సంగీత దర్శకుడు రవి కృషికి గుర్తింపు చౌద్వీ క చాంద్ సినిమాతో లభించింది. మహమ్మద్ రఫి -రవి (రవి శంకర శర్మ) కాంబినేషన్ లో అజరామరమైన గీతాలు కొన్ని వచ్చాయి.
నిర్మాత బి ఆర్ చోప్రా , సంగీత దర్శకునిగా రవి ప్రోత్సహించాడు. బి ఆర్ సినిమాలకు రఫీ చాలాపాటలు పాడాడు.
ఐతే బి ఆర్ చోప్రా కు రఫీ కి విబేధాలు వచ్చాయి. దానికి కారణాలు వివిధరకాలు వినిపిస్తాయి. ఒక పాటలో తన సహ గాయకుడుగా 'మహేంద్ర కపూర్' ను రఫీ వద్దన్నారని, దానికి బి ఆర్ అంగీకరించలేదని ,అందువల్ల విబేధాలు వచ్చాయన్నది ఒక వెర్షన్.
మహేంద్ర కపూర్ గాత్రం తొలినాళ్ళలో రఫీ గాత్రానికి దగ్గరగాఉండేది.(కొన్ని మహేంద్ర కపూర్ పాటల్ని రఫీ పాటలని శ్రోతలు భ్రమపడటం నాకు తెలుసు). అందువల్ల ఇద్దరు కలిసి పాడితే వైవిధ్యం ఉండదనేది రఫీ వాదనగా చెబుతారు. ఏదిఏమైనా చివరకు బి ఆర్ చోప్రా , మహేంద్ర కపూర్ ను తన సంస్థ ద్వారా ప్రోత్సహమిచ్చాడు. రవి ఒక రకంగా వారి ఆస్థాన సంగీతదర్శకుడు. అలా రవి- మహేంద్ర కపూర్ కాంబినేషన్లో చాలానే పాటలు- మంచిపాటలు వచ్చాయి.
హమ్ రాజ్ సినిమా (బి ఆర్ చోప్రా-సాహిర్ లూధియాన్వి- రవి- మహేంద్రకపూర్ ల కాంబినేషన్) లో ఇద్దరు హీరో లకు (రాజ్ కుమార్ , సునీల్ దత్ ) కు నేపధ్య గానం మహేంద్రకపూర్ చేయటం హమనార్హం.
నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-127 `మన్ రె తూ కాహె ధీర్ ధరె` (మనసా ! ఎందుకు ధైర్యాన్ని కూడగట్టుకోవు?) `చిత్ర లేఖ` సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట. సాహిర్ లూధియాన్వి రచన, రోషన్ సంగీతం. నాకు ఆలస్యంగా దగ్గరైనపాట. రేడియో లో ఎక్కువగా వినపడేదికాదు.పాట లలితమైన పదాలతో సాగుతుంది. ఎక్కడా ఉర్దూ పదాలులేవు. ఇది సాహిర్ లూధియాన్వి రచనాశైలి కి భిన్నమైనది. బహుశా సినిమా కథ ప్రాచీన భారతానికి చెందినది కావటం వల్ల కావచ్చు.... ఐతే పాటలో నేను సాహిర్ ను పట్టుకున్నాను. సాహిర్ రాసిందే`బర్నింగ్ ట్రెయిన్ ` సినిమాలో జనరంజకమైన ఖవ్వాలీ ఉంది. జీవితాన్ని రైలు ప్రయాణంతో పోలుస్తూ సాగుతుందది.జీవిత ఆనందాన్ని అనుభవించమని చెబుతుంది. అందులో ''జో భీ జిత్నా సాథ్ దే ఎహసాన్ హై.., (ఎవరైనా మీతో కలసిగడిపినదే, వారు మీకు చేసిన ఉపకారం) అని ఒక పాదం ఉంది. అదే అర్ధం వచ్చే ఒక పాదం `మన్ రె తూ కహే` లోనూ ఉంది. అది `ఉత్నా హి ఉపకార్ సమఝో కోయి జిత్నా సాథ్ నిభా దే` (ఎంత వరకూ తోడునడచారో అంతమేరా ఉపకారం చేసారనుకో!) `మన్ రే తూ కాహే ` విషాద భరితమైన పాట. అందులో చెప్పిన తత్వమూ, ఎంతో ఆనందకరంగా సాగే `పల్ దో పల్ కా సాథ్ ` లో చెప్పిన తత్వమూ ఒకటే కావటం ఆసక్తికరం.
