Tuesday, May 9, 2017

తద్ బీర్ సే బిగిడీ హుయీ తక్ దీర్ బనాలే’

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-78

‘తద్ బీర్ సే బిగిడీ హుయీ తక్ దీర్ బనాలే’
(“ఉపాయంతో ,చెదిరిన తలరాత మార్చుకో)
‘బాజీ’ (1951) సినిమాలో గీతాదత్ పాడిన పాట.

పాటలు విని ఇష్టపడే క్రమంలో  చాలా పొరలుంటాయి.హిందీ పాటల విషయంలో పాటలో భావం లేదా అర్ధం తెలియకుండానే వినటం మొదలయ్యింది. పాట బాణీ, సంగీతం, గాయనీగాయకుల స్వరం ఇవి కొన్ని పొరలు.దృశ్యం,దృశ్యీకరణ,నటులు,నటన ఇవి మరికొన్ని పొరలు. పాట లోని భావం లేదా అర్ధం వీటన్నిటికన్నా లోతైన పొర.
అర్ధంతో నిమిత్తం లేకుండానే,చాలాకాలంగా వింటున్న,లిరిక్ పెదాలపై ఆడుతున్న కొన్ని పాటల అర్ధం తెలిసిన క్షణంలో అరే! ఇంతకాలం మిస్సయ్యామే అనిపిస్తుంది.
అలాంటి ఒక పాట ‘తద్ బీర్ సే బిగిడీ హుయీ తక్ దీర్ బనాలే’. తటస్థంగానో సందిగ్ధంగానో ఉన్న మనిషిలో కదలిక తెచ్చేలా, కొద్దిగా రెచ్చగొట్టేలా ఉన్న పాట. ఏ చరణానికి ఆ చరణం చూస్తే ఇండిపెండెంట్ గా కొటేషన్ లా అనిపిస్తుంది.

ఐతే సినిమాలో ఇది పాన/జూద శాల లో నర్తకి హీరోనుద్దేశించి పాడేపాట. పాట రాసింది సాహిర్ లూధియాన్వి.సంగీతకారుడు ఎస్. డి. బర్మన్. ఈ పాట అప్పటి మిగతా పాటలతో పోలిస్తే చాలా వరస, ఆర్కెస్ట్రా పరంగా ఆధునిమైనదిగా వినిపిస్తుంది.  


“ఉపాయంతో ,చెదిరిన తలరాత మార్చుకో
నీ మీద నీకు నమ్మకముంటే పందెంకాసుకో

లోకంచూపులకు అంత భయపడతావెందుకు?
న్యాయం నీవైపు వుంది, నిందను తలకెత్తుకో
నీ మీద నీకు నమ్మకముంటే పందెంకాసుకో

నీ కోసమే నువ్వు బ్రతికితే అదీ బ్రతుకేనా?
నువ్వు మరణించయినా మిగతావారిని బ్రతికించు
నీ మీద నీకు నమ్మకముంటే పందెంకాసుకో

పడవ తెడ్లు విరిగిపోతే మనం ఓడినట్టా?
చేతులనే తెడ్లు గా మార్చుకో
నీ మీద నీకు నమ్మకముంటే పందెంకాసుకో”

Sunday, May 7, 2017

పీతల్ కి మోరి గాగరీ , దిలడీ సే మోల్ మంగాయి రే

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-77
“పీతల్ కి మోరి గాగరీ , దిలడీ సే మోల్ మంగాయి రే”
(నా ఇత్తడి బిందె ను ఢిల్లీ నుండి తెప్పించాను)
‘దో బూంద్ పానీ’ సినిమాలో పర్వీన్ సుల్తానా ,మినూ పురుషోత్తమ్ పాడిన పాట.

రచయిత గా కె.ఎ. అబ్బాస్ , రాజ్ కపూర్ తో చేసిన సినిమాలు అన్నీ విజయవంతమయ్యాయి. ఐతే కె.ఎ. అబ్బాస్ స్వంయంగా దర్శకుడు. అలా డజన్ పైగా సినిమాలు తీసాడుకానీ ఏవీ కమర్శియల్ గా సక్సెస్ కాలేదు. ఐతే వాటిలో ప్రతి సినిమా విలువైనదే.  వాటిలో ఒక సినిమా ‘దో బూంద్ పాని’. సాధారణ సినీ ప్రేక్షకులకు పేరు పరిచయం కూడా అనుమానమే. 80 లలో దూరదర్శన్ లో ప్రదర్శితమయ్యింది.
రాజస్థాన్ ఎడారి ప్రాంతాల నీటికొరతసమస్యను రియలిస్టిక్ గా చూపిన సినిమా.

ఈ పాట కు రచయిత ‘కైఫి ఆజ్మి’.‘జయదేవ్’ సంగీత దర్శకుడు. వీరిద్దరు ఇంచుమించు  అదేకాలం లో , రాజస్థానీ ఎడారుల నేపధ్యంతో ‘రేష్మా ఔర్ షేరా’ సినిమాకు పనిచేశారు.

