Showing posts with label r d burman. Show all posts
Showing posts with label r d burman. Show all posts

Saturday, October 21, 2017

ఎక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-115
ఎక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా
(ఒక అమ్మాయిని చూసినపుడు ఎలా అనిపించిందంటే)
1994 లో వచ్చిన ‘1942 ఎ లవ్ స్టొరీ’ సినిమాలో పాట. కుమార్ సాను పాడిన పాట.
1942 కాలానికి చెందిన ( పీరీడ్) ఫిల్మ్ గా వచ్చిన ఆ సినిమాకి ఇప్పటి చిత్ర ప్రముఖులు విధు వినోద్ చోప్రా, సంజయ్ లీలా బన్సాలి పని చేసారు. ఆర్ డి బర్మన్ సంగీతదర్శకుడు. జావెద్ అఖ్తర్ గీత రచయిత.
అప్పటికి ఆర్ డి బర్మన్ సంగీత దర్శకుడిగా తన పునర్వైభవం పొందటానికి చాలానే కృషి చేస్తున్నాడు. ఆ కృషి ‘1942- ఎ- లవ్ స్టొరీ’ లో కనిపిస్తుంది. ఆ సినిమా సంగీతం అతనికి స్వయంగా నచ్చింది. అదే మాట తన పాత మిత్రులతో పంచుకున్నాడు. ఐతే అదే సినిమా అతని ‘హంస గీత’ మై పోయింది. సినిమా విడుదలై సంగీతం శ్రోతలకు చేరువయ్యేసరికి అతను మరణించాడు.
‘ఉపమ కాఌదాసస్య ‘ అంటారు. ఉపమాలంకారాన్ని వినియోగించటంలో అంతవారులేరని అర్ధమనుకుంటాను. కాఌదాసు ఉలిక్కిపడేట్టు జావెద్ అఖ్తర్ ఈ పాట రాసాడు. పాటలో చరణం తప్ప మిగతావన్నీ ఉపమానాలే. ఇరవై పైనే ‘ఎలా అనిపించింది’ అన్నదానికి సమాధానాలు. ఇన్ని ఉపమానాలు కాఌదాసు ఒకేచోట ఎప్పుడూ రాసిఉందక పోవచ్చు.
పాట పాడిన గాయకుడు ‘కుమార్ సాను’ ఎనభైల చివరి సంవత్సరాలలో ప్రముఖగాయకుడిగా గుర్తింపుపొందాడు. కిశోర్ కుమార్ అనుకరిస్తూ పాడిన అనేక గాయకుల్లో విజయవంతమైన గాయకుడు. కిశోర్ కుమార్ ను ఉన్నతశిఖరాల్లో నిలిపిన ఆర్ డి బర్మన్ ఎందువల్లో ‘కుమార్ సాను’ తో ఈ సినిమా వరకూ పాడించలేదు.
“ఒక అమ్మాయిని చూసినపుడు ఎలా అనిపించిందంటే
వికసించే గులాబీలా
కవి కన్న కలలా
వెలుతురు కిరణంలా
వనంలో హరిణిలా
వెన్నెల రాత్రిలా
చల్లని మాటలా
గుడిలో వెలుగుతున్న ఒక దీపంలా.
ఒక అమ్మాయిని చూసినపుడు ఎలా అనిపించిందంటే
అందమైన ఉదయంలా
శీతాకాలపు నీరెండలా
వీణానాదంలా
రంగుల రాణిలా
అల్లుకున్న తీగలా
కెరటాల ఖేఌలా
పరిమళాలతో వీచే చల్లని గాలిలా
ఒక అమ్మాయిని చూసినపుడు ఎలా అనిపించిందంటే
నాట్యంచేసే నెమలిలా
పట్టుదారంలా
దేవరాగంలా
చందనపు చిరుమంటలా
పదహారు రకాల అలంకరణలా
తెలిమంచులా
నెమ్మదిగా పెరుగుతున్న నిషాలా”


