Saturday, October 21, 2017

దిన్ హై యే బహార్ కె ఫూల్ చున్ లె ప్యార్ కా

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-112
“దిన్ హై యే బహార్ కె ఫూల్ చున్ లె ప్యార్ కా”
(“వసంతకాలమిది,ప్రేమపుష్పాలను సేకరించు”)
హనీ మూన్ (1973) సినిమాలో పాట.రఫీ గానం, ఉషాఖన్నా సంగీతం,యోగేష్ రచన.
నా స్నేహితుడొకరు తెలుగు సినిమా పాటల బాంక్ కోసం కృషి చేస్తున్నాడు.తెలుగులోవచ్చిన ప్రతిసినిమా పాట వివరాలతో(క్రెడీట్స్) సహా సేకరించాలని అతని కొరిక.
అందులో భాగం గా వివరాలు తెలియని పాటలు కొన్ని నాకుపంపాడు.నాకేమైనా తెలియొచ్చునేమోనని అతని ఆశ.
అందులో గాయకుడు రామకృష్ణ ఎల్లారీశ్వరి తోకలిసిన పాట ఒకటిఉంది .'సాగిపోవు నావలా అలా...ఓ డార్లింగ్ ఓ డార్లింగ్'అని సాగుతుంది.
ఆపాట ఎప్పుడూ వినలేదు...కానీ ఎక్కడో విన్నట్టుంది. తెలియని పాటేదో వెంటాడుతుంది.అలా చాలారోజులు గడచాయి
అనుకోకుండా ఒక రోజు మధ్యాహ్నం 'మన్ చాహే గీత్ ‘ ద్వారా సమాధానం దొరికింది.
ఆ పాట మహమ్మద్ రఫీ పాడారు. రాజశ్రీ సంస్థ నిర్మించిన ''హనీమూన్ (1973) సినిమాలోది.
డెబ్భయ్యవ దశకం లో మహమ్మద్ రఫీ సంగీతయానం ఒక కుదుపుకు లోనయ్యింది.ముఖ్యంగా 70-75 మధ్య అంతకుముందటి లా అతను నేపధ్య గాయకుడిగా 'తొలిఎంపిక కాదు (కొన్ని మినహాయింపులతో). తొలి ఎంపిక అంటే అప్పటి అగ్రనటులకు నేపధ్యగానం చేయటం లో, అగ్ర సంగీతదర్శకులతో పనిచేయటంలో.
ఆ దశలో రఫీ చిన్న సంగీతదర్శకులతో పనిచేశాడు. చిన్న నటులకు నేపధ్య గానం చేశాడు. అందులో కొన్ని ఆణిముత్యాలున్నాయి. అందులో ఒకటి ఈ పాట.
“వసంతకాలమిది
ప్రేమపుష్పాలను సేకరించు
ఓ సహచరీ,
నీ నవ్వే పెదవులనుండి పాట ఎందుకు దూరమయ్యింది?
కురిసే ప్రేమవానలో నీ మనసెందుకు తపిస్తుంది?
అలా ప్రేమజల్లులను అలా దూరం కానీయకు
తల్లడిల్లే నీ గుండె చెబుతుండవచ్చు
గడచిన జీవితం నిన్ను వెనక్కి లాగుతుండవచ్చు
ప్రేమించినవారు నిన్నలా బెదిరించరు
జీవితం వధువులా మారి నీతో కలసి నడుస్తుంది
చేతులు సాచి అందుకో! ఆగేది దేనికోసం?
ఇప్పుడీ దూరాలిక దేనికి?
ఈ అసహాయత దేనికి?
జరగాల్సింది జరిగిపోయింది
దానిగురించి ఆలోచించకు
మనసుకు సర్దిచెప్పి , బరువు తగ్గించుకో
ఈ మౌనం విడువు
ఈ బాధ వదులుకో”


