Showing posts with label kishor kumar. Show all posts
Showing posts with label kishor kumar. Show all posts

Thursday, February 8, 2018

హవావోం పె లిఖ్ దూ.. హవావోం కె నామ్

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-136
`హవావోం పె లిఖ్ దూ.. హవావోం కె నామ్`
(గాలుల పేరుమీద ...గాలుల పై వ్రాస్తాను)
దో దూని చార్ -1968 (రెండు రెళ్ళు నాలుగు) సినిమా లో కిశోర్ కుమార్ పాడిన పాట. గీత రచన గుల్జార్. స్వర రచన హేమంత్ కుమార్.
పురవాయీ /పురవయ్యా( తూరుపు గాలి) పదం హిందీ సినీ సాహిత్యంలో బాగా వినిపిస్తుంది. ...
తూరుపుగాలి ఒక దశలోహిందీపాటల్లో కూడా బాగా తోలింది. పంకజ్ మలిక్,ఎస్ డి బర్మన్, సలీల్ చౌధురి,హేమంత్ కుమార్ వంటి సంగీతదర్శకులు వంగ ప్రాంతపు సంగీతాన్ని, రవీంద్ర సంగీతాన్నిహిందీ పాటలద్వారా దేశం మొత్తానికి పంచి ఇచ్చారు. ప్రత్యేకంగా అరవైలవరకూ బెంగాలీ ముద్ర వారిపాటల్లో కనిపిస్తుంది.
ఆ కాలంలో వచ్చిన పాట ఇది.ప్రకృతిని వర్ణించేది. కిశోర్ కుమార్ తనకోసం తానే పాడుకున్నాడు. పంచె కట్టు, బెంగాలీ లాల్చీ తో అచ్చమైన బెంగాలీ బాబులా కనిపిస్తాడు. పాటలో కనిపించే బాలనటి తర్వాత హీరోయిన్ గా ఎదిగిన నీతూసింగ్. ‘దో దూనీ చార్ ‘ (2010)పేరుతోనే వచ్చిన సినిమాలో గృహిణి గా నటించింది .
ఈ ‘కిశోర’ ’హేమంత’ సమీరం వింటున్నపుడు అది శరీరాన్ని తాకుతున్నట్టే కాదు మనసునూ స్పృశిస్తున్నట్టనిపిస్తుంది. 

“గాలుల పేరుమీద గాలుల పై వ్రాస్తాను
ఈ అపరిచిత పరదేశి ప్రణామం.

ఓ పక్షీ ! నీ ఈ రాగయుక్తమైన ఈ ప్రణామం
ఎవరిపేరుమీద ఎవరికోసమో చెప్పు

తరుశాఖలపై వెలుగుకిరణం వచ్చి
చేయి సాచినపుడు
చీకటి నెమ్మదిగా కిందికి దిగి
నవ్వుతూ చెప్పింది
ఇక్కడ ఉదయ సాయంత్రాలు ఆటలాడుతూఉంటాయని

ఆకతాయి నీరు తన దారిన ప్రవహించటం మరచి
అద్దంలా మారి పూలపైకి ప్రతిఫలిస్తుంది
ఈ అమాయకపు పసి ముఖాలను.”


Saturday, October 21, 2017

కభి బేకసీ నే మారా! కభి బేబసీనే మారా!