హమ్ న సంఝే థే బాత్ ఇత్నిసీ

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-113
‘హమ్ న సంఝే థే బాత్ ఇత్నిసీ’
(ఈ చిన్న విషయం నేను అర్ధం చేసుకోలేదు)
‘గర్దిష్ ‘ (1993) సినిమాలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.
ప్రభుత్వం, ఉద్యోగం ఇచ్చేముందు, అంటే అధికార వ్యవస్థ లోనికి రానిచ్చేముందు సదరు వ్యక్తి పై పోలీస్ ఎంక్వైరీ జరుపుతుంది. అతనిపై పోలీసు కేసులు, నేరపూరిత నేపధ్యం వగైరాలు లేవని తెలిసాక మాత్రమే ఉద్యోగం ఇస్తుంది. అదీ పోలీసు ఉద్యోగమైతే , మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. 
నిజాయితీ పరుడైన చిన్న స్థాయి పోలీసు ఉద్యోగికి తన కొడుకును పోలీసు ఇన్సపెక్టర్ గా చూడాలనికోరిక. కొడుకుకు చిన్నప్పటినుండి అందుకు తర్ఫీదు ఇస్తున్నాడు. అతని కల సాకారమౌతుందనుకున్న తరుణం లో పరిస్థితుల ప్రభావంవల్ల కొడుకు చట్టందృష్టిలో నేరమైన పని చేసాడు. తద్వారా పోలీసు ఉద్యోగి కావటానికి అనర్హుడయ్యాడు.
దర్శకుడు ‘ప్రియదర్శన్ ‘ అనేక మళయాళీ సినిమాలను 90 ల తర్వాత హిందీ లో తన ప్రత్యేకముద్రతో తీశాడు. అందులో ‘గర్దిష్’ సినిమా ఒకటి. అతడు నటుడు అమ్రిష్ పురి ని తన సినిమాలలో గొప్పగా వినియోగించు కున్నాడు. ఈ సినిమాలో పోలీసు కానిస్టేబుల్ గా అమ్రిష్ పురి ,అతని కొడుకుగా ‘జాకీ ష్రోఫ్’ నటించారు.
తండ్రీకొడుకులు క్రమంగా దూరం కావటం ఈ పాటలో కనపడుతుంది. ఆర్. డి. బర్మన్ చివరి సినిమాలలో ‘1942 ఎ లవ్ స్టోరీ’ బర్మన్ కు సంతృప్తి నిచ్చిందట. ‘గర్దిష్ ‘ సినిమా లో ఈ పాటా ఆయన అభిమానుల్ని అలరించింది.
ఎనభైల తర్వాత కథలు మాని పాటలు రాయటం మొదలుపెట్టిన ‘జావేద్ అఖ్తర్’ రచన ఇది.
“ఈ చిన్న విషయం నేను అర్ధం చేసుకోలేదు
స్వప్నం అద్ద మైతే
లోకం రాయిలాంటిదని.
ఈ చిన్న విషయం నేను అర్ధం చేసుకోలేదు
నేను కోరినది పొందినపుడు
వెలుతురు తనతో చీకటిని తెస్తుందని
చీకటి చిక్కనైనది
వెలుతురు పలుచనిది
ఈ చిన్న విషయం నేను అర్ధం చేసుకోలేదు
కేవలం విధ్వంసం, ఒంటరితనం
జీవితం నన్ను ఎక్కడికి తెచ్చింది.
గమ్యానికెళ్ళే దారులు తప్పాను
ఈ చిన్న విషయం నేను అర్ధం చేసుకోలేదు
ఒకరు అమ్మగలిగేదేమిటి? ఒకరు పంచగలిగేదేమిటి?
బజారులో పూల దుకాణాలు ఉన్నాయి”
నా దోసిట్లో కేవలం ముళ్ళు మాత్రమే ఉన్నాయి"

కభి బేకసీ నే మారా! కభి బేబసీనే మారా!

