Showing posts with label jisko tune ghar samjha. Show all posts
Showing posts with label jisko tune ghar samjha. Show all posts

Wednesday, March 29, 2017

జిస్ కో తూనే ఘర్ సంఝా హై


“జిస్ కో తూనే ఘర్ సంఝా హై ఓ దునియా ముసాఫిర్ ఖానా హై.”16 March at 19:49

(ఇల్లు అని నువ్వు దేనిని అనుకుంటున్నవో ఆ ప్రపంచం యాత్రీకులుండే ఒక సత్రమే.)
‘సురంగ్’(1953) సినిమాలో షెవాన్ రిజ్వి రాసిన పాట, పండిట్ శివ్ రామ్ కృష్ణ సంగీతం....
కన్యాశుల్కంలో దాసరి వేషంలో కరటకశాస్త్రి శిష్యుడు పాడతాడు “ఇల్లు ఇల్లనియేవు,ఇల్లు నాదనియేవు “ అంటూ.

ఇంచుమించు అదే అర్ధం వచ్చే పాటే ‘సురంగ్ ‘ సినిమాలో దర్శక నిర్మాత వి.శాంతా రామ్ పెట్టాడు.అక్కడ పాడెది దాసరి ఐతే ఇక్కడ శ్రమచేసి బ్రతికే కష్టజీవులు. బైరాగులు జీవితపు బరినుండి ఇవతలకువచ్చి తత్వం చెబుతారు. ఈ శ్రామికులు జీవితవాస్తవాన్ని అనుభవిస్తూనే చెబుతున్నారు.
రేపటి మీద ఆశ ఉండి,ఎదగాలనే కోరిక ఉన్నవాడి ప్రార్ధనలు,మొత్తుకోళ్ళు ఒకలా ఉంటాయి.
ఏపూట గ్రాసం ఆపూటే సంపాదించుకుని,మరుక్షణం పట్ల భరోసా లేని వాని ప్రార్ధనలు ,మొత్తుకోళ్ళు వేరేలా ఉంటాయి.
ఈ విషయాన్ని ఒక అనుభవశాలి ఓ యువకునికి చెబుతున్నాడు. ఆ యువకుడు పెద్ద ఇంటినుండి బయటకు వచ్చి, తనకు తెలియని మనుషులదగ్గరకు కిందకు వస్తున్నాడు. అతని కుటుంబానికి చెందిన క్వారీ లోనే ఆ మనుషులు పనిచేస్తున్నారు.
రాత్రివేళ శ్రామికులు పాడుకుంటున్న ఈ పాటలో ఉన్న వైరాగ్యం(?) స్మశాన వైరాగ్యం లాంటిది కాదు.వారిది నిత్యవైరాగ్యమే.ఇంతకుమించిన ఆశ 'అందని ద్రాక్షపండు ' అనుకున్నారా ? ఇలా అనుకోకపోతే ఈ మాత్రం శాంతి ఉండనుకున్నారా?
జీవితమొక తప్పనిసరి ఆటే ఐతే ముగిసేంతవరకు ఆడేద్దాములే అన్నట్టు వినిపిస్తుందా పాట. పూర్తిస్థాయిలో అవలంబించవలసిన ఆలోచన కాకపోయినా ఇలాంటి ఆలోచన కూడా కలిగివుండాలని అనిపిస్తుంది.
సినిమాకాని,అందులో నటవర్గంకాని అంతగా గుర్తింపు పొందిందికాదు. ఫిలసాఫికల్ పాటల కోసం తొలి ఎంపికైన 'మన్నాడే 'ముఖ్యగాయకుడు. చిత్రీకరణ,నటుల హావభావాలు,సంగీత వాద్యాలు,నర్తనం అన్నీ..పాట మూడ్ ను మరింత సాంద్రతరం చేసేట్టున్నాయి.
“నిద్రలో ఉన్నవారూ..లేవండి.
ప్రభాతకాలమయ్యింది.
ఎవరో యాత్రికుడు డేరా వేసుకున్నాడు.
??????
ఇల్లు అని నువ్వు
దేనిని అనుకుంటున్నవో
ఆ ప్రపంచం యాత్రీకులుండే ఒక సత్రమే.
ఏదో ఒక రోజు
ఈ ఇంటిని అన్నింటినీ వదులుకుపోవలసిందే
నాలుగు రోజుల జీవితాన్ని పట్టుకు
లోకానికి వచ్చావు.
మట్టితో చేసిన బొమ్మవు నువ్వు
అద్దాలమేడలు కడతావు.
నువ్వు మట్టిలోనే కలవాల్సి వుంటుందని
నువ్వెప్పుడు ఆలోచించలేదు.
వెర్రివాడా...లోకమొక సత్రమే.
ఇది కొద్ది సేపటి తమాషానే
ఇది కొద్దిసేపటి వసంతమే
తుఫానొకటి కొట్టిందంటే
నీ ఈ తోటంతా నాశనమౌతుంది.
ఎప్పటికీ ఇక్కడే వుండాలనుకుంటున్నావు
నీకు ఇది తెలుసా?
వెర్రివాడా..లోకమొక సత్రమే.
లోకంఅంతా ఎగ శ్వాస ..దిగ శ్వాస
శ్వాసకెక్కడిది భరోసా?
గంట గంటకి గడియారం పిలుస్తుంది
స్పృహలోకి రా
దారినే నువ్వు గమ్యమనుకుంటున్నావు
ఆ గమ్యం నీకు దొరకదు
-ముళ్ళపూడి సుబ్బారావు