Thursday, February 8, 2018

చౌద్వీ కా చాంద్ హో

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-150
చౌద్వీ కా చాంద్ హో యా ఆఫ్తాబ్ హో
(“పున్నమినాటి చంద్రునివా! లేక సూర్యునివా!)
చౌద్వీ కా చాంద్(1960) సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట.
సమిష్టి విజయాన్ని పంచుకోవటంలో చాలాసార్లు స్పర్ధలు వస్తాయి. ‘ప్యాసా’ సినిమా వాల్ పోస్టర్లపై దర్శక నిర్మాతల పేర్ల పరిమాణంలోనే ఆ సినిమా కు సంగీత సాహియాలందించిన ఎస్ డి బర్మన్, సాహిర్ లూధియాన్వీ ల పేర్లు కనిపిస్తాయి. ఆ సినిమా విజయంలో పాటల పాత్ర ఎంతో ఉంది. ఆ విజయం లో ఎవరి పాలు ఎక్కువ అన్న సమస్య వారిద్దరిమధ్య దూరం పెంచింది. ఆ చిత్ర దర్శక నిర్మాత, నటుడు ‘గురుదత్ ‘ కు ఇద్దరూ కావలసిన వారే.
ఆ తరువాత ‘కాగజ్ కె ఫూల్ ‘ సినిమాతో గురుదత్ కు ఎస్ డి బర్మన్ తోనూ తగువైపోయింది. ఇది గురుదత్ తర్వాత సినిమాలో ‘చౌద్వీ కా చాంద్ ‘ లో కొత్త కలయికకు కారణమయ్యింది. గీత రచయిత ‘షకీల్ బదాయుని’ సంగీత దర్శకుడు ‘నౌషాద్ ‘ తో కలిసి అనేక హిట్ గీతాలందించాడు. అతను వేరేవారితో పనిచేసింది తక్కువ. ఈ సినిమాతో సంగీత దర్శకుడు ‘రవి’ తో కలసిపనిచేసాడు. తద్వారా అద్భుతమనదగిన పాట పుట్టింది. తర్వాత ఆ పాటననుసరించి లెక్కకు మిక్కిలి పాటలు వచ్చాయి.
పరిమిత సంఖ్యలోనే వచ్చిన గురుదత్ సినిమాలలో విలక్షణత ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కో తరహాలో ఉంటాయి. స్థల కాలాలు సినిమాలో కనపడుతుంటాయి. ప్యాసాలో కలకత్తా కనపడితే చౌద్వీ కా చాంద్ లో లక్నో కనపడుతుంది. ముస్లిం నేపధ్యంతో సాగిన ఈ సినిమాలో ఈ పాట పాTaగానే మధురం, దృశ్యీకరణ ద్వారా పాట విలువ మరింత పెరిగింది.
ఈ పాట తెలుగు రూపం ‘పి బి శ్రీనివాస్ ‘ పాడినది ఉందికాని తెలుగు శ్రోతలకు దానికన్నా హిందీ పాటే దగ్గర. ‘అబ్దుల్లా’ సినిమాలో ‘మైనే పూచా చాంద్ సే ‘ పాటకు స్పూర్తి 'చౌద్వీ క చాంద్’ కావచ్చని నా కనిపిస్తుంది.

“పున్నమిచంద్రునివా! లేక సూర్యునివా!
ఏమైనాకాని దేవునిపై ఆన… నువ్వు సాటి లేనిదానవు.
భుజాలపై వాలిన మేఘాలవంటి కుంతలాలు
నిండిఉన్న మధుపాత్రల వంటి నయనాలు
ప్రేమ మైకం కలిగించే మధువువు నువ్వు
సరస్సులో హసించే కమలం వంటి వదనం
జీవన వీణ పలికించే గేయానివి
వసంతానికి ప్రాణమయ్యేదానా! నువ్వు కవి కనే స్వప్నానివి
విద్యుత్తు వంటి చిరునవ్వు పెదవులపై ఆటలాడుతుంది
తారామండలం నువ్వొచ్చే దారిలో సాగిలబడుతుంది
సౌందర్య భరిత ప్రేమలోకానికి యవ్వనానివి నువ్వే”


