Showing posts with label guru dutt. Show all posts
Showing posts with label guru dutt. Show all posts

Tuesday, May 9, 2017

తద్ బీర్ సే బిగిడీ హుయీ తక్ దీర్ బనాలే’

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-78

‘తద్ బీర్ సే బిగిడీ హుయీ తక్ దీర్ బనాలే’
(“ఉపాయంతో ,చెదిరిన తలరాత మార్చుకో)
‘బాజీ’ (1951) సినిమాలో గీతాదత్ పాడిన పాట.

పాటలు విని ఇష్టపడే క్రమంలో  చాలా పొరలుంటాయి.హిందీ పాటల విషయంలో పాటలో భావం లేదా అర్ధం తెలియకుండానే వినటం మొదలయ్యింది. పాట బాణీ, సంగీతం, గాయనీగాయకుల స్వరం ఇవి కొన్ని పొరలు.దృశ్యం,దృశ్యీకరణ,నటులు,నటన ఇవి మరికొన్ని పొరలు. పాట లోని భావం లేదా అర్ధం వీటన్నిటికన్నా లోతైన పొర.
అర్ధంతో నిమిత్తం లేకుండానే,చాలాకాలంగా వింటున్న,లిరిక్ పెదాలపై ఆడుతున్న కొన్ని పాటల అర్ధం తెలిసిన క్షణంలో అరే! ఇంతకాలం మిస్సయ్యామే అనిపిస్తుంది.
అలాంటి ఒక పాట ‘తద్ బీర్ సే బిగిడీ హుయీ తక్ దీర్ బనాలే’. తటస్థంగానో సందిగ్ధంగానో ఉన్న మనిషిలో కదలిక తెచ్చేలా, కొద్దిగా రెచ్చగొట్టేలా ఉన్న పాట. ఏ చరణానికి ఆ చరణం చూస్తే ఇండిపెండెంట్ గా కొటేషన్ లా అనిపిస్తుంది.

ఐతే సినిమాలో ఇది పాన/జూద శాల లో నర్తకి హీరోనుద్దేశించి పాడేపాట. పాట రాసింది సాహిర్ లూధియాన్వి.సంగీతకారుడు ఎస్. డి. బర్మన్. ఈ పాట అప్పటి మిగతా పాటలతో పోలిస్తే చాలా వరస, ఆర్కెస్ట్రా పరంగా ఆధునిమైనదిగా వినిపిస్తుంది.  


“ఉపాయంతో ,చెదిరిన తలరాత మార్చుకో
నీ మీద నీకు నమ్మకముంటే పందెంకాసుకో

లోకంచూపులకు అంత భయపడతావెందుకు?
న్యాయం నీవైపు వుంది, నిందను తలకెత్తుకో
నీ మీద నీకు నమ్మకముంటే పందెంకాసుకో

నీ కోసమే నువ్వు బ్రతికితే అదీ బ్రతుకేనా?
నువ్వు మరణించయినా మిగతావారిని బ్రతికించు
నీ మీద నీకు నమ్మకముంటే పందెంకాసుకో

పడవ తెడ్లు విరిగిపోతే మనం ఓడినట్టా?
చేతులనే తెడ్లు గా మార్చుకో
నీ మీద నీకు నమ్మకముంటే పందెంకాసుకో”