Showing posts with label kisor kumar. Show all posts
Showing posts with label kisor kumar. Show all posts

Friday, June 30, 2017

ముఝే నవ్ లఖా మాంగాదే రే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు -99A
‘ముఝే నవ్ లఖా మాంగాదే రే ‘, ‘లోగ్ కెహతే హై మై షరాబీ హు’
(ప్రియా!నాకు (9 లక్షల విలువైన) హారం తెప్పించు.),( ‘లోకులనుకుంటారు నేను తాగుబోతునని’)
...
షరాబి సినిమాలో ఆశా భోన్స్లే, కిశోర్ కుమార్ పాడినపాట.రచయిత అంజాన్,సంగీతం బప్పిలహిరి.
నాకుతెలిసి లిరిక్ గా అతిపెద్ద పాట. రెండు పాటలుగా కూడా చెప్పవచ్చేమో.
పాట మొదటి భాగం ఆశాబోన్స్లే స్వరంతో ఏదో జానపద గీతం ఆధారంగా తయారయ్యిందనిపించేలా ఉంటుంది.
రెండో భాగం కిశోర్ స్వరంతో మనుషులంతా ఏదో ఒక మత్తులోనే ఉంటారని చెబుతూ సాగుతుంది.భానుమతి పాడిన ఒక తెలుగుపాట ‘పిచ్చి పిచ్చి పిచ్చి,రకరకాల పిచ్చి’ ని ఈ పాట గుర్తుచెస్తుంది.

డెబ్భైలలో దర్శక నిర్మాత ‘ప్రకాశ్ మెహ్రా’ కు అమితాబ్ తో అనేక విజయాలందాయి. తొలి ఎనభైలలో కూడా వీరి కాంబినేషన్ ఆర్ధిక విజయాలనిచ్చింది కానీ పాత కీర్తిని పెంచలేదు. ఎనభైల తర్వాతి వాటిలో నాకు నచ్చిన సినిమా ‘షరాబి’. అమితాబ్ ,అమితాబ్ గా కనపడిన అతికొద్ది సినిమాలలో ఇది ఒకటి(పూర్తి స్థాయి కథానాయకుడిగా).
ముకద్దర్ కా సికందర్ లో ‘సలామె ఇష్క మేరీ జాన్’ పాట ఆ సినిమాకు పెద్ద ఆకర్షణ. ఆ సినిమా ప్రకాశ్ మెహ్రాదే. ఆ పాట దారిలో ‘షరాబీ’లో కూడా ఒక పాట పెట్టారు.
సంగీత దర్శకుడు బప్పిలహిరి. బి గ్రేడ్ సినిమాలకు సంగీతమందిస్తూ ఎనభైలలో పెరిగి ప్రధాన సంగీతకారుడయ్యాడు. నమక్ హలాల్, షరాబి వంటి అమితాబ్ సినిమాలకు సంగీతమిచ్చి, అమితాబ్ -ఆర్ డి బర్మన్, అమితాబ్ - లక్ష్మి ప్యారే ల కాంబినేషన్ కన్నా ముందుకెళ్ళాడు.
పాట