జిందగీ హర్ కదమ్ ఎక్ నయీ జంగ్ హై

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-111
జిందగీ హర్ కదమ్ ఎక్ నయీ జంగ్ హై
(జీవితం లో ప్రతి అడుగూ ఒక కొత్త యుద్ధమే)
Meri జంగ్ (1985) లో లతా మంగేష్కర్, నితిన్ ముకేశ్ పాడిన పాట. ఆనంద్ బక్షి రచన, లక్ష్మీకామ్త్ ప్యారే లాల్ స్వర రచన.
మన్మోహన్ దేశాయి, ప్రకాశ్ మెహ్రా లవంటి దర్శక నిర్మాతల కోవలో ఎనభైల నాటికి సుభాష్ ఘయ్ చేరాడు. అతను డెబ్భైల మధ్యలో దర్శక ప్రస్థానం ప్రారంభించినా ప్రేక్షకులనాడి ఎనభైల మధ్యనాటికి దొరికింది. భారీతారాగణం, భావోద్వేగాలకు, కమర్శియల్ ఎలిమెంట్స్ కి ,సంగీతానికి ప్రాధాన్యమిస్తూ చిత్ర నిర్మాణం చేశాడు. అనిల్ కపూర్ స్టార్ గా ఎదిగే దశలో ఉన్నపుడు అతనితో చాలా సినిమాలు తీశాడు. అందులో ఒకటి మేరీ జంగ్.
ఈ పాట సినిమాలో పలుమార్లు రిపీట్ ఔతుంది. భిన్న గాయకులు పాడారు. సినిమా మొదట్లో వచ్చే పాట ఇది.
‘నాసిర్ హుస్సేన్’ అనేక సినిమాల్లో చిన్నప్పటి పాట పెద్దయ్యాక రిపీట్ అయ్యి మనుషుల్ని కలపటమో, పాత ఉద్వేగాల్ని తిరిగి కలించటమో చేస్తుంది.
అదీ అలాంటి కుటుంబగీతమే (ఫామిలీ సాంగ్). ఐతే పాట సారాంశం హీరోని మోటివేట్ అయ్యేందుకు దోహదపడేట్టు ఉంది.
“మనం గెలుస్తాం
మనం గెలుస్తాం నువ్వు తోడుంటే
జీవితం లో ప్రతి అడుగూ ఒక కొత్త యుద్ధమే
మనం గెలుస్తాం
మనం గెలుస్తాం నువ్వు తోడుంటే
నువ్వే నా పెదవులకు ఈ గీతాన్ని అలంకరించావు
నీ ప్రేమ జీవనాన్ని సంగీతమయం చేసింది
ప్రియతమా!నాదైన ప్రతీదీ నీవిచ్చినదే
నేనొక చిత్రాన్ని ..దాని రూపూ రంగూ నువ్వే
ధైర్యాన్ని వదలవద్దు ప్రపంచాన్ని ఎదుర్కో
చూడు ఆకాశం రంగు మారుతుంది
పరాజయాన్ని కాదు అది విజయాన్ని తెలిపే రంగు
సూర్యనికోసం చంద్రునికోసం చుక్కల కోసం రోజూ ఎక్కడ వెతుకుతావు?
కాగడా తో చీకటిని వెలుతురుమయం చేద్దాం.
ఆశయంతో ఉన్నంతవరకూ బాధనేది లేదు”