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-108
కభి బేకసీ నే మారా! కభి బేబసీనే మారా!
( కొన్ని సార్లు అసహాయత చంపుతుంది,కొన్నిసార్లు నిరాశ్రయత చంపుతుంది)
అలగ్ -అలగ్ సినిమాలో కిశోర్ కుమార్ పాట. ఆనంద్ బక్షి రచన,ఆర్ డి బర్మ సంగీతం
ఎనభైలో ‘రఫీ’ మరణంతో హిందీ సినిమా సంగీతం ఏకధృవ ప్రపంచమైపోయిందనుకున్నారు. ఆ ధృవం కిశోర్ కుమార్. ఐతే ఎనభై తరువాత వచ్చిన కిశోర్ కుమార్ పాటల్లో అతని స్థాయిని పెంచినవి బహు తక్కువ, నిలబెట్టినవీ కొద్దిగానే. అనూహ్యంగా అతనితో ఏమాత్రం సరితూగని గాయకులతో అతను పోటీపడాల్సి వచ్చింది. కిశోర్ కుమార్ ను డెబ్భైలలో ఆకాశంలో నిలిపిన ఆర్ డి. బర్మన్ సైతం ఎనభైలలో కిశోర్ తో కాకుండా షబ్బీర్ కుమార్ వంటి కొత్త గాయకులతో పాటలు పాడించాడు. షబ్బీర్ కుమార్ ‘మహమ్మద్ రఫీ’ ని అనుకరించే గాయకుడు (క్లోన్) కావటం ఒక వైచిత్రి.
నటుడు రాజేశ్ ఖన్నా కిశోర్ కుమార్, ఆర్ డి.బర్మన్ బృందం ఎన్నో విజయాలను చవిచూసింది. వారి కాంబినేషన్ ను కూర్చిన దర్శకుడు శక్తి సామంతా. (1969లో)
పదహారేళ్ళతర్వాత (1985 లో) రాజేశ్ ఖన్నా నిర్మాతగా మారి పై కాంబినేషన్ ను మరోసారి ప్రయత్నించాడు. ఆ సినిమా ‘అలగ్ -అలగ్’. ఫలితం మాత్రం మరో ‘ఆరాధన’ గా రాలేదు. ఐతే కిశోర్ కుమార్ ద్వారా ఒక ఉత్తమ గీతాన్ని అందుకోగలిగాం.
“ఇది గజల్ కాదు గీతమూ కాదు
ఇది నా బాధల గాధ
నా గుండెలో కేవలం అగ్ని ఉంది
నా కళ్ళలో కేవలం నీరు ఉంది
కొన్ని సార్లు అసహాయత చంపుతుంది
కొన్నిసార్లు నిరాశ్రయత చంపుతుంది
మృత్యువుతో పేచీ లేదు
నన్ను జీవితమే చంపేసింది
విధి ని అనేందుకు లేదు
మారనిదల్లా కాలమే
అప్పుడప్పుడూ దురదృష్టం
కొన్నిసార్లు నా లేనితనం
వేటి పేర్లు చెప్పను?
నన్ను అన్నీ చంపాయి.
మృత్యువుతో పేచీ లేదు
నన్ను జీవితమే చంపేసింది
నరక ప్రాయపు,అపనమ్మకపు లోకమిది
ఇదే లోకమైతే ఇదేమిలోకం?
స్నేహితులకు కొదవలేదు
శత్రువులకు కొరత లేదు
కొన్నిసార్లు శత్రుత్వం దోచింది
కొన్నిసార్లు స్నేహం చంపింది.
మృత్యువుతో పేచీ లేదు
నన్ను జీవితమే చంపేసింది
వెలుతురు పట్ల విముఖత వచ్చింది
చీకటి అలవాటైపోయింది
చీకటి ఉన్నంత వరకూ
కాలం బాగానే గడచింది
నన్ను వెన్నెల దోచింది
వెలుతురు నన్ను చంపింది"

Monday, May 15, 2017

తుఝ్ సే నారాజ్ నహీ జిందగీ,హైరాన్ హు

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-81

“తుఝ్ సే నారాజ్ నహీ జిందగీ,హైరాన్ హు”
(జీవితమా! నాకు నీపట్ల కోపం లేదు. ఆశ్చర్యం కలుగుతుంది). మాసూమ్(1983) సినిమాలో పాట.

బాగానచ్చిన  సినిమాలు కొన్ని తిరిగిచూసేటపుడు  జీవితాన్ని క్లోజ్ అప్ లో చూసినంత  భయంవేస్తుంది. సినిమాలో ఒకటికి మించిన పాత్రలతో ఐడెంటిఫై ఐనపుడు , ఆ సినిమా కరుణరసాత్మకమో, విషాందాంతమో ఐనపుడు అది మరింత ఎక్కువ. అలాంటి సినిమాకు చప్పున గుర్తొచ్చే ఉదాహరణ ‘మాసూమ్’(1983).

