Showing posts with label suresh wadkar. Show all posts
Showing posts with label suresh wadkar. Show all posts

Thursday, February 8, 2018

`యే జిందగీ గలె లగాలే`

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-148
`యే జిందగీ గలె లగాలే`
(జీవితమా! నన్ను కౌగిలించుకో)
`తదియ నాటి చంద్రుడు` అని అర్ధమొచ్చే తమిళ సినిమా తెలుగులో `వసంతకోకిల` గా డబ్ అయ్యింది.సినిమా చూసినా రెండు భాషల సినిమా పేర్లు సినిమాకు అన్వయం చేసుకోలేకపోయాను. అదే సినిమా హిందీ లో `సద్మా` గా వచ్చింది. ఆ పేరు సినిమా కథకు సరైనదే అనిపించింది.
ఒక సెలబ్రిటి , అతన ఉనికిని దాచి మారుమూల ప్రాంతంలో కథానాయకునితో కాలంగడపటం,తర్వాత అతనికి దూరమై చివరికి దగ్గరవ్వటం ..ఇలాంటి కథనంతో అనేక సినిమాలు వివిధభాషల్లోవచ్చాయి. ఆకథకు `మరపు` ను కలిపి దుఃఖాంతం చేసిన కథ తో ఈ సినిమా వచ్చింది.
నటీనటులకు మంచి అవకాశమిచ్చిన సినిమా.దానిని కథానాయికా నాయకులు సద్వినియోగం చేసుకున్నారు.
వస్తుతః ఛాయాగ్రాహకుడైన దర్శకుడు బాలూ మహేంద్ర సినిమాను దృశ్యకావ్యం చేశాడు. దానికి ఇళయరాజా సంగీతం ,గుల్జార్ రచన మరింత జీవం పోసాయి.
సురేష్ వాడ్కర్ పాడిన పాటల్లో అమితంగానన్ను ఆకుట్టుకున్నవాటిలో ఇది ఒకటి.పాట మధ్యలో వచ్చే వయొలీన్ల వాదనం మనోహరం.
``జీవితమా! నన్ను కౌగిలించుకో
నేనూ నీవిచ్చే ప్రతిబాధనూ
కౌగిలించుకున్నాను. ఔనా,ఔనా!
నేను ఒక సాకుతో ,లోకానికి చాటుగా
కనురెప్పల తెరలకింద కనుల ఇంటిని నింపుకున్నాను
జీవితమా! నాకు నీ ఆసరా దొరికింది.
చిన్న మేఘం(నీడ?) కంటిలో ప్రవేశించింది
నేను రెండు చుక్కలతో మనసును నింపుకున్నాను
జీవితమా!నాకు తీరం దొరికింది``
https://www.youtube.com/watch?v=0BXqAnZWqdQ

