Showing posts with label mother india. Show all posts
Showing posts with label mother india. Show all posts

Saturday, October 21, 2017

“న మై భగ్ వాన్ హు న మై సైతాన్ హు”

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-107
“న మై భగ్ వాన్ హు న మై సైతాన్ హు”
(“నేను దేవుణ్ణీ కాను దెయ్యాన్నీ కాను)
మదర్ ఇండియా లో పాట.షకీల్ బదాయుని రచన, నౌషాద్ సంగీతం, మహమ్మద్ రఫీ గానం
“లోకమిలాగే ఉంటుంది. దీనికి తగ్గట్టుగా మనం బ్రతకాలి “ అని కొందరనుకుంటారు. “లోకమిలా ఎందుకుంది? ఇందులో బ్రతకటానికి ఏంచేయాలి?” అనుకునే వారూ ఉంటారు. ‘ మదర్ ఇండియా’ సినిమాలో ఇద్దరి అన్నదమ్ముల ఆలోచనలు ఇలానే ఉన్నాయి. 
తమ్ముడికి రేగే ప్రశ్నలకు సమాధానం దొరకటంలేదు. అతనెలా బ్రతకాలో చెబుతున్నారు కాని అలాగే ఎందుకో చెప్పట్లేదు. ఈ పాటతో తనని తాను నిర్వచించుకుంటున్నాడు. ఐతే వినేవారికి అది తమందరి సంబంధించిన నిర్వచనమని అనిపిస్తుంది.
అతడు నటనలేని, భావాలని అణిచిపెట్టుకోని మనిషి. మంచి ముందు మొహం దాస్తాడు,సిగ్గుపడతాడు. దేవాలయాలదగ్గర సాధువుల చిలుముతో సమాధానపడడు. జూదం లాంటివి అతన్ని కట్టిపడేయవు. ఎద్దులా పొలంలో కష్టపడటం ,తీగపై నడకా, అకాశంలో గెడపై వేలాడటం ఇవన్నీ పొట్టనింపుకునే జాలం లో భాగాలని చెబుతాడు. అడ్డదిడ్డమైన వ్యవహారం అతన్ని గందరగోళపరస్తుంది.
“నేను దేవుణ్ణీ కాను దెయ్యాన్నీ కాను
లోకం ఇష్టమొచ్చింది అనుకోనీ ,నేను మాత్రం మనిషిని.
నాలో మంచీ ఉంది చెడ్డా ఉంది
మనసులో ఎంతో మురికి ఉంది కొద్దిగా స్వచ్చతా ఉంది
కొద్దిగా నమ్మదగినవాడిని కొంచెం మోసకారిని
లోకం ఇష్టమొచ్చింది అనుకోనీ ,నేను మాత్రం మనిషిని.
నేను రాజుని కాను నాతలమీద కిరీటంలేదు
ఐనా నా బ్రతుకులో భూమికున్నంత ఓర్పు ఉంది
పైకి పేదవాడిని మనసులో ధనికుడిని
లోకం ఇష్టమొచ్చింది అనుకోనీ ,నేను మాత్రం మనిషిని.
జీవితమనే పాటకి స్వరమూ లేదు తాళమూ లేదు
లోకమంతా గందరగోళంగా భుక్తి అనే వలలో ఉంది
ఎలాంటి అన్యాయమిది నాకు చిత్రమనిపిస్తుంది.
లోకం ఇష్టమొచ్చింది అనుకోనీ ,నేను మాత్రం మనిషిని. 

