Showing posts with label Mehdi hasan. Show all posts
Showing posts with label Mehdi hasan. Show all posts

Sunday, March 26, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-7“భీగీ భోగీ రాతోమే యుహి బాతొ బాతో మే''
Subbarao Mullapudi

వివిధ్ భారత్ లో ఛాయాగీత్ ఐపోయింతరవాత అరగంట ‘ఆప్ కి ఫర్మాయిష్’ వస్తుంది. అదిపూర్తయ్యాక 11 గంటల వార్తలు ఐదునిముషాలపాటు. తర్వాత శుభరాత్రి . కాని కొన్నిసార్లు మన వంటి వారికి ఇంకా రాత్రి కాదు.అగమ్య,అవ్యక్త అన్వేషణ సాగుతూ ఉంటుంది.రేడియో ట్యూనరు వదులయ్యేంత అటూ ఇటూ తిప్పటం. అప్పుడప్పుడు అకాశవాణి ఉర్దూ సంచికా నో ఉర్దూ సర్వీస్ అనో ఒక స్టేషన్ దొరికేది హిందీ పాటలతో. నిద్ర పట్టకపోవడం శాపమైతే..ఒకో సారి అలాటి శాపం వరమౌతుంది.
ఒక రాత్రి 11.30 ప్రాంతాలలో ఒక హిందీ పాట దొరికింది.ఏక గళగీతమే. సింగర్ ని గుర్తుపట్టలేక పోయాను.రఫీకిశోర్ల తర్వాతి గాయకుల్ని చాలా వరకూ గుర్తుపట్టగలను.సంగీతం ఆర్ డీ బర్మన్ దేమో అనిపించేలా ఉంది.క్యాచీ గాఉండి ‘హం’ చేసుకోవటానికి వీలున్న ట్యూను. పాట పూర్తయ్యింది. నా చిన్ని పాకెట్ రేడియో నన్ను దేశ సరిహద్దుల్ని దాటించేసింది. ఆ పాట రేడియో పాకిస్తాన్,లాహోర్ కేంద్రం నుండి. అలా ఆ రాత్రి మరో నిధిరహస్యం తెలుసుకున్నాను. తర్వాత ఆ పాటను కనీసం ఐదు సార్లు విని ఉంటాను కానీ గాయకుడు పేరు తెలీలేదు.
నాలుగేళ్ళ తర్వాత జల్ గావ్ లో ఒకసారి క్లాస్ మేట్ ఇంటికెళ్ళాము. టేప్ రికార్డర్లో ఒక పాట వస్తుంది.ఎక్కడో విన్న గొంతు ..అతన్నడగితే చెప్పాడు.. ఆది పాట కాదు గజల్...పాడేది పాకిస్తా నీ గాయకుడు మెహిదీ హసన్.
తర్వాత్తర్వాత అతని గురించి వివరాలు తెలిసాయి. అతని గజళ్ళు అందుబాటులోకి వచ్చాయి. అద్భుతమైన కంఠస్వరంతో,ఘజల్ కు ప్రత్యామ్నాయపదంగా మారి మొహిదీహసన్ సంగీత ప్రియుల్ని అలరించాడు. తెలుగులో అప్పటికి పదేళ్ళ ముందే అతని గజళ్ళ ఆధారంగా పాటలొచ్చాయి.
ఐతే నేను విన్న ది ఒక పాకిస్తానీ సినిమా పాట. కమర్షియల్ బాలీవుడ్ హుషారయిన సినిమాలో పాటలా సాగుతుంది.నెట్ అందుబాటులోకి వచ్చాక వెతగ్గ వెతగ్గా పాట వీడియో దొరికింది. అచ్చంగా..అచ్చంగా మన బాలీవుడ్ సినిమాలో పాటే..హీరో ఐతే కుమార్ గౌరవ్, మిథున్ చక్రవర్తి లను గుర్తుతెచ్చేలా ఉన్నాడు.
“భీగీ భోగీ రాతోమే యుహి బాతొ బాతో మే
ఝీల్ జైసె ఆంఖోవాలి లడ్కిసె వో ములాకాత్ హోగయి.”
అర్ధం చెప్పే అవసరం లేని పాట.
అతని సినిమా పాటల్లో ఇదోక సూపర్ హిట్ పాట.
తర్వాత రోజుల్లో వచ్చి న 'హాద్సా' సినిమాలో ‘ఏ బొంబై షెహర్ హై’ అనే పాట ఈ పాట ను అనుసరించినట్లే వుంటుంది.
ఇప్పటికీ పాట వింటె ఆనందం కలగటానికి అప్పటి జ్ఞాపకాలే కారణమా? పాట కూడా విలువ విలువైనదేనా?