Showing posts with label a r rehman. Show all posts
Showing posts with label a r rehman. Show all posts

Thursday, February 8, 2018

ఇష్క్ బినా క్యా జీనా

నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-143
ఇష్క్ బినా క్యా మర్నా యారా! ఇష్క్ బినా క్యా జీనా
(ప్రేమ లేనిది ఏమి జీవితం? ప్రేమలేనిది ఏమి మరణం మిత్రమా!)
తాల్ (1999) సినిమాలో ఏ ఆర్ రెహ్మాన్, సోను నిగమ్,అనూరాధ శ్రీరామ్,సుజాత పాడిన పాట.
హీరో ఔదామని చిత్రరంగానికి వచ్చిన ‘సుభాష్ ఘయ్ ‘ దర్శక నిర్మాతగా పెద్ద సినిమాసినిమాలు తీసి పేరుగాంచాడు. అందులో ఎక్కువ భాగం మల్టి స్టారర్లుఅందులోనూ అరుదైన కాంబినేషన్లతో తీసాడు. దిలీప్ కుమార్ తో మూడు సినిమాలు తీసాడు. అందునా ఒకటి దిలీప్ తో పాటు రాజ్ కుమార్ ను కూడా కలిపి. వీటన్నింటిలో యాక్షన్ భాగమూ ఎక్కువే.
ఐతే ‘తాల్ ‘ సినిమాలో యాక్షన్ ను పూర్తిగా పక్కనపెట్టాడు. తనతో చాలా సినిమాలకు సంగీత దర్శకులుగా పనిచేసిన లక్ష్మికాంత్ ప్యారేలాల్ స్థానంలో ఏ ఆర్ రెహ్మాన్ ను తెచ్చాడు.
సినిమాలో కథకు నేపధ్యం సంగీతమే.
హిమ పర్వత పాదప్రాంతం నుండి జానపద సంగీతం ముంబై ప్రవహించింది. ఆ ప్రాకృతిక సంగీతం ఎలా మారింది? ఆ సంగీతానికి వాహకమైన సంగీతకుటుంబం లో యువతి జీవితం ఎలా మలుపులు తిరిగింది సినిమా చూపుతుంది.
సినిమాలో ఫొటోగ్రఫీ, సంగీతం ,లొకేషన్లు, రంగులమేళవింపు ,నృత్యాలు ఆనీ సౌందర్యభరితమే.
“ప్రేమ లేనిది ఏమి జీవితం? ప్రేమలేనిది ఏమి మరణం మిత్రమా!
బెల్లం కన్నా తీయనిది ప్రేమ
చింతపండు కంటే పుల్లనిది ప్రేమ
ఈ ప్రేమ ప్రమాణం నిక్కమైనది
ఈ ప్రేమ బంధాలు సున్నితమైనవి
కింద ప్రేమ ఉంది ..పైన భగవంతుడున్నాడు
ఈ రెంటి నడుమ సమస్తమున్నది
ఒకటికాదు వంద మాటలు చెప్పు
వందమాటల అర్ధం ఒక్కటే
భగవంతుడు అతి సుందరం ..భగవంతునుకన్నా సుందరం ప్రేమ
మణి కాదు మాణిక్యం కాదు ప్రేమ
ఒకటే కోరిక ..ప్రేమ
ప్రేమ ఏమిటో ఎవరికి తెలుసు
ఐనా ప్రేమ ఏమిటొ అందరికీ తెలుసు
ఈ ప్రేమ నగరపు తెలియని దారుల్లో
ప్రియురాలి ఇంటి జాడ ఎవరికి తెలుసు?
చిన్నపాటి జీవితం పెద్దదైన యానం
ఈ ప్రేమఏమిటో ఎవరికి తెలుసు
ఇది బాధా లేక బాధకు మందా?
ఈమె ప్రియురాలా లేక దైవరూపమా?
……
నువ్వు ప్రేమ పేరు విన్నావు
నేను ప్రేమించాను
ప్రేమ ఒక పూలతోట
ప్రేమ ముళ్ళతోకూడిన వస్త్రం”

