Wednesday, March 29, 2017

Tu kaha ye batas


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-43’'తూ కహా ఏ బతా ..ఇస్ నషీలీ రాత్ మే'  24 February
'చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమని '
...
కోటి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట విన్నప్పుడు బాగున్నట్టు అనిపించి ఏదో పాత పాట జ్ఞాపకాల్లో మెదిలీమెదలక ఉండిపోయింది.అదే పాట టీ వీ లో చూశాక మళ్ళీ ఎక్కడో కదలిక.అలాంటిదే ఎక్కడో విన్నట్టు…….సన్నటి తీగల అరిసెలపాకంలా తీయగా సాగిన రఫీ గొంతు,ఎస్.డి.బర్మన్ సంగీతం , ఆపై లవర్ బాయ్ గా దేవానంద్ అభినయం ..ఇంకా... విలక్షణమైన నూతన్అందం ఇవన్నీ గుర్తొచ్చాయి..... ఆ పాట 'తూ కహా ఏ బతా ..ఇస్ నషీలీ రాత్ మే' .(సినిమా 'తెరె ఘర్ కె సామ్‌నె ' పాట రచన హస్రత్ జైపురి)
నిద్ర పట్టి పట్టని సమయంలో పక్కింట్లోనుంచి ఛాయాగీత్ ప్రోగ్రాం లాంటి దాన్నుంచి వచ్చే ఈ పాట వింటుంటే చిరు చలిలో,వెన్నెట్లో ఖాళీ ఐన పట్నపు వీధుల్లో ఇధమిద్ధంగా తెలియని దేనికోసమో తిరుగాడుతున్నట్టు..కళ్ళకు రంగులేవీ కనపడకుండా నలుపు తెలుపు సినిమాలా పరిసరాలున్నట్టు ...రఫీ గొంతు తోడుగా వస్తున్నట్టు...
పాట చిత్రీకరణ ఆహ్లాదకరంగా సాగుతుంది.కథ్హనాయకుడు ప్రేయసి జాడకోసం పొద్దు పోయాక రాత్రివేళలో నగరపు వీధుల్లో తిరుగాడుతున్నాడు.నిద్రలో సోలిపోబోతున్న వీధిని తన పాటతో విసిగించాడు.కొందరు కోపగించారు.ఒకతను ప్రేమబిక్షగాడిని నిజమైన బిక్షగానిగా తలచాడు.ఎదురైన ప్రేమ జంట అతని బాధను అర్ధంచేసుకున్నట్టున్నారు. మొత్తంమీద అతను కార్యసాధకుడయ్యాడు.
“ఈ మత్తుగొలిపే రాత్రిలో నువ్వెక్కడున్నవో అది చెప్పు
ఉన్మత్తమైన మనసు నా మాట వింటేనా?
ఈ పరిసరాలు చిలిపివైనవి
ప్రతి చోటూ అందంతో నిండి ఉంది.
నాnitturpula nuMDi వచ్చిన మేఘాలు నలువైపులా కమ్ముకున్నాయి.
నా ప్రియా..నా గుండెను మండించకు ...నువ్వెక్కడ?
చల్లగా వీచే చిరుగాలిని
నీ జాడ నేనడిగా..
నన్ను మరింత అలజడిలో ముంచి అది తప్పించుకుంది.
ప్రేమతొ నన్ను శిక్షించు...నువ్వెక్కడ?
తారలు, చంద్రుడు విన్నారు
ఈ వసంత కాలం వింది
నా వేదనాగీతాన్ని,రహదారులు విన్నాయి.
ప్రియా..నువ్వూ విను ..ఇప్పుడే రా..నీవెక్కడా?
ప్రేమ శక్తిని చూడు
ప్రేమవత్తిడితో నువ్వొచ్చావు.
నేడు నేను కోరిన దారి దొరికింది.
ఎందుకు దాగుతావు.ఒక సారి కనిపించు...నీవెక్కడ?
-ముళ్ళపూడి సుబ్బారావు




'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-42’
'హోకె మజ్బూర్ హమే ఉస్ నే భులాయాహోగా '22 February

 (ఏమీచేయలేనిస్థితిలో ఆమె నన్ను మరచిపోయి ఉంటుంది).'హకీకత్ ' సినిమాలో పాట.