సారె జగ్ మే కహీ నహీ హై దూసర హిందూస్తాన్

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-149
‘సారె జగ్ మే కహీ నహీ హై దూసర హిందూస్తాన్’
(జగమంతటిలోనూ మరెక్కడా మరొక హిందూస్తాన్ లేదు)
పర్ దేశ్ (1997) సినిమాలో పాట. నదీమ్ -శ్రవణ్ సంగీతం. ఆనంద్ బక్షి రచన. హరిహరన్,శంకర్ మహదేవన్,కవితా కృష్ణమూర్తి ,ఆదిత్య నారాయణ్ గానం.
రోదసి లో ఉన్న రాకేశ్ శర్మ ను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అడిగింది `అక్కడినుండి భారతదేశమెలా కనపడుతుంద`ని. `సారే జహాసే అచ్చా` అని ఆయన వెంటనే సమాధానమిచ్చాడు.దూరంనుండి అలానే ఉంటుందేమో.
ఎ బి సి డి (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీస్ )అని 90లలో ఇండియా టుడే లో ఒక ఆర్టికల్ వచ్చింది. భిన్న సంస్కృతులను సమతౌల్యం చేసుకోవాల్సిన అవసరం సంఖ్యాపరంగా గణనీయమైన సమూహానికి అప్పటికి వచ్చినట్టుంది. ప్రత్యేకంగా యువతకు. హిందీ సినిమాలకు చక్కని సబ్జెక్ట్ దొరికింది. చాలానే సినిమాలు ఈ సబ్జెక్ట్ పై వచ్చాయి.
అలాంటి సబ్జెక్ట్ పై వచ్చిన `దిల్ వాలె దుల్హనియా లేజాయెంగే ` వచ్చిచరిత్రాత్మక విజయం సాధించింది. తర్వాత `పర్ దేశ్ `వచ్చింది. రెండు సినిమాలలోనూ మాతృభూమిపై మమతను చాటే పాటలున్నాయి.
అమ్రిశ్ పురి గొంతు ఇనుపగొలుసులు రాపిడితో వచ్చే శబ్దాన్ని పోలిఉంటుందంటారు. తెలుగు సినిమాలలో అతని సంభాషణల్ని మిమిక్రీ కళాకారులు అనుకరిస్తారు. అతను ‘పర్ దేశ్’ సినిమాలోని ఈ పాటలలో గొంతుకలిపాడు.
‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ (1970) సినిమాలో ఒకపాటలో రచయిత ‘ఇందీవర్’ భారత దేశాన్ని మూడు రంగుల చీరలో ఉన్న వధువు తో పోల్చాడు. ఈ పాటలో భారత దేశాన్ని వధువు నుదిటి పైని బొట్టు తో పోల్చాడు రచయిత ఆనంద్ బక్షి.


“లండన్ చూసాను
పారిస్ చూసాను
ఇంకా జపాన్ చూసాను
మైఖేల్ జాక్ సన్ ను చూసాను,ఎల్విస్ ప్రిస్లీ ని చూసాను
సర్వం చూసాను నా ప్రాణమా!
జగమంతటిలోనూ మరెక్కడా మరొక హిందూస్తాన్ లేదు
ఈ లోకం ఒక వధువైతే
ఆ వధువు నుదుటి బొట్టు
నా ఈ భారతదేశం
ఐ లవ్ మై ఇండియా
ఒకరు మేఘ్ మల్హార్ ఆలపిస్తే
వర్షం తరలివచ్చింది
దీపక్ రాగం వినిపిస్తే
నీటితో దీపం వెలిగింది
సప్త స్వరాల సంగమం ఈ జీవన గీతమాల
మేము మా భగవానునీ వంశీధరుడని అంటాం
వంశీధరా! వంశీధరా!
ఇది నా భారతదేశం”
కోయిల కుహు కుహు పాడుతుంది
హసనాన్ని రోదనను జీవన గీతాలుగా మార్చుకున్నాము
లోకులంతా వారి వారి గీతాలు గానం చేసుకుంటారు
వారు పాడే పాటనుండి ఈ మట్టివాసన గుబాఌస్తుంది
నా మాతృభూమి ఇండియా,నా ప్రేయసి ఇండియా
నా విధి ఇండియా,నా ధర్మం ఇండియా

