Showing posts with label dilip kumar. Show all posts
Showing posts with label dilip kumar. Show all posts

Saturday, May 13, 2017

నయన్ లడ్ జైహె తొ మనవా మె కసక్ హొయి బె కరి

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-80

నయన్ లడ్ జైహె తొ మనవా మె కసక్ హొయి బె కరి
(కన్ను కన్ను కలిస్తే గుండెలో నెప్పి మొదలౌతుంది). గంగా జమునా సినిమాలో మొహమ్మద్ రఫీ పాడిన పాట. నౌషాద్ సంగీతం,షకీల్ బదాయుని రచన.

మదర్ ఇండియా సినిమాలో నర్గీస్ కొడుకుగా నటించటానికి దర్శకుడు మెహబూబ్ ఖాన్ ,దిలీప్ కుమార్ ను సంప్రదించాడు. అంతకు పూర్వం నర్గీస్ తో హీరో గా నటించిన దిలీప్ కుమార్ కొడుకుగా నటించటానికి విముఖత చూపాడు. వేరే నటులతో వచ్చిన ఆ సినిమా చూసిన దిలీప్ కుమార్ ఆ తరహా సినిమా చేయాలనుకున్నాడు. స్వయంగా చిత్ర నిర్మాణానికి చేపట్టాడు. నటుడుగా ఒడుదుడుకులు ఎదుర్కుంటున్న తన సోదరుడు ‘నాసిర్’ తోడ్పడాలన్న తలంపుతో అతన్నీ సినిమాలోకి తీసుకున్నాడు.

ఆ సినిమా ‘గంగా జమునా’. మదర్ ఇండియా సినిమాతో కొన్ని పోలికలున్నా,ఆ సినిమాకు కొనసాగింపుగా కూడా ఉంటుంది.గ్రామీణ నేపధ్యం తో సహజ వాతావరణంలో అవుట్ డోర్ లో నిర్మింపబడింది. 1960ల నాటి సాంఘిక స్థితి గతుల్ని స్పృశిస్తూ సాగుతుంది.

భోజ్ పురి భాష ఎంతో సహజంగా మాట్లాడుతూ, పరిణామం చెందిన పల్లె యువకునిగా దిలీప్ కుమార్ నటన ఎన్నో ప్రశంసలు అందుకుంది.సినిమా అత్యంత ప్రజాదరణతో ఒక బెంచ్ మార్క్ చిత్రంగా మారింది. ఐతే దిలీప్ కుమార్ ఆశించిన మరో ఫలితం..సోదరుడు నాసిర్ ఖాన్ కి లిఫ్ట్ ఈ సినిమా ఇవ్వలేకపోయింది.

సినిమాలోని పాట ‘నయన్ లడ్ జైహె తొ’ కూడా భిన్నమైన డయలెక్ట్ ( భోజ్ పురి?) తోనే ఉంది. పాట్ చిత్రీకరణలో దిలీప్ కుమార్ కదలికలు చూస్తే దానికోసం అతను చేసిన సాధన అర్ధమౌతుంది.

“ఆ అందగత్తె చుట్టూ నాకళ్ళు తిరుగాడుతుంటే
నా పని మొత్తం పాడయ్యింది.

కన్ను కన్ను కలిస్తే గుండెలో నెప్పి మొదలౌతుంది
ప్రేమ తారాజువ్వ ఎగిరితే పెద్ద చప్పుడౌతుంది

నీ రూపాన్ని మనసులో పెట్టుకుంటే తప్పేమిటి?
నీ మీద మనసైతే తప్పేమిటి?

నాకూ ప్రేమనగరంలో ఉండటానికి కొంచం హక్కు ఉంది.
నీ చిలిపి చూపులు నాగుండెను గుద్దుకున్నాయి

ఆ అందగత్తెను చూడకుంటే నాకు నిదరే పట్టదు.
ఉరి చుట్టుకున్నట్టు నా మనసు ని ఇబ్బంది పెడుతుంది.