''మనసా ! ఎందుకు ధైర్యాన్ని కూడగట్టుకోవు? నువ్వు మోహించే తను నిర్మోహి, మోహం తెలియదు
జీవితపు పొద్దు పొడుపు ,పొద్దు కుంగులను ఎవరాపగలరు? రంగును పహరా కాసేదెవరు ,అందాన్ని బంధించేదెవరు? ఎందుకు ఇంత యత్నం చేస్తావు?
ఎంత వరకూ తోడునడచారో అంతమేరా ఉపకారం చేసారనుకో! స్వప్నమనేది జనన మరణాల కలయిక, ఆ స్వప్నాన్ని మరచిపో! నీతో కలిసి ఎవరూ మరణించరు''
నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-125 “బాబుల్ కి దువాయే లేతీ జా,జా తుఝ్ కో సుఖీ సన్ సార్ మిలీ” “తండ్రి ఆశీస్సులు తీసుకొని వెళ్ళు,వెళ్ళు ,నీకు అనందకరమైన జీవితం దొరుకుతుంది)
‘నీల్ కమల్ ‘ సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట. సాహిర్ లూధియాన్వి రచన ,రవి సంగీతం. ...
కూతురు వివాహమై అత్తింటికి వెళుతుంది. తండ్రి వీడ్కోలు పలుకుతున్నాడు.పెఌ ని కళ్యాణమనీ అంటారు. అంటే ఆనందకరమైదని. ఐతే పెఌ వేదనకూ గురిచేస్తుంది. సొంత గడప వదిలి పరాయి గడప తొక్కిస్తుందది. కొత్తప్రపంచంలో కూతురెట్లా ఇముడుతుందోనని తండ్రికి ఎంతో భయం. అక్కడ కూతురు జీవితం ఎలాగడవాలని తండ్రి ఆశ పడుతున్నాడో ఈ పాట చెబుతుంది. ఎంత ఆశో అంత భయమూ పాటలో కనపడుతుంది.
తండ్రి గా బలరాజ్ సాహ్ని కూతురుగా వహీదారెహ్మాన్ కనిపిస్తారు.బలరాజ్ సాహ్ని ఎప్పుడు నటనాపరంగా నిరుత్సాహపరచాడు? ఈ సినిమాలోనూ /పాటలోనూ గుండెల్ని తడుపుతాడు. సాధారణంగా బలరాజ్ సాహ్ని పాటంటే ‘మన్నాడే’ గుర్తుకొస్తాడు. ఐతే ఇది నేపధ్య గీతం. దీనిని ఎంతో కరుణరసాత్మకం గా రఫీ పాడారు.
“ తండ్రి ఆశీస్సులు తీసుకొని వెళ్ళు వెళ్ళు ,నీకు అనందకరమైన జీవితం దొరుకుతుంది
కన్నవారిల్లు నీకు ఎప్పుడూ గుర్తురాకుండాలి అత్తవారింట అంత ప్రేమ దొరకాలి
మృదువుగా నిన్ను పెంచాను మొగ్గలా, పువ్వులా
చిన్నతనంలో ఉయ్యలలూపాను నా చెతుల్ని ఉయ్యల చేసి
నా తోటలో నాజూకైన కొమ్మా! అనుక్షణం నీకు వసంతమవ్వాలి
, నీ భాగ్యం నిన్ను ఏ ఇంటితో కలిపిందో ఆ ఇంటిలో సదా నీ మాట నడవాలి
పెదవులపై నవ్వుల వెలుగులు పూయాలి తలపై ఆనందపు కిరీటం నిలవాలి
ఎన్నటికి ఆరనిజ్యోతి వంటి అలంకరణ నీది కావాలి
నీ జీవన ఘడియలు చల్లని నీడలో ప్రశాంతంగా గడవాలి
ఏనాడూ నీ కాలు కి ముల్లుకూడా గుచ్చరాదు
నీ ఇంటి ద్వారం కలిసే దారికి కూడా దుఃఖమనేది దూరంగా ఉండాలి”
నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు -100
1.మై పల్ దో పల్ కా శాయర్ హు, 2.మై హర్ ఎక్ పల్ కా శాయర్ హు
( నేను ఒకటి రెండు క్షణాలు నిలిచిఉండే కవిని) ( నేనుప్రతిక్షణం నిలిచిఉండే కవిని)
కభీ కబీ సినిమాలో ముకేశ్ పాడిన పాట. సాహిర్ లూధియాన్వి రచన, ఖయ్యామ్ సంగీతం.