ఒహ్ రే తాల్ మిలే నదీకే జల్ మే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-110
‘ఒహ్ రే తాల్ మిలే నదీకే జల్ మే ,నదీ మిలే సాగర్ మే’
(“వాగుల నీరు నదిలో కలుస్తుంది,నది నీరు సాగరంలో కలుస్తుంది)
అనోఖీ రాత్ (1968) సినిమాలో ముకేశ్ పాడిన పాట. ఇందీవర్ రచన, రోషన్ సంగీతం.
‘సర్ గమ్ ‘ (1980) హిందీ సినిమాకు మాతృక తెలుగు లో వచ్చిన ‘సిరిసిరి మువ్వ’. సిరిసిరి మువ్వ సినిమాలో ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎవరు?’ పాట బదులుగా సర్ గమ్ లో ‘హమ్ తొ చలే’ పర్ దేశ్, పర్ దేశీ హోగయే ‘ పాట వస్తుంది.
రెండు పాటల్లోనూ సంగీతం, సాహిత్యం, గానం, చిత్రీకరణ గొప్పగా ఉంటాయి. తాత్వికతతో సాగే అనేక పాటల చిత్రీకరణ పడవల్లోనో, ఎద్దుల బండీలోనో, రైళ్ళలోనో, బస్సులలోనో సాగుతుంది. బహుశా జీవితానికీ ప్రయాణానికీ దగ్గర పోలిక ఉన్నట్టుంది. జీవితమ్ చలనశీలనమని చెబుతున్నారేమో.
తెలుగు పాట లిరిక్ ఇలా సాగుతుంది
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక?
ఏ దారెటూ పోతుందో ఎవరినీ అడగక?
వాన కురిసి కలిసేది వాగులో
వాగు వంక కలిసేది నదిలో
కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో
కాని ఆ కడలి కలిసేది ఎందులో?
ఒక హిందీ పాట ‘ఒహ్ రే తాల్ మిలే నదీ కె జల్ మే ‘ పాటవింటున్నప్పుడు పై తెలుగు పాట లిరిక్ గుర్తుకు వస్తుంది. దగ్గరగా గమనిస్తే హిందీ పాట ప్రభావం తోనే తెలుగు పాట రాసారని నమ్మకంగా అనిపిస్తుంది. ఐతే హిందీ పాట తర్వాత చరణాలలో మరింత లోతుగా ఉంటుంది.
హిందీ పాట అనువాదం:
“వాగుల నీరు నదిలో కలుస్తుంది
నది నీరు సాగరంలో కలుస్తుంది
సాగరం ఎందులో కలిస్తుందో
ఎవరికి ఎరుక?
సూర్యునికోసం ధరణి , ధరణి కోసం చంద్రుడు తపిస్తాయి.
నీటిలో ముత్యపుచిప్పలా ప్రతీ ఆత్మా దాహంతోనే ఉంటుంది
ఒ జతగాడా!
నీటిచుక్క ఏ మబ్బులోలో దాగిందో
ఎవరికి ఎరుక?
పరిచయంలేని పెదవులపై పరిచయమున్న పాటలు
నిన్నటివరకూ పరాయివారు,నేడు జన్మ జన్మల మిత్రులు
ఏ క్షణంలో ఏమౌతుందో
ఎవరికి ఎరుక?”

ఏక్ అకేలా ఇస్ షహర్ మే.రాత్ ఔర్ దోపహర్ మే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-109
“ఏక్ అకేలా ఇస్ షహర్ మే.రాత్ ఔర్ దోపహర్ మే”
(ఈ నగరంలో రాత్రింబవళ్ళు ఒకడు ఒంటరిగా,
‘ఘరోండా’(1977) సినిమాలో భుపేందర్ పాడిన పాటగుల్జార్ రచన జైదేవ్ సంగీతం.
‘ఇల్లు కొందరికి ఉండటానికి గూడు కొందరికి సంపాందిచవలసిన ఆస్తి’. అని ‘రావి శాస్త్రి’ తన ‘ఇల్లు ‘ నవలలో చెబుతారు.
ఈ సినిమాపేరు ‘గూడు’. బొంభాయి నగరం లో ఆవాసం దొరకటం కష్టం. ఇద్దరు మధ్యతరగతి ఉద్యోగులు తమకో గూడు ఏర్పాటు చేసుకుని వివాహంచేసుకుందామనుకున్నారు. తమ అన్ని వనరులూ కట్టబోయే అపార్ట్మెంట్ పై పెట్టారు. దానిపై కలలు కన్నారు. ఆశలల్లుకున్నారు. ఐతే బిల్డర్ మోసంచేశాడు. ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయింది. వారి తిరిగి మొదటికొచ్చారు. దాని కారణం గా వారు దూరమయ్యారు.
అవసరాలు,పరిస్థితులు మనుషులకు పరీక్ష పెడతాయి. అవి కొందర్ని దిగజారుస్తాయి., అడ్డదారులవైపు అడుగులు వేయిస్తాయి. కొందరు మాత్రం పరీక్షకు నిలబడగలుగుతారు.
అప్పటివరకూ కలిసున్న మనుషుల్ని అలాంటి పరీక్షాసమయాలు ఎవరిదారి వాళ్ళు చూసుకొనేట్లు చేస్తాయి.
1977 లో వచ్చిన ఈ సినిమా అప్పటి నగర ,మధ్యతరగతి జీవితాలని ప్రతిబింబిస్తుంది.
“ఈ నగరంలో రాత్రింబవళ్ళు ఒకడు ఒంటరిగా,
అన్నపానాలు వెతుకుతున్నాడు ,ఆశ్రయం వెతుకుతున్నాడు
పగలు ఖాళీ పాత్ర లా ఉంది, రాత్రి చీకటి నుయ్యిలా ఉంది
ఈ శూన్యమైన చీకటి కళ్ళలో , కన్నీటికి బదులు పొగ వస్తుంది
జీవితం సాగించటానికి కారణం కనపడదు. మరణించటానికి సాకు వెతుకుతున్నాడు
వయసుకన్నా దీర్ఘమైన దారుల్లో , గమ్యం చేరిక కానరాదు
పరుగిడుతూనే ఉన్నాడు, అతను ఆగటం చూడనే లేదు
ఈ అపరిచిత నగరంలో తెలిసినవారికోసం వెతుకుతున్నాడు”