`యే జిందగీ గలె లగాలే`

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-148
`యే జిందగీ గలె లగాలే`
(జీవితమా! నన్ను కౌగిలించుకో)
`తదియ నాటి చంద్రుడు` అని అర్ధమొచ్చే తమిళ సినిమా తెలుగులో `వసంతకోకిల` గా డబ్ అయ్యింది.సినిమా చూసినా రెండు భాషల సినిమా పేర్లు సినిమాకు అన్వయం చేసుకోలేకపోయాను. అదే సినిమా హిందీ లో `సద్మా` గా వచ్చింది. ఆ పేరు సినిమా కథకు సరైనదే అనిపించింది.
ఒక సెలబ్రిటి , అతన ఉనికిని దాచి మారుమూల ప్రాంతంలో కథానాయకునితో కాలంగడపటం,తర్వాత అతనికి దూరమై చివరికి దగ్గరవ్వటం ..ఇలాంటి కథనంతో అనేక సినిమాలు వివిధభాషల్లోవచ్చాయి. ఆకథకు `మరపు` ను కలిపి దుఃఖాంతం చేసిన కథ తో ఈ సినిమా వచ్చింది.
నటీనటులకు మంచి అవకాశమిచ్చిన సినిమా.దానిని కథానాయికా నాయకులు సద్వినియోగం చేసుకున్నారు.
వస్తుతః ఛాయాగ్రాహకుడైన దర్శకుడు బాలూ మహేంద్ర సినిమాను దృశ్యకావ్యం చేశాడు. దానికి ఇళయరాజా సంగీతం ,గుల్జార్ రచన మరింత జీవం పోసాయి.
సురేష్ వాడ్కర్ పాడిన పాటల్లో అమితంగానన్ను ఆకుట్టుకున్నవాటిలో ఇది ఒకటి.పాట మధ్యలో వచ్చే వయొలీన్ల వాదనం మనోహరం.
``జీవితమా! నన్ను కౌగిలించుకో
నేనూ నీవిచ్చే ప్రతిబాధనూ
కౌగిలించుకున్నాను. ఔనా,ఔనా!
నేను ఒక సాకుతో ,లోకానికి చాటుగా
కనురెప్పల తెరలకింద కనుల ఇంటిని నింపుకున్నాను
జీవితమా! నాకు నీ ఆసరా దొరికింది.
చిన్న మేఘం(నీడ?) కంటిలో ప్రవేశించింది
నేను రెండు చుక్కలతో మనసును నింపుకున్నాను
జీవితమా!నాకు తీరం దొరికింది``
https://www.youtube.com/watch?v=0BXqAnZWqdQ

కచ్చా కచ్చా చోటా చోటా నింబుడా లాయిదో

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-147
‘’కచ్చా కచ్చా చోటా చోటా నింబుడా లాయిదో”
(పచ్చిపచ్చిగా, చిన్నచిన్నగా ఉన్న నిమ్మ తెచ్చిపెట్టు)
‘హమ్ దిల్ దే చుకే సనమ్’(1998) సినిమాలో పాట.
రాజస్థాన్ యాత్రల్లో జానపదకళాకారుల నృత్యంలోనూ , తోలుబొమ్మల ఆటలోనూ ‘పల్లో లట్ కే రె మారో పల్లో లట్ కె’ అంటూ సాగే జానపద గీతం బాగా వినపడుతుంది. నాకు అదే పల్లవితో కిశోర్ కుమార్ ,ఆశాభోన్స్లే పాడిన సినిమా పాట తెలుసు.(ఎనభైలలో ఇది బాగా వినపడేది).
‘లోక్ సంగీత్ ‘ రేడియో కార్యక్రమంలో విన్న మరోరాజస్థానీ జానపదగీతం ‘నింబూడా,నింబూడా’. ఆకర్షణీయమైనరంగురంగుల టర్బన్లతో, సాంప్రదాయ సంగీతవాయిద్యాలతో, బృందగానంచేసే రాజస్థానీ కళాకారులూ ఈ గీతాన్ని ఆలపిస్తూ టీ.వీ ల్లో కనిపిస్తారు.
ఆ గీతం ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమాలో వచ్చింది. కవితా కృష్ణమూర్తి,కర్శన్ సర్గతియా గానంచేసారు.సంగీతం ఇస్మాయిల్ దర్బార్ ,రచన ‘మహబూబ్’. జానపదగీతాలు సినిమాపాటలుగా వచ్చినపుడు పాట క్రెడిట్ సినిమా రచయితలు తీసేసుకుంటారు.బహుశా చేసిన మార్పుల నిమిత్తమనుకుంటా.
‘పల్లో లట్ కే ‘పాట సినిమాలో చూడటానికి చాలా సాధారణంగా ఉంటుంది. ‘నింబూడా నింబూడా ‘ పాట చిత్రీకరణ భారీగానూ,సౌందర్యభరితంగా ఉంటుంది.
పచ్చినిమ్మకాయలను ‘దిష్టి ‘ తీయటానికి వాడటం ఇక్కడ తెలుసు. రాజస్థాన్ జానపదుల్లోనూ అదే నమ్మకంఉన్నట్టుంది. పాటలో అదే వినపడుతుంది. పైకి వినపడేది కాక వేరే అర్ధం ఏమైనాఉండవచ్చు.