ప్యాసా ,కభీ కభీ , రెండు సినిమాలూ సినీ ప్రేమికుల్ని, సినీ సంగీత ప్రేమికుల్నీ అలరించాయి. రెంటికీ కొన్ని సారూప్యాలు ఉన్నాయి. రెండు సినిమాల్లోనూ కథానాయకులు కవులు. ఇద్దరూ చదువుకునే రోజుల్లో ప్రేమలో పడ్డారు. ఇద్దరి ప్రేమ విఫలమయ్యింది. ఇద్దరి జీవితాలలోనూ తర్వాతి రోజుల్లో పాత ప్రేమికలు తారసపడ్డారు. ఐతే తర్వాత వారు సాగిన దారులు వేరు.
రెండు సినిమాలకు సాహిత్యం ‘సాహిర్ లూధియాన్వి’దే.నిజజీవితలో భగ్న మనస్కుడైన ‘సాహిర్ లూధియాన్వి’ కొన్ని పాటల్లో తాను నిజంగానే ప్రవేశిస్తాడు. కథానాయకుడు కూడా తనవంటి కవి ఐనప్పుడు ,పాత్ర మనసిక స్థితిలో కూడా సామాన్యత ఉన్నపుడు ‘సాహిర్ ‘ తనే ఆ పాత్ర ఐపోయాడు. ‘సాహిర్’ అలా పాత్రగా మారి సాహిత్యం అందించిన ఈ రెండు సినిమాలూ రెండు కళాఖండాలు గా నిలిచిపోయాయి.
‘ప్యాసా’ విషాదాంతం అనలేము ,అలాగే ప్రమోదాంతం అనలేము. చివర్లో కథానాయకుడు తన ప్రపంచాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు.
కభీ కభీ లో కథానాయకుడు ప్రేమను పొందలేని చోట ఆగిపోలేదు. అతనిది మరీ ప్రత్యేక ప్రపంచం కాదు. సమాజంతో మరీ ఫిర్యాదు లేదు.వేరే జీవితాన్ని నిర్మించుకున్నాడు. తండ్రి వ్యాపారాన్ని తను చూసుకుంటున్నాడు. పెళ్లి చేసుకుని కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు.
తన తొలినాళ్ళలో జీవితం పట్ల అతని ఆలోచనల్ని అతను గానంచేసాడు. తన జీవితం తనది మాత్రమే అనుకున్నాడు. తనతో పాటు అది అంతమౌతుందనుకున్నాడు. తనున్న రెండు క్షణాల జీవితం ఎవరికీ పట్టనిదనుకున్నాడు. తనని ‘రిప్లేస్’చేసేవారితో తనకేమీ సంబంధం లేదనుకున్నాడు.
అప్పటి రోజుల్లో అతని గానం:
“రేపు కొత్త మొగ్గలు తొడుగుతాయి.రేపు కొత్త పువ్వులు నవ్వుతాయి
కొత్తనేలమీద,కొత్త పచ్చికపై కొత్త పాదాలు నడయాడుతాయి
అవి నన్ను పట్టించుకోవు.నేనూ వాటిని పట్టించుకోను
వాటి ఉదయ సాయంత్రాలలో ఒక లిప్త కాలమైనా నాదిగా ఎలా చేసుకోగలను?
నేనూ ఒకటి రెండు క్షణాలు నిలిచిఉండే కవిని
ఒకటి రెండు క్షణాల సంతోషం నాది,ఒకటి రెండుక్షణాలు ఉండే యవ్వనం నాది
నాకంటే ముందు ఎంతమంది కవులు రాలేదు ? వచ్చి వెళ్లిపోలేదు
కొందరు నిట్టూర్పులు విడిచి వెళ్ళారు కొందరు పాటలు పాడి వెళ్ళారు
వారూ ఒక్క క్షణపు కథలే, నాదీ ఒక్క క్షణపు కథే
ఇప్పుడు మీలో భాగాన్నినేను ,రేపు మీనుండి దూరమౌతాను.
