Monday, June 19, 2017

మైనె షాయద్ తుమ్హే పెహలీసి కహీ దేఖా థా

నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-94‘
మైనె షాయద్ తుమ్హే పెహలీసి కహీ దేఖా థా
(బహుశా మునుపెక్కడో నిన్ను చూశాననుకుంటా)
బర్సాత్ కి రాత్ సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట. సాహిర్ లూధియాన్వి రచన, రోషన్ సంగీతం.
...
కథానాయకుడుగా భరత్ భూషణ్ నటజివితం ‘నలుపు తెలుపు’ కాలానిది. అతని సినిమాలలొ సంగీతప్రాధాన్యం ఉన్నవి ఎక్కువ. బైజు బావరా, మీర్జా గాలిబ్,రాణీ రూప్ మతి, జహాన్ అరా సినిమాలు చారిత్రకనేపధ్యం తో వచ్చాయి. బర్సాత్ కి రాత్ సాంఘికం చిత్రం.
తలత్ మహమూద్ ,ముఖేశ్ ,మహమ్మద్ రఫీ లు భరత్ భూషన్ కు పాటలు పాడారు. ఐతే రఫీ పాడిన పాటలు ప్రత్యేకంగా బైజు బావ్రా, బర్సాత్ కి రాత్ సినిమాలలో భరత్ భూషణ్ స్వయంగా పాడుతున్నట్టే ఉంటాయి.
బర్సాత్ కి రాత్ సాంఘిక చిత్రం. సినిమా పాటలమయం. పాటలు సంగీత మయం. ప్రేమగీతాలు( సోలోలు,డ్యూయేట్లు), ఖవ్వాలీలు , అనేకమంది గాయకుల గానం.
అతి సౌమ్యం గా కనిపించే భరత్ భూషన్ పక్కన మూర్తీభవించిన ముగ్ధత్వం లా మధుబాల. వారిపై చిత్రీకరించిన పాటలు ప్రశాంత వాతావరణంలో చూస్తుంటే మంత్రనగరికి ప్రయాణం కడతాం. అందులో ఒకటి ‘మైనే షాయద్ తుమ్హే ‘.
చాలా తక్కువ సంగీత వాద్యాలు, తక్కువ సంగీతం, వెన్నెల్లో ప్రశాంతమైన సరస్సు లో నిశ్శబ్దంగా సాగే హంస విహరింపు లా సాగే రఫీ గానం.

“బహుశా మునుపెక్కడో నిన్ను చూశాననుకుంటా
అపరిచితయే కాని పరాయి అనిపించటం లేదు
ఊహ కన్నా తనే సుకుమారమని నమ్మకంగా అనిపిస్తుంది.
ఔను! పూల వంటి ముఖం, ఒత్తైన శిరోజాలు
నా కవితలకన్నా నువ్వే అందంగా కనిపిస్తున్నావు.
నిన్ను చూసినపుడు ఒక నాటి రాత్రి గుర్తుకొస్తుంది
ఒక మౌన కలయిక గుర్తుకొస్తుంది
మనసులో చలిరేపిన అందం జాడ తెలుస్తుంది.
మంటలురేపిన వర్షం గుర్తుకొస్తుంది
ఎవరి కనురెప్పలు నా కనులపై వాలివుంటాయో
నువు నా ఆ జ్ఞాపకాల దేవకన్యవు కావా?
మునుపటిలా తిరిగి మాయమై పోవుగా?
ఈ ఆనందం ఎప్పటికీ ఉండిపోదా?”