ఇద్దరు పిల్లలు, అన్యోన్య దాంపత్యం తో ఉన్న కుటుంబం. ఆ కుటుంబంలోకి ప్రవేశించిన పదేళ్ళ పిల్లవాడు. ఆ కుటుంబ యజమానిలో తన తండ్రిని వెతుక్కుంటున్నాడు. యజమాని భార్య పిల్లవాడిలో తన భర్త నమ్మకద్రోహాన్ని చూస్తుంది.యజమానికి ఆ పిల్లవాడు తను దాచిఉంచిన రహస్యం తాలూకూ నీడ.
చెట్టుమీది గూడునుండి పుట్టగానే నేలమీద జారిపడ్డ పక్షికూన లాంటి పిల్లాడు సినిమా నిండా కనిపిస్తాడు.
 
చేసిన పొరపాటు కు పర్యవసానాలు చేసిన వారిని మాత్రమే బాధిస్తే పరవాలేదు. పొరపాటు కు సంబంధం లేని వారికి కలిగే వ్యధలకు ,బాధలకు సమాధానం చెప్పాల్సివచ్చినపుడు? అతనికి  అమాయకపు మూగమోములోనే ప్రశ్నలు కనిపిస్తాయి.

ప్రతీ అనందానికీ ఖరీదు ఉంటుంది.ప్రతీ రహస్యం వెంటాడుతుంది. గతం నుండి విముక్తి అంతతేలికగా దొరకదు అని  ఈ పాట చెబుతుంది.
బెంగాలీ గాయకుడు అనూప్ ఘోషాల్ ఈ పాట పాడాడు. ఆర్డి.బర్మన్ సంగీతం,గుల్జార్ రచన.

“జీవితమా!
నాకు నీపట్ల కోపం లేదు. ఆశ్చర్యం కలుగుతుంది
నీ అమాయకపు ప్రశ్నలతో ఇబ్బంది కలుగుతుంది

అనుకోలేదు,
జీవించటం కోసం గాయాల్ని భరించాల్సి ఉంటుందని
నవ్వినందుకు, నవ్వుకు ఋణపడాల్సివస్తుందని

అనిపిస్తుంది
నవ్విన ప్రతి  నవ్వుకు పెదాలపై ఋణం మిగిలిఉంటుంది


జీవితమా! నువ్వు కలిగించే వ్యధను ఒక కొత్త బంధంగా భావించాను
ఎండలో కలిసిన ప్రతికలయికా చల్లని ప్రేమనీడగా భావించాను.

కళ్ళు అశృవులతో నిండినప్పుడు అవి వర్షిస్తాయి
ఎవరికి తెలుసు    రేపు ఈ కళ్ళు ఎవరికోసం తపిస్తాయో

నేను దాచుకున్న  ఒక కన్నీటిబొట్టును
ఎక్కడపోగుట్టుకున్నానో తెలిసేదెలా?”


Wednesday, March 29, 2017

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-30’'పల్ దో పల్ కా సాత్ హమారా' 27 January
“ ఉమ్ర్ క రిస్తా జోడ్నె వాలె
అప్ని నజర్ మె దీవానె హై “ 