జయదేవ్ తక్కువ సినిమాలకుపనిచేసాడు. ఎక్కువ గుర్తుండే పాటలు ఇచ్చాడు. జానపద తరహాలో సాగే  పాటవరస ,సాంప్రదాయ సంగీత వాద్యాలు ఈ పాటను ఒక్కసారి వింటే మరచిపోలేనట్టు చేసాయి.
గాయని పర్వీన్ సుల్తానా పాడిన బహుకొద్ది సినిమాపాటల్లో ఇది ఒకటి.

అపజయం తనతో పాటు తనతో ఉన్న అనేక మంచి విషయాలనూ చీకట్లోకి తీసుకుపోతుంది. చిత్ర అపజయంతో ఈ పాటా మరుగున పడిపోయింది.

నీటికోసం కొందరు యువతులు కడవలు పట్టుకుని పోతున్నారు. వారిలో ఒకరి దగ్గరే ఇత్తడి బిందె వుంది. పోయేటప్పుడు శ్రమను మరిచేంత ఆనందంలో ఉండి ఉత్సాహవంతమైన పాట పాడుకుంటున్నారు.

“నా ఇత్తడి బిందె ను ఢిల్లీ నుండి తెప్పించాను(??)
కాళ్ళకు గజ్జలు కట్టుకుని , నీళ్ళు నింపుకోవటానికి వచ్చాను

మువ్వలు చప్పుడుతో నడక మారింది..యవ్వనపు నడక మారింది
చెంగు అటు ఇటు జారుతుంటే ..చూడు సిగ్గులేనివాడు
ఊరిలో నింద పడాలి ..
చెంగు చెప్పేదానికి  నువ్వే సాక్ష్యం

బిందె నీటిలో మునుగుతుందంటే   గుండె చప్పుడౌతుంది
నా ముఖం కొత్తగా కనపడుతుంది
నీళ్ళలో చూసుకుంటుంటే
బుగ్గలు ఎరుపెక్కుతున్నాయి ..
ఈ మంట రేపిందెవరు?”

ఒకామె బావిలోకి తాడు వేస్తూనే వుంది.బొక్కెన నీటికి తగులుతుందని చూస్తున్న వారికి బొక్కెన రాతికి తగిలిన చప్పుడు వినిపించింది.వారి నీటి ఆశ నీటి పాలయ్యింది. నిరాశ తో వెనుతిరిగారు. వెళ్ళేటప్పటి ఉత్సాహం ఆవిరయ్యింది.పాట సాగుతుంది.

“అలాంటి రోజులుండేవి..వూరిలో నీరుండేది.
చుక్కల నీడలో బిందెనిండా నీరు తెచ్చేవారం.
ఇప్పుడు ఎక్కడనుండి నీరు తేవాలి? దాహం ఎలా తీర్చాలి?
ఎండలో మాడిపోతూ ?????”
 -ముళ్ళపూడి సుబ్బారావు.


Friday, May 5, 2017

జానే కహా వో దిన్

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-76’

“జానే కహా వో దిన్ “(ఎక్కడికి పోయాయి ఆ రోజులన్నీ?)
మేరా నామ్ జోకర్ లో పాట ,గానం ముఖేష్, సంగీతం శంకర్ జైకిషన్, సాహిత్యం హస్రత్ జైపురి

‘మేరా నామ్ జోకర్’   సినిమా ఫలితం  రాజ్ కపూర్ కు నిరాశ కలిగించిందంటారు. ఐతే రోజులు గడిచాక సినిమా ఒక క్లాసిక్ గా మారింది.
రిపీట్ రన్ లో సినిమా చూసాను. . పేజీ లోపు ఉన్న ‘జాన్ కీట్స్’  కవిత  ‘హ్యూమన్ సీజన్స్ ‘ కు మూడు గంటల చిత్రరూపమనిపించింది. వ్యక్తి పూర్తి జీవితాన్ని అంటే బాల్యం నుంది వృద్దాప్యం వరకూ చూపే సాంఘిక చిత్రాలు అరుదు. ఈ సినిమా లో అది చూస్తాము.

కథానాయకుని జీవితంలో వివిధ దశల్లో అనుభవాలు (బాల్యంలో,యవ్వనంలో, మాన్ హుడ్(?) లో), ఆ దశల్లో ఎదురైన స్త్రీలు, వారితో ఏర్పడ్డ/ తెగిన బంధాలు, చివరిలో ఆ అనుభవాల నెమరువేత ,ఆంతరంగికశోధన ..వీటిని చెబుతూ కథానాయకునిఅనుభవాలతో ప్రేక్షకుల సహానుభూతుల్ని చేస్తుందీ సినిమా.

