Showing posts with label talat mohamood. Show all posts
Showing posts with label talat mohamood. Show all posts

Monday, May 29, 2017

జల్ తే హై జిస్ కేలియే..తేరీ ఆంఖోకే దియే.

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-87
జల్ తే హై జిస్ కేలియే..తేరీ ఆంఖోకే దియే..(నీ కళ్ళు దివ్వెల్లా దేనికోసం వెలుగుతున్నాయో)
సుజాత(1959) సినిమాలో తలత్ మొహమూద్ పాడిన పాట.
సినిమా కళను అర్ధంచేసుకుని తమ ఆలోచనలను ప్రతిభావంతంగా చెప్పిన ప్రభావశీలురైన దర్శకులుకొందరున్నారు. అలాంటి దర్శకుల సినిమాలు మొత్తం చూడాలని నాకనిపిస్తుంది. వారిలో బిమల్ రాయ్ ఒకరు. ఆయన సినిమాల్లో చూడకుండా మిగిలిన వాటిలో ఒక సినిమా ‘సుజాత’.ఆ విషయాన్ని పదే పదే ‘తలత్ మొహమూద్’ ఈ పాట ద్వారా గుర్తుచేస్తుంటాడు.
నండూరి రామమోహన్ రావు గారి వ్యాసం ఒకటి హిందీ గాయకుల గురించి చదివాను. అందులో ఆయన అభిప్రాయమో ,వేరే వారిదోగానీ ‘తలత్ మొహమూద్’ పై ఒక కామెంటు గుర్తుంది. ఆయన(తలత్)ఊటీ లో చలికాలం(రాత్రి?) లో చొక్కాతీసేసి చలికి వణుకుతూ పాడినట్టు కాకుండా, మామూలుగా పాడితే మరింత గొప్పగా ఉంటుంది.
ఇది అతిశయోక్తిలా ఉన్నా ముందుపాటల్లో లేని సన్నని కంపనం అతని గొంతులో తర్వాత పాటల్లో తెలుస్తుంది. ఈ పాటలో కూడా అది గమనించవచ్చు. ఐతే ఆయన అభిమానులు ఆ కంపనను ఒక అందంగానే స్వీకరిస్తారు.
ఎస్. డి.బర్మన్ సంగీతంలో పాటమధ్య వచ్చే కొన్ని శబ్దాలు ,ప్యాసాసినిమాలో ’జిన్హే నాజ్ హై’ పాటను గుర్తుకు తెస్తాయి.
మజ్రూహ్ సుల్తాన్ పురి ఈ గీత రచయిత.’మజ్రూహ్’ అంటే ‘గాయపడ్డవాడు ‘ అని అర్ధమట. అతను గాయపడటం అటుంచితే, అతను చాలా పాటలతో శ్రోతల హృదయాలని గాయపరచాడు.
ఈ పాట ఫోన్ లో కథానాయకుడు పాడుతున్నాడు. ఎవరినుద్దేశించి పాడుతున్నాడో ఆమె ఇష్టంతోనూ,కష్టంతోనూ వింటుంది.
పాటను చూడకుండా మనసుపెట్టి వింటే మనసుకైన గాయాలకు వెన్న రాస్తున్నట్టుంటుంది..
“ నీ కళ్ళు దివ్వెల్లా
దేనికోసం వెలుగుతున్నాయో
ఆ గీతాన్ని నీకోసం
వెతికి తెచ్చాను.
నొప్పిలా మారి నా మనసులో చేరింది,వదలనంది
మాయలా మారి నీ కన్నుల్లో ఆగింది,కదలనంది
నేడు తెచ్చాను
ఆ గీతం నీకోసం.

గుండెలో దాచుకో, చేజారనీయకు
నా గీతం గాజుకన్నా సున్నితం..పగలనీకు
రాగంతీస్తూనే ఉంటాను
ఈ గీతం నీకోసం.
ఇది నీ రసభరితమైన పెదవుల్ని చేరేంతవరకు
నీ ముంగురులనీడల్లో తిరుగాడుతూనే ఉంటుంది
పాడుతూనే ఉంటాను
ఈ గీతం నీకోసం.”
-ముళ్ళపూడి సుబ్బారావు