Saturday, October 21, 2017

గోరోం కి నా కాలోంకీ దునియా హై దిల్వాలో కె

‘నచ్చిన’పాటలు-’లోపలి’ మాటలు-102
“గోరోం కి నా కాలోంకీ దునియా హై దిల్వాలో కె”(తెల్లగా ఉన్నవారిదీ కాదు నల్లగా ఉన్నవారిదీ కాదు, గుండె ఉన్నవారిదే ఈ లోకం).
డిస్కో డాన్సర్ లో పాట అంజాన్ రచన, సురేశ్ వాడ్కర్, ఉషా మంగేష్కర్ గానం ,బప్పిలహిరి సంగీతం
శివ్ ఖేరా రాసిన ‘యు కెన్ విన్’ పుస్తకంలో ఒక చిన్న కథ.
మార్కెట్ లో ఒకతను బెలూన్లు అమ్ముతున్నాడు. కొనేవారిని ఆకర్షించటానికి కొన్నిబెలూన్లలో హీలియమ్(?) నింపి ఆకాశంలోకి వదులుతున్నాడు. అందులో రంగురంగులవివున్నాయి.
ఒక పిల్లవాడు అమ్మేఅతన్ని ప్రశ్నించాడు. నల్లరంగు బెలూను కూడా పైకి వెళుతుందా? అమ్మేఅతని సమాధానం. “ బెలూన్ రంగుకాదు. అందులో ఏమున్నదో అది ముఖ్యం”.
ఈ కథ చదివాక నాకు గుర్తుకొచ్చిన హిందీ పాట “గోరోం కి నా కాలోంకీ దునియా హై దిల్వాలో కె”
క్రీడారంగం,కళారంగం నేపధ్యంలో వచ్చే సినిమాల్లో చాలా చిన్నస్థాయి నుండి మొదలైన ఆటగాళ్ళు/కళాకారులు పైకి రావటం, దానికి అదేరంగంలో విఫలమైన సీనియర్లు వారికి సహాయపడటం ఎక్కువగా చూపబడుతుంది.వీటికి ప్రజాదరణ బాగానే లభిస్తుంది. డిస్కో డాన్సర్ సినిమా కూడా అలాటిదే.
1982 లో డిస్కో డాన్సర్ సినిమా చాలా హడావుడి చేసింది. అంతకుముందు బి గ్రేడ్ హీరోగా ఉన్న మిథున్ చక్రవర్తిని దాన్సింగ్ స్టార్ గా మార్చింది. బప్పీలహిరి ని ప్రధమశ్రేణి సంగీతదర్శకుడిగా మార్చింది.సినిమాలో కథ ఒక పేద పిల్లవాడు వీధి గాయకుడిగా మొదలై పెద్ద గాయకుడిగా ఎదగటం.
కథానాయకుడు చిన్నగా ఉన్నపుడు పాడిన పాట ఇది. ఇందులో కనిపించే బాలనటుడి డాన్స్ మూవ్ మెంట్స్ మిథున్ చక్రవర్తి కదలికల్ని గుర్తుచేస్తాయి. అతని పాటనచ్చి మేడమీదినుండి దిగిన అమ్మాయిచేసిన నృత్యం ధియేటర్లలో విజిల్స్ వేయించింది.కథానాయకుడ్ని ప్రభావితం చేసిన వీధి గాయకుడిగా రాజేశ్ ఖన్నా పాటలో కనిపిస్తారు.
“తెల్లగా ఉన్నవారిదీ కాదు నల్లగా ఉన్నవారిదీ
కాదు గుండె ఉన్నవారిదే ఈ లోకం
నవ్వుతూ బతికి నవ్వుతూ మరణించే
మనలాంటి గుండె కలవారిదే
ఉదయ సాయంత్రాలూ మన పాటలు వీధుల్లో మారుమోగుతాయి.
మనం పాటల బేహారులం అదే మన పని
బంగారం వెండి మీద కాదు పాటమీదే మన ప్రేమ
బ్రతికిన నాలుగు రోజులూ ఆనందం గా బ్రతుకు మిత్రమా
చేయాల్సింది ఉంటే మనస్పూర్తిగా చేయి మిత్రమా
నీదేమిటి? నాదేమిటి? మరచిపో మిత్రమా”

Tuesday, May 23, 2017

సోనా ..కరే ఝిల్ మిల్ ఝిల్ మిల్

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-85
‘సోనా ..కరే ఝిల్ మిల్ ఝిల్ మిల్’. (బంగారంలా మెరుపులు …)
పహేలి (1977) సినిమాలో సురేష్ వాడ్కర్,హేమలత పాడినపాటగాయకుడు సురేష్ వాడ్కర్ కు ఇది తొలిపాట.


శబ్దాలకూ భాష ఉంటుందనుకుంటా. వర్షించే చినుకులు తెలుగులో ‘చిటపట’ మంటాయి(‘చిట పట చినుకులు పడుతూ ఉంటే’),. హిందీలో ‘టిప్ టిప్’ అంటాయి (‘ టిప్ టిప్ బరసా పానీ’). అదే బెంగాలీ లో ఐతే ‘టాపుర్ టూపుర్ ‘ అంటాయట.(‘బ్రిష్టి పడో టాపుర్ టూపుర్’).

వర్షం మీద వచ్చినపాటలు కోకొల్లలు. హిందీ వర్షపు పాటల్లో నాకిష్టమైన పాట ఒకటి . ‘సోనా ..కరే ఝిల్ మిల్ ఝిల్ మిల్’.

95/96 లలోతీవ్రమైన వేసవి కాలం.కొత్త కాలనీలోపచ్చదనం పెరగలేదు. నీటి ఎద్దడి.సరఫరాఐన మంచినీరు తాగలేనట్టు ఉండేది.కాలనీ పక్కనున్నవాగులో చెలమలు ఎండిపోయాయి. పళ్ళబిగువున కాలం నడుస్తుంది. హఠాత్తుగా వాన వచ్చింది. వేలాది కూలర్లు ఒకేసారి మొదలైనట్టు చల్లదనం, గుట్టలకి మైదానాలకీ మబ్బులు గొడుగు పట్టేశాయి. కుంభ వృష్టి మొదలయ్యింది.ఇంట్లో టీ వీ లో ‘ఎ టి ఎన్’ చానెల్లో బైట వాతావరణాన్ని చూపుతూ ఈ పాట. ..’సోనా ..కరే ఝిల్ మిల్ ఝిల్ మిల్’.  ఆ పాట పట్ల  ఇష్టం అప్పుడు మొదలయ్యింది . అప్పటికే అది పాత పాట.