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-108
కభి బేకసీ నే మారా! కభి బేబసీనే మారా!
( కొన్ని సార్లు అసహాయత చంపుతుంది,కొన్నిసార్లు నిరాశ్రయత చంపుతుంది)
అలగ్ -అలగ్ సినిమాలో కిశోర్ కుమార్ పాట. ఆనంద్ బక్షి రచన,ఆర్ డి బర్మ సంగీతం
ఎనభైలో ‘రఫీ’ మరణంతో హిందీ సినిమా సంగీతం ఏకధృవ ప్రపంచమైపోయిందనుకున్నారు. ఆ ధృవం కిశోర్ కుమార్. ఐతే ఎనభై తరువాత వచ్చిన కిశోర్ కుమార్ పాటల్లో అతని స్థాయిని పెంచినవి బహు తక్కువ, నిలబెట్టినవీ కొద్దిగానే. అనూహ్యంగా అతనితో ఏమాత్రం సరితూగని గాయకులతో అతను పోటీపడాల్సి వచ్చింది. కిశోర్ కుమార్ ను డెబ్భైలలో ఆకాశంలో నిలిపిన ఆర్ డి. బర్మన్ సైతం ఎనభైలలో కిశోర్ తో కాకుండా షబ్బీర్ కుమార్ వంటి కొత్త గాయకులతో పాటలు పాడించాడు. షబ్బీర్ కుమార్ ‘మహమ్మద్ రఫీ’ ని అనుకరించే గాయకుడు (క్లోన్) కావటం ఒక వైచిత్రి.
నటుడు రాజేశ్ ఖన్నా కిశోర్ కుమార్, ఆర్ డి.బర్మన్ బృందం ఎన్నో విజయాలను చవిచూసింది. వారి కాంబినేషన్ ను కూర్చిన దర్శకుడు శక్తి సామంతా. (1969లో)
పదహారేళ్ళతర్వాత (1985 లో) రాజేశ్ ఖన్నా నిర్మాతగా మారి పై కాంబినేషన్ ను మరోసారి ప్రయత్నించాడు. ఆ సినిమా ‘అలగ్ -అలగ్’. ఫలితం మాత్రం మరో ‘ఆరాధన’ గా రాలేదు. ఐతే కిశోర్ కుమార్ ద్వారా ఒక ఉత్తమ గీతాన్ని అందుకోగలిగాం.
“ఇది గజల్ కాదు గీతమూ కాదు
ఇది నా బాధల గాధ
నా గుండెలో కేవలం అగ్ని ఉంది
నా కళ్ళలో కేవలం నీరు ఉంది
కొన్ని సార్లు అసహాయత చంపుతుంది
కొన్నిసార్లు నిరాశ్రయత చంపుతుంది
మృత్యువుతో పేచీ లేదు
నన్ను జీవితమే చంపేసింది
విధి ని అనేందుకు లేదు
మారనిదల్లా కాలమే
అప్పుడప్పుడూ దురదృష్టం
కొన్నిసార్లు నా లేనితనం
వేటి పేర్లు చెప్పను?
నన్ను అన్నీ చంపాయి.
మృత్యువుతో పేచీ లేదు
నన్ను జీవితమే చంపేసింది
నరక ప్రాయపు,అపనమ్మకపు లోకమిది
ఇదే లోకమైతే ఇదేమిలోకం?
స్నేహితులకు కొదవలేదు
శత్రువులకు కొరత లేదు
కొన్నిసార్లు శత్రుత్వం దోచింది
కొన్నిసార్లు స్నేహం చంపింది.
మృత్యువుతో పేచీ లేదు
నన్ను జీవితమే చంపేసింది
వెలుతురు పట్ల విముఖత వచ్చింది
చీకటి అలవాటైపోయింది
చీకటి ఉన్నంత వరకూ
కాలం బాగానే గడచింది
నన్ను వెన్నెల దోచింది
వెలుతురు నన్ను చంపింది"

Thursday, June 15, 2017

చాంద్ నీ రాత్ మే ఎక్ బార్ తుఝేదేఖా హై

నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-93‘
'చాంద్ నీ రాత్ మే ఎక్ బార్ తుఝేదేఖా హై'
(వెన్నెల రాత్రిలో ఒకసారి చూశాను)
దిల్ ఎ నాదాన్ సినిమాలో కిశోర్ కుమార్ పాట. పాట రచయిత నక్ష్ లైల్ పురి.
...
వయసు పిలిచింది’ (1977) డబ్బింగు సినిమాఐనా తెలుగు సినిమాకు ఒక కుదుపు. అందులో నటులు కమల్ హాసన్, రజనీకాంత్, సంగీత దర్శకుడు ఇళయరాజా అంతకుముందు తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా, ఈ సినిమాతో బలంగా ముద్రవేశారు. అందులో పాటలు ‘ఇలాగే ఇలాగే సరాగమాడితే, మబ్బే మసకేసిందిలే, నువ్వడిగింది ఏనాడైనా, జీవితం మధుశాలా .. అన్నీ హిట్ గీతాలె. కొత్త తరహా సంగీతం, కొత్త నటులు.
ఆ సినిమాను తర్వాత హిందీ లో తీశారు. సినిమా పేరు ‘దిల్ ఎ నాదాన్’(1982) . ఐతే నటులు రాజేశ్ ఖన్నా, శతృఘన్ సిన్హా లు. దశాబ్ద కాలానికి పైగా తెరపై వెలుగుతున్నారు. సంగీతదర్శకుడు ‘ఖయ్యామ్’ క్లాసికల్ సంగీతం అందించటంలో లబ్ద ప్రతిష్టుడు.
అలా తమిళ/తెలుగు సినిమాకు ప్రత్యేకత అనుకున్న కొత్తదనం (నటులు, సంగీత దర్శకుడు) హిందీలో కనపడదు. ఫలితం తెలియదుకాని అద్భుతమైన పాటని సినిమా అందించింది. ఉర్దూ పదాలతో పాటను చిక్కపరుస్తూ సాగే రచన,తనదైన ముద్రను తెలియజేస్తూ గంభీరంగా సాగే ఖయ్యాం సంగీతం పాటను మరచిపోలేనట్టు చేశాయి.
అదేకాలంలో ఖయ్యామ్ సంగీతదర్శకత్వంలో వచ్చిన మరో పాట ఏ-దిల్ ఎ నాదాన్’(రజియా సుల్తాన్) పాట ‘చాంద్ నీ రాత్ మె ‘ పాట లో అంతర్లీనంగా వినిపిస్తుంది.

