‘లాగా చునరీ మే దాగ్, చుపావూ కైసే?’ (ముసుగు పైన మరక అంటింది? దానిని ఎలా దాయగలను?)
దిల్ హీ తో హై(1963) సినిమాలో మన్నాడే గాన చేసిన పాట.
రాజ్ కపూర్ సొంత సినిమాలలో ఆయనకు అధికభాగం నేపధ్యగానం ముకేశ్ చేశారు . ఒకవేళ ముకేశ్ పాడక పోతే ఆ స్థానం మన్నాడే దే. సాధారణంగా రాజ్ కపూర్ సినిమాలకు సంగీత దర్శకత్వం శంకర్ జైకిషన్ (లు) వహించేవారు. శైలేంద్ర గీతరచన చేసేవారు.
ఐతే దిల్ హీ తో హై సినిమాలో వేరే కలయిక వచ్చింది. అందులో కొన్ని పాటలు సాహిర్ లూధియాన్వి రాశారు.సంగీతం రోషన్ అందించారు. అందులో ఒక పాట ‘లాగా చునరీ మే దాగ్, చుపావూ కైసే?’.
మన్నాడే నేపధ్య గాయకుడిగా ఎప్పుడూ ‘ఒక’ వెలుగు వెలగలేదు. ఐతే నలభై యేళ్ళపాటు తన ప్రత్యేకత నిలుపుకుంటూనే ఉన్నాడు. శాస్త్రీయ సంగీతం తో కూడిన పాటలు కాని, ఫిలసాఫికల్ టచ్ ఉన్న పాటలు కాని పాడాల్సివచ్చినప్పుడు అవి మన్నాడే తలుపు తట్టాయి. అలాంటి పాటలో చాలా భాగం ‘నిలిచి’ పోయే పాటలు కావటం విశేషం.
పాటల రచయిత సాహిర్ లూధియాన్వి ఈ పాటలో ఒక మాజిక్ చేశాడు. అతని పేరులో ‘సాహిర్’ అంటే ‘మాజిక్’ అనే. వినేవారికి పాట ఒక రకంగా అర్ధం ఔతూ హఠాత్తుగా వేరేది చెబుతుంది.
సంగీతదర్శకుడు ‘రోషన్’ శాస్త్రీయ సంగీత పునాదితో అనేక పాటల్ని అజరామరం చేసిఉన్నాడు. ఈ పాట అతని కిరీటంలో మరో తురాయి. (అతని కుమారులు రాజేష్ రోషన్(సంగీత దర్శకుడు), రాకేష్ రోషన్(నటుడు,దర్శకుడు) మనుమడు హృతిక్ రోషన్(నటుడు) ఇప్పటికీ చిత్ర రంగంలో ఉన్నారు)
సినిమాలో కథానాయకుడు గాయకుడు. ఒకసారి వృద్ధ సంగీతకారుడుగా మారువేషంలో ఒక ప్రదర్శనలో పాల్గొన్నాడు. సినిమాలో అతని మారువేషం, అతని నటన హాస్యంకోసం పెట్టి ఉండవచ్చేమో కాని పాట అర్ధం ,గానం,సంగీతం పాటను ఏ మాత్రం హాస్యగీతం కాదని చెబుతున్నాయి.
పురుషుని స్వరం తో ఉన్నా, పాట స్త్రీ తనకి సంబంధించి తన ‘కన్ఫెషన్ ‘ చెబుతున్నట్టు ఉంటుంది.
పాట అర్ధం.
“ముసుగు పైన మరక అంటింది? దానిని ఎలా దాయగలను?
ముసుగు పైన మరక ..దానిని ఎలా దాయగలను? ఇంటికి ఎలా వెళ్ళగలను?
ముసుగు పై మరక అయ్యింది
శుద్ధమైన శరీరంపై శుద్ధమైన ముసుగు
వెళ్లి తండ్రి కళ్ల్లలోకి ఎలా చూడగలను? ఇంటికి ఎలా వెళ్ల్లగలను?
ఇచ్చిన మాటలు,విధులు అన్ని మరచాను
అత్తగారి ఇంటికి వచ్చి మైకంలో పడిపోయాను
వెళ్లి తండ్రి కళ్ల్లలోకి ఎలా చూడగలను? ఇంటికి ఎలా వెళ్ల్లగలను?
******
శుద్ధమైన ముసుగు మరేమీ కాదు నా ఆత్మే!
మరక అనేది మాయాజాలమే!
ఆ ప్రపంచం నా తండ్రిగారి ఇల్లు
ఈ ప్రపంచం నా అత్తగారి ఇల్లు
వెళ్లి తండ్రి కళ్ల్లలోకి ఎలా చూడగలను? ఇంటికి ఎలా వెళ్ల్లగలను?”
పాట సగంనుండి మన్నాడే చేసే స్వరాలాపన పాట విలువ మరింత పెంచింది. ఈ పాట ఎప్పటినుందో వింటున్నా క్రమక్రమంగా నన్ను ఆకట్టుకుంది. సుమారు పదేళ్ళక్రితం ఒక టివీ సంగీతకార్యక్రమం లో నటుడు సచిన్ (హిందీ/మరాఠీ) ఈ పాట స్వరాలాపనతో సహా పాడటం గమనించాక అతనిపట్ల గౌరవం పెరిగింది.
-ముళ్ళపూడి సుబ్బారావు.