పాట రచయిత ,సంగీత దర్శకుడు ‘రవీంద్ర జైన్’. ఆయనకు దృష్టి లోపం ఉంది. సృష్టి ని అసలు చూడకుండానే ఉన్నాడా? కొంత కాలం చూసి చూపు కోల్పోయాడా అన్నది నాకు తెలియదు. అతను రాసిన పాటల్లో ప్రకృతి వర్ణన వింటుంటే అసలు చూడకుండా అలా రాయటం సాధ్యమా అనిపిస్తుంది.

‘బ్రిష్టి పరే టాపుర్ టుపుర్’ పదం బెంగాలీ లో ప్రసిద్ధమట. రవీంద్రనాథ్ టాగోర్ కవితాపంక్తి కూడా.కలకత్తా లో కొంతకాలం గడపిన రవీంద్ర జైన్ పై ‘రవీంద్ర సంగీత్ ‘ ప్రభావం ఉంది. అలాగే అక్కడికవిత్వం ప్రభావం కూడా. అలా ఈ బెంగాలి కవితాపంక్తి హిందీ పాటలో కి వచ్చిచేరింది.

పాట చిత్రీకరణలో  వర్షం ,పచ్చని ప్రదేశాలు, వాగులు, వంకలు, వ్యవసాయపు పనులవారు, పూర్తిగా వదలని నటీనటుల పసిదనం  పాటను మరింత ఆకర్షణీయం చేసాయి.

పాట లో ఒక చరణం లో పదం ‘ మేఘం ఘర్జన కు పర్వతంబెదిరింది.పిట్ట అల్లుకున్న గూడు చెదరకుండా ఉంది’ అని వస్తుంది. భలే ఉంది అనిపిస్తుంది.


పాట అర్ధం నేను అర్ధం చేసుకున్నంత వరకు

“  బంగారంలా మెరుపులు ,వెండిలా వికసించే నవ్వులు
చిట పటలతో కురిసే వాన

కాగితపు చిన్న పడవ ..నీటి అలల్ని పట్టుకుని సాగుతుంది
ఈ పడవలో సవారీ చేసి , నది దాటి వెళదాం పద
అక్కడి నేరేళ్ళు మధురం, తీయ తీయగా.. మధురం,మధురం

మేఘం ఘర్జించేసరికి  పర్వతం గుండె కంపించింది
కానీ గిజిగాడు  చాలా తెలివితో ఉన్నాడు
తన గూడు ఇటు అటు చెదరకుండా కట్టాడు.

ఎరుపు,గులాబి,నీలం,పచ్చదనం
ఇవన్నీ ఇంద్రధనుస్సు ను అలంకరించాయి.
చూడు గగనంలో వర్షాగమనం
రంగులమ్మే అంగడిలా ఉంది
గినియా పువ్వు చినుకుల్ని  చూస్తుంది, చినుకులే ఒక ఆట.’