తనువెల్లా అలంకరించుకుంటాను
గుండె చప్పుడు లా నా కాలి అందెలు మోగినప్పుడు
ప్రియా!నాకు (9 లక్షల విలువైన) హారం తెప్పించు.
నుదుట బొట్టు(?) చెవులకు జూకాలు
కాళ్ళకు పట్టీలు, చేతులకు గాజులు
నిన్ను చేతుల్లోకి తీసుకుంటాను,నాకు దుస్తులు కుట్టించు
నిన్ను తనువుకు హత్తుకుంటాను,మెరిసే చుక్కలతో చునిరీ
అవి కట్టుకుని వస్తే అందరి చూపులూ నాపైనే
నన్ను అలంకరించు
ఈ అందం ...ఈ వయసు తో
నీకోసం నాట్యం చేస్తున్నాను
సూర్యుడి నడిగి సౌందర్య సామగ్రి తెప్పించు నా కోసం
నీ పెదవులు స్పృశిస్తా ప్రియతమా
జీవితమంతా ఎదురు చూస్తూనే ఉన్నా
ప్రియుని కళ్ళలోని అల్లరి కోసం
నీప్రేమలో కోల్పోయిన
నా జన్మజన్మల కలల్ని అలంకరించుకుని కూర్చున్నా
ఇప్పుడు అర్ధంచేసుకుని ఒప్పుకున్నా
హృదయం అర్పిస్తే ఏమౌతుందో
ప్రపంచం ఏడ్వనీ, లోకులు కోపగించనీ
నేను ప్రియుని ఇంటికి వెళ్ళవలసిందే
పూలదండ నవ్వినట్టు
నువ్వు కళ్ళతో నవ్వినట్టు
కిరణాలను నా పాపిట్లో అలంకరించు
పున్నమి చంద్రుని నా నొసట బొట్టుగా తే
నిన్ను నా నుదుట దిద్దుకుంటాను
మొత్తం మద్యశాలను నీ పాదాలపై చిలకరిస్తాను
**************
“లోకులనుకుంటారు నేను తాగుబోతునని
నువ్వు ,బహుశా అదే అనుకును ఉంటావు
అవును, లోకులనుకుంటారు నేను తాగుబోతునని
కొందరిలో యౌవన సౌందర్యాల నిషా
కొందరిలోప్రేమతరంగాల నిషా
కొందరికి కొందర్ని చూస్తే శ్వాస నుండి ఉబికివస్తుంది నిషా
తాగనప్పటికీ హద్దులుదాటి నడిచే నిషా
నిషా లో లేని వారెవరో కొద్దిగా చెప్పునాకు
తెలివి తో ఉన్నఎవరినైనా నా ముందుకు తీసుకురా
అందరూ నిషాలోనే ఉన్నారు..తేడా వాటి రంగుల్లోనే
వెలుగురేఖల ఉదయానికి తుషారపు నిషా
పవనానికి సుగంధాల నిషా, మేఘానికి వాన చినుకుల నిషా
కొందరికి సుఖమే నిషా, కొందరి కి బాధే నిషా
నిషా అనేది మద్యంలో ఉంటే మద్యపు సీసా నాట్యం చేస్తుంది
మద్యశాల ఊగుతూ ??????
ప్రియతమా! కళ్ళతో మధువు తాగించు కొద్దిగా
ప్రియతమా! నిన్ను నేను , నా శ్వాసలో బస చేయిస్తాను
ప్రియతమా! నీకు (9 లక్షలవిలువైన ) హారం చేయిస్తాను”



‘దేఖా ఏక్ ఖ్వాబ్ తొ యే సిల్ సిలే హుయే ‘

నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-96

‘దేఖా ఏక్ ఖ్వాబ్ తొ యే సిల్ సిలే హుయే ‘
(“ఒక సారి కన్న కల బంధాల పరంపర అయ్యింది)...
సిల్ సిలా సినిమాలో కిశోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడిన పాట.సంగీతం శివ్-హరి,సాహిత్యం జావేద్ అఖ్తర్
కాం పిటీటివ్ ఎగ్జామ్స్ కు తయారయ్యేక్రమంలో ‘హూ ఇస్ హు’ పుస్తకంచదవటం ఒకభాగం. అందులో కళాకారులు- వాద్యపరికరాలు ఒక చాప్టరు. బిస్మిల్లా ఖాన్- షెహనాయ్,అల్లారఖా- తబ్లా, పండిట్ రవిశంకర్- సితార్, శివ్ కుమార్ శర్మ- సంతూర్, హరిప్రసాద్ చౌరాసియా- ఫ్లూట్ ..ఇలా బట్టి వేయాలి. వాళ్ళ ను చూసిందిలేదు,విన్నది లేదు, ఆ పరికరాలు చాలా వరకూ తెలియనివి. అలా చదివిన చదువు వేరే రకంగా సార్ధకం అయ్యింది.
యశ్ చోప్రా తన సోదరుడు బి. ఆర్ . చోప్రా తో కలిసికొంత కాలం పనిచేసి, డెబ్భైలలో సొంతంగా సినిమాలు నిర్మించటం మొదలు పెట్టాడు. రాజేశ్ ఖన్నా మొదలుపెట్టి తర్వాత అమితాబ్ తో పలు చిత్రాలు నిర్మించాడు. వాటిలో ఎక్కువ చిత్రాలు మ్యూజికల్ హిట్లే.ఆర్.డి. బర్మన్, ఖయ్యాం, రాజేశ్ రోషన్ వంటి వారు ఆ సినిమాలకు స్వర రచన చేశారు. సాహిర్ లూఢియాన్వి ఉన్నంతకాలం (80 వరకు) వారికి పాటలు రాసారు.
ఎనభై నుండి యశ్ చోప్రా సంస్థకు రచయితతో పాటు సంగీత దర్శకులు కూడా మారారు. వారి సిల్ సిలా (1981) కు శివ్ హరి అనేవారు సంగిత దర్శకులు. సలీమ్ జావేద్ లలో ఒకరైన జావెద్ అఖ్తర్ తొలిసారిగా ఇందులో కొన్ని పాటలు రాసారు. అందులో పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి.
యశ్ చోప్రా తర్వాత సినిమాలకూ వారిదే సంగీతం. అందులో ‘చాందిని’, ‘లమ్హే’ సినిమాలు సంగీతపరంగా మంచి స్థాయి కలవి.
‘చాందిని’ సినిమాలో ఒక డ్యూయెట్ ‘తెరె మెరే హోటో పే మీఠే మీఠే గీత్ మిత్వా’ పాట వినటానికి హాయిగొలుపుతుంది. ఆ పాట మధ్యలో వచ్చే సంగీతం ఒక పాత పాట ను గుర్తుకు తెస్తుంది. ఆ పాత పాట ‘ దేఖ్ ఏక్ ఖ్వాబ్ తో యే సిల్ సిలే హుయే’. ఆ రెండు పాటల సంగీతం ‘శివ్ - హరి’ దే.
ఆ మధ్య కాలంలో ‘మ్యూజిక్ టు డె ‘వారివి ఇన్ స్ట్రుమెంటల్ సంగీతం చాలానేవచ్చింది.. అందులో ‘సౌండ్ స్కేప్స్ ’ ఒకటి. ఆ కాసెట్లో ఒకచోట ‘తెరే మెరే హోటో పే’ ని గుర్తుచేసే సంగీతం వినపడింది. ఆసంగీతం విద్వాంసుడు ‘ శివ్ కుమార్ శర్మ’దే . అతని వాయిద్యం ‘సంతూర్’.
వివరాలలోకి వెళ్తే శివ్- హరి అంటే శివకుమార్ శర్మ - హరి ప్రసాద్ చౌరాసియా లు. వారిరువురూ నాకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ద్వారా అంతకుముందెన్నడో పరిచితులు..

