‘కహీ దూర్ జబ్ దిన్ ధల్ జాయే, సాంజ్ కి దుల్హన్ బదన్ చురాయే’
(ఎంతో దూరం ప్రయాణించాక పగటిని సంధ్యావధువు రహస్యంగా తనలోకి తీసుకుంటుంది)
ఆనంద్(1971) సినిమాలో ముకేశ్ పాడిన పాట. సలీల్ చౌధురి సంగీతం,యోగేష్ రచన
డాక్టర్ భాస్కర్ తన వృత్తిలో ఎదురయ్యే ద్వంద్వ ప్రమాణాలపట్ల అసహనంతో వున్నాడు.అతను అంతర్ముఖుడు.జీవితానికి అవసరమైన లౌక్యం కూడా అతనిలో లోపించింది. తక్కువ మాట్లాడే అతని జీవితంలోకి సదా మాటాడుతూనే ఉండే ఒక వ్యక్తి తుఫానులా ప్రవేశించాడు.ఆ వ్యక్తి పేరు ఆనంద్.
అతను ఆనందానికి మానవరూపం.సంతోషం పంచటం అతని నైజం. ఇతరుల ఆనందం కోసం ఏదైనా చేసేస్తాడు.
అతని జీవనవ్యవధి 6 నెలలే. అంతవరకూ అతను డాక్టర్ల పర్యవేక్షనలో ఆసుపత్రిలో గడపాలి.ఐతే అతను మిగిలిన జీవితం భాస్కర్ ఇంటిలో గడపాలిచాడు.
గలగల మాట్లాడుతూ జలపాతంలా హోరు చేస్తూ పరిసరాల్ని, చుట్టూ ఉన్న మనుషులమధ్య దూరాలు తగ్గిస్తూ కాలం గడుపుతున్న ఆ ఆనంద్ మనసులో నిజంగా ఏముంది?
అతను పైకి కనపడే మనిసషేనా ? లేక లోన మరొకరున్నారా?
ఇది డాక్టర్ భాస్కర్ అన్వేషణ.నిజమైన ఆనంద్ ఒక్కసారి డాక్టర్ భాస్కర్ కు అనుకోకుండా ఎదురుపడ్డాడు. ద్వంద్వాన్ని భరించలేని డాక్టరు.ద్వంద్వాన్ని అబినయిస్తూ పేషెంటు.వారిద్దరి మధ్యా ఏర్పడ్డ అనుబంధం.
ఇది ‘ఆనంద్’ సినిమా కథ.
ఈ సినిమా చూసాక మరవటం కష్టం. అప్పటి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా, అప్పటికి భావి సూపర్ స్టార్ అమితాబ్ ..వీళ్లిద్దరూ కాదు ,ఆనంద్, భాస్కర్ లు మాత్రమే మనతో ఉంటారు.
సినిమాలో మరువలేని ఒక సంభాషణ “ఖుషీ తొ తుమ్ సబ్ కె సాత్ భాంట్ తే హై .ఆజ్ మేరె సాత్ థోడాసా గమ్ భీ భాంట్ లో “..”నై నై నై..ఏ చీజ్ మై కిసీసే భాంట్ నే వాలా” (డాక్టర్: ఆనందాన్ని నువ్వు అందరికీ పంచుతావు.ఈ రోజు నాతో కొద్దిగా నీ బాధను పంచుకో. ఆనంద్: లేదు లేదు. దీనిని నేనెవరితోనూ పంచుకునేది లేదు)
కొద్ది సేపు మాత్రమే కనిపించే ‘లోపలి’ ఆనంద్ ఈ పాట పాడుతాడు. అతనిపై మూడు పాటలు సినిమాలో చిత్రీకరించినా అతని పాత్రను పూర్తిగా ఆవిష్కరించేది ఈ పాటే.
ఆ సన్నివేశంలో వచ్చేదే ఈ పాట.
ఎంతో దూరం ప్రయాణించాక పగటిని
సంధ్యావధువు రహస్యంగా తనలోకి తీసుకుంటుంది
నా తలపుల వాకిటిలో
ఎవరో కలల దీపాలు వెలిగిస్తారు
ఎప్పుడైనా నా శ్వాస బరువైనప్పుడు
ఎప్పుడైనా నా కళ్ళు నిండివున్నప్పుడు
ఆటపట్టిస్తున్నట్టు, ప్రేమతో కదలాడుతూ
ఎవరో నన్ను స్పృశిస్తారు..కాని కంటికి కనపడరు
కొన్నిసార్లు ఈ హృదయాలు కలవలేకపోతుంటాయి
కొన్నిచోట్ల ఎపుడో,జీవితకాల బంధాలు ఏర్పడతాయి
చిక్కులు ఎంతో చిక్కనివి....నా మనసే నా విరోధి
నాది ఐనప్పటికీ ,వేరే వారి బాధను సహిస్తుంది.
నా మనసుకి నా లోలోపలి రహస్యాలన్నీ తెలుసు
నా పసిడి కలలు ఎలా ఛిద్రమయ్యిందీ తెలుసు
నా ఈ స్వప్నాలు .. ఇవి మాత్రమే నావి
వీటి నీడలు కూడా నానుండి దూరం కావు.
-ముళ్ళపూడి సుబ్బారావు
No comments:
Post a Comment