Sunday, May 21, 2017

షీషా హో యా దిల్ .. ఆఖిర్ టూట్ జాతా హై

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-82
షీషా హో యా దిల్ .. ఆఖిర్ టూట్ జాతా హై
(అద్దమైనా, హృదయమైనా ,చివరికి ముక్కలైపోతుంది.)

1980 ఒక సూపర్ హిట్ గీతం ఇది.అప్పుడే కాదు ఇప్పటికీ శ్రోతలు ఈ పాటను కోరుతూనే ఉంటారు.దృశ్యపరంగా గొప్పగా ఉండదు.

సినిమా పేరు ‘ఆశా’. పాట లో నిరాశ ఉందా? నిర్వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుందా? ఉన్నదాంతో సర్దుకుపొమ్మంటుందా?

సినిమాలో హీరోయిన్ వృత్తి గాయకురాలు. లారీ డ్రైవర్ ఐన హీరో ఆమె కు ఒకసారి సాయపడి స్నేహితుడయ్యాడు. అప్పటికే అతనికి భార్య ఉంది. భార్యతో గాయకురాలి ప్రదర్శన కు వెళ్ళాడు. అప్పటి పాట ఇది. పాటలో ప్రతిఫలించేటంత నిరాశ అప్పటికి ఆమె జీవితంలో కనపడదు. ‘ఫోర్ షాడోయింగ్’ ద్వారా జరగబోయేది చెబుతున్నారా? ‘యధ్బావం తద్భవతి’ అంటారు. ఆమె ఆలోచనలను బట్టి ఆమె ఆశ ఫలించదని చెలియజెబుతున్నారా?

పాట రచయిత ‘ఆనంద్ బక్షి’. 70ల తర్వాత పాటల రచయితగా ఎక్కువగా వినపడిన పేరు. అతని పాటలు తేలికైన చిన్న చిన్న పదాలతో సాగుతూ ఒక మాదిరి హిందీ తెలిసిన వాళ్ళకుకూడా అర్ధమయ్యేట్టు ఉంటాయి. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ స్వర కల్పన.లతామంగేష్కర్ గానం.

(ఈ సినిమా తెలుగు రూపం ‘అనురాగదేవత’లో ఈ పాటకు వేటూరి రాసిన పల్లవి “చూసుకో పదిలంగా, హృదయాన్ని అద్దంలా,పగిలేది ఖాయం ఏదైనా! రగిలేను నీలో వేదనా!”)

హిందీ పాట అర్ధం:

అద్దమైనా, హృదయమైనా
చివరికి ముక్కలైపోతుంది.

చేతినుండి పెదవులకు అందేలోపే
సముద్రం వెనక్కి వెళ్లిపోతుంది

కోరికలు ఉండగానే సరిపోదు
కలయిక అంత తేలిక కాదు
లోకం అసహాయుల్ని చేస్తుంది
విధిరాత రాసి ఉండాలి
కోరికలకు ఒకదానితో ఒకటి పోటీ
వాటికి రాజీ ఎలా?
ఒక దానిని కోరితే
రెండవది కోపగిస్తుంది.

గట్టున కూర్చుని
అలల్ని గమనిస్తూ
నేను తుఫానులతో ఆడుకుంటున్నాను
హృదయపు కోరికలతో ఆడుకుంటున్నాను

నాకు అప్పుడు తెలియదు
ఎవరూ తోడు రారని
నావికుడు వదిలి వెళ్లిపోతాడని
ఒడ్డు దూరమైపోతుందని
******
ప్రపంచం ఒక నాటకం
ఆశ నిరాశలమయం
కొద్దిగా పూలు ఉన్నాయి,ముళ్ళు ఉన్నాయి
విధి వారికి పంచుతుంది
ఎవరి బాకీ ఎంతో అంత
ఎవరి కథ ఎంతో అంత
కొందరు దోచుకోబడతారు
కొందరు దోచుకుంటారు.

No comments:

Post a Comment