“నీలోనువ్వే సిగ్గుపడుతూఉన్న నిన్ను
వెన్నెల రాత్రిలో ఒకసారి చూశాను
నీలిఅంబరం లో ఊయలలో
వయ్యారపు అతిశయంతో ఊగుతున్న
ఏడు రంగుల అందమైన ఊయలలో
నీలోనువ్వే సిగ్గుపడుతూఉన్న నిన్ను
వెన్నెల రాత్రిలో ఒకసారి చూశాను

మేలుకున్న సరస్సు ఒడ్డున ఎక్కడో
చేతులలో అందమైన పూలగుత్తి తో
మధురమైన ప్రేమగీతం ఆలపిస్తూ
పూలవాన కురిపిస్తూ..ప్రేమ పొంగిస్తూ
నీలోనువ్వే సిగ్గుపడుతూఉన్న నిన్ను
వెన్నెల రాత్రిలో ఒకసారి చూశాను
మెరుస్తూఉన్న విప్పారిన కురులు
గాలికి అద్దిన పరిమళం
నా ప్రతి శ్వాసను సుగంధభరితం చేస్తుంది
నీలోనువ్వే సిగ్గుపడుతూఉన్న నిన్ను
వెన్నెల రాత్రిలో ఒకసారి చూశాను

ముఖంపైకి నీ ముఖాన్ని వంచినపుడు
లజ్జతో,సిగ్గుతో గాభరా పడుతూ
నేను చేతులతో ముఖాన్ని దాచుకున్నాను
పూలవాన కురిపిస్తూ..ప్రేమ పొంగిస్తూ
నీలోనువ్వే సిగ్గుపడుతూఉన్న నిన్ను
వెన్నెల రాత్రిలో ఒకసారి చూశాను”



Saturday, May 13, 2017

ఆ చల్ కే తుఝే మై లేకే చలూ

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-79
‘ఆ చల్ కే తుఝే మై లేకే చలూ’
(“పద నిన్ను తీసుకెళతాను అలాంటి ఒక ఆకాశం కిందికి).

కిశోర్ కుమార్ గాయకుడుగానే కాక నటుడుగానూ ప్రసిద్ధుడే.అతను నటించిన సినిమాలలో ఎక్కువభాగం సరదాగా సాగేవే.ఐతే అతను స్వయంగా దర్శకత్వం వహించిన తొలిచిత్రం ‘దూర్ గగన్ కి చావ్ మె’ (1964) అలాంటిది కాదు.

సైన్యంలో పనిచేసిన వ్యక్తి తిరిగివచ్చాడు. ప్రమాదంలో భార్య చనిపోయిందనితెలుసుకున్నాడుఽప్పుడే కొడుకు స్వరం కోల్పోయాడు.కొడుకును తీసుకుని ప్రయాణం కట్టాడు. అతని లక్ష్యం కొడుకు చేత తిరిగి మాట్లాడించటం. ఇది సినిమా కథ. ఇదే కథ తెలుగులో ‘రాము’ సినిమా గా పరిణామం చెందింది. మాతృక కు దక్కని విజయం రిమేక్ కి దక్కింది.

కిశోర్ కుమార్ ఎంతో ఇష్టంగా ఈ సినిమా తీసాడు. సినిమాపై సత్యజిత్ రే ప్రభావం వుంది. ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాత, కథానాయకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత గా కిశోర్ కుమార్ తన ప్రజ్ఞ చూపారు.