రేపు వికసించే పాటల మొగ్గల్ని ఏరుకునేవారు మరొకరు వస్తారు
నాకంటే ఉన్నతంగాగా చెప్పేవారు, మీకంటే ఉన్నతంగా వినేవారు
రేపెవరో నన్ను గుర్తుచేసుకుంటారు. ఐనా ఎందుకు గుర్తుచేసుకోవాలి?
తీరికలేని ప్రపంచం నాకోసం తన కాలాన్ని ఎందుకు వృధా చేసుకుంటుంది?”
సినిమా చివరిలో ఒకతరంలోని వ్యక్తులు తమ తర్వాతతరం వారిలో తమని తాము చూసుకుంటున్నారు. అపుడు
వినిపించే పాట మొదటి పాట వరుసలోనే మరొక అర్ధంతో వినపడుతుంది.
జీవితమంటే ఒకరి జీవితం కాదు. అది రూపాలు మార్ర్చుకుంటూ వేరే వారిని వాహిక చేసుకుని కొనసాగుతుంటుంది అని చెప్పే పాట అది. జీవితానికున్న ‘కొనసాగింపు’ ను తన జీవితానుభవాలద్వారా కథానాయకుడు గమనించగాడని అనిపిస్తుంది.
“ ప్రతిక్షణం నిలిచిఉండే కవిని నేను
కలకాలం నిలిచి ఉండే కథ నాది
ఎల్లవేళలా ఉండే సంతోషం నాది
అనుక్షణం ఉండే యవ్వనం నాది
అనుబంధాల రూపం మారుతూ ఉంటుంది
బంధాల పునాదులు నాశనం కావు
స్వప్నాలు, ఆకాంక్షలు నాశనం కావు.
ఒక పువ్వులో నీ రూపం నిలుస్తుంది
ఒక పువ్వులో నా యవ్వనం ఉంటుంది
ఒక ముఖం లో నీ గుర్తులుఉంటుంది
ఒక ముఖంలో నా గుర్తులుంటాయి
నువ్వు నేను జీవన అమృతాన్ని
ఈ చేతులతో తాగాలి
వీరి గుండె చప్పుడులో నివాసముండాలి
వీరి శ్వాస లో జీవించాలి
నీ సోయగాల్ని ఒకరికివ్వు
నేను నా నమ్మకాన్ని ఒకరికిస్తాను
ని కోసమే చేసిన ఆలోచనలు
అన్నింటినీ దీవెనలు చేస్తాను.”
హమ్ దోనో సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట. జయ్ దేవ్ సంగీతం, సాహిర్ లూధియాన్వి రచన.
...
నా కవిత్వం ల్లో నేను దొరుకుతాను అంటాడు ‘తిలక్’ ‘అమృతం కురిసిన రాత్రి’ లో. నిజానికి చాలా మంది రచయితల్ని వాళ్ల రచనల్లో దొరకబట్టవచ్చు. ఐతే దేవానంద్, సాహిర్ లూధియాన్వి రాసిన తన సినిమా పాట ఒక దానిలో లో తనున్నానన్నాడు. ‘ఇట్ ఈజ్ మై ఫిలాసఫీ ఆఫ్ లైఫ్’ అని ఆ పాట నుద్దేశించి అన్నాడు. ఆ పాట ‘మై జిందగీ కా సాత్ నిభాతా చలా హువా’. సినిమా ‘హమ్ దోనో’.
ఇది దేవానంద్ సోదరుల సినిమా. సాధారణం గా వారి సినిమాలకు అప్పట్లో ఎస్. డి. బర్మన్ సంగీతమిచ్చేవారు. ఈ సినిమాకు మాత్రం బర్మన్ శిష్యుడు ‘జయ్ దేవ్’ సంగీత దర్శకుడు. ఈ సినిమాతోనే అతను తనను ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత సంఖ్యాపరంగా తక్కువైనా నిలిచిపోయే పాటలు చేశాడు.
