Showing posts with label ghalib. Show all posts
Showing posts with label ghalib. Show all posts

Thursday, March 30, 2017

హజారొ ఖ్వాహిషె ఐసీ కి హర్ ఖ్వాఇష్ పె దమ్ నికలె

"హజారొ ఖ్వాహిషె ఐసీ కి హర్ ఖ్వాఇష్ పె దమ్ నికలె”
('వేలాది కోరికలు ,,ప్రతీ కోరికా దానికొరకు ప్రాణమీయదగినదే')
మిర్జా గాలిబ్ టీ.వీ సిరియల్ (1988) లో గాలిబ్ రచించిన ఈ గజల్ జగజిత్ సింగ్' పాడారు.
మనిషి కోరికలు అనంతమైనవి అంటుంది ఆర్ధిక శాస్థ్రం. కోరికే బాధకు మూలమంటాడు గౌతమ బుద్ధుడు.అనంతమైన కోరికల్లో ప్రాణమిచ్చైనా తీర్చుకోవాలనుకోనేవి ఎన్నివుంటాయి?
అల్లాంటివికూడా కూడా వేలకొద్దీ అంటాడు గాలిబ్.
గాలిబ్ ను తొలిసారిగా పరిచయంచేసింది 8(?) తరగతి తెలుగువాచకంలో ఒక పాఠ్యభాగం. దాశరధి అనుసృజన చేసిన గాలిబ్ గజల్లు ' గాలిబ్ గీతాలు ' పుస్తకానికి ముందుమాట మా పాఠం. ఆ ముందు మాట రచయిత శ్రీ దేవులపల్లి రామానుజరావు . తర్వాత గాలిబ్ గీతాలు పుస్తకం దొరికింది. బాపు బొమ్మలతో ఇప్పటికీ ఆ పుస్తకం అచ్చు ఔతూనే ఉంది. అలా గాలిబ్ తెలుగు వాకిళ్ళలోకి అడుగు పెట్టాడు. ఐతే తర్వాత కాలంలో గుల్జార్ గాలిబ్ పై టీ.వీ సీరియల్ తీసి నట్టింట్లో కి గాలిబ్ ను తెచ్చాడు.అందులో నజీరుద్దీన్ షా గాలిబ్ గా నటించాడు. జగ్ జిత్ సింగ్ గితాలాలపించాడు.
(అంతకు చాలా ముందు మీర్జా గాలిబ్ పేరుతో హిందీ సినిమా వచ్చింది.బైజు బావరా గా నటించి ప్రసిద్ధికెక్కిన భరత్ భూషణ్ గాలిబ్ గా నటించాడు.)
పాట అర్ధం దగ్గర దగ్గరగా (పూర్తి గజల్ )
“వేలాది కోరికలు ,,ప్రతీ కోరికా దానికొరకు ప్రాణమీయదగినదే
నాకోరికలు ఎన్నో తీరాయి..కాని కొద్దిగానే తీరాయి.
నా హంతకి భయపడెది దేనికి?ఆమెను కారణమన్నారా
నా కళ్ళనుండి జీవితాంతం అవిశ్రాంతంగా స్రవించే రక్తానికి
ఆడం ను స్వర్గంనుంచి నెట్టేయటం విన్నాను ఆని
మరింత హీనంగా నీ వీధినుండి బైటపడ్డాను.
ఓ దయాహీన! నీ రహస్యాలు నేను బైటపెడితే
నా తలపాగా లోపలి కేశపు పాయల్లా తేటతెల్లమౌతాయి.
ఆమె కెవరైనా లేఖ రాయాలంటే నాతోనే రాయించుకొండి
ప్రతి ఉదయం ఇంటినుండి కలాన్ని చెవిలో ఉంచుకుని బయలుదేరతాను
ఈ వయస్సులో మధుపానం చేసేవారి గుంపులో కలిసాను.
తిరిగి మధు పాత్రే సమస్తమయ్యే కాలమొచ్చింది.
ఎవరినుంచి నా గాయాలకు న్యాయం కోరానో
ఆగాయాలకు మరింత కత్తి గాటు తగిలింది.
ప్రేమలో జీవితానికి మరణానికి అంతరం లేదు
ఎవరిని చూసి బ్రతుకుతామో ఆ అవిశ్వాసి కోసం ప్రాణమిస్తాము
గుండెలొ గయంచేసిన బాణాన్ని బలంగా లాగితే
దానితో గుండె వ్లికి వస్తుంది..దానితో ప్రాణమూ వెలికి వస్తుంది.
దేవుని కోసం…నిర్దయీ ,,రహస్యాలపై ముసుగు తీయకు
అవిశ్వాసి ఐన ప్రేయసి అక్కడ కూడా బయటపడవచ్చు.
ఎక్కడ పానశాల ద్వారం,ఎక్కడ ప్రబోధకుడు
కాని నేను పానశాల నుండి బయటకొస్తుంటే అతను లోనికెళుతున్నాడు.”
-ముళ్ళపూడి సుబ్బారావు