జిస్కె సర్ హో ఇష్క్ కి ఛావ్

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-139
‘ జిస్కె సర్ హో ఇష్క్ కి ఛావ్..పావ్ కె నీచే జన్నత్ హోగి ‘
(“ఎవరి శిరస్సు ప్రేమ నీడన ఉందో,వారి పాదాలకింద స్వర్గం ఉంటుంది)
దిల్ సె సినిమాలో సుఖ్విందర్ సింగ్ ,సప్నా అవస్థి పాడిన పాట. ఏ ఆర్ రెహ్మన్ సంగీతం. గుల్జార్ రచన
రైలు ప్రయాణపు చప్పుళ్ళు, సైరన్ (సీటీ) మోత (రైలు కూత) పాట సంగీతంలో కలిసిపోవటం చాలాపాటల్లో వుంది. అందులో చాలా పాటలు పాపులర్ అయ్యాయి.
రైలు లోపలి పాటలు (రుఖ్ సే జరా నకాబ్, పల్ దో పల్ కా, యే గోటేదార్ ), కథానాయిక రైలులో ఉంటే హీరో రోడ్ ప్రయాణం పాటలు ( మేరే సపనో కి రానీ) ఆతర్వాత రైలు పైన ప్రయాణిస్తూ పాడే పాటలు వచ్చాయి.
రైలు పైన గుర్తొచ్చే పాటలు ‘హమ్ దోనో దో ప్రేమీ’ (అజ్ నబీ), హోగా తుమ్సే ప్యారా కౌన్ (జమానే కో దిఖానా హై), ‘జిస్కె సర్ హొ ఇష్క్ కి ఛావ్’ (దిల్ సె 1997).
‘హమ్ దోనో దో ప్రేమీ ‘ పాట ,పాట అనటంకంటే సంభాషణల్ని ఆర్ డీ బర్మన్ తన సంగీతంలో ఇమిడ్చేసి మాయచేసాడనవచ్చు. అర్ధం బహు సామాన్యం. వినటానికీ చూడటానికీ ఆనందకరం. ‘హోగా తుమ్సే ప్యారాకౌన్ ‘పాట స్టూడియో తీసారు.చూడటానికి ఇబ్బందికరం.
‘జిస్కె సర్ హో ఇష్క్ కి ఛావ్ ‘ పాట అన్నిరకాలుగా ఆనందకరం.
అందమైన నీలగిరి కొండలు,మెలికలుతిరిగేరైలు మార్గం, తెరనిండా రంగులు,నటులు,ఆకర్షణియమైన నృత్యం, అంబరాన్నందుకునే సుఖ్వీందర్ స్వరం, చక్కని బీటు తోపాటు ‘ జిస్కి జుబా ఉర్దూ కి తరాహ్ ‘ ‘ తావీజ్ బనాకె పెహనూ ఉసే’ వంటి చిత్ర పద బంధాలతో సాగే రచన.


“ఎవరి శిరస్సు ప్రేమ నీడన ఉందో
వారి పాదాలకింద స్వర్గం ఉంటుంది
ఆ నీడన నడు ….
ప్రేమ నీడన నడు ...నడు
స్వర్గం పై కాలిడి నడు ..నడు
ఆ సహచరి సుగంధం లాంటిది
ఆమె నోటిమాట ‘ఉరుదూ’ లాంటిది
నా సాయంత్రాలు రాత్రులు,నా లోకం
నా సహచరి,ప్రియురాలు.
పూలలో దాగుతుంది, అత్తరులా
పరిమఌంచి ఎక్కడుందో తెలుపుతుంది
అద్భుతంలా ఎక్కడైన దొరికితే
తావీదు లా తనను ధరిస్తాను
నా సహచరి నా ప్రార్ధన లాంటివి
నా పాటా ఆమే..నా విశ్వాసప్రకటనా ఆమే
ఆ సహచరి పోలిక కదిలే మంచుబిందువు
ఆమె పాదాలకింద స్వర్గం కదలాడుతుంది
కొన్నిసార్లు కొమ్మలలో ...కొన్నిసార్లు ఆకులలో...
గాలిలో ఆమెజాడను వెతుకుతాను నేను
వెలుగునీడలమధ్య దోబూచులాడే
తన అన్ని రూపాలసారాన్నినేను
తను చిలిపిదనంతో రంగులు మారుస్తుంది
నేను రూపురంగుల అన్వేషిని”


