Wednesday, February 7, 2018

హోష్ వాలోం కో ఖబర్ క్యా , బేఖుదీ క్యా చీజ్ హై

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-130
``హోష్ వాలోం కో ఖబర్ క్యా , బేఖుదీ క్యా చీజ్ హై``
(మెలకువతో ఉన్నవారికేం తెలుసు మైమరపు అంటే ఏమిటో)
సర్ఫరోష్ (1999) సినిమాలో జగ్ జిత్ సింగ్ పాడిన పాట .జతిన్ -లలిత్ సంగీతం. నిదా ఫజ్లి రచన....
నిదా ఫజ్లి ,గుప్పెడు పాటలే సినిమాలకు రాసినా అవి గుప్పెడు గుండెను తట్టేవే. సంగీత దర్శకులు జతిన్ -లలిత్ లు సంగీత కుటుంబానికి చెందినవారే. పాటలు పాడిన నటి సులక్షణా పండిట్ సోదరులు వీరు.
ఎనభైలలో వచ్చిన కొన్ని సినిమాలలో జగ్ జిత్ సింగ్ గజళ్ళు చోటుచేసుకున్నాయి. సున్నితమైన అనుభూతులతో మనసును నెమ్మదిగా ఊయలలూపేవి అవి. అలాంటి అనుభూతిని 1999 లో మరోసారి ఈ పాటతో పొందగలిగాం. పాట చిత్రీకరణా అప్పటికి పాతకాలపుదే. కనపడేవి పాట వింటున్న కథానాయకుడి కాలేజి రోజుల జ్ఞాపకాలే.

``మెలకువతో ఉన్నవారికేం తెలుసు మైమరపు అంటే ఏమిటో
ప్రేమించు. అప్పుడు తెలుసుకో జీవితమంటే ఏమిటో
తనతో చూపు కలిసాక పరిసరాలు వెలుతురుతోనిండాయి
నేడే తెలుసుకున్నాను ప్రేమలో ఉన్న మాయ ఏమిటో
విడివడిన కురులు ఋతువుకు గీతాలు నేర్పాయి
వాలిన కన్నులు చెప్పాయి మద్యపానమహిమ ఏమిటో
తనతో మనసు ఉన్న స్థితి ని పెదవులతో చెప్పలేకపోయాను
తనూ అర్ధంచేసుకోలేక పోయింది మౌనమంటే ఏమిటో``

పంఖ్ హోతే తో రె ఉడ్ aatiరె

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-129
పంఖ్ హోతే తో రె ఉడ్ aatiరె
(రెక్కలుండి ఉంటే ఎగిరి వచ్చేదానిని)
సెహ్రా (1963) సినిమాలో లతా మంగేష్కర్ పాట. సంగీతం రామ్ లాల్, రచన హస్రత్ జైపురి.
తెలుగునాట కొన్ని హిందీ పాటలు తెలుగు పాటలతో సమానంగా గ్రామీణప్రాంతాలలో కూడా ప్రాచుర్యం పొందాయి.ఆ ప్రాచుర్యానికో కొలమానం ఆ పాట వరసలు భజన గీతాల్లో చొచ్చుకుపోవటం....
మా వూరి భజన బృందం సంప్రదాయ భజన గీతాలే కాక , సినిమా పాటల వరసల్లో భక్తి పాటలు కట్టి పాడుతుండే వారు. `అబ్బాయే పుడతాడు` లాంటి పాటను `శ్రీ శైలా శిఖరానా` అని పాడేస్తున్నా మాకు సినిమా పాటే గుర్తొచ్చేది. అలా కొన్ని హిందీ పాటలూ వయా తెలుగు సినిమాద్వారా భజనలో చేరేవి. ఐతే కొన్ని హిందీ పాటలు తెలుగు సినిమాల్లో రాకున్నా భజన లోకి వచ్చేవి. `హే నీలే గగన్ కి తలే `, పంఖ్ హో తో ` పాటలు అలాంటివే.
`పంఖ్ హో తో ` పాట విన్నచాలాకాలానికి దూరదర్శన్ లో దర్శనమిచ్చింది. తెలిసిన నటులు కారు,చిత్రీకరణా విలక్షణమే.
ఉత్తర భారతంలో కబూతర్ ఖానా లు కనిపిస్తుంటాయి. అక్కడ వందలాది పావురాలు గుమిగూడి మేత మేస్తూ,నీళ్ళు తాగుతూ కువకువలాడుతుంటాయి. ఎగిరొస్తూ పోతూ శబ్దంచేస్తుంటాయి. నీళ్ళలో మునిగి తడిరెక్కలు విదులిస్తుంటాయి. వీటన్నిటి శబ్దాలు ఈపాటలో వినిపిస్తుంటాయి. పావురాల విన్యాసాలన్నీ నటిమణుల నృత్యంలో కనిపిస్తాయి.

