Showing posts with label balraj sahni. Show all posts
Showing posts with label balraj sahni. Show all posts

Friday, June 30, 2017

తుఝె సూరజ్ కహు యా చందా?

  1. నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-97

తుఝె సూరజ్ కహు యా చందా?
(నిన్ను సూర్యుడననా చంద్రుడననా?)
‘ఎక్ ఫూల్ దో మాలి’(1969) లో మన్నడే పాడిన పాట.సంగీతం రవి,ప్రేమ్ ధవన్ రచన
...
పిల్లల్ని లాలిస్తూ మగవారు పాడిన పాటలు కంపారటివ్ గా తక్కువ. ‘కహానియా సునాతి హై పవన్ ఆతీ జాతీ హై’( రాజ్ పూత్), ‘మై గావూ తూ సో జావూ’(బ్రహ్మచారి) ఇలా కొన్ని గుర్తొస్తాయి. తెలుగులోకూడా మరీ ఎక్కువలేవు.’చందురుని మించు’(రక్త సంబంధం), బుజ్జి బుజ్జి పాపాయి(ఆడ బ్రతుకు) , లాలి జో లాలీ జో(ఇంద్రుడు చంద్రుడు) వాటిలో కొన్ని.,
ఆ తరహా పాటల్లో నాకు ఇష్టమైన హిందీ పాట ‘తుఝె సూరజ్ కహు యా చందా?’. ఎక్కువసార్లు వినటంవల్ల ఫెమీలియర్ ఐన పాట. విన్న చాలా కాలానికి పాట చూసాను. చూసిన చాలారోజులతరవాత మనసుకు పట్టింది.
తండ్రీకొడుకుల మధ్యఅనుబంధాలు వాచ్యంగా ప్రకటితమవ్వటం మన సమాజంలో తక్కువనిపిస్తుంది.’చీకటి గదులు’ నవలలో ఈ సంబంధాలు, అనుబంధాలు ‘ఘనీభవించటం’ గురించి చదివినది గుర్తుంది.ప్రేమ వ్యక్తపరచటం,పిల్లల్ని లాలించటం పెద్దరికానికో,గంభీరతకో తగిందికాదని నా చిన్ననాటి సమాజంలో ఒక నమ్మకమేమో.

బలరాజ్ సహానీ నటించిన సినిమాలు సంఖ్యాపరంగా తక్కువే. నేను చూసిన అతని సినిమాలలో (పదిలోపు ) దేనిలోనూ నిరుత్సాహపరచలేదు. గ్రామీణ భారతీయునికి అచ్చమైన ప్రతిరూపం అనిపిస్తాడు. బంధువర్గంలో మనసుకు నచ్చిన మనిషి లాఉంటాడు. ఈ పాటలో అతను కొడుకు(?) ను ఆడిస్తూ పాడుతున్నాడు.

బలరాజ్ సహనీ కీ నేపధ్య గాయకుడిగా మన్నడే మినహా ఎవరినీ నేనూహించలేను. ఆయె మేరీ ప్యారే వతన్(కాబూలి వాలా),తూ ప్యార్ కా సాగర్ హో(సీమా),యె మేరె జొహర్ జబి తుఝె మాలూమ్ నహి(వక్త్), తుఝే సూరజ్ కహు యా చందా(ఎక్ ఫూల్ దో మాలి), ధర్తి కహే పుకార్ కె (నేపధ్యగీతం,దో భిగా జమిన్ )నాకు తెలిసినవి. ఐదు దశాబ్దాలు పైగా చిత్రరంగంలో ఉండి మన్నాడే పాడిన పాటలు కంపారటివ్ గా తక్కువ కావచ్చుకాని, సక్సెస్ శాతం లెక్కిస్తే చాలా ఎక్కువ. వాటిలో ఫిలసాఫికల్, శాస్త్రీయ , జానపద ఛాయలున్న పాటలు అధికం.
సంగీత దర్శకుడు రవి గురుదత్, బిఽఅర్. చోప్రాలను మినహాయించి పెద్ద బానర్లకు పనిచేసింది తక్కువ. చేసిన వాటిలోజనరంజకమైనవి చాలానే ఉన్నాయి. నాకు గుర్తుండిపోయిన అతని ఆఖరి హిందీ సినిమా ‘నిఖా’(1983). చిత్రంగా మళయాళ చిత్రాలకు సంగీతదర్శకుడై ‘బాంబే రవి’ పేరుతోచాలా సినిమాలకు పనిచేశాడు.
వైశాలి, సరిగమలు పేరుతో తెలుగులో వచ్చిన డబ్బింగు సినిమాలకు అతనే సంగీతదర్శకుడు.’ చౌద్వీ కా చాంద్ హో’ పాట చేసినాయనే ‘స్వర రాగ గంగా ప్రవాహమే’ అని తెలుగు పాట చేశాడని తెలిసినపుడు ‘ఓ’ అనిపించింది.

“నిన్ను సూర్యుడననా చంద్రుడననా?
నిన్ను దీపమననా నక్షత్రమననా?
నా ప్రియమైన బాబు
లోకంలో నా కీర్తిని పెంచుతాడు

నేను ఎప్పటినుండి ఎదురుచూస్తున్నాను
నా వాకిటిలో ఎవరైనా ఆడుకుంటారని
పసినవ్వుల బదులుగా
నా జీవితం మొత్తం తీసుకో
నా చేతులలో లోకమంతా
నీతో పాటు ఊయలూగుతున్నది

నీ వేలుపట్టుకుని ఇప్పుడు
నీకు నడక నేర్పుతాను
నేను పెద్దవాడినైనాక
రేపు నాకు చెయ్యందించు
జీవితానికి నువ్వు వచ్చాక
ఒక కొత్త ఆసరా దొరికింది
ఈ లోకంలో నా తరువాత కూడా
నా పేరు నిలిచి ఉంటుంది
నిన్ను చూసినవారంతా
నా కొడుకువని చెప్పుకుంటారు
నాకు మరోమారు జీవితం
నీ రూపంలో దొరుకుతుంది”