Showing posts with label sharukh khan. Show all posts
Showing posts with label sharukh khan. Show all posts

Thursday, February 8, 2018

జిస్కె సర్ హో ఇష్క్ కి ఛావ్

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-139
‘ జిస్కె సర్ హో ఇష్క్ కి ఛావ్..పావ్ కె నీచే జన్నత్ హోగి ‘
(“ఎవరి శిరస్సు ప్రేమ నీడన ఉందో,వారి పాదాలకింద స్వర్గం ఉంటుంది)
దిల్ సె సినిమాలో సుఖ్విందర్ సింగ్ ,సప్నా అవస్థి పాడిన పాట. ఏ ఆర్ రెహ్మన్ సంగీతం. గుల్జార్ రచన
రైలు ప్రయాణపు చప్పుళ్ళు, సైరన్ (సీటీ) మోత (రైలు కూత) పాట సంగీతంలో కలిసిపోవటం చాలాపాటల్లో వుంది. అందులో చాలా పాటలు పాపులర్ అయ్యాయి.
రైలు లోపలి పాటలు (రుఖ్ సే జరా నకాబ్, పల్ దో పల్ కా, యే గోటేదార్ ), కథానాయిక రైలులో ఉంటే హీరో రోడ్ ప్రయాణం పాటలు ( మేరే సపనో కి రానీ) ఆతర్వాత రైలు పైన ప్రయాణిస్తూ పాడే పాటలు వచ్చాయి.
రైలు పైన గుర్తొచ్చే పాటలు ‘హమ్ దోనో దో ప్రేమీ’ (అజ్ నబీ), హోగా తుమ్సే ప్యారా కౌన్ (జమానే కో దిఖానా హై), ‘జిస్కె సర్ హొ ఇష్క్ కి ఛావ్’ (దిల్ సె 1997).
‘హమ్ దోనో దో ప్రేమీ ‘ పాట ,పాట అనటంకంటే సంభాషణల్ని ఆర్ డీ బర్మన్ తన సంగీతంలో ఇమిడ్చేసి మాయచేసాడనవచ్చు. అర్ధం బహు సామాన్యం. వినటానికీ చూడటానికీ ఆనందకరం. ‘హోగా తుమ్సే ప్యారాకౌన్ ‘పాట స్టూడియో తీసారు.చూడటానికి ఇబ్బందికరం.
‘జిస్కె సర్ హో ఇష్క్ కి ఛావ్ ‘ పాట అన్నిరకాలుగా ఆనందకరం.
అందమైన నీలగిరి కొండలు,మెలికలుతిరిగేరైలు మార్గం, తెరనిండా రంగులు,నటులు,ఆకర్షణియమైన నృత్యం, అంబరాన్నందుకునే సుఖ్వీందర్ స్వరం, చక్కని బీటు తోపాటు ‘ జిస్కి జుబా ఉర్దూ కి తరాహ్ ‘ ‘ తావీజ్ బనాకె పెహనూ ఉసే’ వంటి చిత్ర పద బంధాలతో సాగే రచన.


“ఎవరి శిరస్సు ప్రేమ నీడన ఉందో
వారి పాదాలకింద స్వర్గం ఉంటుంది
ఆ నీడన నడు ….
ప్రేమ నీడన నడు ...నడు
స్వర్గం పై కాలిడి నడు ..నడు
ఆ సహచరి సుగంధం లాంటిది
ఆమె నోటిమాట ‘ఉరుదూ’ లాంటిది
నా సాయంత్రాలు రాత్రులు,నా లోకం
నా సహచరి,ప్రియురాలు.
పూలలో దాగుతుంది, అత్తరులా
పరిమఌంచి ఎక్కడుందో తెలుపుతుంది
అద్భుతంలా ఎక్కడైన దొరికితే
తావీదు లా తనను ధరిస్తాను
నా సహచరి నా ప్రార్ధన లాంటివి
నా పాటా ఆమే..నా విశ్వాసప్రకటనా ఆమే
ఆ సహచరి పోలిక కదిలే మంచుబిందువు
ఆమె పాదాలకింద స్వర్గం కదలాడుతుంది
కొన్నిసార్లు కొమ్మలలో ...కొన్నిసార్లు ఆకులలో...
గాలిలో ఆమెజాడను వెతుకుతాను నేను
వెలుగునీడలమధ్య దోబూచులాడే
తన అన్ని రూపాలసారాన్నినేను
తను చిలిపిదనంతో రంగులు మారుస్తుంది
నేను రూపురంగుల అన్వేషిని”