యుద్ధం తాతయ్య గారని ఒకాయన మా చిన్నతనంలో వుండేవాడు.మిలటరీ లో పనిచేసి రావటంవల్ల ఆయనకాపేరు. భజన కార్యక్రమాల్లో హార్మొనీ వాయించేవారు.చనిపోయేదాకా తాడిచెట్టులా ఏ మాత్రం వంగకుండా వున్నాడు. మామ వరసయ్యే మరొకాయన మిలటరీ లో పనిచేసి మా వూహ తెలిసేసరికి ఆర్ టి సి లో డ్రైవరు గా కుదురుకున్నాడు.మావూర్లోనే పనిచేసే ఫారెస్ట్ ఉద్యోగికొడుకొకాయన అప్పటికి మిలటరీలో పనిచేస్తూ సెలవలకు మా వూరొచ్చేవాడు.ఆయన సాహసాలు వినటానికి,అతనుతెచ్చే మిలటరి నేపధ్యపు తెలుగు మాగజైనుకోసం అతని చుట్టూ మూగేవాళ్ళం.
ఇంట్లోంచి పారిపోయి గుంటూరెళ్ళి యుద్ధంలో చేరిపోవటం గురించి పెద్దాళ్ళు అనుకునేవారు.సైన్యానికి సంబంధించి నా జ్ఞాపకాలు ఇవి.
వివిధభారతిలో సాయంత్రం 7.05నిముషాలకు 'జయ్ మాల 'పేరుతో సైనికులకోసం ప్రత్యేకంగా పాటల ప్రోగ్రాం వస్తుండేది. కాలేజి రోజుల్లో మెస్ కు వెళ్ళేప్పుడో ,వచ్చేప్పుడో దారిలో ఇళ్ళనుండి ‘జయ్ మాల’ ప్రోగ్రామ్ ట్యూన్ వినవచ్చేది. డ్రమ్ముల శబ్దం,మార్చింగు తరహా సంగీతంతో ఆకర్షించేది.
ఆ కార్యక్రమం లో సైనిక నేపధ్యపు పాటలు వచ్చేవి.చాలా పాటలు రిపీట్ ఔతుంటాయి. అలా విన్న పాటల్లో మెల్ల మెల్లగా మనసుకు దగ్గరైన ఒక పాట..."హోకె మజ్ బూర్ ఉస్ నే భులాయా హోగా".ఇది 'హకీకత్ ' సినిమాలోనిది.
ఈ సినిమా శ్రీనివాస టాకీస్(ఏలూరు ) లో 83లోమార్నింగు షో గా వచ్చింది. పాట కోసం సినిమా చూశాను.నలుపు తెలుపు సినిమా. అప్పుడు నన్ను గొప్పగా ఆకర్షించ లేదు.
క్రమంగా అవగతమైన విషయం ..’హకీకత్’ సినిమా 'మదర్ ఆఫ్ ఇండియన్ వార్ మూవీస్ ' గా పేరుపొంది అనేక సినిమాలకు ఆధారమయ్యింది.
చేతన్ ఆనంద్ దర్శకత్వం ,బలరాజ్ సహ్ని,ధర్మేంద్ర,విజయానంద్,సంజయ్ ఖన్ వంటి పెద్దనటులు, అప్పుడే జరిగిన ఇండో చైనా వార్ నేపధ్యం, దేశం కోసం రక్త తర్పణ చేయమంటూ రోమాంచితంచేసే కర్ చలే హం ఫిదా జాన్ ఓ తన్ సాథియో వంటి పాటలు .. చిత్రాన్ని యుద్ధ సినిమాలకు ఒక కొలమానం గా మార్చాయి.
ఐతే 'హోకె మజ్బూర్ హమే ఉస్ నే భులాయాహోగా ' పాట మాత్రం నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ పాట ఒక్క సైనికులకనే కాదు, ఇష్టమైన తనవారి ఎడబాటు అనుభవిస్తూ,దానికి తోడు కష్టాలు అనుభవిసూ,రేపటి పట్ల భరోసా లేకుండా, అసహాయులైన తనవారికోసం తల్లడిల్లే అనేకమందిని గుర్తుతెస్తుంది.
సినిమానే కాదూ, నాకు సంబంధించి ఈ పాట కూడా మల్టి స్టారరే.. పాత తరం గాయకుడు 'తలత్ మొహమూద్ ',శాస్థ్రీయ గానంలో ఉద్దండుడు 'మన్నాడే ', విశేషణాలు అవసరం లేని మహమ్మద్ రఫీ, తలత్ మొహమూద్ నుండి బాటన్ అందుకుంటున్నట్టు 'భూపేందర్ '(అతనికిది తొలిపాట?) ..వీరందరి గాన వాహిని ఈ పాట.ఈ పాట రచన దిగ్దంతుడు 'కైఫీ ఆజ్మీ ' సంగీతం 'మదన్ మోహన్ '.
“ఏమీచేయలేనిస్థితిలో ఆమె నన్ను మరచిపోయి ఉంటుంది
మౌనంగా బాధను విషంలాంటి మందులా మింగి ఉంటుంది
పాత కథలు ను ఆమె మనసు వినిపించి ఉండి ఉంటుంది
కన్నీటిని కళ్ళతో తాగేసి పొర్లనీకుండా చేసుంటుంది
తలుపులు మూసిన గదిలో నా ఉత్తరాన్ని కాల్చేసి ఉంటుంది.