ఇందులోని పాటల్లో ‘ఆ చల్ కే తుఝే మై లేకే చలూ’,’కోయి లౌటాదే ముఝే బీతే హుయె దిన్’ చాలా బాగుంటాయి.
కిశోర్ కుమార్ ప్రేమికులు తప్పని సరిగా గుర్తు తెచ్చుకునే పాట ‘ఆ చల్ కె తుఝే మై లేకె చలూ’.
పాటకు గీతరచన, స్వర రచన, గానం అతనే చేసారు. చిత్రీకరణ అతను, అతని కుమారుడు అమిత్ కుమార్ పైనే సాగింది. అలా ఈ పాట కిశోర్ కుమార్ ‘పూర్తి స్వంత గీతం’.
పాట అర్ధం:
“పద నిన్ను తీసుకెళతాను అలాంటి ఒక ఆకాశం కిందికి
అక్కడ ఎలాంటి వ్యధ ఉండదు, కన్నీరుండదు..ప్రేమ మాత్రమే ఉంటుంది.

అక్కడ సూర్యుని తొలి కిరణాలు తో ఆశల ఉదయం మేల్కుంటుంది
అక్కడ చంద్రుని కిరణాలతో పెను చీకట్లు పరుగెడతాయి.
దూరపు దారులు కనపడనట్టు కొన్ని సార్లు ఎండ విచ్చుకుంటుంది కొన్ని సార్లు నీడ కమ్ముకుంటుంది

అక్కడ చూపు సాగినంతమేరా, స్వతంత్ర గగనం రెపరెపలాడుతుంది
అక్కడ రంగురంగుల పక్షులు ఆశల సందేశాలు మోసుకొస్తాయి
స్వప్నాల్లోఆనందపు మొగ్గలు వికసిస్తాయి.సాయంత్రాలు ఆనందమయమౌతాయి.

అక్కడ కలల ప్రపంచంలో ప్రేమమాత్రమే వికసిస్తుంది
అక్కడకు మనమెళ్లి పోదాం.. ఎలాంటి చింతా విచారం లేకుండా
అక్కడ విరోధులు లేరు. అపరిచితులు లేరు. అందరూ కలసి నడవవచ్చు”
-ముళ్ళపూడి సుబ్బారావు


Tuesday, April 4, 2017

రుక్ జానా నహీ తూ కహి హార్ కే


' రుక్ జానా నహీ తూ కహి హార్ కే '(ఓడిపోయి ఎప్పుడూ ఆగిపోవద్దు)
('ఇంతిహాన్ ' (1974)సినిమా మజ్రూహ్ సుల్తాన్ పురి రచన ,కిశోర్ కుమార గానం,లక్ష్మికాంత్ ప్యారేలాల్ సంగీతం)

80లో ఖుర్బాని సినిమా చూసాక నా అభిమాన నటుల్లో మరొకరు కలిసారు. అతను వినోద్ ఖన్నా. అతన్ని అభిమానించడం మొదలెట్టె సరికే అతను సినిమాల్లోంచి విరమించుకున్నాడని తెలిసింది.కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకున్నపుడే అతన్ని అధ్యాత్మికత పిలిచినట్టుంది.అతను ఆచార్య రజనీష్ వెంటనడిచాడు.

ఐతే అతని కొత్తసినిమాలు అప్పటికి నిర్మాణంలో ఉన్నవి కొన్నివచ్చాయి.అవేకాక నా అభిమాన ధియేటర్ వేదరాజ్ (ఏలూరు) లో అతని పాత సినిమాలు వచ్చినవల్లా చూసాను.

అందులో ఒకటి 'ఇంతిహాన్ '(పరీక్ష).కాలేజి విధ్యార్ధి గా ఉన్న నాకు ఆ సినిమా బాగా నచ్చింది.అందుకు నాకర్ధమైన కొన్ని కారణాలు సినిమా పూర్తిగా కాలేజి నేపధ్యంలో సాగటం,సినిమాలోసంఘటనలు నమ్మగలిగేలా ఉండటం..ఇంకా ముఖ్యంగా కథానాయకుడు  ఒక నమ్మదగిన,ఆధారపడదగిన, రక్షణనివ్వగలిగే వాడిలా కనపడటం
.
సినిమాలో కథానాయకుడు మంచి ఆదర్శాలతో ఉన్నాడు.ఇష్టంతో ఎంచుకున్న ప్రొఫెసర్ ఉద్యోగానికి ఒక కాలేజీ వచ్చాడు.అస్తవ్యస్తంగా ఉన్న కాలేజిని సంస్కరించే ప్రయత్నాలు చేశాడు.విద్యార్దుల్లో అల్లరిమూకకు శత్రువయ్యాడు.డిప్రెషన్ లోఉన్న ప్రిన్సిపల్ కూతురును మామూలు స్థితికి రావటానికి సహకరించాడు.విద్యార్ధుల్లో చాలామందిని ప్రభావితం చేయగలిగాడు.ఐతే అల్లరి మూకలోని ఒక విదార్ధిని హీరో తనపై అత్యాచారం చేశాడని నిందమోపింది.

