Monday, May 15, 2017

తుఝ్ సే నారాజ్ నహీ జిందగీ,హైరాన్ హు

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-81

“తుఝ్ సే నారాజ్ నహీ జిందగీ,హైరాన్ హు”
(జీవితమా! నాకు నీపట్ల కోపం లేదు. ఆశ్చర్యం కలుగుతుంది). మాసూమ్(1983) సినిమాలో పాట.

బాగానచ్చిన  సినిమాలు కొన్ని తిరిగిచూసేటపుడు  జీవితాన్ని క్లోజ్ అప్ లో చూసినంత  భయంవేస్తుంది. సినిమాలో ఒకటికి మించిన పాత్రలతో ఐడెంటిఫై ఐనపుడు , ఆ సినిమా కరుణరసాత్మకమో, విషాందాంతమో ఐనపుడు అది మరింత ఎక్కువ. అలాంటి సినిమాకు చప్పున గుర్తొచ్చే ఉదాహరణ ‘మాసూమ్’(1983).

ఇద్దరు పిల్లలు, అన్యోన్య దాంపత్యం తో ఉన్న కుటుంబం. ఆ కుటుంబంలోకి ప్రవేశించిన పదేళ్ళ పిల్లవాడు. ఆ కుటుంబ యజమానిలో తన తండ్రిని వెతుక్కుంటున్నాడు. యజమాని భార్య పిల్లవాడిలో తన భర్త నమ్మకద్రోహాన్ని చూస్తుంది.యజమానికి ఆ పిల్లవాడు తను దాచిఉంచిన రహస్యం తాలూకూ నీడ.
చెట్టుమీది గూడునుండి పుట్టగానే నేలమీద జారిపడ్డ పక్షికూన లాంటి పిల్లాడు సినిమా నిండా కనిపిస్తాడు.
 
చేసిన పొరపాటు కు పర్యవసానాలు చేసిన వారిని మాత్రమే బాధిస్తే పరవాలేదు. పొరపాటు కు సంబంధం లేని వారికి కలిగే వ్యధలకు ,బాధలకు సమాధానం చెప్పాల్సివచ్చినపుడు? అతనికి  అమాయకపు మూగమోములోనే ప్రశ్నలు కనిపిస్తాయి.

ప్రతీ అనందానికీ ఖరీదు ఉంటుంది.ప్రతీ రహస్యం వెంటాడుతుంది. గతం నుండి విముక్తి అంతతేలికగా దొరకదు అని  ఈ పాట చెబుతుంది.
బెంగాలీ గాయకుడు అనూప్ ఘోషాల్ ఈ పాట పాడాడు. ఆర్డి.బర్మన్ సంగీతం,గుల్జార్ రచన.

“జీవితమా!
నాకు నీపట్ల కోపం లేదు. ఆశ్చర్యం కలుగుతుంది
నీ అమాయకపు ప్రశ్నలతో ఇబ్బంది కలుగుతుంది

అనుకోలేదు,
జీవించటం కోసం గాయాల్ని భరించాల్సి ఉంటుందని
నవ్వినందుకు, నవ్వుకు ఋణపడాల్సివస్తుందని

అనిపిస్తుంది
నవ్విన ప్రతి  నవ్వుకు పెదాలపై ఋణం మిగిలిఉంటుంది


జీవితమా! నువ్వు కలిగించే వ్యధను ఒక కొత్త బంధంగా భావించాను
ఎండలో కలిసిన ప్రతికలయికా చల్లని ప్రేమనీడగా భావించాను.

కళ్ళు అశృవులతో నిండినప్పుడు అవి వర్షిస్తాయి
ఎవరికి తెలుసు    రేపు ఈ కళ్ళు ఎవరికోసం తపిస్తాయో

నేను దాచుకున్న  ఒక కన్నీటిబొట్టును
ఎక్కడపోగుట్టుకున్నానో తెలిసేదెలా?”


No comments:

Post a Comment