``రెక్కలుండి ఉంటే ఎగిరి వచ్చేదానిని,
హృదయంలేని ప్రియతమా!
నీకు (గాయపడ్డ)గుండె మచ్చలు చూపేదానను
పక్షిగా మారి ,మనసు లగ్నంచేసి
తలపుల్లో మునిగి గగనానికి చేరాను
దూరంనుంచి చూసాను, ఋతువు ఎంతో అందంగాఉంది
ఉండాల్సిన నువ్వే లేవక్కడ
బాహువులు కిరణాల్లా చాచి ఉన్నాయి
ఆశల మేఘాలపై చేరి అలల్లాకదలాడుతున్నాయి
నేను మాట నిలుపుకున్నాను
నీవు మాత్రం ఇచ్చినమాట మరచావు``


తుమ్ మిలె దిల్ ఖిలే ఔర్ జీనేకో క్యా చాహియే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-128
`తుమ్ మిలె దిల్ ఖిలే ఔర్ జీనేకో క్యా చాహియే)
(నువ్వు కలిసావు. హృదయం వికసించింది,ఇక జీవించటానికి ఏమి కావాలి)
క్రిమినల్ (1996) సినిమాలో కుమార్ సాను, అల్కా యాగ్నిక్ పాడిన పాట. ఎమ్ ఎమ్ క్రీ సంగీతం, ఇందీవర్ రచన.
దక్షిణాది సంగీత దర్శకులు రాజేశ్వర రావు,ఆది నారాయణ రావు వంటివారు తమసంగీతాన్ని ఉత్తరాదికి వినిపించినా అది చుట్టపుచూపే....
బహుశా ఇళయరాజా నే తొలిగా హిందీ సీమలో గుర్తింపు పొందినవాడు కావచ్చు. తర్వాత ఏ ఆర్ రెహ్మాన్ ను హిందీ ఆంకర్లు `రెహ్మాన్ ..దో దిన్ కి మెహ్మాన్` అని వెక్కిరించినా అతడు రెండు దశాబ్దాలుగా అక్కడ నిలబడే ఉన్నాడు.
తర్వాత సంగీత దర్శకుడు కీరవాణి కూడా,ఎమ్ ఎమ్ క్రీమ్ పేరుతో కొన్ని హిందీ సినిమాలకు సంగీతమిచ్చాడు. వాటిలో కొన్ని పాటలు దేశం నలుమూలలనుండీ `ఫర్మాయిష్` చేయబడుతూనే ఉన్నాయి.
క్రిమినల్ సినిమా రెండు భాషల్లో `మహేశ్ భట్` దర్శకత్వంలోవచ్చింది. సినిమాలో చెప్పుకోదగింది సంగీతమే. అందులో ముఖ్యంగా ఈ పాట. శ్రావ్యమైన సంగీతం, ప్రశాంతతతో నిండిన అలాపన,చక్కని విజువల్స్.

~నువ్వు కలిసావు. హృదయం వికసించింది
ఇక జీవించటానికి ఏమి కావాలి
నువ్వు చింతించకు,నీ వెనువెంట
నేను ఉంటాను జీవితాంతం
లోకంలోని ప్రేమంతా నేను నీలోనే పొందాను
నిన్ను చూడటానికే చంద్రుడు ఉదయిస్తుంటాడు
నిన్ను తనలో చూసుకోవటానికే అద్దం పరితపిస్తుంది
ఇంత అందమైనది వేరొకటి లేదు
రెండు లోకాల సౌందర్యం ఒక్క నీలోనే కలసి వచ్చింది
మనం మరణిస్తాము ప్రేమ ఎప్పడూ మరణించదు
ప్రేమించినవారు అమరులవుతారు
ఎంత సౌందర్యమో అంత నమ్మిక
ప్రేమతో ఒక సారి చూడు..తిరిగి బ్రతికించు

