Showing posts with label khoya khoya chand. Show all posts
Showing posts with label khoya khoya chand. Show all posts

Saturday, April 15, 2017

ఖోయా ఖోయా చాంద్,ఖులా ఆస్మాన్


“ఖోయా ఖోయా చాంద్,ఖులా ఆస్మాన్”
(“చంద్రుడు మాయమయ్యాడు, ఆకాశం ఖాళీ అయ్యింది)
కాలా బజార్ సినిమాలో రఫీ పాడిన పాట,శంకర్ జైకిషన్ సంగీతం,శైలేంద్ర రచన

ఏలూర్లో చదువుకునే రోజుల్లో (1986) లో కొన్ని రోజులు  రూములో ఒక్కడినేఉన్నాను.ఒక లెక్చరర్ ద్వారా ఒకతను రూమ్ మేట్ అయ్యాడు. అంతకు ముందు అతను హైదరా బాద్ లో ఉండేవాడు. ఒక రోజు పుస్తకంగా వచ్చిన అతని కవితలు చూపించాడు. వాళ్ళ తండ్రి పై రాసిన కవితలవి. నేను ప్రత్యక్షం గా చూసిన తొలి కవి అతను.
మధ్య మధ్యలో అతను పాటలు పాడుతుండేవాడు. ఒక పాటపంక్తులు ఒక్కొక్కటి ఒక్కొక్క సారి  పదే పదే పాడేవాడు. అందులో కొన్ని  “నీదు మనసు నీలో లేదు నాలోన లీనమయే “, “నిదుర రాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి”, “మేలుకున్న స్వప్నము లోన ఏల ఇంక బిడియ పడేవు”.

అడిగినపుడు ఆ పాట మొదలు చెప్పాడు . అది “నిండు చందమామ ..నిగనిగల మామ”అంటూ సాగే జేసుదాసు తొలిరోజుల్లొ పాడిన తెలుగు పాట. సినిమా ‘బంగారు తిమ్మరాజు’.ఆ సినిమా అంతకు మునుపు చూసాను,పాటా విన్నాను. ఐతే పదే పదే అతని నోట వింటుంటే మరింకేదో పాట మనసులో మెదులుతుండేది. హఠాత్తుగా ఒక రోజు స్ట్రైక్ అయ్యింది. ఆ పాట కి , రఫీ పాడిన ‘ఖోయా ఖోయా చాంద్ ‘ పాటకు పోలికలున్నాయి.

తెలుగు పాటకు సంగీత దర్శకులు ‘రాజన్ నాగేంద్ర ‘ ద్వయం. తర్వాతి రోజుల్లో వారి కన్నడ,తెలుగు పాటల వరసలు  కొన్ని హిందీ సినిమా సంగీత దర్శకులూ తీసుకున్నారు.

హిందీ పాట ‘ఖోయా ఖోయా చాంద్ ‘ పాట చంద్రుడు మాయమయ్యాడని చెబుతున్నా వింటున్నప్పుడు వెన్నెల్లో విహరిస్తున్నట్టే ఉంటుంది నాకు..చాలా వరకు పాత పాటల్లో  కొన్నింటికి మాత్రమే దృశ్యం  విలువను పెంచుతుంది. చనచ్చిన  పాటలు చూడకుండా కళ్ళుమూసుకునో,శున్యంలోకి చూస్తూనో వింటున్నప్పుడు మనసు పాటతో తేలిపోతూ ఎక్కడెక్కడో విహరిస్తుంది.

నావరకూ ‘ఖోయా ఖోయా చాంద్’ అలాంటి పాటే.

పాట అర్ధం

“చంద్రుడు మాయమయ్యాడు, ఆకాశం ఖాళీ అయ్యింది
నీకు నిద్ర ఎలా వస్తుంది? చూపులతో  రాత్రంతా  గడచి పోతుంది.

మత్తుతో నిండిన గాలి వీస్తుంది
హృదయపు మొగ్గ వికసిస్తుంది
మనసు దారుల్లో అలజడి రేగింది
ఆమెను పిలవాలంటే

తారలు కదలిపోతున్నాయి. పరిసరాలు కదలిపోతున్నాయి
నాతో పాటు అవన్నీ ప్రయాణమయ్యాయి.
నాలుగు వైపులనుండీ  సైగలు వస్తున్నాయి.
ఎవరి వానివో ఐపొమ్మని

అలాటి రేయి,తడిసిన రేయి
చేతిలో చేయి, ఆమెజతలో హాయి
మనసులో మాట ఆమెకు చెప్పేస్తే
ఇప్పుడు నన్నుబాధించకు

నన్ను నేను ఎవరికోసం వదులుకున్నానో
ఆమె ఏమీ మాటాడక మౌనంగా ఉంది.
నాకంత   పరీక్ష పెట్టద్దని
ఎవరైనా ఆమెతో కొద్దిగా చెప్పండి “

నా ముప్ఫైయేళ్ళ క్రితం స్నేహితుడ్ని ఈ పాట గుర్తు చేస్తూ ఉంటుంది. అతని పేరు నాగళ్ళ దుర్గాప్రసాద్ (తెనాలి)
---ముళ్ళపూడి సుబ్బారావు