Thursday, June 15, 2017

హమ్ నె దేఖీ హై ఇన్ ఆంఖో మె మెహక్తీ ఖుష్బూ

‘నచ్చిన’ పాట- ‘లోపలి’ మాట-95
‘హమ్ నె దేఖీ హై ఇన్ ఆంఖో మె మెహక్తీ ఖుష్బూ’
(“ఆ కళ్ళలో మెరిసేటి సుగంధాన్ని చూసాను నేను)
ఖామోషీ (1969) సినిమాలో లతామంగేష్కర్ పాడిన పాట. గుల్జార్ రచన హేమంత్ కుమార్ సంగీతం.
...
‘చివరకు మిగిలేది’ సినిమా పేరు తెలుసు. అది బుచ్చిబాబు నవలకు చిత్రరూప మనుకున్నాను. అప్పటికి(ఇప్పటికీ??) చిత్రం ఏ రూపంలోనూ లభ్యతలో లేదు. ‘భరాగో’ మరో నూటపదహార్లు పుస్తకంలో ఈ సినిమాగురించి చదివాను. ఓ బెంగాలీ సినిమాకు అది రీ మేక్. అదే సినిమా పదేళ్ళ తరువాత ‘ఖామోషీ’ (1969) గా హిందీలోవచ్చింది.
చివరకు మిగిలేది సినిమాకు మరొక ప్రత్యేకత ఉంది. ‘మంజీరా’ అనే బానర్ పై ఆ సినిమాను ఉప్పునూతల పుషోత్తమరెడ్డి ఆయన మిత్రులు పాల్వాయి గోవర్ధనరెడ్డి, ఎమ్.సత్యనారాయణరావు మరికొందరితో కలసి నిర్మించారు. బహుశా పూర్తి స్థాయి తెలంగాణా నిర్మాతలనుండి వచ్చిన మొదటి సినిమా ఇదేనేమో.
ఒక నర్సు మానసిక రోగులను స్వస్థ పరిచే ఆసుపత్రిలో పనిచేస్తుంది. ఆమెకు తన వృత్తిజీవితంలో ఎదురైన అనుభవాలు,వృత్తి జీవితానికి ఆంతరంగిక జీవితానికీ మధ్య గీతలుచెరిగిపోతే కలిగే సంఘర్షణ చుట్టూ కథ నడుస్తుంది. ప్రెమకోసం తపించే రోగిని ఆమె ప్రేమిస్తున్నట్టు నటిస్తూ అ అక్రమంలో అతనిపై ప్రేమపెంచుకుంది. అతను సాధారణస్థితి పొంది తనదారిలో వెళ్లిపోయాడు . తర్వాత మరో మానసిక రోగి తోనూ ఆమె ప్రేమ నటించాల్సివచ్చింది. ఈ సారి రోగి ఈమె పై ప్రేమపెంచుకున్నాడు. ఈ వైరుధ్యాలను ఆమె భరించలేకపోయింది. తను మానసిక రుగ్మతకు లోనయ్యింది.
బెంగాలీ లో సుచిత్రాసేన్, తెలుగులో సావిత్రి, హిందీ లో వహీరెహ్మాన్ లు కథానాయిక (నర్సు) పాత్రను ధరించారు.(సావిత్రికి ఆ పాత్ర ఎంతో నచ్చి తమిళ హక్కులు తీసుకున్నారామె).
కొత్తగా ప్రేమలో పడిన ఒక యువతి రేడియో లో ప్రేమను నిర్వచిస్తూ,దాని లక్షణాలు చెబుతూ రేడియోలో పాట పాడుతుంది. ప్రేమించి ,దానిద్వారా బాధననుభవిస్తున్న ఆమె ఆ పాట వింటుంది. (‘భరాగో’ ‘ చివరకు మిగిలేది నుండి ఎంపికచేసిన పాట కూడా ఇదే సందర్భంలో, ఈ పాట స్థానంలో వచ్చినదే. ఐతే పాట అర్ధం, వరసా రెండూ వేరు)
“ఆ కళ్ళలో మెరిసేటి సుగంధాన్ని చూసాను నేను
చేతులతో స్పృశించి ఈ బంధాలను ఆరోపించకు.
ఇది ఒక భావన . దీనిని మనసు తో అనుభూతి చెందు
ప్రేమని ప్రేమ గానే ఉండనివ్వు, దానికో పేరు పెట్టకు
ప్రేమ ఒక మాట కాదు, ప్రేమ ఒక సడి కాదు
అది ఒక నిశ్శబ్దం, వింటుంది, చెబుతుంది కూడా
అది చల్లారేది కాదు,ఆగేది కాదు,నిలిచేది కాదు
యుగయుగాలుగా కురుస్తున్న వెలుతురు చినుకు అది.
అది ఎపుడైనా చిరునవ్వుతో కళ్ళ లో వెలుగుతుంది
కనురెప్పలు పై వెలుతురులా వాలుతుంది
పెదవులు ఏమీ చెప్పవు, కానీ కంపించే పెదవులపై
చెప్పాల్సిన కథలు మౌనంగా నిలిచివుంటాయి.”