ఆ నిందనుండి అతను బయటపడటమే అతనికి పరీక్ష. పరీక్ష పెట్టాల్సిన అధ్యాపకుడే పరీక్ష కునిలవాల్సి రావటం,,అందులో అతను నెగ్గటం సినిమా.

తనపై పడ్డ అపవాదును సకల శక్తులుఒడ్డి చెరుపుకున్నాడు.ఆ క్రమంలో తనని ద్వేషించినవారిలో మార్పు తేగలిగాడు. తన నిర్దోషిత్వం ఋజువయ్యాక అక్కడినుండి దూరంగా పోదలిచి బయలుదేరాడు.

అప్పటి పాట' రుక్ జానా నహీ తూ కహి హార్ కే '.

ఇదిఒక స్పూర్తి ని నింపే పాట,ధైర్యాన్నిచ్చేపాట,అర్ధంచేసుకునేవారు లేక ఒంటరిగా నిలబడ్డప్పుడు నిలబడ్డ నేలను గట్టిపరచే పాట.(ఈ సినిమా చూసి అధ్యాపకుణ్ణి య్యాను,విన్నప్పుడు ఎంతో ఓదార్పు పొందుతాను..ఇలాంటి అనేక కామెంట్లు యుట్యూబ్ లో చూసాక నాలాంటివారెందరో ఉన్నారని ధైర్యంతో ఈ మాట చెబుతున్నా)


“ఓడిపోయి ఎప్పుడూ ఆగిపోవద్దు
ముళ్ళపైనడిచే వర్షఋతు నీడకు చేరగలవు

ఓ పథికుడా...

సూర్యుడు చూడు ఆగిఉన్నాడు,నీముందు వంగి ఉన్నాడు
ఎపుడైనా ఇలాంటి ధీరుడు
తన ఇష్టాలతో నడిచినపుడు
పగటి ఎదురుచూపు,సాయంత్రపు సంతోషమౌతుంది,
ఓ పథికుడా...
.

వెంట ఎవరూ లేరు,ఇది పరీక్షాకాలం
కానీ గుండె తోడుగా నడుస్తూనే ఉండు
గమ్యం నిన్ను పిలుస్తూనే వుంటుంది
పిలిచి నిన్ను ఆపేవారు లేకుండా చూసుకో
ఓ పథికుడా…

కంటఒలికే కన్నీళ్ళు,దారిచూపే దివ్వెలు
లోకానికి వారికివ్వాల్సింది ఇచ్చేసి,నీ కలలు మాత్రం తీసుకునినడు
ఎవరూ లేకపోయినా నీవైన ప్రేమ స్వప్నాలు ఉన్నాయి
ఓ పథికుడా..”