Wednesday, March 29, 2017

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-12:'దునియా మె అగర్ ఆయే హై తో జీనాహి పడేగా'
అల్బర్ట్ కాము తన ‘మిత్ ఆఫ్ సిసిఫస్ ' వ్యాసాల్లో ఒకచోట జీవితం అసంబద్ధ్తతో కూడుకున్నదని మనిషి అనుభవంలోకి వస్తుంది.తర్వాత ప్రశ్న ..మరి జీవితంకొనసాగించదగిందేనా? అంటాడు. మరి మార్గాంతరాలు? ...అతను చర్చించేవి జీవేచ్చను రేకెత్తించేవిగా అనిపించవు.
పై దానికి సమాధానమా అన్నట్టుకొనసాగించాల్సిందా లేదా అన్న ప్రశ్నకు తావే లేనట్టు, ‘మదర్ ఇండియా’ లోని ఈ పాట చెబుతుంది.
అసంబద్ధతకు కష్టాలకు సంబంధం, కారణాలు అన్వేషించడం, ప్రత్యామ్నాయం ఆలోచ...ించడం ..ఇవేవీ లేకుండా కర్మలో మనస్పూర్తిగా ఇన్వాల్వ్ ఔతూ బ్రతకడం ఒక జీవితవిధానమే. దీనికి జీవితం పట్ల చాలా మమకారంఉండాలి.
స్వాతంత్ర్య పూర్వ, అనంతర మూడు,మూడున్నర దశాబ్దాల గ్రామీణభారతానికి సంబంంధీంచిన ఒక అధ్బుత చిత్రరూపం మదర్ ఇండియా సినిమా.ఎంత అద్భుత కళాఖండమో అంత విషాదభరితం. ఎంత అంటే రెండోసారి చూసేటప్పుడు నీళ్ళునిండినకళ్ళతో దృశ్యం మసకబారేంత.
కౌమారం నుండి ముదిమి అయ్యేవరకూ ఒక స్త్రీ జీవనయానంఇది. గ్రామీణ భారత మహిళ ఆత్మను,ఒక రకంగా గ్రామీణ భారత అత్మను గొప్పగా తెరపై ఆవిష్కృతంచేసిందీసినిమా. అంతకు పూర్వం తానే తీసిన 'ఔరత్ ' సినిమాని కొన్ని మార్పులతో మహబూబ్ ఖాన్ తిరిగి మదర్ ఇండియా గానిర్మించాడు.
కథానాయిక రాధగా నర్గీస్ నటించింది. ,ఒక మనిషిగా,ఒక స్త్రీగా ఆ పాత్రపడని కష్టం లేదు. ఇంట్లో,పొలంలోశ్రమ, అప్పుల వూబి,సంతానం, అశక్తుడైన భర్త వియోగం,వరదలు,లైంగికవేధింపులు.....ఐనా రేపటిమీద ఆశ. క్రీస్తు శిలువను మోసినట్టు నాగలి మోస్తూ,పసివాళ్ళతో వ్యవసాయం.అలుపెరగని పోరాటం.ఏదో భరోసా ..నమ్మకం...శ్రమ ఇవన్నీ తమని గట్టెకిస్తాయని ఓరిమితో ఎదురుచూపు.
అలాంటి సందర్భంలో ఈ పాట.
'దునియా మె అగర్ ఆయే హై తో జీనాహి పడేగా'. లతా మంగేష్కర్, మీనా మంగేష్కర్ ఉషామంగేష్కర్ లతో కలసి పాడింది. సంగీతకారుడు నౌషాద్,గీతకారుడు షకీల్ బదాయుని.
“ఈ లోకానికి వచ్చినాక ..జీవించితీరాల్సిందే
జీవితమొక విషమైనా తాగాల్సిందే
కష్టాలలోపడుతూవున్నా తిరిగి లేవాల్సిందే
కాలిపోతూవున్నా నిప్పుల్లో నడుస్తూ ఉండాల్సిందే
దుఖాన్ని ఇచ్చినవాడే వాటిని తొలగిస్తాడు
మర్యాదతో బ్రతికినవారే మర్యాదతో మరణిస్తారు
దేవుడున్నాడు నీతో.. గుండెలో బాధను మరచిపో
శ్రమించే వారికి కష్టమైన పనంటూ ఏముంది
ఎవరికైనా చేసినదానిబట్టే ప్రతిఫలముంటుంది.”
కష్టాలకు పరాకాష్ట గా ఆమె నాగలి లాగుతుంటే పసివాళ్ళు మేడిపడుతుంటారు. పొలంలోనే వంటచేస్తూ,పిల్లల్ని సంబాలించుకుంటూ...సెల్ఫ్ మోటివేషన్ కోసమా అన్నట్టురాధ పాత్ర ఈ పాట పాడుతూంది.పాటలో ప్రతి దృశ్యం పూర్తి రియలిస్టిక్ వాతావరణంతో సాగుతుంది.


--- ముళ్ళపూడి సుబ్బారావు