Showing posts with label Roti. Show all posts
Showing posts with label Roti. Show all posts

Thursday, April 13, 2017

యార్ హమారీ బాత్ సునో




‘లెట్ హిమ్ హు ఈజ్ విత్ అవుట్ సిన్ కేస్ట్ ది ఫస్ట్ స్టోన్’(పాపాలు ఏమీ చేయనివారే మొదటి రాయి విసరాలి).
బైబిల్ లో ప్రసిద్ధ వాక్యం.

‘యార్ హమారీ బాత్ సునో’(నా మాట వినండి మిత్రులారా).
‘రోటి’(1974) సినిమాలో కిశోర్ కుమార్ పాడిన పాట. లక్ష్మికాంత్ ప్యారేలాల్ సంగీతం,ఆనంద్ బక్షీ రచన.

నేరం నాదికాదు! ఆకలిది సినిమా వచ్చింది. అందులో చిన్నప్పటి కథానాయకుడు అమ్మ ఆకలి తీర్చటానికి రొట్టె దొంగతనం చేసాడు. అది తప్పించుకోవటానికి ఓ నేరస్థుడు సాయపడ్డాడు.కథానాయకుడు నేరాలతోనే పెరిగి జైలు శిక్ష అనుభవించి బయటపడ్డాడు. మామూలు జీవితం గడుపుదామనుకుని  మళ్లీ ‘రొట్టె’ కోసమే ఒకతనితో గొడవపడి అతని మరణానికి కారకుడయ్యాడు. కోర్ట్ లో న్యాయమూర్తి తో చెప్పాడు ‘నేరం నాది కాదు మిలార్డ్ ఆకలిది’ అని.


ఈ సినిమా కు అధారం ‘రోటీ ‘ పేరుతో వచ్చిన హిందీ సినిమా .ఇందులో కథానాయకుడు రాజేష్ ఖన్నా. అతనపుడు సూపర్ స్టార్. సినిమా తీసినాయన ‘మన్ మోహన్ దేశాయ్’. తర్వాత తర్వాత ‘పెద్ద’ చిత్రాలు,మల్టి స్టారర్ సినిమాలు తీయటంలో పేరుగాంచాడు.

రామాయణంలో దశరధుడు పాత్ర లో విషాదముంది. ఆ విషాదానికి కారణం అతనికున్న శాపం. ఉద్దేశ రహితంగా శ్రవణ కుమారుని చావుకి కారణమై అంధులైన అతని తల్లి తండ్రుల శాపానికి గురయ్యాడు.

‘దుష్మన్’ పేరుతో అంతకుముందు రాజేష్ ఖన్నాదే ఒక్ సినిమా వచ్చింది. అందులో కథానాయకుడు అనుకోకుండా ఒక మనిషి మరణానికి  కారణమౌతాడు. చనిపోయినతని కుటుంబానికి సేవ చేయాల్సిందిగా కోర్ట్ అతనికి శిక్ష విధిస్తుంది.


రోటి సినిమా కథ ఈ రెండు కథలు కలిపి ఉంటుంది. జైలు నుమ్డి తప్పించుకున్న హీరో  పారిపోతూ రైలులో ఒక వ్యక్తి రైలునుండి నదిలోకి పడిపోవటానికి కారణమయ్యాడు. పారిపోయిన కథానాయకుడు మారుమూల వూరిలో ఒక అంధ దంపతుల దగ్గర చేరాడు. వారెవరో కాదు. హీరో తో నదిలో తోయబడ్డ వ్యక్తి తల్లిదండ్రులే. అతని పేరు శ్రవణ్.

సినిమా కాశ్మీర్ లోనూ హిమాలయాల సానువుల్లోనూ చిత్రీకరింపబడింది. అందమైన లొకేషన్లు, మనోరంజకమైన పాటలతో  సినిమా ఆద్యంత ఆకర్షణియంగా సాగుతుంది.

కథానాయకుడు పారిపోతున్న దారిలో ఒక చోట బస్సు ఆగింది. అకాడ కొందరు ఒక యువతి నడత బాగుండలేదని రాళ్ళతో కొట్టి హింసిస్తున్నారు. అప్పుడు హీరో చేసిన హితబోధ ఈ పాట.

‘లెట్ హిమ్ హు ఈజ్ విత్ అవుట్ సిన్ కేస్ట్ ది ఫస్ట్ స్టోన్’(పాపాలు ఏమీ చేయనివారే మొదటి రాయి విసరాలి) అనేది బైబిల్ ఒక ప్రసిద్ధమైన వాక్యం.
ఆ వాక్యం ఆధారంగా ఈ పాట రాయబడిందని పిస్తుంది. ఐతే ఆ వాక్యానికి కొనసాగింపుగా శిక్షకు గురైన ఆమెతో క్రీస్తు   చెప్పిన మరో మాట ‘ టు గో అండ్ సిన్ నో మోర్’( వెళ్ళు ,తిరిగి తప్పు చేయకు ) పాటలో ప్రస్తావనకు రాదు.

“నా మాట వినండి మిత్రులారా
ఎవరైతే పాపి కారో వానిని
ఎవరైతే పాపంచేయలేదో వానిని
ఒక్క మనిషిని ఎంచుకోండి

కొందరు మహా తెలివిమంతులు
కొందరు మామూలు మనుషులు
కొద్దిగానో కాస్త ఎక్కువగానో
మనలో ప్రతిఒక్కరం పాపులమే
కొందరు ఒప్పుకుంటారు,కొందరు కోపగిస్తారు
కొందరు దొరికిపోయినవారు కొందరు తప్పించుకున్నవారు


మనమంతా కలిసి ఈ పాపికి శిక్ష విధించాలి
కాని ఎవరైతే పాపి కారో వారే తొలి రాయి విసరాలి

మొదట మీ మనసును శుభ్రపరచుకోండి
తర్వాత వేరే వారికి న్యాయం చెప్పండి.

నా మాట వినండి మిత్రులారా
ఒక నిర్దోషిని ఎన్నుకోండి
పాపి కాని వానిని
పాపంచేయని వానిని”


--ముళ్ళపూడి సుబ్బారావు.