చాంద్ నీ రాత్ మే ఎక్ బార్ తుఝేదేఖా హై

నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-93‘
'చాంద్ నీ రాత్ మే ఎక్ బార్ తుఝేదేఖా హై'
(వెన్నెల రాత్రిలో ఒకసారి చూశాను)
దిల్ ఎ నాదాన్ సినిమాలో కిశోర్ కుమార్ పాట. పాట రచయిత నక్ష్ లైల్ పురి.
...
వయసు పిలిచింది’ (1977) డబ్బింగు సినిమాఐనా తెలుగు సినిమాకు ఒక కుదుపు. అందులో నటులు కమల్ హాసన్, రజనీకాంత్, సంగీత దర్శకుడు ఇళయరాజా అంతకుముందు తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా, ఈ సినిమాతో బలంగా ముద్రవేశారు. అందులో పాటలు ‘ఇలాగే ఇలాగే సరాగమాడితే, మబ్బే మసకేసిందిలే, నువ్వడిగింది ఏనాడైనా, జీవితం మధుశాలా .. అన్నీ హిట్ గీతాలె. కొత్త తరహా సంగీతం, కొత్త నటులు.
ఆ సినిమాను తర్వాత హిందీ లో తీశారు. సినిమా పేరు ‘దిల్ ఎ నాదాన్’(1982) . ఐతే నటులు రాజేశ్ ఖన్నా, శతృఘన్ సిన్హా లు. దశాబ్ద కాలానికి పైగా తెరపై వెలుగుతున్నారు. సంగీతదర్శకుడు ‘ఖయ్యామ్’ క్లాసికల్ సంగీతం అందించటంలో లబ్ద ప్రతిష్టుడు.
అలా తమిళ/తెలుగు సినిమాకు ప్రత్యేకత అనుకున్న కొత్తదనం (నటులు, సంగీత దర్శకుడు) హిందీలో కనపడదు. ఫలితం తెలియదుకాని అద్భుతమైన పాటని సినిమా అందించింది. ఉర్దూ పదాలతో పాటను చిక్కపరుస్తూ సాగే రచన,తనదైన ముద్రను తెలియజేస్తూ గంభీరంగా సాగే ఖయ్యాం సంగీతం పాటను మరచిపోలేనట్టు చేశాయి.
అదేకాలంలో ఖయ్యామ్ సంగీతదర్శకత్వంలో వచ్చిన మరో పాట ఏ-దిల్ ఎ నాదాన్’(రజియా సుల్తాన్) పాట ‘చాంద్ నీ రాత్ మె ‘ పాట లో అంతర్లీనంగా వినిపిస్తుంది.

“నీలోనువ్వే సిగ్గుపడుతూఉన్న నిన్ను
వెన్నెల రాత్రిలో ఒకసారి చూశాను
నీలిఅంబరం లో ఊయలలో
వయ్యారపు అతిశయంతో ఊగుతున్న
ఏడు రంగుల అందమైన ఊయలలో
నీలోనువ్వే సిగ్గుపడుతూఉన్న నిన్ను
వెన్నెల రాత్రిలో ఒకసారి చూశాను

