Showing posts with label shakeel badayuni. Show all posts
Showing posts with label shakeel badayuni. Show all posts

Thursday, February 8, 2018

సుహానీ రాత్ ఢల్ చుకీ

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-138
మనసు కొన్ని పాటల్ని ,అవి విన్నప్పటి పరిసరాలు, వాతావరణం, మనసికస్థితి...వీటితో కలిపి ముద్దచేసి దాచుకుంటుంది.
తిరిగి ఆ పాట విన్నప్పుడు ,ఆ ముద్ద వెన్నలా కరుగుతుంది.
1989 అక్టోబరు నెల. ట్రైనింగు లో భాగంగా ‘ఇల్లెందు ‘ కాలరీస్ లో గెస్ట్ హవుస్ లో మకాం. ఆ గెస్ట్ హవుస్ బ్రిటిషర్స్ కాలంలో కట్టబడింది. పొడవైన వరండాలు, అసాధారణమైన ఎత్తులోఉన్న రూఫు, మామూలు గదులనుమించి విశాలంగాఉన్న స్నానశాలలు,పాతకాలపుడిజైన్లతో టేకు ఫర్నిచరు.పాశ్చాత్యశైలిలోఉన్న వంటశాల,అ...ందులోనుండి కిటికీ ద్వారా వంటకాల రవాణా. నాణ్యమైన పింగాణీ సామాను. ..
ఒకనాడు ఉజ్వలంగావెలిగిన రాజసౌధాన్ని ఆ గెస్ట్ హౌవుస్ నాకు గురుతెచ్చేది.
దానితో కూడిన వాతావరణం తెలియకుండానే నాతో లేని గంభీరాన్ని ప్రదర్శింపజేసేట్టుండేది.
ఒకరోజు సెకండ్ షో సినిమాచూసి నడుచుకుంటూ వస్తున్నాను.చేతులు జేబులోపెట్టుకునేమాత్రపు చలి.ఇల్లందు పారిశ్రామికవాడ మనసులో ఏమిదాచుకుందో తెలియదు కాని భయంగొలిపేలాంటి ప్రశాంతత.అక్కడక్కడా మిణికుమిణుకుమనే వీధిదీపాలు. శిక్షణలో ఉన్న ఫారెస్ట్ ఉద్యోగులతో కోలాహలంగా ఉండే అటవీశాఖ హాస్టలు దగ్గర సడిలేదు. గెస్ట్ హవుస్ గేట్ దగ్గర వాచ్ మన్ స్వెటరుతో కూర్చుని ఉన్నాడు. ఆరిపోతున్న చలిమంట, గేట్ ని ఆనుకునే ఇద్దరు చేతులుకలిపితే అందేంత కాండమున్న చెట్టు. పైనుండి జలపాతంలా జారుతున్న వెన్నెల. వాచ్ మన్ పక్కనున్న ట్రాన్సిస్టర్ నుండి ఈ పాట. వెంట్రుకలు నిక్కబొడుచున్నాయి.వళ్ళంతా మైమరపు.

‘సుహానీ రాత్ ఢల్ చుకీ ,న జానె తు కబ్ ఆవొగీ’
“అందమైన రేయి గడచిపోతుంది, నీ రాక ఎపుడో తెలియదు
లోకపు ఋతువు మారిపోతుంది, నీ రాక ఎపుడో తెలియదు
చోటులన్నీ తమ ఆనందాలు వెదజల్లి నిదురించాయి
తారలన్నీ తమ వెలుగులు చూపి చూపి నిదురించాయి
ప్రతి దీపము వెలిగి మలిగింది ,నీ రాక ఎపుడో తెలియదు
నీకై ఎదురుచూపుతో నేనిక్కడ తపిస్తున్నాను
వసంత ఋతువులోనే శిశిరం వచ్చింది
గాలి కూడా దిశను మార్చుకుంది ,నీ రాక ఎపుడో తెలియదు”
మహమ్మద్ రఫీ పాడిన షకీల్ బదాయుని రచన. నౌషాద్ స్వర రచన. హిందీ సినిమా పాట ఈ పాటతోనే కొత్తపుంత తొక్కిందంటారు. అదే పుంత పై యాభైయేళ్ళు హిందీ పాట నడచింది


Saturday, October 21, 2017

“న మై భగ్ వాన్ హు న మై సైతాన్ హు”

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-107
“న మై భగ్ వాన్ హు న మై సైతాన్ హు”
(“నేను దేవుణ్ణీ కాను దెయ్యాన్నీ కాను)
మదర్ ఇండియా లో పాట.షకీల్ బదాయుని రచన, నౌషాద్ సంగీతం, మహమ్మద్ రఫీ గానం
“లోకమిలాగే ఉంటుంది. దీనికి తగ్గట్టుగా మనం బ్రతకాలి “ అని కొందరనుకుంటారు. “లోకమిలా ఎందుకుంది? ఇందులో బ్రతకటానికి ఏంచేయాలి?” అనుకునే వారూ ఉంటారు. ‘ మదర్ ఇండియా’ సినిమాలో ఇద్దరి అన్నదమ్ముల ఆలోచనలు ఇలానే ఉన్నాయి. 
తమ్ముడికి రేగే ప్రశ్నలకు సమాధానం దొరకటంలేదు. అతనెలా బ్రతకాలో చెబుతున్నారు కాని అలాగే ఎందుకో చెప్పట్లేదు. ఈ పాటతో తనని తాను నిర్వచించుకుంటున్నాడు. ఐతే వినేవారికి అది తమందరి సంబంధించిన నిర్వచనమని అనిపిస్తుంది.
అతడు నటనలేని, భావాలని అణిచిపెట్టుకోని మనిషి. మంచి ముందు మొహం దాస్తాడు,సిగ్గుపడతాడు. దేవాలయాలదగ్గర సాధువుల చిలుముతో సమాధానపడడు. జూదం లాంటివి అతన్ని కట్టిపడేయవు. ఎద్దులా పొలంలో కష్టపడటం ,తీగపై నడకా, అకాశంలో గెడపై వేలాడటం ఇవన్నీ పొట్టనింపుకునే జాలం లో భాగాలని చెబుతాడు. అడ్డదిడ్డమైన వ్యవహారం అతన్ని గందరగోళపరస్తుంది.
“నేను దేవుణ్ణీ కాను దెయ్యాన్నీ కాను
లోకం ఇష్టమొచ్చింది అనుకోనీ ,నేను మాత్రం మనిషిని.
నాలో మంచీ ఉంది చెడ్డా ఉంది
మనసులో ఎంతో మురికి ఉంది కొద్దిగా స్వచ్చతా ఉంది
కొద్దిగా నమ్మదగినవాడిని కొంచెం మోసకారిని
లోకం ఇష్టమొచ్చింది అనుకోనీ ,నేను మాత్రం మనిషిని.
నేను రాజుని కాను నాతలమీద కిరీటంలేదు
ఐనా నా బ్రతుకులో భూమికున్నంత ఓర్పు ఉంది
పైకి పేదవాడిని మనసులో ధనికుడిని
లోకం ఇష్టమొచ్చింది అనుకోనీ ,నేను మాత్రం మనిషిని.
జీవితమనే పాటకి స్వరమూ లేదు తాళమూ లేదు
లోకమంతా గందరగోళంగా భుక్తి అనే వలలో ఉంది
ఎలాంటి అన్యాయమిది నాకు చిత్రమనిపిస్తుంది.
లోకం ఇష్టమొచ్చింది అనుకోనీ ,నేను మాత్రం మనిషిని.