అందులోని ప్రతీ అక్షరం తన నుదిటిపైకి ఉబికి వస్తుండి వుంటుంది.
చూపుల్లోని భయన్ని బయటకు తెలియనీకుండా ఉంచుంటుంది
ముక్కలైన హృదయం?????
మేజా బల్ల మీది నా ఫొటో తిసినపుడు నేను పడే బాధ ఆమెకు అర్ధమౌతూ ఉంటుంది.
ఆమె కోరికలన్నీ ఆవిరౌతూ ఉండిఉండాలి
బాధను స్పురింపజేసేలా నవ్వుతూఉండి ఉండాలి
నాపేరు విన్నంతనే అశృవులు రాలుతూ ఉండిఉండాలి
జతరాలి భుజంపై తలవాల్చుకుని ఉంటుంది
తలను అయిష్టంగా దువ్వించుకుంటూ ఉండి ఉంటుంది
బాధామేఘాలు ముఖంపై కమ్ముకుని ఉండి ఉంటాయి.
కళ్ళలో కాంతి చానాళ్ళుగా ఉండి ఉండదు.
ముఖం చానాళ్ళగా కళ తప్పే ఉండిఉంటుంది.”
-ముళ్ళపూడి సుబ్బారావు

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-41’
"మొహబ్బత్ బడే కామ్ కీ చీజ్ హై"! …...యే బేకార్ బేదామ్ కి చీజ్ హై! 20 February

 (ప్రేమ చాలా అక్కరకొచ్చే విషయం) .......(ఇది ఎందుకూపనికిరాని చవకైన వస్తువు.)
...
త్రిశూల్ సినిమాలో జేసుదాస్,కిశోర్ కుమార్, లతామంగేష్కర్ పాడిన పాట.ఖయాం సంగీతం సాహిర్ లూధియాన్వి
రచన.
యాంగ్రీ యంగ్ మాన్ గా అమితాబ్ స్థిరపడిఉన్న కాలం(1978). మల్టిస్టారర్ సినిమా అంటే అమితాబ్ తోపాటు ఇంకా ఎవరున్నారు అని ప్రశ్నించే కాలం.ఒకే సంవత్సరం డాన్,ముకద్దర్ కా సికందర్,త్రిశూల్,కస్మే వాదే వంటి హిట్ సినిమాలు వచ్చాయి.
త్రిశూల్ చిత్రంలో తండ్రీకొడుకులమధ్య తారా స్థాయి సంఘర్షణ,కుటుంబసభ్యులమధ్య భావోద్వేగాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి.
తన తల్లి ని మోసంచేసి తన పుట్టుకకు కారణమైన వ్యక్తిపై హీరో కత్తిగట్టాడు. తండ్రి అప్పటికే పెద్ద సివిల్ కంట్రాక్టరు గా స్థిరపడిఉన్నాడు.అతని మరోకొడుకు విదేశాలలో చదువుకుని తిరిగొచ్చి ఇష్టంలేకపోయినా తండ్రి వ్యాపారం లో అదుగుపెట్టాడు.అతనికి ప్రపంచమంతా ఆటస్థలం,లోకమంతా ప్రేమమయం.హీరో అనుభవాలు వేరు.అతను చూసిన ప్రపంచం దగా,వంచన తో నిండి ఉంది.అక్కడ ప్రేమనేదే లేదు.
హీరో తన పగ సాధించే క్రమంలో తన కు తమ్ముడికి తనెవరో తెలియకుండా దగ్గరయ్యాడు. ఓ పెద్ద పార్టీ ఏర్పాటుచేశాడు. తమ్ముడు తన ప్రేయసితో వచ్చాడు. హీరో పట్ల ఆకర్షితురాలైనామె కూడా అక్కడ ఉంది.
ఆ సందర్భంలో పాట:
తమ్ముడు, అతని ప్రేయసి దృష్టిలో:
“అంతటా అందం, యవ్వనం
ఈ రేయి ఎంతో ఆహ్లాదం
పట్టు వంటి శరీరం కంపిస్తుంది.
సున్నితమైన స్వప్నాలు గానంచేస్తున్నాయి.
గుండె చప్పుడులో మైకం కమ్ముకుంది.
ఇక్కడనుండి ఎక్కడెక్కడికో రంగులు వ్యపిస్తున్నాయి.
వాతావరణం ప్రేమ విందు చేస్తుంది.
ఈ రోజు ఏదో అందం పై మనసు పోతుంది..ఎందుకు?