ఖుదా అప్నె వాలియోంసె హోత హై రాజీ

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-137
‘ఖుదా అప్నె వాలియోంసె హోత హై రాజీ’
(భగవంతుడు తనను అనుసరించేవారిని అనుగ్రహిస్తాడు)
ఫిజా (2000) సినిమాలొ బృందగీతం.బృందంలో ఎ. ఆర్. రెహ్మాన్ ఉన్నాడు. సంగీతం ఎ ఆర్ రెహమాన్. రచన షౌకత్ అలి ఖాన్....
కళా విమర్శకుడు కళాకారుడిగా మారినపుడు అతని కళాసృష్టి ఎలాఉందో అని ఎందరో ఎదురుచూస్తారు. ప్రత్యెకంగా అతని విమర్శకు అప్పటిదాకా లోనైనవారైతే మరింత ఉత్సుకతతో చూస్తారు.
ఖాలిద్ మొహమ్మద్ జర్నలిస్ట్, సినీ విమర్శకుడు. ఫిల్మ్ ఫేర్ మాగజైన్ లో పనిచేసారు.అనేక సినిమాలపై విమర్శ రాశాడు.అతను దర్శకత్వానికి పూనుకున్నాడు. ‘ఫిజా’ సినిమా తీసాడు.సినిమాకథ కు కాలం ,నేపధ్యం 1993 మతసంఘర్షణ తర్వాత ముంబై నగరం.
ఘర్షణల తర్వాత ఒక ముస్లిమ్ కుటుంబంలో యువకుడు కనపడకుండాపోయాడు. అతనికి తల్లీ చెల్లీ ఉన్నారు. స్నేహితురాలు ఉంది. అందరూ అతనికోసం ఎదురుచూస్తున్నారు. అతనొస్తాడని తల్లికి అపారనమ్మకం. అతనికోసం ప్రార్ధనలు చేస్తుంది. అందుకు హజి దర్గాకు వచ్చింది. ఆ సందర్భంలో పాట.
ముంబై నగరంలో భాగమ్గా అరేబియాసముద్రంలో హజి అలి దర్గా ఉంది.సయెద్ పీర్ హజి అలి షా బుఖారి పెరుపై ఉన్న దర్గా అది.


“భగవంతుడు తనను అనుసరించేవారిని అనుగ్రహిస్తాడు
ఈ ద్వారం తల ఎత్తుకు బ్రతికేట్టు చేస్తుంది
ఇక్కడ మనసు తో కోరుకో ..ఇది హాజి అలి స్థలం
ఆయన ఖుదా కు స్నేహితుడు
సముద్రాలకు రాజా! హైదర్ కుమారుడా!
సముద్రాలకు రారాజా! ఒక్క చూపు
ప్రియ హాజి అలీ
నువ్వు సముద్రమంత ధనికునివి
బాబా హాజి అలీ ,బాబా హాజి అలీ
నీ ద్వారం పవిత్రమైనది స్వచ్చమైనది ఎంతో గొప్పది
ఓ తేజోమయా
నిర్మలచిత్తుడా
అందరికీ ఇంత నీడనివ్వు
ఇక్కడ హిందు ముస్లిమ్ శిఖ్ఖు క్రిస్టియన్లు అందరూ సఫలులౌతారు
ఈ సముద్రం నీ ద్వారానికి పహారా కాస్తుంది
నీ ముఖమెపుడూ వెలుగుతో నిండి ఉంటుంది
ప్రియ హాజి అలీ, ప్రియ హాజి అలీ
మొహమ్మద్ ముస్తఫా పేరుపై దానం చేయండి
ఆయన పేరుపై దానం చేయండి
నీ ద్వారంనుండి నిరాశ తో ఎవరూ వెఌంది లేదు
బాబా! వెనక్కివెఌంది లేదు
ఎవరి మనసులో ఏమి దాచారో అంతా నీకు తెలుసు
నీ దాతృత్వం దాక్షిణ్యం ఆకాశంలోనూ పొగడబడుతుంది
బాబా! హజి అలీ
ఈ పేదవారి ప్రార్ధనలు విను దయచూపు
ప్రియ హాజి అలీ, ప్రియ హాజి అలీ
లోకానికి నీవు గర్వకారణం
దురదృష్టవంతులు నీ ద్వారంలో అదృష్టవంతులౌతారు
అదృష్టవంతులౌతారు
నా కోరిక తీరేవరకు
జీవితాంతం నా కన్నీరు నీ ద్వారంపై ప్రవహిస్తుంది
బాబా! హజి అలీ
నీవారైన వారికి నువ్వు ఇవ్వనిదేమిటి?
బాబా! హజి అలీ”