పనితో పాటు పుట్టిన పాట, పనికి దూరమై నాజూకుగా మారి రాజాస్థానాలకు జేరిందంటారు. అక్కడ కొత్త రూపాలు సంతరించుకుంది. రూపంతో పాటు విషయాన్నీ మార్చుకుంది.
ఘజల్ అలాంటి ఒక రూపం. ఒకప్పుడు దానిని విని ఆనందించటం ఉన్నత వర్గాల ఉత్తమ అభిరుచికి నిదర్శనం. అలాంటి ఘజల్ కొద్ది కొద్ది రూపబేధాలతో, అందులోని సారాంశాన్ని మార్చుకుంటు తిరిగి వెనక్కి ప్రయాణంచేసింది.
మెహఫిల్ లో ఆలాపన అనేది సంపన్న,ఉన్నత వర్గాల సాంస్కృతిక సమావేశం లో పాడేదైతే, స్ట్రీట్ సింగింగ్ (వీధి పాట) సామాన్యులకోసం వాళ్లదగ్గరకు వెళ్లి పాడేది.
అక్కడి పాట రూపసారాంశాలు ఏమిటి? ఇక్కడి పాటవేమిటి?
దీనికి సంబంధించిన నా అనుభవం ఒకటి..
గులామ్ అలి పాడిన ఒక ఘజల్ ‘ హమ్ తెరె షెహర్ మె ఆయే హై ముసాఫిర్ కి తరాహ్ ‘.అతని కచేరీల్లో తప్పనిసరిగా ఉండే ఘజల్ ఇది.
అతని పాటకచేరీ సాధారణం గా చక్కటి ఏ సి హాలుల్లొ జరుగుతుంది.శ్రోతల్లో ఎగువ వర్గానికి చెందినవారే అధికం.
ప్రియురాలు చేతిలో ఒక వ్యక్తి మోసపోయాడు. ఆమెకై ఆమె ఊరికి వచ్చాడు. ఆమెను కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. పాట రూపంలో అతని బాధ వెళ్లగక్కుతున్నాడు.
గులామ్ అలి చేతిలో హారొనియమ్ అతని గొంతుతో కలిసిపోతుంది.
ఆ పాట వింటూ శ్రోతలు తన్మయులు ఔతుంటారు.
అదే పాటను సుమారు పదిహేనేళ్ళ వయసున్న వీధిగాయకుడు, తన తల్లి వాద్య,గాత్ర సహకారంతో రహదారి పక్కన కూర్చుని పాడుతున్నాడు. అతని చేతిలో డోలక్ ఉంది. అతని గొంతులో ఎత్తుపల్లాలకు అతని డోలక్ శబ్దానికి చిత్రమైన ‘సింక్’ ఉంది.
పాటలో పదాలు అవే. ఐతే అవి అతను ప్రియురాలిని వేడుకుంటున్నట్టు లేవు. ఎవరినో గట్టిగా ప్రశ్నిస్తున్నట్టు గా వున్నాయి.
ప్రత్యేకం గా ‘ మేరా మంజిల్ హై కహా,మేరా ఠికానా హై కహా?’ పదం నిలదీసి అడుగుతున్నట్టు వుంది.
ఆ పాట వినే శ్రోతలు గులామ్ అలి పాట విన్నపుడున్నంత తన్మయంగా ఉండరు.
పాట అర్ధం:
నేను నీ నగరానికి బాటసారి లా వచ్చాను.
ఒకేఒక్కసారి కలవటానికి అవకాశమివ్వు
నా గమ్యం ఎక్కడ ? నిలువనీడ ఎక్కడ?
ఉదయం నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను?
ఆలోచించుకోవటానికి ఒక రాత్రి కి అవకాశమివ్వు
నా కనుకొలకుల్లో తడిమెరుపును దాచి ఉంచాను
నా కనురెప్పలను అశృవులతో అలంకరించి ఉంచాను.
నా కళ్ళకు ఒక్కసారి వర్షించటానికి అవకాశమివ్వు
ఈ రాత్రి నా ప్రేమ బాధను విను
కంపించుతున్న పెదవుల ఫిర్యాదు విను
ఈ రోజు నా ఆలొచనలు చెప్పుకోవటానికి అవకాశమివ్వు
మరచిపోయేదే ఐతే ఒప్పుకున్నది ఎందుకు?
నమ్మకద్రోహీ! నువ్వు నన్ను ప్రేమించింది ఎందుకు?
కనీసం రెండు మూడు ప్రశ్నలడగటానికి అవకాశమివ్వు
--ముళ్ళపూడి సుబ్బారావు