--ముళ్ళపూడి సుబ్బారావు

Wednesday, March 29, 2017

చింగారీ కోయీ భడ్ కే


'చింగారీ కోయీ భడ్ కే ,తో సావన్ ఉసే భుఝాయే '22 March at 20:31
 (మంటలు రేగినప్పుడు,వాన జల్లు వాటిని ఆర్పుతుంది)
...
అమర్ ప్రేమ్ (1972) సినిమాలో కిశొర్ కుమార్ పాడిన పాట.ఆనం బక్షి రచన.ఆర్ డి బర్మన్ సంగీతం.
వార్తాపత్రికలు,మాగజైన్లలో ఆర్టికల్స్ కు ఆ ఆర్టికల్ ప్రధానోద్దేశాన్ని తెలియజెప్పటానికి ఎదైనా కొటేషన్ని ప్రారంభంలో ఉదహరిస్తారు. ఎదైనా కావ్యాలనుండో, పెద్ద రచయితల రచనలనుండో, ప్రముఖల మాటలనుండో తీసుకుంటారు.సినిమా పాటలకు కూడా అలాంటి గౌరవం అప్పుడప్పుడూ దొరుకుతుంది.
2005/6 ప్రాంతాలలో బిజినెస్ లైన్ పేపర్లో ఒక ఆర్టికల్ పెన్షన్ ఫండ్ మీద వచ్చింది. ఆ ఆర్టికల్ ప్రారంభంలో ఒక హిందీ పాట చరణంలో ఒక లైను కోట్ చేశారు. ఆ లైను 'మఝ్ దార్ మే నయ్యా డోలే,తో మాఝీ పార్ లగాయే..మాఝీజో నావ్ డుబాయే ఉసే కౌన్ బచాయే '.ప్రభుత్వ,ప్రభుత్వ సంస్థల ఉద్యోగులనుండి,సంస్థలనుండి, భవిష్యత్తులో పెన్షన్ చెల్లించటం కోసం తీసుకున్న డబ్బును, షేర్ మార్కెట్లో ఇన్వెస్త్ చేయటాన్ని ఆ ఆర్టికల్ చర్చించింది.
ఏమాత్రం రిస్క్ ఉండని విధంగా ఉండాల్సిన పెన్షన్ ను రిస్క్ కు గురిచేయటం. అది చెప్పటం కోసం వ్యాస రచయిత పై పాటలో భాగం తీసుకున్నాడు. పడవను నడిపేవాడే పడవను ముంచబూనితే ...నమ్మితే నట్టేట ముంచితే?
ఈ పాట ముందునుండీ ఇష్టంగానే వింటున్నాను. పైన చెప్పింది చదివాక సినిమా పాటకు కావ్య గౌరవం దక్కిందనిపించింది.
మంటలు రేగినప్పుడు
వాన జల్లు వాటిని ఆర్పుతుంది
వానజల్లే మంటలు రేపితే
వాటిని ఆపేదెవ్వరు?
శిశిరం తోటని నాశనం చేస్తే
వసంతం దానిని చిగిరింపజేస్తుంది
వసంతంలోనే తోట నాశనమైతే
దానిని వికసింపజేసేదెవరు?
స్వప్న మందిరం ఎలా కూలిందని
నన్ను అడగవద్దు
ఇది వేరేవారు చేసింది కాదు
ఇది నా వారి కథే.
శత్రువెపుడైనా గాయపరిస్తే
మిత్రుడు ఓదారుస్తాడు
ఆప్తులే గాయంచేస్తే
ఆర్చేవారెవ్వరు?
జరగబోయేదేదో తెలియదు
నేను చేయాల్సిందీ తెలియదు
తాగటంవల్ల బ్రతికిఉన్నా
తాగకపొతే చనిపోతా
లోకమంతా నిన్ను దాహంతో ఉంచినప్పుడు
మధువు నీ దాహాన్ని తీరుస్తుంది.
మధువే నీ దాహానికి కారణమైతే
ఆ దాహంతీర్చేదెవ్వరు?
తుఫానుకు ఎదురుగా
ఎవరూ నిలువలేరని తెలుసు
ఇది కెరటాల దోషంకాదు
అది వేరేవారిది
నది మధ్యలో పడవ ఊగిసలాడితే
పడవ నడిపేవ్యక్తి ఒడ్డుకి తెస్తాడు
అతనే పడవను ముంచేస్తే
పడవను కాపాడేదెవరు?
-ముళ్ళపూడి సుబ్బారావు