ప్రేమ చాల ఉపయోగపడే విషయం.
ప్రేమ ఉండటం వల్లే లోకం ప్రకాశిస్తుంది.
ప్రేమలేకుంటే ఏమీ లేదు
కంటికి, హృదయానికి ??????
ప్రేమనే ఈ స్వర్గం లేకపోతే..ఏమీ లేదు
ఇది ఒక ప్రశాంతినిచ్చే విషయం.
కథానాయకుని(అన్న) దృష్టిలో:
అచ్చు ఐన కథలపుస్తకాలలో ప్రేమ ఉంటుంది.
యదార్ధ జీవితంలో ప్రేమలేదు
ఇది లోకపు బజారుల్లో ఉంటుంది
ఇది ఎవరికి అవసరం పడేది కాదు
ఇది ఎందుకూపనికిరాని చవకైన వస్తువు.
తమ్ముడు:
ఇది ప్రకృతి ఇచ్చిన బహుమతి
అన్న:
ఇది పేరుకి మాత్రమే ఉన్న వస్తువు.
తమ్ముడు:
ప్రేమంటేనే ఇంత కలత చెందే వాడివి
పద,నీకు ప్రేమంటే తెలియజెబుతాను.
ఎంతోకాలంగా ఒంటరిగాఉన్న నీమనసుకి
అందమైన బస చూపుతాను
నామాట ఎంతో విలువైనది “
వేరు వేరు నేపధ్యాలనుండి వచ్చినవారు ,వారి వారి అనుభవాలతో ప్రేమ గురించి చెప్పే పాట. నిజంఈ రెంటి నడుమా ఎక్కడో ఉండి ఉంటుంది.
-ముళ్ళపూడి సుబ్బారావు

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-40’
'భర్-భర్ ఆయీ మొరి అఖియా పియా బిన్..ఖిర్ ఖిర్ ఆయి బదరియా '18 February

 (ప్రియుడు లేక మేఘంవర్షించినట్టు కళ్ళు వర్షించాయి)
జల్సా ఘర్ సినిమాలో బేగం అఖ్తర్ గానం చేసిన థుమ్రీ ఇది.బహుశా బేగం అఖ్తర్ కనిపించిన గానంచేసిన ఆఖరి సినిమాపాట కావచ్చు.
జల్సా ఘర్ (సంగీత శాల/సంగీతగృహం) బెంగాలీ సినిమా కుసత్యజిత్ రే దర్శకత్వం వహించారు.
దేశం బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నప్పటి (1920ల) కాలం.జమీందారీ వ్యవస్థ స్థానే ఆధునిక వ్యాపారాలు,యాంత్రీకరణ ప్రవేశిస్తున్నాయి. సాంఘికంగా వచ్చేమార్పులు గమనించకపోవటం ,మారే కాలంలో మరని మనుషులు,మార్చుకోని విలువలు వీటి పర్యవసానాల చర్చ ఈ సినిమా.
వస్తున్న,రాబోయే మార్పులు తమపై చూపబోయే ప్రభావాన్ని ఏమాత్రం గుర్తింపదలచుకోని(?) జమీందారు కేంద్రం గా సినిమా సాగుతుంది.
అప్పటికాలాన్నిబట్టి జమీందారీ హవేలీలో సంగీతశాల కలిగిఉండటం ప్రతిష్టాత్మకం. అందులో సంగీత కాలక్షేపం ఉత్తమాభిరుచికి ఓ కొలమానం.
సినిమాలో జమీందారు సంగీతశాల, సంగీతంపట్ల అతని అనురక్తిని సౌందర్యదృష్టి కి నిదర్శనం.సంగీతం అతని ప్రాణం.
అతని మితిమీరిన సంగీతాభిరుచే అతని ఆర్ధికపతనానికికారణమయ్యిందా?
లేక వేరే కారణాలవల్ల జరిగేపతనాన్ని ఆపలేక సంగీతపు నీడకు చేరాడా?
జీవనశైలిలో భాగంకావాల్సిన కళలు,అభిరుచులు, అవే జీవనమైపోవటం ఎప్పుడు జరుగుతుంది?
మార్పును గమనించలేకఫోవటంవల్లా?
మార్పుకు తగ్గట్టు మారలేకపోవటంవల్లా?
మారినా ఉపయోగంలేదనే స్థితి..పాయింట్ ఆఫ్ నో రిటన్ కు చేరిపోయినప్పుడా?
ఇవన్నీసినిమా చూసినప్పుడు కలిగే సందేహాలు.
