Showing posts with label shammi Kapoor.Md rafi. Show all posts
Showing posts with label shammi Kapoor.Md rafi. Show all posts

Sunday, May 21, 2017

హై దునియా ఉసీకి, జమానా ఉసీ కా

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-84
“హై దునియా ఉసీకి, జమానా ఉసీ కా”
(వారిదే ఈ ప్రపంచం  , వారిదే ఈ కాలం)

హీరోగా షమ్మి కపూర్ నటించిన  సినిమాలు ధియేటర్ లో చూసినవి  తక్కువే.నాకు తెలిసేసరికే అతను హీరోగా నటించటం మానుకున్నాడు.  చూసిన అతని  పాత సినిమాలు కూడా మహమ్మద్ రఫీ పాటలు పిలవటం వల్లే. ‘యా...హూ...’ అంటూ తారా స్థాయి లో పిలుస్తుంటే ఆగేదెలా?

షమ్మీ కపూర్ సినిమాల్లో పాటలు బాగాలేనివి ఏమైనా ఉన్నాయా? చూడటం కష్టమైన పాటలు ఉంటాయి కాని వినలేనివి ఉండవు. ‘బై డిఫాల్ట్ ‘షమ్మి కపూర్ పాట అంటే రఫీ పాడిందే.

‘కాశ్మీర్ కి కలీ’ లో అన్ని పాటలూ బాగుంటాయి. ఐతే  “హై దునియా ఉసీకి, జమానా ఉసీ కా” పట్ల నాకు ప్రత్యేకమైన ఇష్టముంది. వెతుక్కుంటే దొరికిన కారణం పాటలో రఫీ గొంతుకు సమాంతరం గా సాగే శాక్సోఫోన్ వాదనం. .అది యుగళ గీతమే. రఫీతో పాటు రెండో గాయకుడు శాక్సో ఫోన్.
 
పాట ఒక మాదిరి విషాద గీతం. మద్యం సేవించిన నాయకుడు ప్రేమలో గాయపడి పాడుతున్నాడు. మహమ్మద్ రఫీ మద్యం తీసుకునేవాడు కాదని  చెబుతారు. ఈ పాటతో శ్రోతల్ని మధుసేవనం చేయిస్తాడు.
తక్కువ సంగీత పరికరాలు, డామినేట్ చేసే   శాక్సోఫోన్ .. వీటితో ఒక  భిన్నమైన ‘మూడ్’ ఏర్పడింది.
శాక్సోఫోన్  పలికించే అతనికి దృశ్యపరంగానూ ప్రాముఖ్యత ఇవ్వబడింది. బహుశా అతను నిజమైన కళాకారుడు కావచ్చు.
చిత్రానికి సంగీత దర్శకుడు ఓ.పి.నయ్యర్, పాట రచయిత ఎస్‌. హెచ్. బిహారి.  

“ఎవరు ప్రేమలో వేరేవారికి  సొంతమౌతారో
వారిదే ఈ ప్రపంచం  , వారిదే ఈ కాలం

ప్రేమ రహదారిలో దోచుకోబడ్డ బాటసారి,
అతని దృష్టిలో ఈ లోకమే స్వర్గలోకం
అతనే జీవితంలో ఆనందాన్ని కొల్లగొట్టాడు

ప్రేయసి కి ప్రతిరూపం ఐపోయిన వాడు
మోకరిల్లి మొక్కదగిన  పిచ్చివాడు
వాని పిచ్చితనాన్ని గౌరవించు

ధ్వంసం కావటం ఎవరి రీతో
ప్రేమలోవ్యధ ఎవరికి ఔషధమో  
వానిని ఈ లోకపుదుఃఖాలు ఏవి బాధించగలవు?”

-ముళ్ళపూడి సుబ్బారావు