Showing posts with label mere ghar aye ek nanhi pari. Show all posts
Showing posts with label mere ghar aye ek nanhi pari. Show all posts

Sunday, March 26, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-4 “మెరే ఘర్ ఆయే ఏక్ నన్ హి పరీ”
Subbarao Mullapudi
‘కభీ కభీ’ సినిమా ఏలూరు వేదరాజ్ థియేటర్ లో రి రన్ సినిమా గా వచ్చింది.82 లొ కావచ్చు.ఆ సినిమాలో ముఖేష్ పాటలు అప్పటికీ జనాల నోళ్ళలో నానుతూనే ఉన్నాయి. అమితాబ్,శశి కపూర్,రిషి కపూర్ వంటి తారల (తారామణులెవరో అప్పటికి నాకు అవసరముండేది కాదు)ఆకర్షణీయమైన పోస్టర్లు పిలుస్తుంటేకాదనగలమా?
సినిమా మొదలయ్యింది.అప్పటి వరకూ చూసిన అమితాబ్ సినిమా లాంటిది కాదు.నడిచేకొద్దీ మూవీ నన్ను తనలో ఇమిడ్చేసుకుంది. నాకు తెలిసిన ముఖేష్ మూడు పాటలు, కిశోర్ ఒక్క పాట కాదు, మరో పాట నన్ను మెస్మరైజ్ చేసింది.
సినిమాలో నాకు పరిచయంలేని పరిసరాలు.రోజంతా సూట్లలోనో,స్వెట్టర్లతోనో లేదా శాలువాలు కప్పుకొనో ఉండే మనుషులు.ఇంట్లోనే చలిమంట ఏర్పాట్లు.కుటుంబ సభ్యులంతా చాలా విశ్రాంతి గా కూర్చుని కాలక్షేపం చెయ్యడం. అదో కొత్త లోకం నాకు.
అలాంటి ఇంటికి , గృహస్తుల కూతురు వయసున్న మరొ అమ్మాయి అతిధి గా వచ్చింది. ఆ అమ్మాయికి ఆ గృహిణికి ఏమి సంబంధమో మనకి తెలీదు.
అతిధి ఉద్దేశిస్తూ సాగే పాట.. లతా మంగేష్కర్ స్వరం, వహీదా రెహ్మాన్ అభినయం. ఖయ్యాం సంగీతం, సాహిర్ లూధియన్వి సాహిత్యం.
“మెరే ఘర్ ఆయే ఏక్ నన్ హి పరీ”
ఇందులో కొన్నిపదాలు ‘షహద్’,’మిథాస్’,’ఇతర్’, ‘మెహకాస్’ లాంటివి విన్నపుడు ఏదోహాయి కలుగుతుంది.
పాట అర్ధం ఇలా సాగుతుంది.
“లేతరెక్కల పక్షి కూన నా ఇంటికి వచ్చింది
అందమైన వెన్నెల రథం సవారీ లో..
తన పలుకుల్లో తేనె వంటి తీయదనం
తన శ్వాస లో అత్తరు వంటి పరిమళం..
మంచులో తడిసిన గులాబీల్లాటి పెదవులు
పండిన ఎర్రటి దానిమ్మల్లాటిబుగ్గలు..
తన రాకతో నా వాకిట్లో విచ్చుకున్న పూలు వసంతగానమాలపించాయి
తనని ఒక సారి చూసినంతలోనే తనివితీరదు..కోరి కోరి వేలాది సార్లు చూస్తాను..
తననడిగా నువ్వెవరని
నవ్వుతూ చెప్పింది.. నేను నీ ప్రేమను
నీ మది లో ఎప్పుడు ఉంటూనే ఉన్నా
ఇంటికి వచ్చాను మొదటి సారి.. అని”
సినిమాలో అతిథి లాంటి వయసులో అప్పుడు విన్నాను. ఇప్పుడు అందులో గృహస్తు స్థితిలో ఉన్నాను.ఈ మధ్యకాలమంతా పాట నాతోనేవుంది.చదువుకోసం,వుద్యోగం కోసం దూరతీరాలో ఉన్న పిల్లలు వచ్చి నట్టింట్లో తిరిగే ప్రతిసారీ ఈ పాట గుర్తుకొస్తుంది.ఈ పాట విన్న ప్రతిసారి ఖాళీ ఇంటిని చూసి కళ్ళు తడిబారతాయి.
మనకి ఉద్దేశం లేకపోయినా మన చర్యలు కొందరి బాధకుకారణమయ్యే అవకాశం ఉందన్న ఎరుకే ఉంటే ఎంత బాగుండును?