కభి బేకసీ నే మారా! కభి బేబసీనే మారా!

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-108
కభి బేకసీ నే మారా! కభి బేబసీనే మారా!
( కొన్ని సార్లు అసహాయత చంపుతుంది,కొన్నిసార్లు నిరాశ్రయత చంపుతుంది)
అలగ్ -అలగ్ సినిమాలో కిశోర్ కుమార్ పాట. ఆనంద్ బక్షి రచన,ఆర్ డి బర్మ సంగీతం
ఎనభైలో ‘రఫీ’ మరణంతో హిందీ సినిమా సంగీతం ఏకధృవ ప్రపంచమైపోయిందనుకున్నారు. ఆ ధృవం కిశోర్ కుమార్. ఐతే ఎనభై తరువాత వచ్చిన కిశోర్ కుమార్ పాటల్లో అతని స్థాయిని పెంచినవి బహు తక్కువ, నిలబెట్టినవీ కొద్దిగానే. అనూహ్యంగా అతనితో ఏమాత్రం సరితూగని గాయకులతో అతను పోటీపడాల్సి వచ్చింది. కిశోర్ కుమార్ ను డెబ్భైలలో ఆకాశంలో నిలిపిన ఆర్ డి. బర్మన్ సైతం ఎనభైలలో కిశోర్ తో కాకుండా షబ్బీర్ కుమార్ వంటి కొత్త గాయకులతో పాటలు పాడించాడు. షబ్బీర్ కుమార్ ‘మహమ్మద్ రఫీ’ ని అనుకరించే గాయకుడు (క్లోన్) కావటం ఒక వైచిత్రి.
నటుడు రాజేశ్ ఖన్నా కిశోర్ కుమార్, ఆర్ డి.బర్మన్ బృందం ఎన్నో విజయాలను చవిచూసింది. వారి కాంబినేషన్ ను కూర్చిన దర్శకుడు శక్తి సామంతా. (1969లో)
పదహారేళ్ళతర్వాత (1985 లో) రాజేశ్ ఖన్నా నిర్మాతగా మారి పై కాంబినేషన్ ను మరోసారి ప్రయత్నించాడు. ఆ సినిమా ‘అలగ్ -అలగ్’. ఫలితం మాత్రం మరో ‘ఆరాధన’ గా రాలేదు. ఐతే కిశోర్ కుమార్ ద్వారా ఒక ఉత్తమ గీతాన్ని అందుకోగలిగాం.
“ఇది గజల్ కాదు గీతమూ కాదు
ఇది నా బాధల గాధ
నా గుండెలో కేవలం అగ్ని ఉంది
నా కళ్ళలో కేవలం నీరు ఉంది
కొన్ని సార్లు అసహాయత చంపుతుంది
కొన్నిసార్లు నిరాశ్రయత చంపుతుంది
మృత్యువుతో పేచీ లేదు
నన్ను జీవితమే చంపేసింది
విధి ని అనేందుకు లేదు
మారనిదల్లా కాలమే
అప్పుడప్పుడూ దురదృష్టం
కొన్నిసార్లు నా లేనితనం
వేటి పేర్లు చెప్పను?
నన్ను అన్నీ చంపాయి.
మృత్యువుతో పేచీ లేదు
నన్ను జీవితమే చంపేసింది
నరక ప్రాయపు,అపనమ్మకపు లోకమిది
ఇదే లోకమైతే ఇదేమిలోకం?
స్నేహితులకు కొదవలేదు
శత్రువులకు కొరత లేదు
కొన్నిసార్లు శత్రుత్వం దోచింది
కొన్నిసార్లు స్నేహం చంపింది.
మృత్యువుతో పేచీ లేదు
నన్ను జీవితమే చంపేసింది
వెలుతురు పట్ల విముఖత వచ్చింది
చీకటి అలవాటైపోయింది
చీకటి ఉన్నంత వరకూ
కాలం బాగానే గడచింది
నన్ను వెన్నెల దోచింది
వెలుతురు నన్ను చంపింది"

