Showing posts with label mere apne. Show all posts
Showing posts with label mere apne. Show all posts

Thursday, April 27, 2017

'కోయీ హోతా జిస్కో అప్నా '


'కోయీ హోతా జిస్కో అప్నా '
నావాళ్ళు అనుకునేవాళ్ళు ,ఎవరైనా ఉంటే బాగుండును
(మేరే అప్నే సినిమాలో పాట గుల్జార్ రచన, సలీల్ చౌధరి సంగీతం)

కొన్ని అభిమానాలు అనుకోకుంకుండానో,యాదృచ్చికంగానో కలుగుతాయనిస్తుంది. వెతికితే వాటికి కారణాలు కనిపిస్తాయేమో.


నాకు పదిహేనేళ్ళ వయసపుడు వినోద్ ఖన్నా సినిమాలు చూడటం మొదలు పెట్టాను. నేనతని అభిమానినా అంటే అప్పుడు ఔననే చెప్పాలి.


కనీసం పది సంవత్సరాలు (80- 90) అతనివి పాతవి కొత్తవి అనేక సినిమాలు చూసి ఆనందించాను. ఇప్పటి వరకూ అతనికి సంబంధించిన న్యూస్ ను ఫాలో ఔతూనే వున్నాను.
అతని నటజీవితానికి,వ్యక్తిగత జీవితానికి, రాజకీయ జీవితానికి సంబంధం వుండే వుంటుంది. నావరకు వినోద్ ఖన్నా అంటే డెబ్భైల మొదలుకుని 90 వరకూ సాగిన అతని తెర జీవితమే. అది నాకు ఆనందాన్ని ఇచ్చింది. మేరె అప్నే,కచ్చే ధాగే, ఇంతిహాన్,అమర్ అక్బర్ ఆంథొని,కుర్బాని సినిమాలలో అతని పాత్రలతో ఎక్కడో ఐడెంటిఫై ఔతానని పిస్తుంది.


అతని నట జీవితాన్ని చూస్తే రెండు ఫేజ్ లు కనిపిస్తాయి.
సపోర్టింగ్ ఆర్టిస్ట్ గామొదలై,విలన్ గా  నటించి ,హీరోగా మారి హఠాత్తుగా నటనను విరమించుకున్నంతవరకూ ఉన్నకాలం, ఐదేళ్ళ విరామమ్ తర్వాత తిరిగి నటించిన కాలం.


70 కి అటూ ఇటుగా సినిమాలలోకి వచ్చి  కమర్షియల్ సినిమాల్లో రాణిస్తూనే మేరే అప్నే,అచానక్,మీరా వంటి ఆఫ్ బీట్ సినిమాల్లో నటించి దర్శకుల నటుడనిపించుకున్నాడు.


మల్టిస్టారర్ సినిమాలలో సునీల్ దత్,ధర్మేంద్ర,రాజేశ్ ఖన్నా,జితేంద్ర,అమితాబ్ బచన్ వంటి నటులతో తెర పంచుకున్నాడు.


సునీల్ దత్ తన సొంత సినిమా రేశ్మా ఔర్ షేరా సినిమాలో సపోర్టింగ్ కారక్టర్ ఇచ్చి వినోద్ ఖన్నా ను ప్రోత్సహించాడు.తరువాత వారిద్దరు నెహ్లే పె డెహ్లా, డాకూ ఔర్ జవాన్ వంటి సినిమాల్లో నటించారు.


ధర్మేంద్ర తో నటించిన సినిమాలలో మొదట్లో విలన్ గాను తరువాత సమానమైన పాత్రలలోనూ నటించాడు. వారు నటించిన సినిమాలలో ఎమోషనల్  కంటెంట్ ఎక్కువ వుండేది. మొదటగా వారు కలిసి నటించిన మేరా గావ్ మేరా దేశ్ సినిమా ఒక మైలు రాయి లా నిలిచింది. వినోద్ ఖన్నా పునఃప్రవేశం తర్వాతకూడా వారుబట్వారా, క్షత్రియ    వంటి  ఆక్షన్ ఓరియంటెడ్ సినిమాల్లోనే కనిపించారు.