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-38’
"అకేలా గయా.. థా మై ..న ఆయా అకేలా"12 February
"ఒంటరిగా వెళ్ళాను ...ఒంటరిగా తిరిగి రాలేదు"
(రాజ్ పూత్ (రాజపుట్ 1981) సినిమాలో కిశోర్ కుమార్ పాడిన పాట,లక్ష్మికాంత్ ప్యారేలాల్ సంగిటం, ఆనంద్ బక్షి రచన.)
...
రాజస్థాన్,రాజ్ పుటానాల నేపధ్యంలో 'రేష్మా ఔర్ షేరా' నుండి 'పహేలీ' వరకూ చాలానె వచ్చాయి.వీటిలో ఎక్కువభాగం భారీ తారాగణం,రాజపుటాన్ల శౌర్య సాహసాలు,వీరత్వం,వారి విలువలకు కట్టుబడి ఉండటం,కోటలు,హవేలీలు,ఒక విధమైన మిస్టిక్ ఫీలింగు కలిగించే ఎడారి భూములతో ...జానపదకథలు అనిపించేట్టు ఉంటాయి. ఐతే వాటి ఆకర్షణ వాటిదే.
ఈ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన హీరోలు ధర్మేంద్ర,వినోద్ ఖన్నా లు.వారిద్దరికి తోడు మరో పెద్ద నటుడు రాజెష్ ఖన్నా,హేమమాలిని తోడై, విజయానంద్ (దేవానంద్ సోదరుడు)వంటి పెద్ద దర్శకుడు, ముషీర్ రియాజ్ లాంటి నిర్మాత కలిసినప్పుడు విజయం వరించదా? ... వరించాలనేంలేదని చెప్పిన సినిమా రాజ్ పుట్.
మార్కెటింగులో చెబుతారు ప్రతీ ప్రోడక్ట్ కి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఉంటుందని.ఈ సినిమా నిర్మాణంలో కూడిన అందరూ ఆ లైఫ్ సైకిల్లో డౌన్ స్లోప్ పై ఉన్నవారే.
అప్పటికి ఒక పుష్కరం ముందు రాజేష్ ఖన్నా 'మేరే సప్నో కి రానీ' అని కిశొర్ కుమార్ గొంతుతో 'ఆనంద్ బక్షీ' పాటపాడి చరిత్ర సృష్టించాడు. అదే నటుడు,అదే గాయకుడు, అదే గీతకారుడు ...కానీ పాత మాజిక్ రిపీట్ కాలేదు.
అవన్నీ అటుంచితే నాకైతే ఈ పాట తొలిసారి చూసి విన్నప్పటినుండి నచ్చుతూనే వుంది. రాజస్థానీ పల్లెపడుచు ను పోలీసు అధికారి పెళ్ళాడే ఉద్దేశంతో ఆమె ఇంటిదగ్గర ,ఆమే ఇంటి పనుల్లో(పొయ్యి రాజేస్తూ,ముల్లంగి కోస్తూ,మైదా కలుపుతూ,రొత్తే కాలుస్తూ) ఉన్నప్పుడు చూశాడు. ఆమే తలపులతో తన జాతిగుర్రం మీద తిరుగు ప్రయాణంలో అతని పాట.అంతటా ఆమే కనిపిస్తుంది,ప్రతీ పడుచులో నూ ఆమే,నింగిలో నీటిలో ....వీటన్నిటితో అందమైన రాజస్థానీ కట్టడాలు,మైదానాలు....ఒకరకంగా చూస్తే రాజస్థాన్ టూరిజానికి యాడ్ గా వాడుకోవచ్చేమోననిపించే చిత్రీకరణ.
పాట అర్ధం స్థూలంగా
“ఒంటరిగా వెళ్ళాను ...కాని ఒంటరిగా తిరిగిరాలేదు
నీజ్ఞాపకాల సమూహాలు నావెంట వస్తున్నాయి.
నీ ఇంటిని వదిలి వచ్చినప్పటినుండి అంతా మారిపోయినట్టు కనిపిస్తుంది
అప్పుడెలా ఉండేది ఇప్పుడెలా ఉంది ..ఈ ఋతువంతా కొత్తకొత్తగావుంది
మనసు కోరుకుంటుంది వెనక్కి వెళదామని
వెళ్ళి నిన్ను జత తెచ్చుకోమని
ఈ జ్ఞాపకాల వెల్లువలో ఒంటరిగా ఎలా ఉండను?”
పాటలోగుర్రం నీరుతాగే సన్నివేశం ఎందుకో బాగా గుర్తుండిపోయింది.అలాగే అతని వూహల్లో ఆమెని పెళ్ళి చేసుకుని గుర్రం పై వస్తుంటాడు.పల్లకీలో ఆమె. అది చూసినప్పుడు ట్రెజర్ హంట్ లో సఫలుడై నిధి ని తెచ్చుకుంటున్న కౌబాయ్ హీరో అనుకోకుండా గుర్తొస్తాడు.
-ముళ్ళపూడి సుబ్బారావు