“నిమ్మ,నిమ్మ,నిమ్మ
పచ్చిపచ్చిగా, చిన్నచిన్నగా ఉన్న నిమ్మ తెచ్చిపెట్టు
పో! పచ్చని పొలంనుండి నిమ్మకాయ తీసుకురా!
తీసుకురా! తీసుకురా!
ప్రేమికుల చెడు చూపునుండి
తప్పించుకోవాలంటే విను
పుల్లపుల్లని నిమ్మ ను పదునైన ఛురికతో తలపై కొయ్యి
అప్పుడు చిన్నచిన్నని నిమ్మ
ఏమి మాయ చేస్తుందో చూడు
ఆ చెడు చూపు
పుల్లనై పోతుంది
ఆపై నాలుగు దారుల్లో
జారిపడుతుంది
చిన్నదే కాని రసభరితం
మంచి కుదుపునిస్తుంది
దీని వాసన మనసులో కోరిక పెంచుతుంది
నాలికపై వేసుకుంటే అంతే
కాని ప్రేమలో ప్రేమికుడు ప్రేయసి
ఒకరి తో ఒకరు కళ్ళకలుపుతారు
అప్పుడు వారిమధ్య చాలాసార్లు
తీయని యుద్ధం జరుగుతుంది
నిమ్మకాయ చెబుతుంది అదే ప్రేమ అని.
నా స్నేహితురాళ్ళూ పోయి తీసుకురండి
చిన్న నిమ్మకాయ”


బహారో ఫూల్ బరసావో !

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-146
``బహారో ఫూల్ బరసావో ! మేరా మెహబూబ్ ఆయా హై``
(వసంతమా! పూలను వర్షించు,నా ప్రియతమ వచ్చింది)
సూరజ్(1966) సినిమాలో మహమ్మద్ రఫీ పాడినపాట.శంకర్ జైకిషన్ సంగీతం ,రాజిందర్ కిషన్ సాహిత్యం.
హీరో రాజేంద్రకుమార్ ను `జూబిలీ హీరో` అంటారు. అతని సినిమాలు ఎక్కువ జూబిలీలు చేసుకున్నయనో లేదా ఇరవై ఐదు హిట్ సినిమాల్లో నటించినందుకో తెలియదు.
నటుడు దిలీప్ కుమార్ ను చాలా మంది నటులు అనుకరించారు.రాజేంద్రకుమార్ కూడా నాకు దిలీప్ కుమార్ ను గుర్తుకుతెస్తాడు. పూర్తి దిలీప్ కాదు. ఆయనలో ఒక పార్శ్వం.( మరో పార్శ్వాన్ని అమితాబ్ బచన్ లో నేను చూశాను)
దిలీప్ కుమార్ తరహా నటనతో రాజేంద్రkumar ఆయనకన్నా ఎక్కువసినిమాల్లో నటించాడు,విజయవంతమయ్యాడు.అతని సినిమాలు విజయంలో సంగీతానిదీ పెద్ద పాత్రే.
ఎన్నో సూపర్ హిట్ పాటలు అతని సినిమాలలో ఉన్నాయి. అందులో రఫీ పాడినవిఎక్కువ.
సూరజ్ సినిమా లో పాటలన్నీ హిట్ ఐనవే. నేను చూసేనప్పుడు(1980లు) సినిమా పెద్ద ఉత్సుకత కలిగించలేదు. అలాంటివి తెలుగులో అప్పటికే చాలావచ్చిఉన్నాయి.(సూరజ్ కూడా సౌత్ నిర్మాతలు,దర్శకుడు ద్వారా వచ్చిందే). సినిమాలో గుర్తుండేట్టు చేసింది పాటలే. వాటిల్లో అమిత ప్రజాదరణ పొందిన ఒకపాట ఇది.
`దీక్ష` తెలుగు సినిమాలో `మెరిసే మేఘమాలికా` పాట దీనిని కొంత పోలి ఉంటుంది.


