‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-83
“యే రాతే ..నయీ పురానీ..ఆతే .ఆతే జాతే ..కెహతా హై కోయి కహాని”
(“ ఈ రాత్రులు...కొత్తవి పాతవి ..ఏవో కథలు చెబుతాయి).లతా మంగేష్కర్ గానం, ఆనంద్ బక్షి రచన,రాజేష్ రోషన్ సంగీతం.
హైస్కూల్లో ఉన్నపుడు స్వతంత్రంగా 79 నాటికి స్నేహితులతో కలిసి ఏలూరెళ్లి సినిమాలు చూసే ధైర్యం వచ్చింది. సెలవురోజుల్లో ఐదారు రూపాయిలు దొరకబట్టుకోగలిగితే ఉదయం బస్సో లారీయో ఎక్కి మార్నింగు షో టైముకు ఏలూరు చేరేవాళ్ళం.కనీసం రెండు సినిమాలు చూద్దామని. చూడదలుచుకున్న కొత్తసినిమాలు మార్నింగు షో లు ఉండేవి కావు. పాత హిందీ/ఇంగ్లీష్ సినిమాలో,డబ్బింగు సినిమాలో ఉదయపుఆటలు ‘ఆడేవి’.ఇష్టమై కాకపోయినా అలా కొన్ని సినిమాలు చూడాల్సివచ్చేది.
అలా చూసిన ఒక సినిమా ‘జూలీ’. హిందీ సినిమాల్లో ఆశించే పెద్దనటులూ, ఫైటింగులూ ఏమీ లేవు. పాటలు మాత్రం అన్నీ విన్నవే. సినిమా అప్పుడు ఏమాత్రం ఆకట్టుకోలేదు.
తర్వాత రోజుల్లో టివీ లో చూసేంతవరకూ పాటలతో సినిమా టచ్ లోనే ఉంది.
సినిమా వచ్చిన కాలం నాటికి(1975) ఇది ధైర్యవంతమైన సినిమానే. సినిమా నడిచే స్థలం రైల్వే ఉద్యోగులు నివసించే కాలనీ. రైల్వేలు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి కావటం వల్లకావచ్చు భిన్న భాషలు, మతాలకు చెందినవారక్కడ వున్నారు. కథానాయిక కుటుంబానిది ఆంగ్లో ఇండియన్స్ నేపధ్యం. బెంగాలుకు చెందిన హిందువుల అమ్మాయితో ఆమెకు స్నేహం. చదువు నుండి సెలవలకు వచ్చిన స్నేహితురాలి తమ్ముడుతో ప్రేమలో పడిందామె.
కాలనీక్లబ్బులో ఫంక్షన్ (న్యూ ఇయర్ పార్టీ??) జరుగుతుంది. కథానాయిక స్నేహితురాలు ఈ పాట పాడుతుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ మరింత ముందుకు పోవటానికి ఈ ఫంక్షన్ దోహదపడింది.
సినిమాతో సంబంధం లేకుండా ఈ పాట ప్రశాంతమైన వాతావరణంలో ప్రత్యేకంగా రాత్రుల్లో వింటుంటే మనసు వూగుతుంది, జోగుతుంది.అప్రమేయంగా ‘వక్త్’ సినిమాలో ‘ఆగే భీ జానే న తూ..పీచే భీ జానే న తూ ‘ పాట గుర్తుకు వస్తుంది.
“ ఈ రాత్రులు...కొత్తవి పాతవి
వస్తుంటాయి ,వచ్చి పోతుంతాయి.
ఏవో కథలు చెబుతాయి
చూడు ఎవరో వస్తున్నారు.
చూడు ఎవరో వెళుతున్నారు.
అందరి హృదయాలు మెలకువతోనే ఉన్నాయి.
అందరి కళ్ళు అర్ధ నిద్రలో ఉన్నాయి
నిశ్శబ్దం మాత్రమే మాటలాడుతూ ఉంది.
ఎలాటి తీయని సమయమిది?
కనురెప్పల వీదుల్లో
తిరుగాడే నిదురలాంటి
సుందర స్వప్నాల బృందాల్లాంటి
పూలనుండి వీచే సుగంధం.
ఏ వైపునుండి గాలులు
ఎప్పుడు వీస్తాయో ఎవరికి తెలుసు?
ఏడాది వరకైనా గుర్తుంచుకో
ఏమాత్రం మరవవద్దు
ఈ కలయిక రాత్రిని.”