“న మై భగ్ వాన్ హు న మై సైతాన్ హు”

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-107
“న మై భగ్ వాన్ హు న మై సైతాన్ హు”
(“నేను దేవుణ్ణీ కాను దెయ్యాన్నీ కాను)
మదర్ ఇండియా లో పాట.షకీల్ బదాయుని రచన, నౌషాద్ సంగీతం, మహమ్మద్ రఫీ గానం
“లోకమిలాగే ఉంటుంది. దీనికి తగ్గట్టుగా మనం బ్రతకాలి “ అని కొందరనుకుంటారు. “లోకమిలా ఎందుకుంది? ఇందులో బ్రతకటానికి ఏంచేయాలి?” అనుకునే వారూ ఉంటారు. ‘ మదర్ ఇండియా’ సినిమాలో ఇద్దరి అన్నదమ్ముల ఆలోచనలు ఇలానే ఉన్నాయి. 
తమ్ముడికి రేగే ప్రశ్నలకు సమాధానం దొరకటంలేదు. అతనెలా బ్రతకాలో చెబుతున్నారు కాని అలాగే ఎందుకో చెప్పట్లేదు. ఈ పాటతో తనని తాను నిర్వచించుకుంటున్నాడు. ఐతే వినేవారికి అది తమందరి సంబంధించిన నిర్వచనమని అనిపిస్తుంది.
అతడు నటనలేని, భావాలని అణిచిపెట్టుకోని మనిషి. మంచి ముందు మొహం దాస్తాడు,సిగ్గుపడతాడు. దేవాలయాలదగ్గర సాధువుల చిలుముతో సమాధానపడడు. జూదం లాంటివి అతన్ని కట్టిపడేయవు. ఎద్దులా పొలంలో కష్టపడటం ,తీగపై నడకా, అకాశంలో గెడపై వేలాడటం ఇవన్నీ పొట్టనింపుకునే జాలం లో భాగాలని చెబుతాడు. అడ్డదిడ్డమైన వ్యవహారం అతన్ని గందరగోళపరస్తుంది.
“నేను దేవుణ్ణీ కాను దెయ్యాన్నీ కాను
లోకం ఇష్టమొచ్చింది అనుకోనీ ,నేను మాత్రం మనిషిని.
నాలో మంచీ ఉంది చెడ్డా ఉంది
మనసులో ఎంతో మురికి ఉంది కొద్దిగా స్వచ్చతా ఉంది
కొద్దిగా నమ్మదగినవాడిని కొంచెం మోసకారిని
లోకం ఇష్టమొచ్చింది అనుకోనీ ,నేను మాత్రం మనిషిని.
నేను రాజుని కాను నాతలమీద కిరీటంలేదు
ఐనా నా బ్రతుకులో భూమికున్నంత ఓర్పు ఉంది
పైకి పేదవాడిని మనసులో ధనికుడిని
లోకం ఇష్టమొచ్చింది అనుకోనీ ,నేను మాత్రం మనిషిని.
జీవితమనే పాటకి స్వరమూ లేదు తాళమూ లేదు
లోకమంతా గందరగోళంగా భుక్తి అనే వలలో ఉంది
ఎలాంటి అన్యాయమిది నాకు చిత్రమనిపిస్తుంది.
లోకం ఇష్టమొచ్చింది అనుకోనీ ,నేను మాత్రం మనిషిని. 