హమ్ దోనో పాటలు ఇప్పటికీ రేడియో శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ పాట ‘జయ్ మాలా’ ప్రోగ్రామ్ లో ఎక్కువగా వినపడుతుంది. సినిమా నేపధ్యం మిలటరీ/ యుద్ధం కు చెందినది కావటం ఇందుకు కారణం కావచ్చు.పాట చూడటానికీ బాగుంటుంది.పాట కు తగిన ఆహార్యం అభినయం, కదలికలతో దేవానంద్ నటన పాట అర్ధం, మూడ్ ను తెరపై చూపింది.
సాహిర్ లూధియాన్వి మిగతా పాటలతో పోలిస్తే ఈ పాట తక్కువ, తేలికపాటి పదాలతో సాగింది.కాని చెప్పింది మాత్రం చాలా చిక్కనైనది.
దేవానంద్ పుస్తకం ‘రొమాన్సింగ్ విత్ లైఫ్’ చదివినప్పుడు ఈ పాట గురించి అతను అన్నది నిజమే అనిపించింది.
ఈ సినిమా పట్ల దేవానంద్ కు ప్రత్యేకమైన ఇష్టం ఉంది. దానికి సర్వకాలీనత ఉందనుకున్నాడు. అంచేతే ఆ సినిమా యాభై యేళ్ళ తర్వాత రంగులద్దాడు.
సినిమా కున్న సర్వకాలీనత సంగతి తెలియదుకాని ఈ పాటైకైతే అది ఉంది. పాట నిత్యనూతనమే.
“నేను జీవితంతో పాటే నడిచాను
ప్రతి ఆందోళననూ పొగలా ఊది వదిలాను
పాటలు విని ఇష్టపడే క్రమంలో చాలా పొరలుంటాయి.హిందీ పాటల విషయంలో పాటలో భావం లేదా అర్ధం తెలియకుండానే వినటం మొదలయ్యింది. పాట బాణీ, సంగీతం, గాయనీగాయకుల స్వరం ఇవి కొన్ని పొరలు.దృశ్యం,దృశ్యీకరణ,నటులు,నటన ఇవి మరికొన్ని పొరలు. పాట లోని భావం లేదా అర్ధం వీటన్నిటికన్నా లోతైన పొర.
అర్ధంతో నిమిత్తం లేకుండానే,చాలాకాలంగా వింటున్న,లిరిక్ పెదాలపై ఆడుతున్న కొన్ని పాటల అర్ధం తెలిసిన క్షణంలో అరే! ఇంతకాలం మిస్సయ్యామే అనిపిస్తుంది.
అలాంటి ఒక పాట ‘తద్ బీర్ సే బిగిడీ హుయీ తక్ దీర్ బనాలే’. తటస్థంగానో సందిగ్ధంగానో ఉన్న మనిషిలో కదలిక తెచ్చేలా, కొద్దిగా రెచ్చగొట్టేలా ఉన్న పాట. ఏ చరణానికి ఆ చరణం చూస్తే ఇండిపెండెంట్ గా కొటేషన్ లా అనిపిస్తుంది.
ఐతే సినిమాలో ఇది పాన/జూద శాల లో నర్తకి హీరోనుద్దేశించి పాడేపాట. పాట రాసింది సాహిర్ లూధియాన్వి.సంగీతకారుడు ఎస్. డి. బర్మన్. ఈ పాట అప్పటి మిగతా పాటలతో పోలిస్తే చాలా వరస, ఆర్కెస్ట్రా పరంగా ఆధునిమైనదిగా వినిపిస్తుంది.
'పల్ దో పల్ కా సాత్ హమారా' పాటలో ఒక పదం ఇది
( జీవితకాలపు జోడు కట్టాలనుకునేవారు నా దృష్టిలో పిచ్చివారు) ...