మేలుకున్న సరస్సు ఒడ్డున ఎక్కడో
చేతులలో అందమైన పూలగుత్తి తో
మధురమైన ప్రేమగీతం ఆలపిస్తూ
పూలవాన కురిపిస్తూ..ప్రేమ పొంగిస్తూ
నీలోనువ్వే సిగ్గుపడుతూఉన్న నిన్ను
వెన్నెల రాత్రిలో ఒకసారి చూశాను
మెరుస్తూఉన్న విప్పారిన కురులు
గాలికి అద్దిన పరిమళం
నా ప్రతి శ్వాసను సుగంధభరితం చేస్తుంది
నీలోనువ్వే సిగ్గుపడుతూఉన్న నిన్ను
వెన్నెల రాత్రిలో ఒకసారి చూశాను

ముఖంపైకి నీ ముఖాన్ని వంచినపుడు
లజ్జతో,సిగ్గుతో గాభరా పడుతూ
నేను చేతులతో ముఖాన్ని దాచుకున్నాను
పూలవాన కురిపిస్తూ..ప్రేమ పొంగిస్తూ
నీలోనువ్వే సిగ్గుపడుతూఉన్న నిన్ను
వెన్నెల రాత్రిలో ఒకసారి చూశాను”



Tuesday, June 6, 2017

తు ఇస్ తరాహ్ సె జిందగీ మె షామిల్ హై



నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-92
తు ఇస్ తరాహ్ సె జిందగీ మె షామిల్ హై
(నువ్విలా నా జీవితంలో భాగమైతే)
‘ఆప్ తో ఐసే న థే’ సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట.రచన ‘ఫజ్ లి’

వివిధ్ భారతిలోనూ, రేడియో సిలోన్ లోనూ ఎనభై లలో మారుమోగిన పాట ఇది.  ఒక పాట సినిమాలొ రెండు వెర్షన్లుగా ఉండటం చాలా సార్లు జరుతుంది. మేల్,ఫిమేల్ వెర్షన్లు, హాపీ,శాడ్  వెర్షన్లు,చిన్నప్పటి పాట పెద్దయ్యాక పాడటం..ఇలా. ఐతే ఈ సినిమాలో ఈ పల్లవితో ప్రారంభమయ్యే పాటలు మూడు వున్నాయి.మహమ్మద్ రఫీ ది ఒకటి , మన్ హర్ ఉధాస్ ది ఒకటి, మరొకటి హేమలత పాడింది. మూడిట్లో ఏది వచ్చినా చివరిదాకా వినేట్లు వుంటాయి.

ఈ పాటకు సంగీతం ఇచ్చింది ‘ఉషా ఖన్నా’. స్త్రీ సంగీత దర్శకులు హిందీ లో ఉండివుండవచ్చు.కాని ఉషా ఖన్నా లా మూడు దశాబ్దాల పాటు సినిమాసంగీత దర్శకుల్లా కొనసాగినవారు లేరు. వందకు తగ్గని సినిమాలకు పనిచేశారు.వాటిలో  ఎక్కువ భాగం చిన్న తరహా సినిమాలు. అందులో పాటలద్వారా మాత్రమే గుర్తింపు పొందిన సినిమాలూవున్నాయి.

ఇప్పటి పాట మహమ్మద్ రఫీ పాడినది. ఇది హుషారుగా సాగే వెర్షన్. రఫీ అభిమానులు ఇష్టంగా వినే పాట.

“నువ్విలా నా జీవితంలో భాగమైతే
ఎక్కడ ఉన్నా నీ సమక్షంలోనే ఉన్నట్టుంటుంది

ఈ ఆకాశం, ఈ మేఘాలు, ఈ దారులు, ఈ గాలులు
ప్రతీది తమ స్థానాల్లోపదిలంగా ఉన్నాయి
చాలా రోజులుగా లోకంలో దేనిపట్లా ఫిర్యాదు లేదు
ఈ జీవితమొక ప్రయాణం, నువ్వు ఆ ప్రయాణపు గమ్యానివి

నువ్వే లేకుంటే లోకంలో ఏదో లోటు ఉండేది
చీకటి దారుల్లో వయసు దారితప్పి తిరుగుతుండేది  
నీ బాహువుల్లోకి వచ్చి మనసు విశ్రమించింది
నేను తప్పిపోయిన అలను,నువ్వు ఒడ్డు వి

నా ప్రపంచం నీ అందంతో కాంతివంతమయ్యింది
నా అన్వేషణ,నీ సౌందర్యం  కలకాలముండాలి
దేవుడు ఈ పిచ్చితనాన్ని కలకాలముంచాలి
నీపైఉంచిన  నమ్మకమే, నా ప్రతీ కోరికను నిజంచేయగలుగుతుంది.”