సినిమాలో పాటలో వందలాది ఎకరాల్లో తులిప్స్ పూలతోట. మంచుకొండలు, సెలయేర్లు, మంచుకమ్మిన సెలయేర్లు తొ పాట వర్ణమయం, సౌందర్యమయం. పాట లొకేషన్ మరో పాట ‘భవ్ రే నె ఖిలాయా ఫూల్’ (ప్రేమ్ రోగ్) ను గుర్తు తెస్తుంది.

“ఒక సారి కన్న కల బంధాల పరంపర అయ్యింది
చూపులు సాగినంత దూరం పూలు వికసించి ఉన్నాయి
నీ చూపులపై నాదో ఫిర్యాదు
ఇక్కడి పూలూ మన మధ్య దూరాన్ని పెంచుతున్నాయి
నా శ్వాస లో నీ సుగంధం నిలిచి ఉంది
అది నీ ప్రేమలో ఉన్న మాయాజాలం
నీ గాలుల్లో నీ పిలుపు వినవస్తుంది
గాలికెరటాల్లో ప్రేమ వర్ణాలున్నాయి
గుండె చప్పుడులో నీ గీతాలు కలిసి ఉన్నాయి
ఏమి చెప్పను . సిగ్గుతో పెదవులు తాళం పడి ఉన్నాయి
నీ సంరక్షణలో నా హృదయం ఉంది
రా ! నిన్ను నా చేతుల్లో దాచిఉంచుతాను
నా కంటిలో నీ చిత్తరువు ఉంది
దారుల్లో దూరం వరకూ కాంతి నిండి ఉంది.

రేపు ఈ వెలుగుల తోడు లేకుంటే?
వేయి ప్రేమదీపాలు వెలుగుతూ ఉంటాయి”



Friday, June 2, 2017

కహా తక్ యే మన్ కో అంధేరే ఛలేంగే

నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-89
“కహా తక్ యే మన్ కో అంధేరే ఛలేంగే”
(ఈ మనసులో చీకటి ఎప్పటివరకు)
బాతో బాతో మే సినిమాలో కిశోర్ కుమార్ ఆలపించిన పాట.సంగీతం రాజేశ్ రోషన్, రచన యోగేశ్.
తెలుగు సినిమా అప్పటికి (80ల నాటికి) అర్బనైజ్ (నగరీకరణ) కాలేదు. చాలా సినిమాల మూలాలు పల్లేలోనే ఉండేవి. నగరవాసులు అప్పటికి విలన్లే. ఐతే హిందీ సినిమాలు చాలారోజులకుముందే సిటీకి వచ్చేసాయి. నగరజీవిత నేపధ్యంలో సినిమాలు చాలానే ఉన్నాయి. 79లో వచ్చిన ‘బాతో బాతోమే’ అలాంటి ఒక నగర సినిమా.
అమితాబ్ ఒక రకమైన సినిమాల్లో సూపర్ స్టార్ ఐతే ,కథానాయకుడు అమోల్ పాలేకర్ మరో తరహా సినిమాల్లో సూపర్ స్టార్. అప్పుడు మధ్యతరగతి,ఉద్యోగాల్లో ఉన్న నగర యువతకు అతనో మోడల్.