నలభై యేళ్ళ క్రితం.. "గులాబి పూలతోటలో,ఖవాలి తీపి పాటలో" అంటూ ఒక పాట మధ్యలో వచ్చింది. 'ఖవాలీ అంటే ఏమిటని మా పెద్ద తెలుగు మాష్టార్ని అడిగాను. పాఠాలగురించి కాకుండా పాటల గురించి అడుగుతున్నందుకు కోప్పడ్డాడు.తర్వాత ఖవాలి అంటే ఏమిటోకాదుగానీ రెండు తెలుగు ఖవాలీ పాటలు చెప్పాడు.అవి 'మేడలో ఉన్న చిలకమ్మా','స్నేహమేనా జీవితం'.తర్వాత హిందీ సినిమా ఖవాలీలు విన్నా తెరమీద చూసింది మాత్రం 'బర్నింగ్ ట్రెయిన్ ' సినిమాలో.ఆ పాట 'పల్ దో పల్ కా సాత్ హమారా'
'సూపర్ ఎక్స్ ప్రెస్ ' అనే ప్రతిష్టాత్మక రైలు తొలిసారిగా ఢిల్లీ నుండి బొంబాయి ప్రయాణం ప్రారంభించింది.అందులో మినీభారతదేశమనదగ్గ ప్రయాణికుల సముదాయం ఉంది. ఒక మహారాజ, వజ్రాల వ్యాపారి,స్మగ్లర్,ఒక పూజారి,స్కూలు పిల్లలతోక్రైస్తవ ఉపాధ్యాయని,తన బృందంతో ఒక సంగీతకళాకారిణి,కొత్తగాపెళ్ళైన జంట,టిక్కెట్టు లేకుండా ప్రయాణించే ఇద్దరు వ్యక్తులు,ఒక సిక్కు కుటుంబం,ప్రేమను తెంచుకున్న యువతి,పెళ్ళివద్దనుకుని నగలతో ఇంటినుండి పారిపోతున్న యువతి,ఆ నగలపై కన్నుపడ్డ దొంగ,మారువేషంలోఉన్న పోలిసు,రైలు సిబ్బంది ... వీరంతా విలాసవంతమైన ఆ కొత్త రైలు ప్రయాణాన్నీనుభవిస్తున్నారు.
ఐతే అప్పటికే ఆ రైలు కి బ్రేకులు ఫెయిలైఉన్నాయి.అదితెలిసిన కొందరు రక్షణకోసం ప్రయత్నిస్తున్నారు. అది తెలియని ప్రయాణికులు ఆనందగీతాలాపనలో ఉన్నారు.వారికి రాబోయే ప్రమాదంపట్ల సినిమా ప్రేక్షకులకున్న ఆదుర్దా వారికి లేదు. వారు పాడే పాటా సన్నివేశానికి తగిందే.
“ఒకటి రెండు క్షణాల ప్రయాణం మనది,ఒకటి రెండు క్షణాల స్నేహం మనది
ఈ మజిలీ లో కలిసినవారు తరువాతి మజిలీలో విడిపోతారు
ప్రతీ ఆనందం కొద్దిసేపటి అతిధి మాత్రమే...
మనసులోకి ప్రతి కోరికనూ తీర్చేసుకో
కళ్ళలోని చిలిపిదనం,పెదవులపైని వెచ్చదనం
ఇప్పటి మన కలయికలో ఉన్నాయి.రేపేమౌతుందో ఎవరికి తెలుసు?
ఈ క్షణం ఆనందమయమైన స్వర్గం.ఈ క్షణంలో జీవించు
ఈనాటి సుఖాలు వాస్తవాలు. రేపటి సుఖాలు కల్పితగాధలే.
జీవితం వేగంగాసాగే తుఫాను వంటిది.దానిని వెంటాడాలనుకోవడం పిచ్చితనం
కనపడని ఆనందాలకోసం హైరానా దేనికి?
గడచిపోయిన కాలం తిరిగివచ్చేనా?
అందరూ మొదట్లో దారితెలియనివారే
జీవితమంటే దారితెలుసుకోవటమే
మిత్రులారా నేను నమ్మిందిదే
ఎవరైనా మీతో గడిపిన కాలం వారు మీకు చేసిన ఉపకారం
జీవితకాలపు జోడు కట్టలనుకునేవారు
నా దృష్టిలో పిచ్చివారు
ఊగు (ఆడిపాడు) ..ఆనందించు
ఊపిరి ఉనంతవరకూ ఆడిపాడు ఆనందించు
ఆనందించడమే జీవితానికి ఇచ్చే మర్యాద.”
ఒక తెలుగు పాటలో శ్రీ శ్రీ అంటారు" నిన్న మరల రాదు, రేపు మనది కాదు..నేడే నిజం..నేడే సుఖం" అని.పాటలో చెప్పేది విన్నప్పుడు కాసేపు నిజమేగా అనిపిస్తుంది.ఈ ఆలోచనను ఎంతమాత్రం జీవితంలోకి స్వీకరించవచ్చు అనేది మనిషిమనిషికి మారుతూ ఉంటుంది.