Sunday, June 4, 2017

‘తుమ్ ఇత్నా జో ముస్కురా రహే హో, క్యా గమ్ హై జిస్కో చుపా రహే హో’


నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-91

‘తుమ్ ఇత్నా జో ముస్కురా రహే హో, క్యా గమ్ హై జిస్కో చుపా రహే హో’
(నువ్వు ఇంతగా నవ్వుతూ ఉన్నావు,దాని వెనుక ఏమి బాధను దాచి వుంచావు?)

‘అర్ధ్  ‘(అర్ధం) సినిమాలో జగ్ జిత్ సింగ్ ఆలపించిన గజల్. సంగీతమూ ఆయనదే.
గజల్ రచయిత ‘కైఫి ఆజ్మి’. పాటలో కనిపించే ‘షబానా అజ్మీ’ ఆయన కూతురు.

సినిమా దర్శకుడు మహేశ్ భట్ మిగతా సినిమాలు టచ్ చేయకుండా వదిలేసిన (నగర)జీవిత పార్శ్వాలను స్పృశిస్తాయి. మొహమాటం లేకుండా ఎంచుకున్న కథాంశం పై సెర్చ్ లైట్ వేసినట్టు, ప్రయోగశాలలో ‘డిసెక్షన్ ‘ చేసినట్టు ఉంటాయి.

అర్ధ్ సినిమా అలాంటిదే. వివాహేతర సంబంధాలు,జీవిత భాగస్వాముల అభద్రతలు సినిమా కథ .
దేనితో మనసు ఖాళీ అయ్యిందో దానితోనే  (వివాహబంధం)  ఆ ఖాళీ నిండి తీరాల్సి లేదనే నిర్ణయానికి చివరకు కథానాయిక వస్తుంది.
భర్త  నమ్మకద్రోహంతో గాయపడిన ఆమెకు, మరొకరు స్నేహితుడయ్యాడు. అతనింటికి ఆమె అతిధిగా వెళ్లింది. ఆమె చిరునవ్వు వెనక విషాదాన్ని అతను గమనించాడు. ఆ సందర్భంలో పాటఇది .

ఇందులో ఆఖరి చరణం లో కైఫి ఆజ్మి,  విధి (ముకద్దర్)  గురించి చెప్పినదానిపై  నాకనిపించింది

మనం ఎదుర్కొనే సమస్యలు,సవాళ్ళు ,అనుభవించే వ్యధలు,చింతలు,కష్టాలు ..వీటన్నింటినీ రెంటిగా విడగొట్టొచ్చు. ఒక వర్గం. మనం మన చర్యల, ప్రయత్నాల ద్వారా మార్చుకోగలిగినవి. మరొక వర్గం . ఇవి మనని ప్రభావితం చేస్తుంటాయిగాని వాటిని మార్చగల శక్తి మనకుండదు.
అలాటి వాటిని ఏమిచేయాలి? ‘విధి’ కి వదిలిపెడితే కొంత ఓదార్పు దొరుకుతుందేమో! అదే ఇక్కడ చెబుతున్నాడనిపిస్తుంది.(సర్కిల్ ఆఫ్  ఇన్ఫ్లూయెన్స్,సర్కిల్ ఆఫ్ కన్సర్న్ లాగా???)


“నువ్వు ఇంతగా నవ్వుతూ ఉన్నావు
దాని వెనుక ఏమి బాధను దాచి వుంచావు?