మధ్యవయస్కుడైన ఒక జమిందారు రంగులు మాసి,పెచ్చులూడిన తన రాజమహలు వంటి బంగళా టెర్రేసు మీద కూర్చుని తనలోకంఉండి,తనదగ్గర మిగిలిన చివరిద్దరి సేవకుల్లో ఒకణ్ణి అడుగుతున్నాడు "ఇది ఏ నెల" అని. రోజుల్ని,నెలల్నే కాదు సీజన్లను కూడా అతను మరచిఉన్నాడు.పొరుగున జరిగే శుభకార్యక్రమాన్ని గమనించి గతాన్ని గుర్తుచేసుకున్నాడు.
తరిగిపోతున్న ఆస్తులపట్లగమనింపులేకుండా,చివరకు స్త్రీ ధనంవెచ్చించి సంగీతంపట్ల తన అనురక్తిని చాటుకుంటాడు.అంతస్తు లో తనకి మించాలని చూస్తున్న పొరుగువాడైన 'కొత్త వ్యాపారి 'పై తన ఆధిక్యం చూపాలని తలపెట్టిన సంగీతకార్యక్రమానికి దూరంలో ఉన్న భార్యా,కొడుకులను పిలిపించి, తుఫానులో వారి మరణానికి కారకుడయ్యాడు.
జమిందారు తన వంశం,తన రక్తం ఎంతో ఉన్నతమైనవని, డబ్బు సంపాదించినంత మాత్రాన గొప్పలక్షణాలు రావని తనని తాను నమ్మబలుక్కుంటాడు. తన సౌందర్య దృష్టి, తన ఉత్తమ సంగీతాభిరుచి తన గొప్పదనపు కారణాలలో కొన్ని అనుకుంటాడు.
మారుతున్న కాలంలో తనస్థానమేమిటో తేల్చుకోలేకపోతున్నాడు.తనింటిలో ఆరిపోతున్న కొవ్వొత్తులు చూశి చలితుడౌతున్నాడు. బయట ఉదయకాంతుల్ని చూసి భయపడుతున్నాడు.శిధిలమైన శరీరం పై గమనింపులేకుండా ఉక్రోషంతో తలపాగా ధరించి గుర్రపు స్వారీ ప్రారంభించాడు. బెదిరిన గుర్రం నుండి పడి మరణించాడు.
జమీందారుగా ఛాబీ బిస్వాస్ నటించాడు.అతన్ని మొదటిసారి చూసింది ఈ సినిమాలోనే..షావుకారు సినిమాలో గోవిందరాజుల సుబ్బారావును తొలిసారి షావుకారు చంగయ్య గా చూస్తే కలిగిన అబ్బురం మళ్ళీ జల్సా ఘర్ చూసినప్పుడు కలిగింది.
ఈ పాట కు సంబంధించి..
సినిమాలో సంగీతశాల లో జరిగేమూడు కార్యక్రమాలో ఒకటి బేగం అఖ్తర్ పాడిన ఈ థుమ్రీ.ఈ పాట చిత్రీకరణలో నెమ్మదిగా కదిలే కెమేరా అనేక వివరాలను పట్టుకుంటుంది.సంగీతాన్ని వినే వివిధ వ్యక్తుల ఫీలింగ్స్ ..బిస్వాంబర్ కళ్ళలో తన్మయం,ఆ తన్మయాన్ని కళ్ళతోనే పక్కవానితో పంచుకోవటం,గంగూలీ(కొత్తగా వృద్ధిలోకి వస్తున్న వ్యక్తి) సంగీతాన్ని ఆనందిస్తున్నట్టు ఇబ్బంది పడుతూ నటించటం, సంగీతశాలలో పెచ్చులూడిన స్థంభాలు,చాండ్లియార్లో ఉన్న గాజు క్వాలిటీ… ప్రతీ సూక్ష్మ విషయం సినిమాను అర్ధం చేసుకోవటానికి దోహదపడేదే.
-ముళ్ళపూడి సుబ్బారావు

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-39’
'నసీబ్ ఇన్సాన్ కా చాహత్ సె హి సవర్ తా హై'14 February

 (“మనిషి అదృష్టమనేది అతని కోరికలతోనే రూపుదిద్దుకుంటుంది)
“హమ్ తుమ్హే చాహతే హై ఐసె “(నేనూ నిన్ను ఎంత కోరుకుంటున్నానంటే)
...
కుర్బానీ సినిమాలోఈ పాటలో మొదటి రెండు లైన్లు పాడింది ఆనంద్ కుమార్,మిగతా పాటంతా మన్ హర్ ఉధస్ పాడారు.ఇందీవర్ రచన కల్యాణ్ జీ ఆనంద్ జీ సంగీతం.
1980 లో కుర్బానీ సినిమా ఒక సంచలనం. మామిత్రుల మాటల్లో 'షోలే తర్వాత ఇదేరా సినిమా ' .ఎక్కడవిన్నా నాజియా హసన్ పాట 'ఆప్ జైసా కోయి మెరీ జిందగీమె ' ఒకపక్క, మరోపక్క 'లైలా మై లైలా'పాటలే.