 'పల్ దో పల్ కా సాత్ హమారా' పాటలో ఒక పదం ఇది
( జీవితకాలపు జోడు కట్టాలనుకునేవారు నా దృష్టిలో పిచ్చివారు)
...
నలభై యేళ్ళ క్రితం.. "గులాబి పూలతోటలో,ఖవాలి తీపి పాటలో" అంటూ ఒక పాట మధ్యలో వచ్చింది. 'ఖవాలీ అంటే ఏమిటని మా పెద్ద తెలుగు మాష్టార్ని అడిగాను. పాఠాలగురించి కాకుండా పాటల గురించి అడుగుతున్నందుకు కోప్పడ్డాడు.తర్వాత ఖవాలి అంటే ఏమిటోకాదుగానీ రెండు తెలుగు ఖవాలీ పాటలు చెప్పాడు.అవి 'మేడలో ఉన్న చిలకమ్మా','స్నేహమేనా జీవితం'.తర్వాత హిందీ సినిమా ఖవాలీలు విన్నా తెరమీద చూసింది మాత్రం 'బర్నింగ్ ట్రెయిన్ ' సినిమాలో.ఆ పాట 'పల్ దో పల్ కా సాత్ హమారా'
'సూపర్ ఎక్స్ ప్రెస్ ' అనే ప్రతిష్టాత్మక రైలు తొలిసారిగా ఢిల్లీ నుండి బొంబాయి ప్రయాణం ప్రారంభించింది.అందులో మినీభారతదేశమనదగ్గ ప్రయాణికుల సముదాయం ఉంది. ఒక మహారాజ, వజ్రాల వ్యాపారి,స్మగ్లర్,ఒక పూజారి,స్కూలు పిల్లలతోక్రైస్తవ ఉపాధ్యాయని,తన బృందంతో ఒక సంగీతకళాకారిణి,కొత్తగాపెళ్ళైన జంట,టిక్కెట్టు లేకుండా ప్రయాణించే ఇద్దరు వ్యక్తులు,ఒక సిక్కు కుటుంబం,ప్రేమను తెంచుకున్న యువతి,పెళ్ళివద్దనుకుని నగలతో ఇంటినుండి పారిపోతున్న యువతి,ఆ నగలపై కన్నుపడ్డ దొంగ,మారువేషంలోఉన్న పోలిసు,రైలు సిబ్బంది ... వీరంతా విలాసవంతమైన ఆ కొత్త రైలు ప్రయాణాన్నీనుభవిస్తున్నారు.
ఐతే అప్పటికే ఆ రైలు కి బ్రేకులు ఫెయిలైఉన్నాయి.అదితెలిసిన కొందరు రక్షణకోసం ప్రయత్నిస్తున్నారు. అది తెలియని ప్రయాణికులు ఆనందగీతాలాపనలో ఉన్నారు.వారికి రాబోయే ప్రమాదంపట్ల సినిమా ప్రేక్షకులకున్న ఆదుర్దా వారికి లేదు. వారు పాడే పాటా సన్నివేశానికి తగిందే.
“ఒకటి రెండు క్షణాల ప్రయాణం మనది,ఒకటి రెండు క్షణాల స్నేహం మనది
ఈ మజిలీ లో కలిసినవారు తరువాతి మజిలీలో విడిపోతారు
ప్రతీ ఆనందం కొద్దిసేపటి అతిధి మాత్రమే...
మనసులోకి ప్రతి కోరికనూ తీర్చేసుకో
కళ్ళలోని చిలిపిదనం,పెదవులపైని వెచ్చదనం
ఇప్పటి మన కలయికలో ఉన్నాయి.రేపేమౌతుందో ఎవరికి తెలుసు?
ఈ క్షణం ఆనందమయమైన స్వర్గం.ఈ క్షణంలో జీవించు
ఈనాటి సుఖాలు వాస్తవాలు. రేపటి సుఖాలు కల్పితగాధలే.
జీవితం వేగంగాసాగే తుఫాను వంటిది.దానిని వెంటాడాలనుకోవడం పిచ్చితనం
కనపడని ఆనందాలకోసం హైరానా దేనికి?
గడచిపోయిన కాలం తిరిగివచ్చేనా?
అందరూ మొదట్లో దారితెలియనివారే
జీవితమంటే దారితెలుసుకోవటమే
మిత్రులారా నేను నమ్మిందిదే
ఎవరైనా మీతో గడిపిన కాలం వారు మీకు చేసిన ఉపకారం
జీవితకాలపు జోడు కట్టలనుకునేవారు
నా దృష్టిలో పిచ్చివారు
ఊగు (ఆడిపాడు) ..ఆనందించు
ఊపిరి ఉనంతవరకూ ఆడిపాడు ఆనందించు
ఆనందించడమే జీవితానికి ఇచ్చే మర్యాద.”
ఒక తెలుగు పాటలో శ్రీ శ్రీ అంటారు" నిన్న మరల రాదు, రేపు మనది కాదు..నేడే నిజం..నేడే సుఖం" అని.పాటలో చెప్పేది విన్నప్పుడు కాసేపు నిజమేగా అనిపిస్తుంది.ఈ ఆలోచనను ఎంతమాత్రం జీవితంలోకి స్వీకరించవచ్చు అనేది మనిషిమనిషికి మారుతూ ఉంటుంది.
-ముళ్ళపూడి సుబ్బారావు

