Showing posts with label jalsaghar. Show all posts
Showing posts with label jalsaghar. Show all posts

Wednesday, March 29, 2017

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-40’
'భర్-భర్ ఆయీ మొరి అఖియా పియా బిన్..ఖిర్ ఖిర్ ఆయి బదరియా '18 February

 (ప్రియుడు లేక మేఘంవర్షించినట్టు కళ్ళు వర్షించాయి)
జల్సా ఘర్ సినిమాలో బేగం అఖ్తర్ గానం చేసిన థుమ్రీ ఇది.బహుశా బేగం అఖ్తర్ కనిపించిన గానంచేసిన ఆఖరి సినిమాపాట కావచ్చు.
జల్సా ఘర్ (సంగీత శాల/సంగీతగృహం) బెంగాలీ సినిమా కుసత్యజిత్ రే దర్శకత్వం వహించారు.
దేశం బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నప్పటి (1920ల) కాలం.జమీందారీ వ్యవస్థ స్థానే ఆధునిక వ్యాపారాలు,యాంత్రీకరణ ప్రవేశిస్తున్నాయి. సాంఘికంగా వచ్చేమార్పులు గమనించకపోవటం ,మారే కాలంలో మరని మనుషులు,మార్చుకోని విలువలు వీటి పర్యవసానాల చర్చ ఈ సినిమా.
వస్తున్న,రాబోయే మార్పులు తమపై చూపబోయే ప్రభావాన్ని ఏమాత్రం గుర్తింపదలచుకోని(?) జమీందారు కేంద్రం గా సినిమా సాగుతుంది.
అప్పటికాలాన్నిబట్టి జమీందారీ హవేలీలో సంగీతశాల కలిగిఉండటం ప్రతిష్టాత్మకం. అందులో సంగీత కాలక్షేపం ఉత్తమాభిరుచికి ఓ కొలమానం.
సినిమాలో జమీందారు సంగీతశాల, సంగీతంపట్ల అతని అనురక్తిని సౌందర్యదృష్టి కి నిదర్శనం.సంగీతం అతని ప్రాణం.
అతని మితిమీరిన సంగీతాభిరుచే అతని ఆర్ధికపతనానికికారణమయ్యిందా?
లేక వేరే కారణాలవల్ల జరిగేపతనాన్ని ఆపలేక సంగీతపు నీడకు చేరాడా?
జీవనశైలిలో భాగంకావాల్సిన కళలు,అభిరుచులు, అవే జీవనమైపోవటం ఎప్పుడు జరుగుతుంది?
మార్పును గమనించలేకఫోవటంవల్లా?
మార్పుకు తగ్గట్టు మారలేకపోవటంవల్లా?
మారినా ఉపయోగంలేదనే స్థితి..పాయింట్ ఆఫ్ నో రిటన్ కు చేరిపోయినప్పుడా?
ఇవన్నీసినిమా చూసినప్పుడు కలిగే సందేహాలు.
మధ్యవయస్కుడైన ఒక జమిందారు రంగులు మాసి,పెచ్చులూడిన తన రాజమహలు వంటి బంగళా టెర్రేసు మీద కూర్చుని తనలోకంఉండి,తనదగ్గర మిగిలిన చివరిద్దరి సేవకుల్లో ఒకణ్ణి అడుగుతున్నాడు "ఇది ఏ నెల" అని. రోజుల్ని,నెలల్నే కాదు సీజన్లను కూడా అతను మరచిఉన్నాడు.పొరుగున జరిగే శుభకార్యక్రమాన్ని గమనించి గతాన్ని గుర్తుచేసుకున్నాడు.
తరిగిపోతున్న ఆస్తులపట్లగమనింపులేకుండా,చివరకు స్త్రీ ధనంవెచ్చించి సంగీతంపట్ల తన అనురక్తిని చాటుకుంటాడు.అంతస్తు లో తనకి మించాలని చూస్తున్న పొరుగువాడైన 'కొత్త వ్యాపారి 'పై తన ఆధిక్యం చూపాలని తలపెట్టిన సంగీతకార్యక్రమానికి దూరంలో ఉన్న భార్యా,కొడుకులను పిలిపించి, తుఫానులో వారి మరణానికి కారకుడయ్యాడు.
జమిందారు తన వంశం,తన రక్తం ఎంతో ఉన్నతమైనవని, డబ్బు సంపాదించినంత మాత్రాన గొప్పలక్షణాలు రావని తనని తాను నమ్మబలుక్కుంటాడు. తన సౌందర్య దృష్టి, తన ఉత్తమ సంగీతాభిరుచి తన గొప్పదనపు కారణాలలో కొన్ని అనుకుంటాడు.
మారుతున్న కాలంలో తనస్థానమేమిటో తేల్చుకోలేకపోతున్నాడు.తనింటిలో ఆరిపోతున్న కొవ్వొత్తులు చూశి చలితుడౌతున్నాడు. బయట ఉదయకాంతుల్ని చూసి భయపడుతున్నాడు.శిధిలమైన శరీరం పై గమనింపులేకుండా ఉక్రోషంతో తలపాగా ధరించి గుర్రపు స్వారీ ప్రారంభించాడు. బెదిరిన గుర్రం నుండి పడి మరణించాడు.
జమీందారుగా ఛాబీ బిస్వాస్ నటించాడు.అతన్ని మొదటిసారి చూసింది ఈ సినిమాలోనే..షావుకారు సినిమాలో గోవిందరాజుల సుబ్బారావును తొలిసారి షావుకారు చంగయ్య గా చూస్తే కలిగిన అబ్బురం మళ్ళీ జల్సా ఘర్ చూసినప్పుడు కలిగింది.
ఈ పాట కు సంబంధించి..
సినిమాలో సంగీతశాల లో జరిగేమూడు కార్యక్రమాలో ఒకటి బేగం అఖ్తర్ పాడిన ఈ థుమ్రీ.ఈ పాట చిత్రీకరణలో నెమ్మదిగా కదిలే కెమేరా అనేక వివరాలను పట్టుకుంటుంది.సంగీతాన్ని వినే వివిధ వ్యక్తుల ఫీలింగ్స్ ..బిస్వాంబర్ కళ్ళలో తన్మయం,ఆ తన్మయాన్ని కళ్ళతోనే పక్కవానితో పంచుకోవటం,గంగూలీ(కొత్తగా వృద్ధిలోకి వస్తున్న వ్యక్తి) సంగీతాన్ని ఆనందిస్తున్నట్టు ఇబ్బంది పడుతూ నటించటం, సంగీతశాలలో పెచ్చులూడిన స్థంభాలు,చాండ్లియార్లో ఉన్న గాజు క్వాలిటీ… ప్రతీ సూక్ష్మ విషయం సినిమాను అర్ధం చేసుకోవటానికి దోహదపడేదే.
-ముళ్ళపూడి సుబ్బారావు