కళ్ళలో తేమ, పెదవులపై నవ్వు
ఉన్న స్థితి ఏమిటి? పైకి చూపేది ఏమిటి?

కన్నీటిని దిగమింగుకుంటూ ఉంటే
మింగినకన్నీరు   విషమౌతుంది

కాలం మాన్పిన గాయాలను
నువ్వెందుకు తిరిగి రేపుతావు?

విధి అనేది చేతిగీతల ఆట
నువ్వు ఓడింది ఆ గీతల చేతిలోనే!”


Friday, June 2, 2017

“తుమ్ జో మిల్ గయే హో ,తో యే లగతా హై,

నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-90
“తుమ్ జో మిల్ గయే హో ,తో యే లగతా హై, కె జహా మిల్ గయా”
(నిన్ను కలవగలిగాను,అప్పటినుండి అనిపిస్తుంది,ప్రపంచాన్ని పొందగలిగానని)
హస్తే జఖ్మ్ (1973)సినిమాలో మహమ్మద్ రఫీ,లతా మంగేష్కర్ పాడిన కైఫీ అజ్మీ గీతం, మదన్ మోహన్ సంగీతం.

హిందీ సినిమాపేర్ల అర్ధం తెలుసుకోవాలనే కుతూహలం ఉందేది.కొన్ని సినిమాల పేర్లు మరీ కష్టపెట్టేవి. అలాంటివాటిలో ‘హస్తే జఖ్మ్ ‘ ఒకటి. చివరిగా అర్ధం చేసుకున్నది ‘హసించే గాయం’ అని. ఆ సినిమాలో ఈ పాట తరచుగా రేడియోలో వినపడేది(పడుతుంది).పాట అర్ధం తెలియకముందు నుండీ ఈ పాట  ఏదో తెలియని మైమరపు లాంటి అనుభూతి కలిగించేది. గానమూ సంగీతమూ కలిసి శబ్దం గా మారి చేసిన మాయ అది. ఆ శబ్దానికి  అర్ధం  తోడైతే?? .. అలా ఇది ఒక  సమ్మోహన గీతమయ్యింది

అలాంటి  పాటల ను సినిమాలు ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోగలితే మరింత  వన్నెకెక్కుతాయి. అలాంటి అవకాశం ఈ పాటకు వచ్చింది.
కథానాయకుడు ధనికుడైన తండ్రి పద్ధతి నచ్చక,  కోరి దరిద్రాన్ని ఎన్నుకున్నాడు. బొంబాయి నగరంలో టాక్సి డ్రైవర్ అయ్యాడు. కథానాయిక తండ్రి శత్రువు వల్ల చిన్నపుడే కిడ్నాప్ చేయబడి ఇష్టం లేకుండా సెక్స్ వర్కర్ గా మారింది.
వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. అతను ఆమె పట్ల ప్రేమను పాటరూపంలో చెబుతున్నాడు.

జడివాన, ఉప్పెనలాంటి హోరు, అలలు విరిగిపడే చప్పుళ్ళు, ఉరుములమెరుపుల శబ్దాలు, టాక్సీలో ప్రయాణంతడిసిన నగరపు రహదారులు, సముద్రపు ఒడ్డు, విద్యుత్కాంతుల దృశ్యాలు..వీటి మధ్య పాట.


“నిన్ను కలవగలిగాను
అప్పటినుండి అనిపిస్తుంది
ప్రపంచాన్ని పొందగలిగానని

దారి తప్పిన బాటసారికి
తిరిగి తోటి ప్రయాణికులగుంపు దొరకింది

నాకు దూరంగా కూర్చోకు
కోపంగా చూడకు
అదృష్టంకొద్దీ దొరికావు
కలసి దూరమైపోకు

నా తప్పేమిటి???
కొన్నిసార్లు కావచ్చు
భూమి తో ఎప్పుడైనా
ఆకాశం కలవవచ్చు

నువ్వేమిటో నీకేం తెలుసు?
ఒక సుమధుర గానానివి
తడిసిన చల్లని  రాత్రులలో ఆనందానివి
మంటలురేగే పగళ్ళలో చల్లని నీడవు