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-25
'హమె తుమ్సె ప్యార్ కిత్నా'17 January

 (నిన్నెంత నేను ప్రేమిస్తున్నానో నాకు తెలీదు )
...
'నిజం సమాధి కాదు ' అనేదానికి , 'స్కెలిటన్ ఇన్ ది కప్ బోర్డ్' అనే ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ కు చిత్రరూపం 'కుద్రత్ ' సినిమా.రాజేష్ ఖన్నా,హేమమాలిని,వినోద్ ఖన్నా,రాజ్ కుమార్ వంటి పెద్ద తారాసందోహం,విడుదలకు రెండేళ్ళ ముందునుండే ప్రచారకర్తల్లా పనిచేస్తున్న సూపర్ హిట్ గీతాలు చిత్రాన్ని జనానికి చేరువచేశాయి.సినిమా కథ అంతకుముందు రాజేష్ ఖన్నా,హేమమాలిని తోనే వచ్చిన మెహబూబా తరహాలోనే పూర్వజన్మ జ్ఞాపకాలతోనే సాగుతుంది.
తండ్రి గతంలో చేసిన నేరం తాలూకూ సాక్ష్యాన్ని కాల్చేసి దానితోపాటు తనూ దగ్ధమైపోయిన పాత్రలో ప్రియ రాజ్ వంశ్, కోర్ట్ లో తనపై వేసిన కేసు వాపసు తీసుకున్నా, సాక్ష్యాలు లేకపోయినా 'ఈ కోర్ట్ ను మించిన కోర్ట్ పైన ఒకటుందని దానినుండి తప్పించుకోలేమని ' చెప్పి శిక్ష అనుభవించిన పాత్రలో విలన్లాంటి పాత్ర లో రాజ్ కుమార్, ..ఈ రెం డు పాత్రలూ సినిమాలో గుర్తుండిపోయాయి.
'మెహబూబా' చిత్రంలో 'మేరే నైనా సావన్ బాధో' పాట రెండు వెర్షన్లు వున్నట్టే కుద్రత్ లో 'హమె తుమ్సె ప్యార్ కిత్నా' కూడా రెండు వెర్షన్లు వుంది. రెండు సినిమాలకూ ఆర్ డి బర్మన్ సంగీత దర్శకుడు.
ఐతే కుద్రత్ సినిమాలో ఫిమేల్ వెర్షన్ పాట పూర్తి క్లాసికల్ తరహాలో ఉంటుంది. గాయని ప్రముఖ శాస్త్రీయ కళాకారిణి పర్వీన్ సుల్తానా. పాట అర్ధం దగ్గర దగ్గర ఒకటైనా ఈ వెర్షన్లో పదాలు వేరుగా ఉంటాయి.
ఒక కచేరీలో మధ్యవయస్కురాలు పాటపాడుతూ ఉంది.. క్రితంజన్మలో ఆ మె కు సంబంధం ఉన్న ఇద్దరు అక్కడ పాట వింటున్నారు. గతజన్మ స్మృతులు వారిలో ఒకరికి తెలుస్తున్నాయి. ఆ పాటా గత కాలానికి చెందినదే.
శ్రావ్యమైన పర్వీన్ గాత్రంతో వచ్చిన ఈ పాట ఆ సినిమాకొక ప్రత్యేకతనిచ్చింది. అస్సాం కళాకేంద్రమైన నగావ్ లో ఇరాని, అఫ్గని మూలాలున్న తల్లితండ్రులకు జన్మించిన పర్వీన్ సుల్తానా శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది.బహు బిరుదాంకితురాలు.పరిమిత సంఖ్యలో సినిమా పాటలు పాడింది.అందులోఒక మణిపూస ఈ పాట.
“నిన్నెంత నేను ప్రేమిస్తున్నానో నాకు తెలీదు
కాని నువ్వు లేకుండా మాత్రం జీవించలేను
నేను సదా నీపట్ల పిచ్చిదానే
ప్రియా, నువ్వు అప్పటి ప్రేమను మరచిపోయావు
నా విలువ నువ్వు తెలిసుకొనట్లేదు
ప్రియా,ఎవరి చూపునీపై పడిన
నేను చూడలేకపోతున్నా
నా మనసు రగిలిపోతుంది”
-ముళ్ళపూడి సుబ్బారావు