సినిమాలో ఒక కథానాయకుడు ఫిరోజ్ ఖాన్ స్వయం దర్శకత్వంలో నిర్మించాడు.మరో హీరో వినోద్ ఖన్నా. అప్పటికే అమితాబ్ కు పోటిదారుడుగా గుర్తింపుపొందాడు.
సినిమా చూసాక రఫీ,కిశోర్ కుమార్, కంచన,నాజియాహసన్ వీళ్ళందరి పాటలకన్నా నన్ను ఆకట్టుకున్న పాట 'హం తుమ్హే చాహతే హై ఐసే'. పాట నచ్చే నాటికి పాట అర్ధంతెలియదు. మెలోడియస్ గా సాగే పాట,సముద్రపు ఒడ్డు,సంధ్యా సమయం, ఆకర్షణీయమైన హీరో హీరోయిన్లు ..ముఖ్యంగా పాట మొదలయ్యే విధానం ...మరింత చూస్తే హీరో పాత్ర పట్ల నచ్చటం కారణాలు కావచ్చేమో.
ఇప్పుడు అర్ధం తెలిసాక, ప్రత్యేకంగా మొదట్లి లైను 'నసీబ్ ఇన్సాన్ కా చాహత్ సె హి సవర్ తా హై' (మనిషి అదృష్టమనేది అతని కోరికలతోనే రూపుదిద్దుకుంటుంది) బాగా నచ్చుతుంది. అలాగే సినిమాలో పదే పదే వినిపించే మాట 'ఈశ్వర్ కా దూసరా నామ్ దోస్తీ'.
పూర్తి కమర్షియల్ హంగులతో నిండిన సినిమా. ఐతే అరుదుగా సంభవించే హంగుల సరైన మేళవింపు ఇందులో ఉంది.
చిల్లరదొంగతనాలు చేసే హీరో.అతనికి క్లబ్ లో పాటలు పాడే ప్రేయసి. ఓ తెలివైన పోలీసు ఆఫీసర్ వల్ల హీరో జైల్లో పడ్డాడు. మరో హీరో భారీస్థాయి దొంగ.అతను పోలీసు ఆఫీసరుకు చిక్కట్లేదు.భార్యచనిపోయిన అతనికో చిన్న కూతురు.అతనికి మొదటిహీరో జైల్లో ఉన్నపుడు అతని ప్రేయసి పరిచయమయ్యింది. ఆమె ను ఇష్టపడ్డాడు. ఆమె కు తన ప్రేమ తెలియజేసే సందర్భంలో ఈ పాట.
“మనిషి అదృష్టమనేది అతని కోరికలతోనే రూపుదిద్దుకుంటుంది
ఎవరినైనా చచ్చేంత కోరుకుంటే తప్పేముంది?
నేనూ నిన్ను ఎంత కోరుకుంటున్నానంటే
చనిపోయే మనిషి జీవించాలని ఎంతకోరుకుంటాడో అంత
నువ్వు కోపిస్తే ఏమనిపిస్తుందంటే
ఒక్క క్షణంలో
శరీరంనుండి ప్రాణం విడివడిపోయినట్టు
నీవులేని జీవితం అసంపూర్ణం
నిన్ను పొందగలిగితే
అది పరిపరిపూర్ణమౌతుంది.
నిన్ను నేను అలాంటిచోటుకు తీసుకెళతాను
ఎక్కడైతే
ఒంటరితనం కూడా షెహనాయివాదనౌతుందో అక్కడికి “
-ముళ్ళపూడి సుబ్బారావు


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-38’
"అకేలా గయా.. థా మై ..న ఆయా అకేలా"12 February
"ఒంటరిగా వెళ్ళాను ...ఒంటరిగా తిరిగి రాలేదు"
(రాజ్ పూత్ (రాజపుట్ 1981) సినిమాలో కిశోర్ కుమార్ పాడిన పాట,లక్ష్మికాంత్ ప్యారేలాల్ సంగిటం, ఆనంద్ బక్షి రచన.)
...
రాజస్థాన్,రాజ్ పుటానాల నేపధ్యంలో 'రేష్మా ఔర్ షేరా' నుండి 'పహేలీ' వరకూ చాలానె వచ్చాయి.వీటిలో ఎక్కువభాగం భారీ తారాగణం,రాజపుటాన్ల శౌర్య సాహసాలు,వీరత్వం,వారి విలువలకు కట్టుబడి ఉండటం,కోటలు,హవేలీలు,ఒక విధమైన మిస్టిక్ ఫీలింగు కలిగించే ఎడారి భూములతో ...జానపదకథలు అనిపించేట్టు ఉంటాయి. ఐతే వాటి ఆకర్షణ వాటిదే.