తనతో కళ్ళు కలిసాక నాట్యం మొదలుపెట్టాను
మనసు ప్రేమతో తీయని పాట పాడుతుంది

తాళం మోగుతుంటే నడుము మెలికలు తిరుగుతుంది

బట్టలు ఉతుకుతూ మనసు ఎత్తుకు పోయింది..ఎలా మాయ చేసింది
ఎలాంటి మంత్రమేసింది. మాయ చేసింది?”

-ముళ్ళపూడి సుబ్బారావు


Sunday, March 26, 2017

'నచ్చిన ' పాటలు - 'లోపలి 'మాటలు -2   'ఆజ్ పురానీ రాహోంసె కోయీ ముఝే ఆవాజ్ న దే’
మనిషి అంతరంగాన్ని మించి కదన రంగం ఉంటుందా? అది మంచిచెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అలాంటి అంతరంగిక సంఘర్షణను చాలా ఎఫెక్టివ్ గా ప్రతిఫలింపజేసిన సినిమా గుడిగంటలు.దానికి మాతృక తమిళ చిత్రం ఆలయమణి. దానికి హిందీ రూపం ‘ఆద్మీ ‘. శివాజీగణేశన్,ఎన్ టీ ఆర్, దిలీప్ కుమార్ లు హీరో పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. కథానాయకుడు, ప్రతినాయకుడు ఒకరే.ఒకే పాత్రే.ముఖ్యపాత్ర అంతరంగంలోనే అనునిత్యం పోరాటం.స్థూలం గా అది మంచి చెడు మధ్య .
మంచిని చెడు వశం చేసుకునే సన్నివేశంలో ...ఓడిపోతున్న మంచిని చూసి మనసు చెమ్మగిల్లుతుంది. ఒక్కసారి అంతరావలోకనం చేసుకుంటాం.ఏమేమో గుర్తొస్తాయి..
చివరగా బుసకొట్టిన క్రోధలోభ మోహాలను జయించి మనసుని దివ్యమందిరం చేసుకున్న ‘మనిషి’ ధర్మజ్యోతి ఆదరణలో సేదతీరుతాడు.
ఆ నేపధ్యంలోని హిందీ సినిమా ‘ఆద్మీ ‘ లో పాట “ ఆజ్ పురానీ రాహోంసె కోయీ ముఝే ఆవాజ్ న దే’
ఈ పాట నౌషాద్ అలీ(సంగీతం),షకీల్ బదాయుని(గీతం), మహమ్మద్ రఫీ(గానం) త్రయం సృష్టి. కడలి కెరటాలు, ఎత్తైన శిఖరం నేపధ్యం గా దిలీప్ కుమార్ పై చిత్రీకరించిన ఈ పాట చూసినపుడల్లా ఫెటిల్లన పగిలి లావాను వెదజల్లి పూర్తిగా శాంతించి, సెలయేరుకు నెలవైన అగ్నిపర్వతం గుర్తుకొస్తుంది.
గతంనుండి ,అప్పటి చేదుపాటలనుండి, పాత గమ్యాలనుండి, నేరాలనుండి విముక్తుడయ్యాడు.
బంధనాలు తెగిపోయాయి, హృదయ సీమలో లో ఏ కోరికల చిత్రపటాలూ లేవు. సర్వ స్వతంత్రుడయ్యాడు. తనలో ఒక కొత్త మనిషిని కనుగొన్నాడు. దేవుడు కూడా అతని చూపులకు అందుతున్నాడు.
అలాంటి ‘మనిషి ‘ ఎలుగెత్తి పాడే పాటే ఈ గీతం.
పాట చివర మహాబలిపురం లో సాగరజలాలతో నిత్యం పోరాటం చేస్తూ నిలిచి ఉన్న తీర దేవాలయం (షోర్ టెంపుల్) ని చూపుతారు . ఆ గుడి మనిషికి ప్రతీక అనిపిస్తుంది.