ఇప్పుడు నువ్వొచ్చావు
తిరిగి పోనీయను

ఒక అందమైన
దయాహృదయి దొరికింది

నువ్వూ ఏదో పోగొట్టుకున్నావు
నేనూ కళతప్పి  ఉన్నాను

ప్రపంచమొకప్పుడు కొత్తగా ఉండేది
నాకెవరూ అప్పుడు లేరు

హృదయానికి దొరికింది
నీ ఆసరా
ఒక కొత్త ప్రపంచపు
ఆనవాలు దొరికింది “



కహా తక్ యే మన్ కో అంధేరే ఛలేంగే

నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-89
“కహా తక్ యే మన్ కో అంధేరే ఛలేంగే”
(ఈ మనసులో చీకటి ఎప్పటివరకు)
బాతో బాతో మే సినిమాలో కిశోర్ కుమార్ ఆలపించిన పాట.సంగీతం రాజేశ్ రోషన్, రచన యోగేశ్.
తెలుగు సినిమా అప్పటికి (80ల నాటికి) అర్బనైజ్ (నగరీకరణ) కాలేదు. చాలా సినిమాల మూలాలు పల్లేలోనే ఉండేవి. నగరవాసులు అప్పటికి విలన్లే. ఐతే హిందీ సినిమాలు చాలారోజులకుముందే సిటీకి వచ్చేసాయి. నగరజీవిత నేపధ్యంలో సినిమాలు చాలానే ఉన్నాయి. 79లో వచ్చిన ‘బాతో బాతోమే’ అలాంటి ఒక నగర సినిమా.
అమితాబ్ ఒక రకమైన సినిమాల్లో సూపర్ స్టార్ ఐతే ,కథానాయకుడు అమోల్ పాలేకర్ మరో తరహా సినిమాల్లో సూపర్ స్టార్. అప్పుడు మధ్యతరగతి,ఉద్యోగాల్లో ఉన్న నగర యువతకు అతనో మోడల్.

బొంభాయిలో ఉద్యోగస్తుల జీవితం, ఆలోచనలు,కలలు వీటిని రియలిస్టిక్ అనిపించేలా తీసిన సినిమా ఇది. రైలులో ఉద్యోగానికి పోయిరావటం ,అందులో పరిచయాలు, ప్రేమలు, అర్ధాలు, అపార్ధాలు, పెద్దమనిషి మధ్యవర్తిత్వం వీటితో కథ సాగుతుంది. కథానాయిక తల్లి ఆశలవల్ల ప్రేమికులమధ్య దూరం పెరిగింది. ఆ దూరం కథానాయకుని బాధించింది. ఆ సందర్భంలో వెచ్చే పాట.

“ఈ మనసులో చీకటి ఎప్పటివరకు
బాధించే ఈ రోజులు ఎప్పుడు ముగుస్తాయి?
కొద్దిసేపు సుఖం, కొద్దిసేపు దుఃఖం ,ఇదే జీవితం
ఈ శిశిర ఋతువు ఒకటి రెండు ఘడియలపాటే
కొత్త పుష్పాలు దారిలో తిరిగి వికసిస్తాయి
బాధించే ఈ రోజులు ఎప్పుడు ముగుస్తాయి?
ప్రచండ వేగంతో వీస్తుంది గాలి
నా మనసులో నువ్వు నమ్మకాన్ని నిలిపావు
ప్రయాణంలో విడిపోయిన నిన్ను తిరిగి కలుస్తాను.
బాధించే ఈ రోజులు ఎప్పుడు ముగుస్తాయి?
ఎవరేమి చెప్పినా నిజమిదే
ప్రేమకెరటాలు ఎక్కడ మొదలైనా
వాటికి ఏదో ఒకరోజు ఒడ్డు దొరుకుతుంది
బాధించే ఈ రోజులు ఎప్పుడు ముగుస్తాయి?”