ఈ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన హీరోలు ధర్మేంద్ర,వినోద్ ఖన్నా లు.వారిద్దరికి తోడు మరో పెద్ద నటుడు రాజెష్ ఖన్నా,హేమమాలిని తోడై, విజయానంద్ (దేవానంద్ సోదరుడు)వంటి పెద్ద దర్శకుడు, ముషీర్ రియాజ్ లాంటి నిర్మాత కలిసినప్పుడు విజయం వరించదా? ... వరించాలనేంలేదని చెప్పిన సినిమా రాజ్ పుట్.
మార్కెటింగులో చెబుతారు ప్రతీ ప్రోడక్ట్ కి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఉంటుందని.ఈ సినిమా నిర్మాణంలో కూడిన అందరూ ఆ లైఫ్ సైకిల్లో డౌన్ స్లోప్ పై ఉన్నవారే.
అప్పటికి ఒక పుష్కరం ముందు రాజేష్ ఖన్నా 'మేరే సప్నో కి రానీ' అని కిశొర్ కుమార్ గొంతుతో 'ఆనంద్ బక్షీ' పాటపాడి చరిత్ర సృష్టించాడు. అదే నటుడు,అదే గాయకుడు, అదే గీతకారుడు ...కానీ పాత మాజిక్ రిపీట్ కాలేదు.
అవన్నీ అటుంచితే నాకైతే ఈ పాట తొలిసారి చూసి విన్నప్పటినుండి నచ్చుతూనే వుంది. రాజస్థానీ పల్లెపడుచు ను పోలీసు అధికారి పెళ్ళాడే ఉద్దేశంతో ఆమె ఇంటిదగ్గర ,ఆమే ఇంటి పనుల్లో(పొయ్యి రాజేస్తూ,ముల్లంగి కోస్తూ,మైదా కలుపుతూ,రొత్తే కాలుస్తూ) ఉన్నప్పుడు చూశాడు. ఆమే తలపులతో తన జాతిగుర్రం మీద తిరుగు ప్రయాణంలో అతని పాట.అంతటా ఆమే కనిపిస్తుంది,ప్రతీ పడుచులో నూ ఆమే,నింగిలో నీటిలో ....వీటన్నిటితో అందమైన రాజస్థానీ కట్టడాలు,మైదానాలు....ఒకరకంగా చూస్తే రాజస్థాన్ టూరిజానికి యాడ్ గా వాడుకోవచ్చేమోననిపించే చిత్రీకరణ.
పాట అర్ధం స్థూలంగా
“ఒంటరిగా వెళ్ళాను ...కాని ఒంటరిగా తిరిగిరాలేదు
నీజ్ఞాపకాల సమూహాలు నావెంట వస్తున్నాయి.
నీ ఇంటిని వదిలి వచ్చినప్పటినుండి అంతా మారిపోయినట్టు కనిపిస్తుంది
అప్పుడెలా ఉండేది ఇప్పుడెలా ఉంది ..ఈ ఋతువంతా కొత్తకొత్తగావుంది
మనసు కోరుకుంటుంది వెనక్కి వెళదామని
వెళ్ళి నిన్ను జత తెచ్చుకోమని
ఈ జ్ఞాపకాల వెల్లువలో ఒంటరిగా ఎలా ఉండను?”
పాటలోగుర్రం నీరుతాగే సన్నివేశం ఎందుకో బాగా గుర్తుండిపోయింది.అలాగే అతని వూహల్లో ఆమెని పెళ్ళి చేసుకుని గుర్రం పై వస్తుంటాడు.పల్లకీలో ఆమె. అది చూసినప్పుడు ట్రెజర్ హంట్ లో సఫలుడై నిధి ని తెచ్చుకుంటున్న కౌబాయ్ హీరో అనుకోకుండా గుర్తొస్తాడు.
-ముళ్ళపూడి సుబ్బారావు

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-37’
ధరతి కహె పుకార్ కే  10 February

(ధరణి పిలిచి చెబుతుంది)
(దో బిఘా జమీన్ (1953) సినిమాలో పాట, సంగీతం సలీల్ చౌధురి,రచన శైలేంద్ర,గానం లతా మంగేష్కర్,మన్నాడే)
...
ఉన్న చోటగడవని స్థితి కొందర్ని, వేరేచోట మరిన్ని అవకాశాలు కొందర్ని ఉన్నచోటునుండి వేరే చోటుకు కదులుస్తాయి. కదలిక పట్ల 'ఇనెర్షియా' సహజం.దాన్ని అధిగమించి కదలటానికి కారణాలు ఒకటి అవసరం మరొకటి అవకాశం.