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-20
'చోరా.. గంగా కినారా వాలా'
(పిల్లాడు ..గంగాతీర వా సి)7 January
హైదరాబాద్ లో 75 వారాలపాటు నడచిన డాన్ సినిమాలో పాట పల్లవిలో ఒకభాగంఇది.
...
నేరప్రపంచం అనేది ఒకటుంటుందనేది నాకైతే సినిమాల ద్వారానే తెలిసింది.సినిమాలో చూపించే జీవితానికీ నిజజీవితానికి ఎంతదూరమో, అదే అందులోచూపే నేరప్రపంచానికీ వర్తిస్తుందనుకుంటాను. ఒక జానపద సినిమాలో దొంగల ముఠాకు,సాంఘిక చిత్రంలో నేరప్రపంచానికీ నా ఆలోచన ప్రకారం తేడా ఉండేదికాదు.
మన నిజజీవితానికి ఏమీ సంబంధంలేని వాతావరణం లోసాగే సినిమా పాత్రలతో ప్రేక్షకుడికి సంబంధం ఎలా ఏర్పుడుతుంది?ఆ పాత్రల్నిప్రేమించడంకానీ ద్వేషించడంకానీ ఎలా చేస్తాడు? కాని అదిజరుగుతుంది.అంటే వాతావరణాన్ని దాటి,స్థల,కాలాల్నిదాటి పాత్రలతోప్రేక్షకుడు సంబంధంపెట్టుకుంటున్నాడు.వీటన్నిటినీ అధిగమించిన మానసికబంధాలు ఏవో ఏర్పడుతున్నాయి.
ఒక సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే (ఎంత కమర్షియల్ సినిమా ఐనా) దానిలో కమర్షియల్ ఎలిమెంట్లే కాకుండా ఒక మానసిక బంధం కనీసం ఏదో ఒక పాత్రతో మళ్ళీ మళ్ళీ చూసే ప్రేక్షకుడికి ఏర్పడివుండాలని నా ఉద్దేశం.
డాన్ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి కారణం ఏమై ఉండవచ్చు?
డాన్ అనే మాఫియా లీడర్ నిర్దయుడు. డాన్ తన అన్న,అతని ప్రేయసినీ చంపెయ్యటంతో హీరోయిన్ అతనిపై పగపట్టింది.పోలీసులుఅతనికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.అతని ద్వార మొత్తం మాఫియాను పట్టుకోవాలని ఫోలీసుల ఆశ.చివరికి డాన్ ఒకపోలీసు అధికారి కి దొరికాడు కానీ గాయాలతో చనిపోయాడు. అదే సమయంలో డాన్ పోలికలతో ఉన్న వ్యక్తి పోలీసు అధికారికికనిపించాడు. ఆ వ్యక్తి పల్లెనుండి నగరానికి పొట్ట పోసుకునేం దుకు వచ్చాడు. అతనికి ఇద్దరు అనాధపిల్లలు తారసప డ్డా రు.వాళ్ళబాధ్యతాఇతనిదే.
చదువుసంధ్యలు లేని అతను పోలీసు అధికారి తనద్వారా సమాజానికి మంచి జరుగుతుందంటే డాన్ రూపంలో పాములపుట్టలాంటినేరప్రపంచంలోకి అడుగుపెట్టాడు.అతనిద్వారా పోలీసు అధికారి అనుకున్నవి సాధించాడు.డాన్ రూపంలోని వ్యక్తి డాన్ కాదనిమాఫియాకు తెలిసిపోయింది. ఆ వ్యక్తి పోలీసులకు సాయపడ్డాడని తెలిసిన పోలీసు ఆఫీసరు అంతలోనే మరణించాడు. మిగతాపోలీసులంతా ఇతనే డాన్ అని నమ్ముతున్నారు.
ఇప్పుడు ఆ వ్యక్తిని అటు మాఫియా,ఇటు పోలీసులూ వెంటాడుతున్నారు. అతనికి నిజం నిరూపించుకునే మార్గాలన్నిమూసుకుపోయాయి. అతను పరుగెడుతూనే ఉన్నాడు.సాధారణమైనపల్లెటూరి వ్యక్తి,ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళనుచూసి తల్లడిల్లేవ్యక్తి,తనద్వారా మంచి జరుగుతుందంటేనిప్పుల్లోదూకాడు. ఇప్పుడు దిక్కు తోచక అల్లాడుతున్నాడు.
పరుగు అపాడు.తనకు ఇష్టమైన బనారసి పాన్ దొరికింది.పాట అందుకున్నాడు.తన గోడు వెళ్ళగక్కాడు.
"బనారసి పాన్ తిన్నాక, మెదదుకు వేసిన తాళం వూడింది.
ఇక నా తఢాకా చూడు అందర్నీ సాపు చేస్తాడు
ఆ పిల్లగాడు గంగాతీర వాసి".
‘అరే రామా! ఎలాంటి చిక్కుల్లో పడిపోయాను
నా పని శూలంపై నిలుచున్నట్టుంది.
ఎంత సీదా సాదా గా ఉండేవాణ్ణీ.ఎంత అమాయకంగా ఉండేవాణ్ణి.
ఎలాంటి ఘడియల్లో ఈ చదుకున్నవాళ్ళ పాలున పడ్డానో
తియ్యని చురకత్తితో 'హలాల్ ' ఐపోయాను.”
ఇలాంటి పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యే స్థితి చాలామందికి అనుభమౌతుంది. మంచికిపోయి చిక్కుల్లో ఇరుక్కున్న అమాయకపు కథానాయకుడిఅసహాయస్థితి పట్ల ప్రేక్షకుడు కి సానుభూతి కలగటమో లేదా ఎమోషనల్ బాండింగ్ ఏర్పడటమో జరిగుండాలి. దానివల్లే సినిమా ఇంతగా ఆకర్షించివుండవచ్చు.
-ముళ్ళపూడి సుబ్బారావు