-ముళ్ళపూడి సుబ్బారావు
'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-21 'చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్ నబీ బంజాయే హందోనో' 9 January ·
'చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్ నబీ బంజాయే హందోనో' పాట రేడియోలో బాగా వినపడేది. 'తిరిగి మనం అపరిచితులమైపోదాం పద ' ఇది పల్లవికి అర్ధం.విన్నతొలినాళ్ళలో ఇదేదో చిత్రంగా వుందే అనిపించేది. ఆట మధ్యలో ఆపేసి 'తూచ్ ' మళ్ళిమొదలుపెడదాం అన్నపుడూ, చెస్ లో పావుల్ని కలిపేసి మళ్ళీ మొదటినుంచి ఆడదామన్నపుడు ఈ పాట హమ్ చేయటం గుర్తుంది.
బి.ఆర్.చోప్రా అర్ధ శతాబ్దంపాటు హిందీ చిత్రపరిశ్రమలో ఉన్నాడు.దర్శకుడిగా,నిర్మాతగా అతని చిత్రాలు ఎక్కువభాగం విజయవంతమయ్యాయి.అతని చాలసినిమాల...కు సంగీత దర్సకుడిగా 'రవి 'పనిచేశాడు. రవి, గాయకుడు మహేంద్రకపూర్ తో ఎక్కువపాటలు పాడించాడు.వాటిలోనూ చాలా భాగం హిట్ అయ్యాయి. సాహిర్ లూధియాన్వి రాసిన పాటల్లో లోతైన భావాలు,అందమైన ఉర్దూ పదాల ప్రయోగం కనిపిస్తాయి. బి.ఆర్.చోప్రా సినిమా, రవి సంగీతం,మహేంద్రకపూర్ స్వరం.లూధియాన్వి రచన - ఇవి కలిసిన పాట గుమ్రా సినిమాలో 'చలో ఎక్ బార్ ఫిర్ సె ' ఆమె ఒకరిని ప్రేమించింది.ఆ ప్రేమ విషయంతెలియని ఆమే అక్క చనిపోతూ తన పిల్లలకోసం తన భర్తను పెళ్ళిచేసుకోమని కోరింది. ప్రెమను వదులుకుని ఆమె బావను పెళ్ళిచేసుకుంది. తరువాత ఆమె ప్రేమించినతను తిరిగి ఆకుటుంబంలోకి వచ్చాడు. పాట సందర్భం ఇది. మనమిద్దరం తిరిగి అపరిచితులమైపోదాము పద నీ సాన్నిహిత్యం పట్ల నేనేమీ ఆశ ఉంచుకోలేదు వేరే అర్ధాలు స్పురింపజేస్తూ నా వంక చూడకు మరిక నేనూ మాట్లాడేటప్పుడు నా మనసు చలించదు నీ చూపులు అవిదాచుకున్న బాధను తెలియనీవులే నిన్ను కుడా ఏవో చిక్కులు ముందుకు అడుగెయ్యనివ్వవు నన్నూ లోకులు అంటారు ఎవో ముసుగులు వేసుకున్నానని నా గతకాలపు తప్పిదాలు ఇక నా జతగాళ్ళు గడచిపోయిన రాత్రుల నీడలు నీతోనూ ఉంటాయి పరిచయమే సుస్తీ ఐతే దానిని మరచిపోవటమే మేలు బంధమే బరువైపోతే దానిని తెంచుకోవటమే మంచిది కథను ముగింపుకు తేవటం కష్టమైపోయిన దానిని అందమైన మలుపు తిప్పి వదిలెయ్యటం మంచిది.
జీవితంలో చాలాసార్లు కొన్ని సంఘటల్ని 'అన్ డు ' చేయాలనో ఎరేజ్ చేయాలనో బాగా అనిపిస్తుంది.అన్ డు చేయలేకపోయినా ఆ సంఘటనల జ్ఞాపకాల ప్రభావం పట్ల ప్రతిస్పందన మనచేతిలోనే ఉందికదా అని ఒక ఓదార్పు.