మొదటిదానివల్ల కదిలేమనిషిపట్ల సానుభూతి ఎక్కువ కలుగుతుంది.
ఈ చిత్ర దర్శకుడు బిమల్ రాయ్. ఇటాలియన్ సినిమా బైసికిల్ థీవ్స్ స్పూర్తి తో ఈ సినిమా తీసాడంటారు. సినిమా చూస్తే పూర్తి భారతీయత ప్రతిబింబించే కళాఖండమనిపిస్తుంది. కథానాయకుడు బలరాజ్ సాహ్ని నటన అత్యంత సహజంగా ఉండి మనకెంతో పరిచయమైన,ఇంటిలోని మనిషిని చూసినట్టే ఉంటుంది.
రెండు బిఘాల భూమి అంటే ఎనభై సెంట్ల భూమి.ఎకరం కంటే తక్కువ.అదే అతని ఆస్తి...అతని అభిమానం.ఆధారం..జీవనాధారం. దాన్నుండి పండింది పండించుకోవటమే కాదు , దాన్ని రక్షించుకోవటమూ పెద్దపనే. మామూలు వడ్డీతో కూడిన అప్పునే కష్టంతో భరించగలిగినప్పుడు అది దొంగ వడ్డిలతో లెక్కిస్తే సన్నకారు రైతు ఏమౌతాడు? ఆ అప్పు తీర్చటానికి పొలంసాగు కన్నా ఎక్కువ ఆదాయం ఇవ్వగలిగే పనిని వెతుక్కుంటూ పోతాడు.
వడ్డి పెరుగుదలకూ, అతని ఆదాయపు పెరుగుదలకూ పరుగు పందెం.
విజయం ఎవరిది?అతను ఎక్కడ బయలు దేరాడు?ఎక్కడ తేలాడు?
1953 లో ఈసినిమా వచ్చింది.రైతుల స్థితి ఇప్పటికీ మారలేదనిపిస్తుంది.
'ధర్తి కహే పుకార్ కే పాట సందర్భం’:
అప్పులపాలైన రెండు బిఘాల రైతు ఆ అప్పు తీర్చి తన భూమిని కాపాడుకోవటానికి కలకత్తా బయలుదేరాడు.అతన్ని సాగనంపుతున్నట్టు వివిధ పనుల్లో మునిగివున్నకష్టజీవులు..దూరం నుండి బిందెలతో నీరు మోసుకునేవారు,భూమిని పెళ్ళగించేవారు(దున్నటానికి బదులుగా?), కుప్పలువేసేవారు, లోతైన బావుల్లో నీరు చేదుకునేవారు...తమభాషలో అతన్ని ఊరడిస్తున్నారు.
“గంగా యమునలు ఎలా సాగిపోతున్నాయో చూడు.
ఎప్పుడోఒకప్పుడు అందరూ సాగిపోయేవారే
ధరణి పిలిచి చెబుతుంది
ప్రేమ గీతం పాడమని
కాలం గడచిపోతుంది...
నీ కథను విడిచివెళ్ళు
నీ గుర్తులు కొన్ని విడిచెవెళ్ళు
నీవిటు రేపు వస్తావో రావో ఎవరికి తెలుసు.
కాలం గడచిపోతుంది...
నువు తిరిగొచ్చే దారిలో మొగ్గలు కన్నులు విప్పార్చి ఉంచాయి
కొమ్మకొమ్మల్లో కోయల్లు నీపాట పాడుతున్నాయి
నీలాకాశం నవ్వుతూనే వుంది
చేలన్నీ గీతాలు ఆలపిస్తున్నాయి.
మరి నీమనసెందుకు దిగులుగా ఉంది
మనసనే వేణువును పలికించు
ఏవో రాగాలు పలికించు
నువ్వూ నవ్వుతు ఉండు.”
"ఒక నదిలో నువ్వు రెండుసార్లు అడుగు పెట్టలేవు" అంటాడు తత్వవేత్త హెరాక్లిటస్.
ఒక వృత్తిలోనుంచి మరో వృత్తి లోకి మారి తిరిగి పాత వృత్తిలోకి మారటం కష్టమైన దే.అది కూడా నదీప్రవాహంలా వెనక ప్రయాణం ఉండనిదేనేమో. 'కౌన్ కహె ఇస్ ఓర్ తు ఫిర్ ఆయే న ఆయే' (నీవిటు రేపు వస్తావో రావో ఎవరికి తెలుసు.)పదం లో నాకు అదే కనిపిస్తుంది. కథలో జరగబోయేది కూడా అదే. దాని సూచన కూడా కావచ్చు.
-ముళ్ళపూడి సుబ్బారావు