Showing posts with label boojh mera kya naam re. Show all posts
Showing posts with label boojh mera kya naam re. Show all posts

Wednesday, May 3, 2017

బూఝ్ మెరా క్యా నామ్ రె,నదీ కినారా గావ్ రె

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-75

బూఝ్ మెరా క్యా నామ్ రె,నదీ కినారా గావ్ రె
(“నాపేరు చెప్పుకో,నది ఒడ్డున మా వూరు),సి. ఐ.డి (1956) సినిమాలో పాట.


ఒక కాలంలో లతామంగేష్కర్, ఆశాభోస్లే కాకుండా వేరే నేపధ్య గాయనుల పేర్లు అరుదుగా వినిపించేవి. అలాంటి వేరే పేర్లలో ఒకటి  షంషాద్ బేగమ్.

మిగతా గాయనిలతో ఆమె పాడిన పాటలు వింటుంటే ఆమె స్వరంలో ప్రత్యేకత కొట్టొచ్చినట్టు తెలుస్తుంది.

గీతా దత్ ‘ఠండి హవా ‘అని అంటే , ఎంతో కాంట్రాస్ట్ తో  శంషాద్ బేగమ్’కాలి ఘటా’ అంటుంది.(మిస్టర్ అండ్ మిసెస్ 55 సినిమా)

ఆశా భోస్లే ‘కజ్రా మొహబ్బత్ వాలా’ అంటే ఉలిక్కిపడేట్టు షంషాద్ బేగమ్ ‘దునియా హై మేరే పీచే’ అంటుంది.(కిస్మత్ సినిమా)

‘తేరి మెహఫిల్ మె కిస్మత్ ఆజ్మాకర్ హమ్ భి దేఖేంగే ‘ అని లతామంగేష్కర్,షంషాద్ బేగమ్
లు  పాడుతుంటే రెండు నదులసంగమిస్తూ కూడా తమ రంగులను తమతో పాటు తీసుకెళుతున్నట్టనిపిస్తుంది.(మొఘల్ ఎ అజమ్ సినిమా)

చిత్రపరిశ్రమతో పాటు పెరిగిన షంషాద్ బేగమ్ 60ల వరకూ తన ఉనికిని ‘గట్టిగా’ చాటుకుంది.
వెల్లువలాంటి లతామంగేష్కర్ గాన ప్రవాహానికి ఎదురునిలబడి పదేళ్ళపాటు పోటి ఇచ్చింది. పెద్దవయసులో తన లిమిటేషన్ తెలుసుకుని శాస్త్రీయ సంగీతం అభ్యసించింది.

ఆమె పాట ప్రాకృతం గా ఉంటుంది. పెద్ద షాపింగ్ మాల్ లో  పెర్ ఫ్యూమ్స్ అమ్మేచల్లనిచోటులో వచ్చే సుగంధం లతామంగేష్కర్ పాట అనుకుంటే వేసవి సాయంత్రం,వెన్నెలవేళ  అడవి మల్లెల గుబాళింపు షంషాద్ బేగం పాట.

 
సంగీత దర్శకుడు ఓ.పి.నయ్యర్ కి నేను పెట్టుకున్న కొండగుర్తు ,పాటలో ‘చిడతల ‘శబ్దం. చేతిలో ఇమిడే రెండు చిన్న చెక్క ముక్కలను సంగీత వాద్యం  చేసే విద్యను చిన్నప్పుడు సంతలో చూసాను. అదే శబ్దం ఓ.పి. నయ్యర్ అనేక పాటల్లో విన్నాను. ఆ  చిడతల శబ్దం పాటకొక  అశ్వ వేగాన్ని ఇస్తుంది.

వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ పాట ‘సి. ఐ.డి’ సినిమాలోనిది.రచన మజ్రూహ్ సుల్తాన్ పురి. సినిమాలో హీరో హీరోయిన్లు నగరీకులు. వారు పల్లెకు వచ్చినప్పుడు వారికి ఎదురైన పాట. అప్పటివరకూ వున్న నగరవాతావరణానికి భిన్నమైన వాతావరణం.భిన్నమైన సంగీతం,గానం,అభినయం.


“నాపేరు చెప్పుకో
నది ఒడ్డున మా వూరు
మా వాకిట్లో ఉన్న రావిచెట్టు ఊగుతూ
చల్లని నీడ నిస్తుంది

లోకులంటారు నన్నువెర్రిదానినని
నా ఎగిరే కురులు..
నా నల్లని పుట్టుమచ్చ ..
నా ఎర్రని ముఖం తో
నేను వీధుల్లో తిరిగితే నాతో ఊరంతా ఊగుతుంది


నా వంక జాగ్రత్తగా  చూడు
నా కురుల్లో నీ గుండె చిక్కుకుండా చూసుకో
చంచలిని.. నేను కదిలితే
అందరూ మనసుపడతారు.

మనసుపారేసుకునే వారిమధ్య
నా కళ్ళకు మంచిపేరు లేదు
ఐనా నేనొక చిక్కుముడిని
.. నాపేరెందుకు చెప్పలేరు.

నే వెళుతున్నాను
ఎక్కడికెళుతున్నానో చెప్పగలవా?”

-ముళ్ళపూడి సుబ్బారావు