బొంభాయిలో ఉద్యోగస్తుల జీవితం, ఆలోచనలు,కలలు వీటిని రియలిస్టిక్ అనిపించేలా తీసిన సినిమా ఇది. రైలులో ఉద్యోగానికి పోయిరావటం ,అందులో పరిచయాలు, ప్రేమలు, అర్ధాలు, అపార్ధాలు, పెద్దమనిషి మధ్యవర్తిత్వం వీటితో కథ సాగుతుంది. కథానాయిక తల్లి ఆశలవల్ల ప్రేమికులమధ్య దూరం పెరిగింది. ఆ దూరం కథానాయకుని బాధించింది. ఆ సందర్భంలో వెచ్చే పాట.

“ఈ మనసులో చీకటి ఎప్పటివరకు
బాధించే ఈ రోజులు ఎప్పుడు ముగుస్తాయి?
కొద్దిసేపు సుఖం, కొద్దిసేపు దుఃఖం ,ఇదే జీవితం
ఈ శిశిర ఋతువు ఒకటి రెండు ఘడియలపాటే
కొత్త పుష్పాలు దారిలో తిరిగి వికసిస్తాయి
బాధించే ఈ రోజులు ఎప్పుడు ముగుస్తాయి?
ప్రచండ వేగంతో వీస్తుంది గాలి
నా మనసులో నువ్వు నమ్మకాన్ని నిలిపావు
ప్రయాణంలో విడిపోయిన నిన్ను తిరిగి కలుస్తాను.
బాధించే ఈ రోజులు ఎప్పుడు ముగుస్తాయి?
ఎవరేమి చెప్పినా నిజమిదే
ప్రేమకెరటాలు ఎక్కడ మొదలైనా
వాటికి ఏదో ఒకరోజు ఒడ్డు దొరుకుతుంది
బాధించే ఈ రోజులు ఎప్పుడు ముగుస్తాయి?”

