Showing posts with label ganga aye kaha se. Show all posts
Showing posts with label ganga aye kaha se. Show all posts

Sunday, March 26, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-3 'గంగా అయే కహాసే? గంగా జాయే కహారే' 
Subbarao Mullapudi

‘కాబూలీవాలా’ రవీంద్రనాథ్ టాగోర్ రాసిన చిన్న కథ.దాన్ని మొదట బెంగాలీ లో తర్వాత హిందీ లో సినిమా గా తీసారు. కలకత్తా కు ఎండు పండ్లు,వెచ్చని దుస్తులు అమ్ముకోవటం కోసం వచ్చిన వర్తకుడు ‘రహ్మత్’. కూతురు ఆరోగ్యం కోసం చేసిన్ అప్పులు అతన్ని అఫ్గన్ దేశపు పొలం గట్లనుండి కలకత్తా వరకూ తీసుకొచ్చాయి. తన కూతురు జ్ఞాపకాన్ని ఒక పాత వార్తాపత్రిక మీద ఆ పిల్ల చేతి ముద్రగా తనతో తెచ్చుకున్నాడు.
కలకత్తా వీధుల్లో అతన్ని,అతని చేతిలో సంచిని పిల్లల్ని భయపెట్టటానికి తల్లులు వాడుకుంటున్నారు. ఆతను సంచిలో పిల్లల్ని ఎత్తుకుపోతాడని. నిజానికి ఆ సంచి కాదు, అతని హృదయం ఖాళీ గా ఉంది, అతని కూతురు వంటి చిన్న పిల్ల మున్నీ కోసం. ఆ పిల్ల లో తన కూతుర్ని చూసుకుంటున్నాడు రహమత్ .
కాబూల్ కి తిరిగి వెళ్ళాల్సిన సమయానికి అనూహ్య సంఘటనతో పధ్నాలుగేళ్ళు జైలు శిక్ష అనిభవించవలసి వస్తుంది. పర దేశం, ఒంటరి తనం, తన వూరిలో తల్లి లేని కూతురు పట్ల బెంగ,సమాచారం తెలుపలేని స్థితి. ఇంతకన్నా వేదన ఎక్కడ?
 ఈ సినిమా ఎందుకు నన్నింత ఆకర్షించింది? రవీంద్రుని కథా? బిమల్ రాయ్ దర్శక ప్రతిభా? పఠాన్ పాత్రలో ఒదిగిపోయిన బలరాజ్ సాహ్నీ నటనా? సలీల్ చౌధురి సంగీతమా? మన్నాడే,హేమంత్ ల గాత్రమా?..గుల్జార్,ప్రేమ ధవన్ల గీతాలా? ... కాదు.. వీటన్నిటి కలగలుపు.
ఇందులో పాట 'గంగా అయే కహాసే? గంగా జాయే కహారే' చాలా ఆలస్యం గా వినగలిగాను.తొలిసారి విన్నప్పుడు పెన్నిధి దొరికినట్లే అనిపించింది.అంతకుముందు హేమంత్ కుమార్ ను గాయకుడుగా పట్టించుకోలేదు.(ఆయన మంచి సంగీత దర్శకుడు). ఈ పాట అతని పాటలలో నా ప్రధమ ఎంపిక.
 గంగ ఎక్కడినుంది వస్తుంది? ఎక్కడికి పోతుంది? అనే ప్రశ్న తో మొదలై అనేక సత్యాలు చెబుతుంది.
“రాత్రి చీకటి ,పగటి వెలుతురు సంధ్యలో తేడాలు పోగొట్టుకుంటాయి”.
“విలువైన గాజు పాత్ర, మట్టి పాత్రల తేడాలు దప్పిక గొన్నప్పుడు సమసిపోతాయి.”
“అనేక పేర్లు, అనేక భాషలు, లక్షలాది రూపాలు,ముఖాలు...ప్రేమ నేత్రాలు తెరిచి చూస్తే అన్నిటా నేనే అన్నిటా నువ్వే.”
ఈ సినిమా వచ్చాక బెంగాలు పల్లెలలో, కోల్ మైన్స్ ప్రాంతాలలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే కాబూలీ వాలాల పట్ల ప్రజల ధృక్పథం మారిందని ఒకచోట చదివాను.కళల అవసరానికి అంతకంటె రుజువేముంటుంది?