కబీర్ బేడి తో అతను కలసి నటించిన ‘కచ్చే ధాగే ‘ సినిమాకు కొందరు వీరాభిమానులున్నారు.


డెభై ఐదు -డెబ్భై ఎనిమిది మధ్య అమితాబ్ తో కలిసి వినోద్ ఖన్నా ఎనిమిది సినిమాల్లో నటించాడు. జమీర్,పర్వరిష్, అమర్ అక్బర్ ఆంథనీ ,ఖూన్ పసీనా, ముకద్దర్ కా సికందర్ ఇలాంటి సినిమాలు అన్నీ విజయంసాధించాయి.


86/87 లో తిరిగి చిత్రరంగ ప్రవేశం చేసి మరో పదేళ్ళు కథానాయక పాత్రలు ధరించాడు.అప్పుడు వచ్చిన సినిమాలలో ఇన్సాఫ్,సత్యమేవ జయతే వంటి హిట్లు ఉన్నాయి.కమల్ హసన్ ‘నాయకన్’ సినిమాను వినోద్ ఖన్నా తో అతని మిత్రుడు ఫిరోజ్ ఖాన్ నిర్మించాడు. కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా హిట్ అయ్యింది. మరో చెప్పుకోదగ్గ సినిమా ‘ యాష్ చోప్రా నిర్మించిన చాందిని’. అదే కాలంలో వచ్చిన మహేష్ భట్ సినిమా ‘జుర్మ్ ‘ కూడా మంచి గుర్తింపు పొందింది.


70 లలో వినోద్ ఖన్నా తో తన తరహా సినిమాలు తీసిన ‘గుల్జార్’  90లలో కూడా డైరెక్టర్ మూవీ అనదగ్గ ‘లేకిన్’ సినిమా తీశాడు.


తర్వాత రోజుల్లో వినోద్ ఖన్న చాలా సినిమాల్లో నటించినా అతనిదైన మార్క్ వాటిల్లో కనపడదు. తండ్రి తరహా పాత్రలలోకి మళ్లి కొన్ని సినిమాల్లోనూ,టివీ సీరియళ్లలోనూ కనిపించాడు.ఐతే అవేవీ నావంటి అభిమానుల్ని అలరించేవికావు.


ఈ రోజు (27/04/2017) తన డెబ్భైఒకటో సంవత్సరంలో అతను చనిపోయాడు.


1971 లో గుల్జార్ దర్శకత్వం లో వచ్చిన ‘మేరే అప్నే’ సినిమా అతనికి మంచి గుర్తింపు నిచ్చింది. అప్పటి నగరజీవితం,యువత ఆలోచనలు,నిరుద్యోగం, నేరప్రపంచం వైపు యువత చూపు వంటి విశయాలను చర్చించిందా సినిమా. అందులో పాట ఇది.


“నావాళ్ళు అనుకునేవాళ్ళు
ఎవరైనా ఉంటే బాగుండును
దగ్గరగా కాకున్నా దూరంగానైనా
ఎవరో నావాళ్ళు


కళ్ళకు నిద్రలేదు
అది కన్నీటిలో ఈదులాడుతుంది
రాత్రంతా కలల్లో మెలకువగా ఉంటాను
ఎవరో బాధ పంచుకొనేవారు
ఎవరో వెంట నడిచేవారు


మరచిపోయిన కొన్ని వాగ్దానాలు..  
గడచిపోయిన కొన్ని జ్ఞాపకాలు..
ఒంటరితనం రాత్రంతా వాటిని తిరిగి చెబుతుంది
ఏదో ఓదార్పు దొరికితే

ఎవరో నావారు దొరికితే”