‘అబ్ క్యా మిసాల్ దూ తుమ్హారె శబాబ్ కి’
(నీ యవ్వనానికి ఇప్పుడేమి పోలిక చెప్పగలను?)
ఆరతి (1963) సినిమాలో మాహమ్మద్ రఫి పాడిన పాట.మజ్రూహ్ సుల్తాన్ పురి రచన రోషన్ సంగీతం.
అర్ధం తెలియనప్పుడు అదీ రాత్రివేళ వింటుంటే ఒక జోలపాట వింటున్నంట్టుండే పాట ఇది.అలా అనేకసార్లు విన్నాక పాట కంటికి కనపడింది.
నటుడు ప్రదీప్ కుమార్ ని తొలిసారి తెరపై చూసింది రజియా సుల్తాన్ సినిమాలో ‘ఇల్టుట్ మిష్ ‘పాత్రలో. తర్వాత మార్నింగ్ షో లొ నడచిన ‘నాగిని’ సినిమా లో మాత్రమే.దూరదర్శన్ లో (రంగోలీ?) అప్పుడప్పుడు తాజ్ మహల్, చిత్రలేఖ వంటి చారిత్రక నేపధ్యం ఉన్న సినిమాలు,కొన్ని జానపద, సాంఘిక సినిమాల్లో రఫీ పాడిన సూపర్ హిట్ గీతాలకు అతను పెదవి కదల్చడం చూశాను.
అలాగే పాకీజా,దుష్మన్ మినహా మీనాకుమారి సినిమాలు తెరపై చూసిందిలేదు. నాకు తెలిసే సరికే ఇద్దరూ తెరమరుగయ్యారు. తర్వాత ఇంటర్నెట్ అందుబాటు లోకి వచ్చాక ,అప్పటివరకూ విని మాత్రమే ఆనందించిన పాటల్ని చూసి కూడా ఆనందించే అవకాశం వచ్చింది.
చాలా పాత పాటలవిషయంలో, చూశాక నిరుత్సాహపడిందే ఎక్కువ. వాటికి చిత్రీకరణ వల్ల విలువ హెచ్చిన సందర్భాలు తక్కువ.
ఐతే ఆరతి లోని ఈ పాట చిత్రీకరణ, పాట విన్నప్పుడు కలిగిన ఆనందాన్ని ఏమాత్రం తగ్గించదు.
పాట అర్ధం:
“నీ యవ్వనానికి
ఇప్పుడేమి పోలిక చెప్పగలను?
చంద్రుని కిరణాలు మనిషిగా మారాయి.
అందమైన వెన్నెల వెలుగు
ముఖము మీద పూతలా ఉంది
తొలి జాము పూదోట లోని మత్తు
నీ కళ్ళలో ఉంది
గులాబి కొమ్మలో వంపు
నీమెడ లో కనిపిస్తుంది.
నీకురులు విప్పారితే, సాయంత్రపువేళ గుండెలో పొగలు రేగుతాయి
నీ అడుగు పడితే ,కిందికి దిగిన ఆకాశం తిరిగి లేవలేదు
సాయంత్రపు సూర్యకాంతి
వందసార్లు మెరుస్తూనే ఉంటుంది.
నీ పైట చెంగు
నా ఇంటికి శోభ
పూపొద వంటి తనువు
నాఇంటి దీపం
నా కలల స్వర్గానికి
చిత్రరూపం నువ్వు.”
-ముళ్ళపూడి సుబ్బారావు.