మన్ రె తూ కాహె ధీర్ ధరె

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-127
`మన్ రె తూ కాహె ధీర్ ధరె`
(మనసా ! ఎందుకు ధైర్యాన్ని కూడగట్టుకోవు?)
`చిత్ర లేఖ` సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట. సాహిర్ లూధియాన్వి రచన, రోషన్ సంగీతం.
నాకు ఆలస్యంగా దగ్గరైనపాట. రేడియో లో ఎక్కువగా వినపడేదికాదు.పాట లలితమైన పదాలతో సాగుతుంది. ఎక్కడా ఉర్దూ పదాలులేవు. ఇది సాహిర్ లూధియాన్వి రచనాశైలి కి భిన్నమైనది. బహుశా సినిమా కథ ప్రాచీన భారతానికి చెందినది కావటం వల్ల కావచ్చు....
ఐతే పాటలో నేను సాహిర్ ను పట్టుకున్నాను.
సాహిర్ రాసిందే`బర్నింగ్ ట్రెయిన్ ` సినిమాలో జనరంజకమైన ఖవ్వాలీ ఉంది. జీవితాన్ని రైలు ప్రయాణంతో పోలుస్తూ సాగుతుందది.జీవిత ఆనందాన్ని అనుభవించమని చెబుతుంది. అందులో
''జో భీ జిత్నా సాథ్ దే ఎహసాన్ హై..,
(ఎవరైనా మీతో కలసిగడిపినదే, వారు మీకు చేసిన ఉపకారం) అని ఒక పాదం ఉంది.
అదే అర్ధం వచ్చే ఒక పాదం `మన్ రె తూ కహే` లోనూ ఉంది. అది
`ఉత్నా హి ఉపకార్ సమఝో కోయి జిత్నా సాథ్ నిభా దే`
(ఎంత వరకూ తోడునడచారో అంతమేరా ఉపకారం చేసారనుకో!)
`మన్ రే తూ కాహే ` విషాద భరితమైన పాట. అందులో చెప్పిన తత్వమూ, ఎంతో ఆనందకరంగా సాగే `పల్ దో పల్ కా సాథ్ ` లో చెప్పిన తత్వమూ ఒకటే కావటం ఆసక్తికరం.


''మనసా ! ఎందుకు ధైర్యాన్ని కూడగట్టుకోవు?
నువ్వు మోహించే తను నిర్మోహి, మోహం తెలియదు
జీవితపు పొద్దు పొడుపు ,పొద్దు కుంగులను ఎవరాపగలరు?
రంగును పహరా కాసేదెవరు ,అందాన్ని బంధించేదెవరు?
ఎందుకు ఇంత యత్నం చేస్తావు?
ఎంత వరకూ తోడునడచారో అంతమేరా ఉపకారం చేసారనుకో!
స్వప్నమనేది జనన మరణాల కలయిక, ఆ స్వప్నాన్ని మరచిపో!
నీతో కలిసి ఎవరూ మరణించరు''

