Wednesday, February 7, 2018

మన్ రె తూ కాహె ధీర్ ధరె

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-127
`మన్ రె తూ కాహె ధీర్ ధరె`
(మనసా ! ఎందుకు ధైర్యాన్ని కూడగట్టుకోవు?)
`చిత్ర లేఖ` సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట. సాహిర్ లూధియాన్వి రచన, రోషన్ సంగీతం.
నాకు ఆలస్యంగా దగ్గరైనపాట. రేడియో లో ఎక్కువగా వినపడేదికాదు.పాట లలితమైన పదాలతో సాగుతుంది. ఎక్కడా ఉర్దూ పదాలులేవు. ఇది సాహిర్ లూధియాన్వి రచనాశైలి కి భిన్నమైనది. బహుశా సినిమా కథ ప్రాచీన భారతానికి చెందినది కావటం వల్ల కావచ్చు....
ఐతే పాటలో నేను సాహిర్ ను పట్టుకున్నాను.
సాహిర్ రాసిందే`బర్నింగ్ ట్రెయిన్ ` సినిమాలో జనరంజకమైన ఖవ్వాలీ ఉంది. జీవితాన్ని రైలు ప్రయాణంతో పోలుస్తూ సాగుతుందది.జీవిత ఆనందాన్ని అనుభవించమని చెబుతుంది. అందులో
''జో భీ జిత్నా సాథ్ దే ఎహసాన్ హై..,
(ఎవరైనా మీతో కలసిగడిపినదే, వారు మీకు చేసిన ఉపకారం) అని ఒక పాదం ఉంది.
అదే అర్ధం వచ్చే ఒక పాదం `మన్ రె తూ కహే` లోనూ ఉంది. అది
`ఉత్నా హి ఉపకార్ సమఝో కోయి జిత్నా సాథ్ నిభా దే`
(ఎంత వరకూ తోడునడచారో అంతమేరా ఉపకారం చేసారనుకో!)
`మన్ రే తూ కాహే ` విషాద భరితమైన పాట. అందులో చెప్పిన తత్వమూ, ఎంతో ఆనందకరంగా సాగే `పల్ దో పల్ కా సాథ్ ` లో చెప్పిన తత్వమూ ఒకటే కావటం ఆసక్తికరం.


''మనసా ! ఎందుకు ధైర్యాన్ని కూడగట్టుకోవు?
నువ్వు మోహించే తను నిర్మోహి, మోహం తెలియదు
జీవితపు పొద్దు పొడుపు ,పొద్దు కుంగులను ఎవరాపగలరు?
రంగును పహరా కాసేదెవరు ,అందాన్ని బంధించేదెవరు?
ఎందుకు ఇంత యత్నం చేస్తావు?
ఎంత వరకూ తోడునడచారో అంతమేరా ఉపకారం చేసారనుకో!
స్వప్నమనేది జనన మరణాల కలయిక, ఆ స్వప్నాన్ని మరచిపో!
నీతో కలిసి ఎవరూ మరణించరు''

No comments:

Post a Comment