Showing posts with label ye raate ye mausam ye hasanaa hasaanaa. Show all posts
Showing posts with label ye raate ye mausam ye hasanaa hasaanaa. Show all posts

Wednesday, March 29, 2017

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-45’
‘యె రాతే యె మౌసమ్ యె హస్నా హసాన”28 February

(“ ఈ రాత్రులను,ఈ ఋతువులను ,ఈ నవ్వుల్ని,ఈ సంతోషఘడియల్ని)
గానం, సంగీతం 'పంకజ్ మల్లిక్ ',ప్రయివేట్ పాట.
...
లతామంగేష్కర్ 93/94(?) ప్రాంతాలలో సంగీతరంగంలో కొందరు ప్రముఖులకు శ్రద్ధాంజలి ఘటించదలచింది. అందులో కొందరు ఆమె ముందు తరం వారు,కొందరు సమకాలికులు.కీర్తి ని శేషంగా మిగుల్చుకున్నవారు.వారిలో కుందన్ లాల్ సైగల్,పంకజ్ మాలిక్,హేమంత్ కుమార్,తలత్ మొహమూద్,ముకేశ్,రఫీ,కిశోర్ కుమార్ లు ఉన్నారు.
‘శ్రద్ధాంజలి’ పేరు తో వచ్చిన కాసెట్లలో లో పై గాయకులు పాడిన పాటలు లతామంగేష్కర్ తిరిగి పాడింది.సైగల్,పంకజ్ మాలిక్ పాడిన పాటలు లతామంగేష్కర్ గొంతుతో క్వాలిటీతో కూడిన రికార్డింగుతో విన్నాక ఆ గాయకులు ఒరిజినల్ గా పాడిన తిరిగి విన్నాను.
ఆ పాటలు అప్పటివరకూ మరీ ఆకర్షింపకపోవటానికి కారణం ముఖ్యంగా క్వాలిటీ లోపం. ఆ రత్నాల మెరుపును వాటిపై పడ్డధూళి కప్పేసింది.మెరుగైన టెక్నాలజీ ఉపయోగించి అప్పటి పాటల్లో ఉన్న డిస్టర్బెన్స్ ను తీసేయగలిగితే వాటిలో చాలా వరకూ మణిపూసలే.
ఆ పాటల్లో మిగతావారి పాటలు ఎపుడో ఒకప్పుడు చెవిన పడినవే కాని’ పంకజ్ మాలిక్ ‘ పాట లతా మంగేష్కర్ ద్వారానే వినటం.ఆ పాట ‘'యే రాతే,యే మౌసం,యే హసనా హసానా '.
అంతకు ముందు పంకజ్ మల్లిక్ ను సంగీత దర్శకుడుగానే విని ఉన్నాను.40 దశకంలో గాయకులైన కుందన్ లాల్ సైగల్ గురించి కొద్దిగా,పహారి సన్యాల్ పేరు మరీ కొద్దిగా విన్నాను.
గాయకుడుగా సైగల్,సంగీతకారుడుగా పంకజ్ మల్లిక్ గొప్పగా వెలిగారు.వారిద్దరి కాంబినేషన్ గురించి ఒకమాట.పంకజ్ మల్లిక్ ను సైగల్ గురించి అడిగితే 'సైగల్ తో నేను జీవించాను ' అన్నాడట..
(భజన సంప్రదాయానికి,జానపద రీతులకు సంబంధించినదైన బెంగాలీ సంగీతాన్ని రవీంద్రనాథ్ టాగోర్ ఆధునీకరించగా ,దానిని మెరుగు పెట్టినవారిలో ఒకనిగా పంకజ్ మల్లిక్ ను చెబుతారు..ఆధారం నండూరి రామమోహన్ రావు 'స్వర శిల్పి 'వ్యాసం. )
పంకజ్ మాల్లిక్ స్వయంగా పాడిన పాట‘'యే రాతే,యే మౌసం,యే హసనా హసానా ' విన్నాను. అదృష్టవశాత్తూ నాకు దొరికిన పాట ఎవరిద్వారానో 'రెస్టొరేషన్ ' చేయబడ్డదనుకుంటా.మంచి నాణ్యతతో ఉంది.మార్దవమైన గొంతు,జోలపాటో,లాలి పాటో విన్నట్టు తన్మయం కలిగింది. ఆ పాట సినిమాపాట కాదు.ఒక ప్రయివేటు పాట. (ఇలాంటిదే మరో అనుభవం నీరాజనం సినిమాలో తొలి(?) తెలుగు ప్లే బాక్ గాయకుడు ఎం.ఎస్.రామారావు పాడిన 'ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో ' పాట విన్నపుడు కలిగింది.)
ఇప్పుడు వినబోయేది పంకజ్ మల్లిక్ స్వరంతో ఆ పాతపాట .
పాట అర్ధం రమారమీ:
“ ఈ రాత్రులను,ఈ ఋతువులను
ఈ నవ్వుల్ని,ఈ సంతోషఘడియల్ని
నన్ను మరువు కాని వీటిని మరువవద్దు
మత్తైన చూపులు,కదలికలు
నీ కాటుక కళ్ళలో నిండిన నల్లమబ్బులను
ఈ గాలి...ని పెదాలమీద తేలివచ్చే నిశ్శబ్ద రాగాలను
నన్ను మరువు కాని వీటిని మరువవద్దు
మనకలయికల్ని కథలుచేసిన ఈ వనాలను
నా ప్రేమ,నీ యవ్వనం
మన ఇరువురి వేడైన శ్వాస ఒకటైన వేళ
ఈ మేఘ చలనాలు,వర్ష బిందువుల నర్తనాలు
ఈ మత్తుగొలిపే స్థితిని,మనని మనం మరచిన కాలాన్ని
మనం కలసితీసిన రాగాలను....
నన్ను మరువు కాని వీటిని మరువవద్దు”
-ముళ్ళపూడి సుబ్బారావు