సందేశే ఆతే హై హమే తడపాతే హై

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-126
`సందేశే ఆతే హై హమే తడపాతే హై`
(సందేశం వస్తుంది నన్ను బాధిస్తుంది)
బోర్డర్ సినిమాలో సోనూ నిగమ్,రూప్ కుమార్ రాథోడ్ పాడిన పాట. జావెద్ అఖ్తర్ రచన, అను మాలిక్ సంగీతం.
హకీకత్ సినిమా ను `యుద్ధ చిత్రాలకు తల్లి` (మదర్ ఆఫ్ వార్ మూవీస్) అంటారు. ఆ తల్లికి తగిన తనయ 1997లో వచ్చిన `బోర్డర్` సినిమా.
దర్శకుడు జె పి దత్తా సినిమాలు గులామి మొదలు ఉమ్రావ్ జాన్ (కొత్తది) వరకూ అన్నీ విభిన్నమైన అభిరుచి తో తీసినట్టుంటాయి. నావరకూ వాటిపట్ల ఆకర్షణ ఉంది.
పాకిస్తాన్ తో భారత్ కు జరిగిన `బాటిల్ ఆఫ్ లాంగెవాల్` (1971)నేపధ్యంతో వచ్చిన పీరిడ్ ఫిల్మ్ ఇది. సినిమా లో యుద్ధం అనివార్యత చెబుతాడు .అది ఎందుకు నివారించబడాలో చెబుతాడు. సందిగ్ధత చివరకీ మిగిలేవుంటుంది.
సినిమాలో ఈ పాట భరతఖండంలోనే కాదు భారతీయులున్న ఖండ ఖండాలలోనూ మారుమోగింది. ఇప్పటికీ ప్రతిధ్వనులు వినిపిస్తునే ఉన్నాయి.
హకీకత్ సినిమాలో `హోకె మజ్ బూర్ ముఝె ఉస్ నె భులాయా హోగా` మరపురాని పాట.ఆ పాటలో కదన రంగంలో సైనికులు విపత్కర పరిస్థితుల్లో ఇంటిని గుర్తుతెచ్చుకుని పాడే పాట.
`నామ్` సినిమాలో `చిట్టీ ఆయీ హై` పాట దూర సీమల్లో,తీరాల్లో ఉన్నవానినుద్దేశించి ఇంటి దగ్గర తండ్రి పాడేపాట.
పై రెండు పాటల కలయిక ` సందేశే ఆతే హై ` పాటలో కనిపిస్తుంది. పదినిముషాలవరకూ సాగే ఈ పాట క్రమక్రమంగా గాఢమౌతూ మనసుల్ని తడుతుంది.దృశ్యపరంగానూ,శ్రవణ పరంగానూ,అర్ధ పరంగానూ ఉన్నతమైన పాట.
యుద్ధంలో ఉన్న వారికి వదిలివచ్చిన వాటిని తిరిగి కలిసే /చూసే అవకాశాలు అనుమానమే. పాట చివరలో `మై వాపస్ ఆ ఊంగా ` పదం విన్నాక ఎంతో రిలీఫ్ అనిపిస్తుంది.
``సందేశం వచ్చింది
నన్ను బాధించింది
వచ్చిన ఉత్తరం
నన్ను అడుగుతుంది
ఇంటికి ఎప్పుడు వస్తావు
ఎప్పుడొస్తావో రాయి
నీవు లేకుంటే ఈ ఇల్లు శూన్యంగా ఉంది
మనసైన, మోహనమైన అమ్మాయి
నాకు ఉత్తరం రాసింది
నన్ను అడుగుతుంది
తన శ్వాస,తన హృదయ స్పందన
తన గాజులు,తన కడియం
తన జడ, తన జడలో పూలు
పరిమళించే ఉదయాలు, మత్తెక్కించే సాయంత్రాలు
ఒంటరి రాత్రులు, ముగియని మాటలు
తపించే బాహువులు
తపించే చూపులు అడుగుతున్నాయని..
ఎప్పుడు ఇంటికి వస్తావు
ఎప్పుడొస్తావో రాయి.
నీవు లేకుంటే హృదయం శూన్యంగా ఉంది
నన్ను ప్రేమించే వారు,నా స్నేహితులు
నాకు రాసారు. నన్ను అడిగారు
మా ఊరు, మామిడిచెట్టు నీడ
పాత రావి చెట్టు,వర్షించే మేఘాలు
గోధుమ పంట పొలాలు, పచ్చని మైదానాలు
బంతి పూలు, ఊగే రెమ్మలు
ఊగుతున్న ఉయ్యాల, తలలూపే పూవులు
విచ్చుకునే మొగ్గలు
ఇంకా ఊరి వీధులు అడుగుతున్నాయని.
ఇంటికి ఎప్పుడు వస్తావు
ఎప్పుడొస్తావో రాయి
నీవు లేకుంటే ఈ ఊరు శూన్యంగా ఉంది
ఒక మమత తో
గంగ అంత ప్రేమతో
వచ్చిన ఉత్తరం
వస్తూ తెస్తుంది
నా బాల్యపు రోజులు
వాకిటిలో ఆటలు
అమ్మ పైటచెంగు నీడ
ఆమె చిక్కని కాటుక
ఆ జోలపాటల రాత్రులు, ఆమె మెత్తని చేతులు
ఆ కళ్ళల్లో ప్రేమ, మాటలలో చింత
పైకి చూపే కోపం,లోపల ప్రేమ
చూపే అమ్మ
ప్రతీ జాబులో లో అమ్మ అడుగుతుంది
ఇంటికి ఎప్పుడు వస్తావు
ఎప్పుడొస్తావో రాయి
నీవు లేకుంటే వాకిలి శూన్యంగా ఉంది
తిరుగాడే గాలీ ! చెప్పు
నాకో చిన్న పని చేస్తావా?
మా ఊరు వెళ్ళు, నా స్నేహితులను అడిగానని చెప్పు
మా ఊరిలో ఉన్న ఓ వీధిలో
నా హృదయేశ్వరి ఉంటుంది
ఆమెతో ప్రేమ మాట చెప్పు
అక్కడికి కొద్ది దూరంలో మా ఇల్లు ఉంటుంది
మా ఇంటిలో మా అమ్మ ఉంటుంది
మా అమ్మ పాదాలు స్పృశించి
ఆమె కు ఆమె కొడుకు పేరు చెప్పు
ఓ తిరుగాడే గాలీ! కొద్దిగా
నా స్నేహితులకు,ప్రేయసికి
మా అమ్మకు నా వార్త చెప్పు
అక్కడికి వెళ్ళి ఈ వార్త చెప్పు
నేను తిరిగి వస్తాను
తిరిగి నా ఊరికి
ఊరి నీడలోకి
అమ్మ పైటచెంగు కు
ఊరి రావి చెట్టుకు
ఆమె కాటుకకు
ఇచ్చిన మాటను నిలుపుకుంటాను
నేనొక రోజు వస్తాను
-ముళ్ళపూడి సుబ్బారావు