Monday, May 29, 2017

ఇక్ రాస్తా హై జిందగి ,జో థమ్ గయేతో కుచ్ నహీ

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-86
“ఇక్ రాస్తా హై జిందగి ,జో థమ్ గయేతో కుచ్ నహీ”
(జీవితమొక రహదారి,ఒక సారి ఆగితే ..ఏమీ మిగలదు). కాలా పత్తర్ సినిమాలో కిశోర్ కుమార్,లతా మంగేష్కర్ పాడిన పాట.
బొగ్గు గనుల పారిశ్రామిక ప్రాంతాలకి ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. ఈశాన్యప్రాంతం నుండి దక్షిణాదివరకూ కూడా దూరాలతో నిమిత్తం లేకుండా చాల సిమిలారిటీలు కోల్ బెల్ట్ లోకనిపిస్తాయి. లక్షలాది మంది పనిచేస్తున్న ఈ పరిశ్రమనేపధ్యంలో వచ్చిన సినిమాలు తక్కువే.వచ్చిన సినిమాల్లోకూడా మిగితా సాంఘిక సినిమాల్లోచూపేజీవితానికీ,నిజజీవితానికి ఉన్నంత దూరం ఉంది.
దీవార్ సినిమా లో నౌకాశ్రయంలో అమితాబ్ ను కోపధారియువకునిగా చూపి విజయం సాధించిన యాశ్ చోప్రా, ఈ సినిమాలో అమితాబ్ ను బొగ్గుగనుల నేపధ్యంలో ‘యాంగ్రీ యంగ్ మాన్’ గా చూపదలచాడు.
అమితాబ్,శత్రుఘన్ సిన్హా, శశి కపూర్, సంజీవ్ కుమార్ వంటి ‘స్టార్లు’, ముగ్గురు హీరోయిన్లు, సలీమ్ - జావెద్ రచన.. ఇవన్నీ సినిమా బలం.
కోల్ ఇండస్ట్రీ కి సంబంధించి మరువలేని ఒక చేదు జ్ఞాపకం ‘చస్నాల మైన్ డిజాస్టర్’ ఈ సినిమాకు క్లైమాక్స్.
సినిమాలో పాత్రలమధ్య సంఘర్షణ తారాస్థాయిలో ఉంటుంది.మూడు ముఖ్యపాత్రలూ భిన్న కారణాలతో పారిశ్రామిక ప్రాంతానికి వచ్చారు. అమితాబ్ గతంలో నౌకలో అధికారిగా పనిచేసి ఆపత్కాలంలో తన పిరికి చర్య కారణంగా అవమానాలకు గురయ్యాడు. అపరాధ భావన వెంటాడుతుంటే కోల్ మైన్స్ లో షెల్టర్ తీసుకున్నాడు. మరో పాత్ర శత్రుఘన్ సిన్హా చట్టంనుండి దాకోవటానికి అక్కడికి వచ్చి గనిలో పనికి కుదురుకున్నాడు. శశి కపూర్ మైనింగ్ ఇంజనీరుగా మంచి ఉద్దేశాలతో అక్కడికి పనిచేయటానికి వచ్చాడు.
తొలి సంఘర్షణ అమితాబ్ కి తనతో తనకే.దానిని ఎదుర్కోవటానికి స్వయం హననానికి పాల్పడేటంత తీవ్రమైనది. దానికో ఉదాహరణ గాయానికి ఆపరేషన్ చేసే సమయంలో అనస్థీషియా కు నిరాకరించటం. దానికి అతను చెప్పే సమాధానం ‘నొప్పి భరించడం అతని విధి’.
అతని తర్వాత సంఘర్షణ శత్రుఘన్ సిన్హాతో. మౌనం గా సీరియస్ గా ఉన్న అమితాబ్ లోపలి అగ్నిని అతడు కనిపెట్టి ,దానిని ఎక్స్ పోజ్ చెయ్యటానికి యత్నిస్తున్నట్టున్నాడు. అందుకోసం అమితాబ్ ను రెచ్చగొడుతుంటాడు.
వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాల చిత్రీకరణ, సంభాషణలు, భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి.
వీరిమధ్య సయోధ్య పెంచి ,అందరి ఉమ్మడి శత్రువుతో వాళ్ళు తలపడేట్టు చేసే పాత్ర శశి కపూర్ ది. అలాగే మరో శత్రువైన ఉపద్రవం(మైన్ అక్సిడెంట్) తో వారు ఉమ్మడి పోరు చేశారు.
సినిమాలో పాటలకు ‘రాజేశ్ రోషన్’ సంగీతమిచ్చారు.పాటల రచయిత సాహిర్ లూధియాన్వి.
ఈ పాట శశికపూర్ మైనింగ్ ప్రాంతానికి తొలిసారి మోటార్ సైకిల్ పై వెళుతున్న సందర్భంలోనిది.
రహదారి మీద పాట. రహదారిని జీవితంతో పోలుస్తూ సాగే పాట.పాడేఅతను ప్రయాణం ఆపి అక్కడి స్త్రీలు పాడేది వింటాడు. దానికి తనధోరణిలో సమాధానం చెబుతాడు.
కిశోర్: జీవితమొక రహదారి
ఒక సారి ఆగితే ..ఏమీ మిగలదు
ఈ అడుగు ఎక్కడ
ఆగినా ఏమీ మిగలదు.
లత: ఓ సాగిపోయే యాత్రికుడా!
నా చేతిని, ఈ దారిని
విడవవద్దు.తిరిగిరా!
కిశోర్: అందపు సెగలైనా
ప్రేమ పిలుపులైనా
స్వతంత్రంగా ఎగిరే పక్షుల్ని ఏమిఆపగలవు.
వచ్చేదారులు పోయేదారులు
యాత్రికులతో నిండిఉంటాయి
మనం లేకున్నా ఏం కాదు.
లత: అలాంటి బాధ పెట్టకు
ప్రియా! పరదేశం పోకు
నన్ను కూడా వెంటతీసుకునిపో
కిశోర్: సాగిపోయే బాటసారికి
నీడలతో బంధాలెందుకు?
క్షణకాలపు యాత్రికునికి
మనసుపెనవేతలెందుకు?
వచ్చేవారి,పోయేవారి అడుగులతో
రహదారులన్నీ నిండి ఉంటాయి
మనం లేకున్నా పోయేదేంలేదు.
-ముళ్ళపూడి సుబ్బారావు