``వసంతమా! పూలను వర్షించు
నా ప్రియతమ వచ్చింది
పవనమా! రాగమాలపించు
నా ప్రియతమ వచ్చింది
పూల ఎర్రదనమా! మైదాకులా
ఆమె తెల్లని చేతులను చేరు
Naల్లని మేఘమా! దిగివచ్చి
ఈ అందమైన కళ్ళకు కాటుకలా మారు
తారకలారా! ఆమె పాపిడి నింపండి
నా ప్రియతమ వచ్చింది
ప్రకృతీ! ప్రతిచోటా
కాంతి కంబళ్ళు పరుచు
ప్రేయసి బహు సిగ్గరి
సిగ్గుపడి వెఌపోతుంది
కొద్దిగా నువ్వు మనసు ను ఉత్సాహపరచు
నా ప్రియతమ వచ్చింది
లేత మొగ్గలుఈ ప్రేమశయ్యను
అలంకరించాయి
వాటికి తెలుసు
ప్రేమ ఋతువు ఒకనాటికి వస్తుందని
వీచేగాలీ! రంగులు వెదజల్లు
నా ప్రియతమ వచ్చింది``


పియా బసంతీ రే , కాహే సతాయే ఆజా

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-145
పియా బసంతీ రే , కాహే సతాయే ఆజా
ప్రియా! వసంత మిది ..ఎందుకు బాధిస్తున్నావు? రా!
’పియా బసంతీ రే’’ (2000) వీడియో ఆల్బమ్ లో పాట.
ఉస్తాద్ ‘సుల్తాన్ ఖాన్’ రాజస్థానీ సంగీతకుటుంబం నుండి వచ్చాడు. ‘సారంగి’ వాద్యకారుడు.శాస్త్రీయసంగీతం తెలిసినవాడు. ప్రముఖ సంగీతకారులెందరితోనో వేదిక పంచుకున్నాడు. ప్రత్యేక ఆహ్వానం మీద గాయకుడిగా ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ లో ఒక పాట పాడాడు.
చదువుకు సంబంధించిన పరీక్షా? తనకిష్టమైన సినిమా పాట రికార్డింగా? వీటిమధ్య ఎంపిక సమస్య వచ్చినపుడు రికార్డింగు నే ఎంచుకుంది గాయని ‘చిత్ర’. దక్షిణాది భాషలన్నింటిలో పాటలుపాడి ప్రముఖగాయని అయ్యింది.
సుల్తాన్ ఖాన్, చిత్ర కలిసి ‘పియా బసంతి’ అల్బమ్ లో పాటలు పాడారు. అందులో టైటిల్ సాంగ్ అత్యంత ప్రజాదరణ పొందింది. గాయకులిద్దరికీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.
పాట చిత్రీకరణ అందమైన నటులున్నారు. అందమైన లొకేషన్లు ఉన్నాయి. చక్కని ఫొటోగ్రఫీ ఉంది.


