్ళన్నీ దారిమీదే ఉంచింది
నేనైతే తండ్రిని..నా కేమౌతుందిలే ,మీ అమ్మ స్థితే బాగాలేదు
నీ భార్యైతే సేవ చేస్తుంది, సర్వంపోగోట్టుకున్న దానిలా ఉంది
నువ్వు డబ్బులు చాలా కూడబెట్టావు,ఆ డబ్బే నిన్ను దేశంవదిలేట్టు చేసింది
పంజరాన్ని పగలకొట్టి పక్షిలా రా,పరదేశాన్ని వదిలిరా
వచ్చేయ్ ..కాలమెంతో చిన్నది,మన ఇంటిలోనూ ఇంత అన్నమున్నది
ఉత్తరం వచ్చింది..
.. --ముళ్ళపూడి సుబ్బారావు