Showing posts with label razia sultan. Show all posts
Showing posts with label razia sultan. Show all posts

Wednesday, March 29, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-22
'ఆయి జంజీర్ కి ఝంకార్ ఖుదా ఖైర్ కరే'11 January
(సంకెలల చప్పుడు వినవస్తుంది. దేవుడా శాంతి నివ్వు)
'5 క్రోర్స్ కమల్ అమ్రోహీస్ రజియా ' - ఈ హెడ్డింగు కవర్ పేజీ గా వీకెండ్ మాగజీన్ వచ్చింది.ఇప్పటికి లెక్కిస్తే 250 కోట్ల పైమాటే. అంత బడ్జెట్ తో తీసినసినిమా ‘రజియా సుల్తాన్’ .
ఢిల్లీ సల్తనత్ కు తొలి,తుది సామ్రాజ్ఞి రజియా( 13 వ శతాబ్దం) కథ.దర్శకుడు అంతకుముందు పాకీజా వంటి కళా ఖండం తీసివున్నాడు. హేమమాలిని,ధర్మేంద్ర, ప్రదీప్ కుమార్( తాజ్ మహల్ సినిమాలో షాజహాన్)వంటి ...నటులు ఉన్నారు. ఉన్నత నిర్మాణ విలువలు వున్నాయి.
ఐతే ఇవేవీ సినిమాను కాపాడలేకపోయాయి. నిస్పృహ చెందివున్న ప్రేక్షకులకు ఒకింత ఉపశమనం కలిగించించేది ఖయ్యాం సంగీతదర్శకత్వంలో వచ్చిన పాటలు.
అందులో ఒక పాట 'ఆయి జంజీర్ కీ ఝంకార్ '.
దిల్లీ సుల్తానా రజియా కనుసన్నలలో అతివిస్తారమైన మొఘల్ సామ్రాజ్యం నడుస్తుంది..ఐతే హృదయం మాత్రం ఆమె అశ్వాన్ని అవరోహించేటపుడు కాలి ఊతానికి తన శరీరాన్ని సమర్పించే ఒక పరాయి దేశపు నల్లరంగు బానిస కోసం చేతులు చాస్తుంది. కాని ఆమె అధికారమే ఆమెకు చెరసాల .
మనిషే ఐన బానిసకు ఇది అర్ధమౌతూ ఉంది.
ధృఢమైన శరీరమున్నా అదిమిపట్టిఉంచే అనేక శక్తులు ఆ బానిసను కలలుకూడా కనినీయవు. కలలకు కళ్ళాలు,ఆశలకు సంకెళ్ళూ వేస్తూ ఆ బానిస పాడుకుంటున్న పాట.
లావైన ఇనుపసంకెళ్ళ రాపిడిలా, లోతైన సన్నని బావినుండి ఎలుగెత్తి పిలుస్తున్నట్టు ఇదివరకెన్నడూ వినని స్వరం. ఆ మూడ్ ను మరింత చిక్కబరుస్తున్నట్టు సంగీతం.సంకెళ్ళు,ఖైదు, తల్వారు,ప్రళయం వంటి పదాలతో సాగే సాహిత్యం.కబ్బన్ మీర్జా అనే కొత్తగాయకుడు, ఖయ్యాం, జాన్ నిసార్ అఖ్తర్ ల సమిష్టి కృషి.
“సంకెలల చప్పుడు వినవస్తుంది
దేవుడు రక్షించు గాక
నా మనసు ఆమె కు బందీ ఐపోతుంది
దేవుడు రక్షించు గాక
నా ఆత్మను తట్టిపోయిందెవరు?
ఏదో ప్రళయం రాబోతుంది
దేవుడు రక్షించు గాక
గడిచే ప్రతి క్షణం నా కంటికి మెరిసే కత్తిలా కనిపిస్తుంది
దేవుడు రక్షించు గాక
నా గుండెలోని రక్తం నా కళ్ళనుండి ఉబికి రానియకు
దేవుడు రక్షించు గాక
ఆమె ఆమోదం!!...అది జరగనీయకు
దేవుడు రక్షించు గాక”
సామ్రాజ్యాధినేతను కట్టుబానిసనూ సమానంగా నియంత్రించింది , బాధించగలిగింది ఏమిటి?
------------ముళ్ళపూడి సుబ్బారావు