'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-76’
“జానే కహా వో దిన్ “(ఎక్కడికి పోయాయి ఆ రోజులన్నీ?)
మేరా నామ్ జోకర్ లో పాట ,గానం ముఖేష్, సంగీతం శంకర్ జైకిషన్, సాహిత్యం హస్రత్ జైపురి
‘మేరా నామ్ జోకర్’ సినిమా ఫలితం రాజ్ కపూర్ కు నిరాశ కలిగించిందంటారు. ఐతే రోజులు గడిచాక సినిమా ఒక క్లాసిక్ గా మారింది.
రిపీట్ రన్ లో సినిమా చూసాను. . పేజీ లోపు ఉన్న ‘జాన్ కీట్స్’ కవిత ‘హ్యూమన్ సీజన్స్ ‘ కు మూడు గంటల చిత్రరూపమనిపించింది. వ్యక్తి పూర్తి జీవితాన్ని అంటే బాల్యం నుంది వృద్దాప్యం వరకూ చూపే సాంఘిక చిత్రాలు అరుదు. ఈ సినిమా లో అది చూస్తాము.
కథానాయకుని జీవితంలో వివిధ దశల్లో అనుభవాలు (బాల్యంలో,యవ్వనంలో, మాన్ హుడ్(?) లో), ఆ దశల్లో ఎదురైన స్త్రీలు, వారితో ఏర్పడ్డ/ తెగిన బంధాలు, చివరిలో ఆ అనుభవాల నెమరువేత ,ఆంతరంగికశోధన ..వీటిని చెబుతూ కథానాయకునిఅనుభవాలతో ప్రేక్షకుల సహానుభూతుల్ని చేస్తుందీ సినిమా.
బాల్యంలో అతను తన తండ్రి లానే జోకర్ కావాలనుకుంటాడు. జీవిత భాగస్వామి జోకర్ జీవితాన్నిచూసి ఉన్న అతని తల్లి అదివద్దని వారించింది. తల్లి అనుభవం అతనికి అక్కరకు రాలేదు.సర్కస్ లో జోకర్ గా అతని చేష్టలు ప్రేక్షకుల్ని నవ్విస్తుంటే, అతనికి జరగబోయే ఆపదల్ని తలుచుకుని తల్లి తల్లడిల్లుతుంది. తల్లి మరణం కారణంగా అతను కార్చే కన్నీరు కూడా ప్రేక్షకుల్ని ఆనందపరుస్తుంది.
బాల్యంలో తననభిమానించే టిచర్ పట్ల ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఆమెకు దూరమై బాధపడ్డాడు. యువకుడైనాక ఒక యువతి కి సాయపడి ఆమెకు దగ్గరయ్యాననుకున్నాడు. ఆమె తారగా ఎదిగి దూరమయ్యింది. మరోదశలో సర్కస్ లో జోకర్ గా ఉన్నపుడు, ఓ రష్యన్ యువతి ఇతనిపట్ల ఇష్టాన్ని చూపింది. ఆ కథా సఫలంకాలేదు.
జీవితపు మలి సంధ్యలో సర్కస్ లో అతని పెర్ఫార్మెన్స్ చూడటానికి వీరంతా వచ్చారు.ఆ సందర్భం లో ఈ పాట .చూస్తున్న వారికి గతం కళ్ళముందు కదలాడింది. వారి మనసూ కదులుతుంది.
“ఎక్కడికి పోయాయి ఆ రోజులన్నీ?
చెబుతుండేవారు
నా దారిలో చూపులు పరచి వుంచుతామని
నువ్వు ఎక్కడ ఉన్నా
నేను జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే వుంటాను
నున్ను మరువలేను
నా పాద ముద్రలు పడిన చోటల్లా
నా మిత్రులు వంగి ఆ నేలను ముద్దాడేవారు.
వెళ్లిపోయే వసంతం
నన్ను ఎంతగానో రోదింపజేస్తుంది
నిన్నాఈరోజూ ,నా కళ్ళకు
పగళ్ళు కూడా చీకటి రాత్రులే
నా నీడ మాత్రమే నా సహచరి”
మరో పాట ‘జీనా యహా మర్నా యహా ‘ కు కొనసాగింపు పై పాట తర్వాత వస్తుంది.
రేపటి ఆటలో నేనున్నా లేకున్నా
ఆకాశంలో తారలు ఎప్పటికీ ఉంటాయి
నువ్వు మరుస్తావు..వారు మరుస్తారు
కాని నేను ఎప్పటికీ మీవాడినే
నా గుర్తులు ఇక్కడ ఉంటాయి
ఇక్కడికి బదులు వెళ్ళగలిగేది ఎక్కడికి ?
నువ్వు కోరినపుడు నన్ను పిలువు
నేనిదివరకెక్కడున్నానో ఇప్పుడూ అక్కడే ఉన్నాను
నా రెండు లోకాలు ఇక్కడే.
ఇక్కడికి బదులు వెళ్ళగలిగేది ఎక్కడికి ?
-ముళ్ళపూడి సుబ్బారావు
No comments:
Post a Comment