బాబుల్ కి దువాయే లేతీ జా

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-125
“బాబుల్ కి దువాయే లేతీ జా,జా తుఝ్ కో సుఖీ సన్ సార్ మిలీ”
“తండ్రి ఆశీస్సులు తీసుకొని వెళ్ళు,వెళ్ళు ,నీకు అనందకరమైన జీవితం దొరుకుతుంది)
‘నీల్ కమల్ ‘ సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట. సాహిర్ లూధియాన్వి రచన ,రవి సంగీతం.
...
కూతురు వివాహమై అత్తింటికి వెళుతుంది. తండ్రి వీడ్కోలు పలుకుతున్నాడు.పెఌ ని కళ్యాణమనీ అంటారు. అంటే ఆనందకరమైదని. ఐతే పెఌ వేదనకూ గురిచేస్తుంది. సొంత గడప వదిలి పరాయి గడప తొక్కిస్తుందది. కొత్తప్రపంచంలో కూతురెట్లా ఇముడుతుందోనని తండ్రికి ఎంతో భయం. అక్కడ కూతురు జీవితం ఎలాగడవాలని తండ్రి ఆశ పడుతున్నాడో ఈ పాట చెబుతుంది. ఎంత ఆశో అంత భయమూ పాటలో కనపడుతుంది.
తండ్రి గా బలరాజ్ సాహ్ని కూతురుగా వహీదారెహ్మాన్ కనిపిస్తారు.బలరాజ్ సాహ్ని ఎప్పుడు నటనాపరంగా నిరుత్సాహపరచాడు? ఈ సినిమాలోనూ /పాటలోనూ గుండెల్ని తడుపుతాడు.
సాధారణంగా బలరాజ్ సాహ్ని పాటంటే ‘మన్నాడే’ గుర్తుకొస్తాడు. ఐతే ఇది నేపధ్య గీతం. దీనిని ఎంతో కరుణరసాత్మకం గా రఫీ పాడారు.