“కిసీ నజర్ కో తేరా ఇంతిజార్ ఆజ్ భి హై”

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-106
“కిసీ నజర్ కో తేరా ఇంతిజార్ ఆజ్ భి హై”
(“నీచూపు కోసం ,ఎదురు చూపు ఇప్పటికీ ఉంది)
ఐత్ బార్ (1985) సినిమాలో పాట. హసన్ కమాల్ రచన, భూపెందర్, ఆశాభోన్స్లే గానం.బప్పీలహిరి సంగీతం.
డెబ్భైలకు ముందు సినిమాలలో అనేక గజళ్ళు వున్నాయికానీ వాటి గాయకులూ మిగతా సినిమాపాటల గాయకులూ ఒక్కరే కావటంతో ప్రత్యేకంగా తెలిసేవికావు.
తర్వాత రోజుల్లో సినిమా గజళ్ళు జగ్ జిత్ సింగ్, పంకజ్ ఉధాస్ వంటి గజల్ గాయకులు పాడటం మొదలై ఆ ప్రక్రియ వేరుగా కనపడటం మొదలయ్యింది. గజళ్ళు ఉండే సినిమాలు కూడా ప్రత్యేక జానర్ గా ఉండేవి.
‘కిసీ నజర్ కో తేరా ‘ పాట వింటుంటే అలాంటి డిఫరెంట్ సినిమా చెందిన పాట అనిపిస్తుంది. పాట చిత్రీకరణకూడా అలానే అనిపిస్తుంది.
ఐతే ‘ఐత్ బార్ ‘ సినిమా ‘హత్య - రహస్యం’ చుట్టూ తిరిగే సినిమా. సస్పెన్స్ తో పాటు రెండు ‘సర్ప్రైజ్’ లు సినిమాలో ఉన్నాయి.
ఒకటి- క్రైమ్ సినిమాలో మనసుని ఆకట్టుకొనే లలితమైన గజల్లు (భూపేందర్ గానంతో)
రెండు- హోరెత్తించే సంగీతానికి మారుపేరైన బప్పీలహిరి వాటికి సంగీతమివ్వటం.
మొదటి రోజుల్లో రేడియో లోనూ , తర్వాత కాలంలో టీ.వీ. లోనూ బహుళ ప్రాచుర్యంలో ఉన్నపాట(గజల్).
“నీచూపు కోసం ,ఎదురు చూపు ఇప్పటికీ ఉంది
నువ్వెక్కడున్నవో నని ఈ మనసు ఆరాటం ఇప్పటికీ ఉంది
మనం కలిసితిరిగిన స్థలాలు, పరిసరాలో
నా నమ్మకపు జ్ఞాపక చిహ్నం ఇప్పటికీ ఉంది
నా మనసు ఇప్పటికీ తన అధీనంలోనే ఉందని
తనని చూసినపుడు ఎందుకు అనిపిస్తుందో తెలియదు
ఏప్రేమకోసం నేను నమ్మకపు దారుల్లో
ప్రపంచాన్ని వదులుకున్నానో ఆ ప్రేమ ఇప్పటికీ ఉంది
ఖచ్చిమనలేను కానీ ఇప్పటికీ అనిపిస్తుంది
నా అన్వేషణ లో తిరిగి వసంతం దొరుకుతుందని
ప్రేమలో ఎంత గాయపడ్డానని అడగవద్దు
ఆ తలపుతో మనసు బాధపడటం ఇప్పటికీ ఉంది “