ప్రత్యేకంగా ఈ పాటలో చివరిభాగం
'వో అఫ్సానా జిసే అంజాం తక్ లానా న హో ముంకిన్
ఉసే ఏక్ ఖూబ్ సూరత్ మొడ్ దె కర్ ఛోడ్నా అచ్చా '
చాలా నచ్చుతుంది.
‘కభీ కభీ’ సినిమా ఏలూరు వేదరాజ్ థియేటర్ లో రి రన్ సినిమా గా వచ్చింది.82 లొ కావచ్చు.ఆ సినిమాలో ముఖేష్ పాటలు అప్పటికీ జనాల నోళ్ళలో నానుతూనే ఉన్నాయి. అమితాబ్,శశి కపూర్,రిషి కపూర్ వంటి తారల (తారామణులెవరో అప్పటికి నాకు అవసరముండేది కాదు)ఆకర్షణీయమైన పోస్టర్లు పిలుస్తుంటేకాదనగలమా? సినిమా మొదలయ్యింది.అప్పటి వరకూ చూసిన అమితాబ్ సినిమా లాంటిది కాదు.నడిచేకొద్దీ మూవీ నన్ను తనలో ఇమిడ్చేసుకుంది. నాకు తెలిసిన ముఖేష్ మూడు పాటలు, కిశోర్ ఒక్క పాట కాదు, మరో పాట నన్ను మెస్మరైజ్ చేసింది. సినిమాలో నాకు పరిచయంలేని పరిసరాలు.రోజంతా సూట్లలోనో,స్వెట్టర్లతోనో లేదా శాలువాలు కప్పుకొనో ఉండే మనుషులు.ఇంట్లోనే చలిమంట ఏర్పాట్లు.కుటుంబ సభ్యులంతా చాలా విశ్రాంతి గా కూర్చుని కాలక్షేపం చెయ్యడం. అదో కొత్త లోకం నాకు. అలాంటి ఇంటికి , గృహస్తుల కూతురు వయసున్న మరొ అమ్మాయి అతిధి గా వచ్చింది. ఆ అమ్మాయికి ఆ గృహిణికి ఏమి సంబంధమో మనకి తెలీదు. అతిధి ఉద్దేశిస్తూ సాగే పాట.. లతా మంగేష్కర్ స్వరం, వహీదా రెహ్మాన్ అభినయం. ఖయ్యాం సంగీతం, సాహిర్ లూధియన్వి సాహిత్యం. “మెరే ఘర్ ఆయే ఏక్ నన్ హి పరీ” ఇందులో కొన్నిపదాలు ‘షహద్’,’మిథాస్’,’ఇతర్’, ‘మెహకాస్’ లాంటివి విన్నపుడు ఏదోహాయి కలుగుతుంది. పాట అర్ధం ఇలా సాగుతుంది. “లేతరెక్కల పక్షి కూన నా ఇంటికి వచ్చింది అందమైన వెన్నెల రథం సవారీ లో.. తన పలుకుల్లో తేనె వంటి తీయదనం తన శ్వాస లో అత్తరు వంటి పరిమళం..
తన రాకతో నా వాకిట్లో విచ్చుకున్న పూలు వసంతగానమాలపించాయి తనని ఒక సారి చూసినంతలోనే తనివితీరదు..కోరి కోరి వేలాది సార్లు చూస్తాను.. తననడిగా నువ్వెవరని నవ్వుతూ చెప్పింది.. నేను నీ ప్రేమను నీ మది లో ఎప్పుడు ఉంటూనే ఉన్నా ఇంటికి వచ్చాను మొదటి సారి.. అని” సినిమాలో అతిథి లాంటి వయసులో అప్పుడు విన్నాను. ఇప్పుడు అందులో గృహస్తు స్థితిలో ఉన్నాను.ఈ మధ్యకాలమంతా పాట నాతోనేవుంది.చదువుకోసం,వుద్యోగం కోసం దూరతీరాలో ఉన్న పిల్లలు వచ్చి నట్టింట్లో తిరిగే ప్రతిసారీ ఈ పాట గుర్తుకొస్తుంది.ఈ పాట విన్న ప్రతిసారి ఖాళీ ఇంటిని చూసి కళ్ళు తడిబారతాయి. మనకి ఉద్దేశం లేకపోయినా మన చర్యలు కొందరి బాధకుకారణమయ్యే అవకాశం ఉందన్న ఎరుకే ఉంటే ఎంత బాగుండును?