“ తండ్రి ఆశీస్సులు తీసుకొని వెళ్ళు
వెళ్ళు ,నీకు అనందకరమైన జీవితం దొరుకుతుంది
కన్నవారిల్లు నీకు ఎప్పుడూ గుర్తురాకుండాలి
అత్తవారింట అంత ప్రేమ దొరకాలి
మృదువుగా నిన్ను పెంచాను
మొగ్గలా, పువ్వులా
చిన్నతనంలో ఉయ్యలలూపాను
నా చెతుల్ని ఉయ్యల చేసి
నా తోటలో నాజూకైన కొమ్మా!
అనుక్షణం నీకు వసంతమవ్వాలి
,
నీ భాగ్యం నిన్ను ఏ ఇంటితో కలిపిందో
ఆ ఇంటిలో సదా నీ మాట నడవాలి
పెదవులపై నవ్వుల వెలుగులు పూయాలి
తలపై ఆనందపు కిరీటం నిలవాలి
ఎన్నటికి ఆరనిజ్యోతి
వంటి అలంకరణ నీది కావాలి
నీ జీవన ఘడియలు
చల్లని నీడలో ప్రశాంతంగా గడవాలి
ఏనాడూ నీ కాలు కి
ముల్లుకూడా గుచ్చరాదు
నీ ఇంటి ద్వారం కలిసే దారికి
కూడా దుఃఖమనేది దూరంగా ఉండాలి”




Wednesday, November 8, 2017

చోఢ్ ఆయే హమ్ వో గలియా

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-124
చోఢ్ ఆయే హమ్ వో గలియా!
(‘ఆ వీధులు వదిలివచ్చాము’)
మాచిస్ (1996)సినిమాలో పాట. హరిహరన్,సురేశ్ వాడ్కర్,వినోద్ సెహగల్,కే కే పాడిన పాట. విశాల్ భరద్వాజ్ సంగీతం.
ఐదు దశాబ్దాలుగా చిత్రసీమలో తన ప్రాభవాన్ని నిలుపుకుంటూనే ఉన్న గీత రచయిత ‘గుల్జార్’. సినిమాలలు గీతాలే కాదు, మాటలూ రాసాడు. దర్శకుడుగా నిలిచిఉండే సినిమాలూ తీసాడు.తీసిన సినిమాలు వివిధ తరహాలకు చెందినవి. దర్శకుడిగా మొదటి యత్నం (1971) నగర యువతలో రేగిన అశాంతి ని చూపాడు(మేరే అప్నే). పాతికేళ్ళతర్వాత మాచిస్ (1996)సినిమాలో లో ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత పంజాబ్ యువత ఉగ్రవాదంవైపు కదలికను చూపాడు.
గుల్జార్ పాకిస్థాన్ లో పుట్టాడు. దేశవిభజన క్లేశాలు అనుభవించాడు. రాసిన అనేకపాటల్లో ఏదో ఖాళీతనాన్ని వ్యధతో భర్తీ చేస్తున్నట్టు చూపుతాడు. అమీర్ ఖుశ్రో, గాలిబ్ లను తిరిగి పరిచయం చేస్తుంటాడు. కాలపు దారుల్లో దారి తప్పకుండా నడిచినట్టుంటాడు.నడిచిన దూరమెంతో తెలియనీయడు.
మాచిస్ లో ఈ పాటలో మొదటిచరణంలో వదిలివచ్చినవాటిపట్ల బెంగ,రెండవదానిలో అక్కడి స్థితి పట్ల విచారం ,మూడవదానిలో తన స్థితి పట్ల నిర్వేదం కనిపిస్తాయి.
“ఆ వీధులు వదిలివచ్చాము…..
నీ కమలాలవంటి కాళ్ళు ఎక్కడ జారిపడేవో
నీ నవ్విన బుగ్గలు సుడిగుండాల్లా సొట్టలు పడేవో
నీ నడుమువంపులు నదులు తీసుకునేవో
నీ నవ్వు విని పంటలు పక్వానికొచ్చేవో…
అలాంటి వీధులు వదిలివచ్చాము.
ఎక్కడ నీ పాదధూఌ రేగుతుండేదో
విన్నాను .. ఆ గుమ్మంలో సాయంసంజ అలుముకుందని
నీ కేశపాశాల్లో చిక్కుకున్న ఆ రాత్రి ని
తలగడపై అప్పుడప్పుడూ తిరిగి కలుస్తుంటాను
హృదయమొక బాధాశకలం, రాతి పెళ్ళ
ఒకచీకటి నుయ్యి, ఒక మూసి ఉన్నవీధి
గడవని ఒక చిరు క్షణం...
ఎంతో మండిస్తున్నాను ,ఐనా భస్మంకాదు”