‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-85
‘సోనా ..కరే ఝిల్ మిల్ ఝిల్ మిల్’. (బంగారంలా మెరుపులు …)
పహేలి (1977) సినిమాలో సురేష్ వాడ్కర్,హేమలత పాడినపాటగాయకుడు సురేష్ వాడ్కర్ కు ఇది తొలిపాట.
శబ్దాలకూ భాష ఉంటుందనుకుంటా. వర్షించే చినుకులు తెలుగులో ‘చిటపట’ మంటాయి(‘చిట పట చినుకులు పడుతూ ఉంటే’),. హిందీలో ‘టిప్ టిప్’ అంటాయి (‘ టిప్ టిప్ బరసా పానీ’). అదే బెంగాలీ లో ఐతే ‘టాపుర్ టూపుర్ ‘ అంటాయట.(‘బ్రిష్టి పడో టాపుర్ టూపుర్’).
వర్షం మీద వచ్చినపాటలు కోకొల్లలు. హిందీ వర్షపు పాటల్లో నాకిష్టమైన పాట ఒకటి . ‘సోనా ..కరే ఝిల్ మిల్ ఝిల్ మిల్’.
95/96 లలోతీవ్రమైన వేసవి కాలం.కొత్త కాలనీలోపచ్చదనం పెరగలేదు. నీటి ఎద్దడి.సరఫరాఐన మంచినీరు తాగలేనట్టు ఉండేది.కాలనీ పక్కనున్నవాగులో చెలమలు ఎండిపోయాయి. పళ్ళబిగువున కాలం నడుస్తుంది. హఠాత్తుగా వాన వచ్చింది. వేలాది కూలర్లు ఒకేసారి మొదలైనట్టు చల్లదనం, గుట్టలకి మైదానాలకీ మబ్బులు గొడుగు పట్టేశాయి. కుంభ వృష్టి మొదలయ్యింది.ఇంట్లో టీ వీ లో ‘ఎ టి ఎన్’ చానెల్లో బైట వాతావరణాన్ని చూపుతూ ఈ పాట. ..’సోనా ..కరే ఝిల్ మిల్ ఝిల్ మిల్’. ఆ పాట పట్ల ఇష్టం అప్పుడు మొదలయ్యింది . అప్పటికే అది పాత పాట.
పాట రచయిత ,సంగీత దర్శకుడు ‘రవీంద్ర జైన్’. ఆయనకు దృష్టి లోపం ఉంది. సృష్టి ని అసలు చూడకుండానే ఉన్నాడా? కొంత కాలం చూసి చూపు కోల్పోయాడా అన్నది నాకు తెలియదు. అతను రాసిన పాటల్లో ప్రకృతి వర్ణన వింటుంటే అసలు చూడకుండా అలా రాయటం సాధ్యమా అనిపిస్తుంది.
‘బ్రిష్టి పరే టాపుర్ టుపుర్’ పదం బెంగాలీ లో ప్రసిద్ధమట. రవీంద్రనాథ్ టాగోర్ కవితాపంక్తి కూడా.కలకత్తా లో కొంతకాలం గడపిన రవీంద్ర జైన్ పై ‘రవీంద్ర సంగీత్ ‘ ప్రభావం ఉంది. అలాగే అక్కడికవిత్వం ప్రభావం కూడా. అలా ఈ బెంగాలి కవితాపంక్తి హిందీ పాటలో కి వచ్చిచేరింది.
పాట చిత్రీకరణలో వర్షం ,పచ్చని ప్రదేశాలు, వాగులు, వంకలు, వ్యవసాయపు పనులవారు, పూర్తిగా వదలని నటీనటుల పసిదనం పాటను మరింత ఆకర్షణీయం చేసాయి.
పాట లో ఒక చరణం లో పదం ‘ మేఘం ఘర్జన కు పర్వతంబెదిరింది.పిట్ట అల్లుకున్న గూడు చెదరకుండా ఉంది’ అని వస్తుంది. భలే ఉంది అనిపిస్తుంది.
పాట అర్ధం నేను అర్ధం చేసుకున్నంత వరకు
“ బంగారంలా మెరుపులు ,వెండిలా వికసించే నవ్వులు
చిట పటలతో కురిసే వాన
కాగితపు చిన్న పడవ ..నీటి అలల్ని పట్టుకుని సాగుతుంది
ఈ పడవలో సవారీ చేసి , నది దాటి వెళదాం పద
అక్కడి నేరేళ్ళు మధురం, తీయ తీయగా.. మధురం,మధురం
మేఘం ఘర్జించేసరికి పర్వతం గుండె కంపించింది
కానీ గిజిగాడు చాలా తెలివితో ఉన్నాడు
తన గూడు ఇటు అటు చెదరకుండా కట్టాడు.
ఎరుపు,గులాబి,నీలం,పచ్చదనం
ఇవన్నీ ఇంద్రధనుస్సు ను అలంకరించాయి.
చూడు గగనంలో వర్షాగమనం
రంగులమ్మే అంగడిలా ఉంది
గినియా పువ్వు చినుకుల్ని చూస్తుంది, చినుకులే ఒక ఆట.’