Wednesday, March 29, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-29’
'మొహబ్బత్ క్యా చీజ్ హంకో బతావ్ ‘25 January
(ప్రేమ అనేది ఏమిటో నాకు చెప్పు.)
...
ఆకర్షణల విషయంలో మనసును నియంత్రించటంలో విఫలమైతే అది నశింపుకు దారితీస్తుందంటారు(ఆది శంకరాచార్య వివేకచూడామణిలో).అందుకు ఉదహరణగా,లేడి(సంగీతం వింటూ), ఏనుగు(ఆడఏనుగు స్పర్శకు లోబడి), శలభం (అగ్నితో),చేప(ఎర తో),భ్రమరా లను (సుగంధంతో) అంతమౌతాయంటారు.
కమలంలో మకరందానికో,సుగంధానికో మైమరచి సూర్యాస్తమయమయ్యేంతవరకూ కమలంలోనే ఉండిపోతుంది భ్రమరం. సూర్యాస్తమయంతో కమలపురేకులు ముడుచుకుపోతాయి. భ్రమరం కమలంలో బందీయై నశించిపోతుంది.
శలభం అగ్నిశిఖతో ఆకర్షింపబడి అందులోనే కాలిపోతుంది.(ఉర్దూ సాహిత్యంలో,హింది సినిమా పాటల్లోనూ షమ్మా ,పర్వానా పదాలు విరివిగా వాడబడతాయి."ఇస్ షమ్మ్-ఎ-ఫరోజా కే పర్వానె హజారో హై","జల్నే మె క్యా మజా హై పర్వానే జానతే హై")
ప్రేమంటే ఏమిటో అనేకమంది చెప్పిఉన్నారు.చెబుతూనే ఉంటారు. చాలమంది దృష్టిలోఇప్పటికీ అది’ బ్రహ్మపదార్ధమే’. అదేమిటో తెలుసుకోవాలనీ అభిలాష ఉంటూనేవుంటుంది.అది ఎలాఉంటుంది,ఎపుడుమొదలయ్యింది,దాని లక్షణాలు..ఇవన్నీ అంతుచిక్కనివే.
'ప్రేమ్రోగ్' సినిమాను రాజ్ కపూర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.అందులో ఒకపాట 'మొహబ్బత్ క్యా చీజ్ హంకో బతావ్ ". ప్రేమగురించి ఒక పెద్ద ఇంటి అమ్మాయి అమాయకంగా ప్రశ్నిస్తుంది. ఆ కుటుంబనీడన ఎదిగి ఆమెను ఇష్టపడుతున్న వ్యక్తి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.సమాధానమూ ప్రశ్నగానే మిగులుతుంది.
ఈ పాట కోసం రచయిత పైనచెప్పిన రెంటిని (భ్రమరం,దీపపు పురుగు) ఉపయోగిస్తాడు.
“పగలు ఎందుకు వస్తుంది? రాత్రి ఎందుకు ఔతుంది?
వేదన ఎక్కడపుడుతుంది? కళ్ళు ఎందుకు రోదిస్తాయి?
ప్రేమ అనేది ఏమిటో నాకు చెప్పు.
దీనిని ఎవరు మొదలుపెట్టారో నాకు వినిపించు.
సాయంత్రం వరకూ ఒక భ్రమరం పూవు లోపల చరిస్తూ ఉంది.
రాత్రయ్యేసరికి కమలపు రేకుల్లో బందీ అయ్యింది
ఉదయం ఖైదు నుండి విడుదల య్యాక ..ఏమయ్యిందని నేనడిగాను
అది ఏమీ మాట్లాడదు...తనలోకంలో తను ఈ పదాలు పాడుకుంటుంది
ప్రేమ అనేది ఏమిటో నాకు చెప్పు.
ఈ శరీరం ఎందుకు జ్వలిస్తుంది?ఈ శ్వాస వెచ్చగా ఎందుకువుంది?
ఇది ఎలాంటి అగ్ని? ఈ దీపం ఎందుకు మలిగిపోతుంది?
దీపం వెలుగంగానే శలభం వచ్చింది
అగ్ని ఒడిలో తనకి తాను దూకింది.
నేను మరో శలభాన్ని అడిగాను..అగ్నిలో ఉన్నదేమిటని
అది ఏమీ మాట్లాడదు...తనలోకంలో తను ఈ పదాలు పాడుకుంటుంది
ప్రేమ అనేది ఏమిటో నాకు చెప్పు.
నిషా ఎలా ఉంటుంది? అడుగులుతడబడతాయెందుకు?
కంటికి ఏమీ ఎందుకు కానరాదు? ఈ ఆనందం ఎలాకలుగుతుంది?
ఒకరోజు మధుశాల వైపు చూడవెళ్ళాను
మైకపు కౌగిలిలోఉన్న ఒక తాగుబోతు అటు వెళుతున్నాడు
నేనతన్ని అడిగాను ..ఎందుకు జీవితమంతా తాగుతూనే ఉన్నావని.
అతను ఏమీ మాట్లాడడు...తనలోకంలో తను ఈ పదాలు పాడుకుంటు న్నాడు
ప్రేమ అనేది ఏమిటో నాకు చెప్పు.”
ఏవైతే నాశన హేతువలని చెప్పారో అవే ప్రేమానుభూతికి కారణాలౌతున్నయని కవి అంటున్నాడు.
(గీత రచయిత సంతోష్ ఆనంద్, సంగీతకారులు లక్షికాంత్ ప్యారేలాల్, గానం సురేష్ వాడ్కర్,లతా)
-ముళ్ళపూడి సుబ్బారావు