Wednesday, March 29, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-35
'దిల్ ఢూంఢ్తా హై ..ఫిర్ వొహి '.6 February
(హృదయం తిరిగి వెతుకుతుంది.)
('మౌసం సినిమా లో భుపేందర్ ,లతా పాడిన పాట,రచన గుల్జార్,సంగీతం మదన్ మోహన్ )
...
దిలీప్ కుమార్,దేవానంద్,షమ్మి కపూర్,రాజేంద్రకుమార్ తర్వాతితరం కథానాయకుల సినిమాలు ఒకవెల్లువలా వచ్చిన సంవత్సరాలు మిడ్ సెవంటీస్.ప్రత్యేకంగా 1975 లో కభీ కబీ,ఆంధీ,మౌసం, షోలే,దీవార్,చుప్కే చుప్కే,అమానుష్,ధర్మాత్మ,ఖుష్బూ వంటి పెద్ద హీరోలసినిమాలు, జూలీ,ఖేల్ ఖేల్ మే, గీత్ గాతా చల్ వంటి చిన్న హీరోలసినిమాలు వచ్చాయి.చాలాభాగం విజయవంతం అయ్యాయి. వీటన్నింటిలోనూ డజన్లకొద్దీ పాటలు జనం నోళ్ళలో నానుతూండేవి.
ఆ సంవత్సరం సంగీతదర్శకుడు మదన్ మోహన్ పాటలవరకు సంగీతమిచ్చిన సినిమా 'మౌసం ' (తెలుగులో ఋతువు అనాలా కాలం అనాలా? హిందీలో సంవత్సరానికి 4 మౌసం లు.
తెలుగులో 6 ఋతువులు,మూడు కాలాలు).
కిశొర్ కుమార్ అప్రతిహతంగా వెలుగుతున్న కాలం లో అతని పాట లేకుండా వచ్చిన సినిమా మౌసం. తనచేతనే గాయకుడిగా పరిచయం చేయబడ్డ 'భుపేందర్ ' తో రెండు పాటలు మదన్ మోహన్ ఇందులో పాడించాడు. రఫీ,లతా లు మిగతా గాయకులు.
సంగీతం,సాహిత్యం, గానంసరైన మేళవింపు జరిగితే అమర(ఇమ్మోర్టల్) గానం ఆవిష్కృతమౌతుంది. 'దిల్ ఢూంఢ్తా హై ..ఫిర్ వొహి ' పాట అలాంటిదే.
సినిమా పేరు 'మౌసం '.అవి సంవత్సరానికి నాలుగు (ఏక్ బరస్ కే మౌసం చార్ ..ఒక పాటకూడా వేరే సినిమాలో ఉంది). నాలిగింటిలో మూడు 'మౌసం ' ల ప్రసక్తి ఈ పాటలో ఉంది.ఆ ఋతువుల్ని(?)వాటితో పాటు ప్రేమను అనుభూతిస్తూ చెప్పిన పాట.
నాలుగో 'మౌసం 'రికార్డు చేయబడింది కాని సినిమాలోకి రాలేదని చదివాను.
“విశ్రాంతంగా కూర్చుని ప్రేమించినవాని తలపుల్లో మునిగిన నాటి
రేబవళ్ళ కోసం హృదయం తిరిగి వెతుకుతుంది.
శరత్కాలపు నీరెండలో నీ చెంగు లో కళ్ళు దాచుకుని
ఇంటి వాకిట్లో పడుకుని
ఒక్కోసారి తలదించుతూ, వేరే వైపు వత్తిగిలుతూ...
హృదయం తిరిగి వెతుకుతుంది.
లేకుంటే, వెచ్చనైన వేసవి రాత్రుల్లో,తూర్పుగాలి వీచినపుడు
మేడమీదచల్లటి తెల్లటి చద్దర్లపై పడుకుని
పొద్దుపోయే వరకు మేలుకుని తారల్ని చూసినప్పుడు
హృదయం తిరిగి వెతుకుతుంది.
మంచుకురిసే శీతవేళల్లో ఏదైనా కొండమీద
లోయల్లో ప్రతిధ్వనించే నిశ్శబ్దాలను వింటూ
కళ్ళపై తెలిమంచుతెరలు కప్పుతున్నపుడు
హృదయం తిరిగి వెతుకుతుంది.”
ఈ పాట రఫీ తో ఎందుకు పాడించలేదా అని రఫీ అభిమానిగా ఇదివరకు అనుకున్న క్షణాలున్నాయి. ఐతే ఆ కోరిక వేరే రకంగా తీరింది.
పాటలో ఒక పాదం "తసవ్వుర్-ఎ-జానా కియె హుఎ " కొత్తగా అనిపించేది. వెతికితే తెలిసిన విషయం ఈ పాట పల్లవి గాలిబ్ ఘజల్ "ముద్దత్ హుఈ హై యార్ కో మెహ్మాన్ కియే హుఏ " లో ఆఖరి స్టాంజా లలో ఒకటి. ఆ ఘజల్ ను మహమ్మద్ రఫీ 'మీర్జా గాలిబ్ ' సినిమాలో పాడాడు. అలా నాకోరిక తీరింది.
-ముళ్ళపూడి సుబ్బారావు