“ప్రియా! వసంత మిది ..ఎందుకు బాధిస్తున్నావు? రా!
ఏమి మాయ చేసావో తెలియదు
మనసు ప్రేమ ధ్వని ని వినిపిస్తుంది
ఎందుకు బాధిస్తున్నావు? రా!
మేఘం ఒళ్ళు విరుసుకున్నపుడు
ధరణి పైట చెంగు రెపరెపలాడుతుంది
ఈ ఆకులు ఈ పొదలు
ఏదో అలికిడి చేస్తున్నాయి
మనసు ఊగులాడుతుంది, ఏమంటుందో తెలియదు
మనసు ఒప్పుకోదు
నేను నీ సొంతం ప్రియా!
భావి స్వప్నాలు కనురెప్పలపై కూర్చుని ఉన్నాయి
మనసు లోతుల్ని పైకి తెస్తున్నావు
మనసులో ప్రేమను మేలుకొలుపుతున్నవాడా!
సప్తవర్ణ స్వప్నాలు అంటున్నాయి ...ఎందుకు బాధిస్తున్నావు? రా!”


కరోగి యాద్ తొ హర్ బాత్ యాద్ ఆయేగి

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-144
‘కరోగి యాద్ తొ హర్ బాత్ యాద్ ఆయేగి’
(గుర్తుచేసుకుంటే, ప్రతి మాటా జ్ఞప్తికొస్తుంది)
...
కొన్ని పాటల్లోని సంగీతం మనసు ను తేలికపరుస్తుంది, అర్ధం మనసును బరువెక్కిస్తుంది. అలాంటి పాటల్లో ఇది ఒకటి.
మాటల రచయిత ‘సాగర్ సర్హది’ బాల్యంలో దేశ విభజనతో పాకిస్తాన్ నుండి కాందిశికుడిలా ఢిల్లీ కివచ్చాడు. అక్కడినుండి బొంబాయికి. రచయితగా యశ్ చోప్రా తో కలిసి విజయవంతమైన సినిమాలకు పనిచేసాడు. అందులో కభీ కభీ, సిల్ సిలా ,చాందిని వంటివి ఉన్నాయి. అమితాబ్ బచన్ తో ‘మీరు బరువైన గుండె తో రాస్తారు’ అనిపించుకున్నాడు.
‘బజార్’ సినిమాతో దర్శకుడయ్యాడు. ‘బజార్’ సినిమా కన్యాశుల్కం వంటి కథకు మరో రూపంలో హైదరాబాద్ నేపధ్యంగా నడుస్తుంది. (హిందీ సినిమాల్లో అప్పట్లో నాకు హైదరాబాద్ కొత్తగా కనిపించేది. అంతకు ముందటి ‘మెహబూబ్ కి మెహంది’, తర్వాతి ‘నిఖా’ సినిమాల్లో).
సినిమాలో సంగీతం, పాటలు మరపురానివి. పాటలు సినిమాకోసం రాసినవి కాకుండా సాహిత్యం నుండి అవసరం మేరకు ఎంచుకున్నవి. మీర్ తకి మీర్ (దిఖాయి దియె) , మఖ్దూమ్ మొహియుద్దిన్( ఫిర్ చిడీ రాత్ బాత్ ఫూలోన్ కి) కవితలు/గజల్లు అలాంటివే.
‘కరోగి యాద్’ పాట బషర్ నవాజ్ రచన. ఖయ్యాం సంగీతం, భుపెందర్ స్వరం ..వీటి విలువను మరింతపెంచిన నటినటుల నటన, చిత్రీకరణ ...వీటన్నింటితో పాట ఓ గొప్పానుభూతినిస్తుంది.


“గుర్తుచేసుకుంటే, ప్రతి మాటా జ్ఞప్తికొస్తుంది
కదిలిపోయే కాలపు, ప్రతి కెరటం ఆగిపోతుంది
ఈ చంద్రుడు కరగిపోయిన కాలానికి అద్దం ఔతాడు
కదలాడుతున్న మబ్బుల్లో ఏదో ముఖం రూపుకట్టింది
బరువెక్కిన దారులు ఏదో కథ వినిపిస్తుంది
వర్షంతో చెమ్మగిల్లిన ఋతువు పొగ గా మారుతుంది
కరగిపోతున్న కొవ్వొత్తి నిచూసి మనసు గర్విస్తుంది
అరచేతిలోని గోరింట ఏవో జ్ఞాపకాలు రేపుతుంది
వీధి మలుపులో ఒక గుమ్మం శూన్యంగా ఉంది
తపించే కళ్ళతో ఎవరిరాకకో ఎదురుచూస్తుంది
చూపులు దూరంవరకూ వెళ్ళి తిరిగి వస్తున్నాయి “