బాల్యంలో అతను తన తండ్రి లానే జోకర్ కావాలనుకుంటాడు. జీవిత భాగస్వామి జోకర్ జీవితాన్నిచూసి ఉన్న అతని తల్లి అదివద్దని వారించింది. తల్లి  అనుభవం అతనికి అక్కరకు రాలేదు.సర్కస్ లో జోకర్ గా అతని చేష్టలు ప్రేక్షకుల్ని నవ్విస్తుంటే, అతనికి జరగబోయే ఆపదల్ని తలుచుకుని తల్లి తల్లడిల్లుతుంది. తల్లి మరణం కారణంగా  అతను  కార్చే కన్నీరు కూడా ప్రేక్షకుల్ని ఆనందపరుస్తుంది.

బాల్యంలో తననభిమానించే టిచర్ పట్ల ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఆమెకు దూరమై బాధపడ్డాడు. యువకుడైనాక ఒక యువతి కి సాయపడి ఆమెకు దగ్గరయ్యాననుకున్నాడు. ఆమె తారగా ఎదిగి దూరమయ్యింది. మరోదశలో సర్కస్ లో జోకర్ గా ఉన్నపుడు, ఓ రష్యన్ యువతి ఇతనిపట్ల ఇష్టాన్ని చూపింది. ఆ కథా సఫలంకాలేదు.

జీవితపు మలి సంధ్యలో సర్కస్ లో అతని పెర్ఫార్మెన్స్ చూడటానికి వీరంతా వచ్చారు.ఆ సందర్భం లో ఈ పాట .చూస్తున్న వారికి  గతం కళ్ళముందు కదలాడింది. వారి మనసూ కదులుతుంది.

“ఎక్కడికి పోయాయి ఆ రోజులన్నీ?
చెబుతుండేవారు
నా దారిలో చూపులు పరచి వుంచుతామని

నువ్వు ఎక్కడ ఉన్నా
నేను జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే వుంటాను
నున్ను మరువలేను

నా పాద ముద్రలు పడిన చోటల్లా
నా మిత్రులు వంగి ఆ నేలను ముద్దాడేవారు.
వెళ్లిపోయే వసంతం
నన్ను ఎంతగానో రోదింపజేస్తుంది

నిన్నాఈరోజూ ,నా కళ్ళకు
పగళ్ళు కూడా చీకటి రాత్రులే
నా నీడ మాత్రమే నా సహచరి”

మరో పాట ‘జీనా యహా మర్నా యహా ‘ కు కొనసాగింపు పై పాట తర్వాత వస్తుంది.

రేపటి ఆటలో నేనున్నా లేకున్నా
ఆకాశంలో తారలు ఎప్పటికీ ఉంటాయి
నువ్వు మరుస్తావు..వారు మరుస్తారు
కాని నేను ఎప్పటికీ మీవాడినే
నా గుర్తులు ఇక్కడ ఉంటాయి
ఇక్కడికి బదులు వెళ్ళగలిగేది ఎక్కడికి ?


నువ్వు కోరినపుడు నన్ను పిలువు
నేనిదివరకెక్కడున్నానో ఇప్పుడూ అక్కడే ఉన్నాను
నా రెండు లోకాలు ఇక్కడే.
ఇక్కడికి బదులు వెళ్ళగలిగేది ఎక్కడికి ?

-ముళ్ళపూడి సుబ్బారావు


Wednesday, May 3, 2017

బూఝ్ మెరా క్యా నామ్ రె,నదీ కినారా గావ్ రె

‘నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-75

బూఝ్ మెరా క్యా నామ్ రె,నదీ కినారా గావ్ రె
(“నాపేరు చెప్పుకో,నది ఒడ్డున మా వూరు),సి. ఐ.డి (1956) సినిమాలో పాట.


ఒక కాలంలో లతామంగేష్కర్, ఆశాభోస్లే కాకుండా వేరే నేపధ్య గాయనుల పేర్లు అరుదుగా వినిపించేవి. అలాంటి వేరే పేర్లలో ఒకటి  షంషాద్ బేగమ్.

మిగతా గాయనిలతో ఆమె పాడిన పాటలు వింటుంటే ఆమె స్వరంలో ప్రత్యేకత కొట్టొచ్చినట్టు తెలుస్తుంది.

గీతా దత్ ‘ఠండి హవా ‘అని అంటే , ఎంతో కాంట్రాస్ట్ తో  శంషాద్ బేగమ్’కాలి ఘటా’ అంటుంది.(మిస్టర్ అండ్ మిసెస్ 55 సినిమా)

ఆశా భోస్లే ‘కజ్రా మొహబ్బత్ వాలా’ అంటే ఉలిక్కిపడేట్టు షంషాద్ బేగమ్ ‘దునియా హై మేరే పీచే’ అంటుంది.(కిస్మత్ సినిమా)

‘తేరి మెహఫిల్ మె కిస్మత్ ఆజ్మాకర్ హమ్ భి దేఖేంగే ‘ అని లతామంగేష్కర్,షంషాద్ బేగమ్
లు  పాడుతుంటే రెండు నదులసంగమిస్తూ కూడా తమ రంగులను తమతో పాటు తీసుకెళుతున్నట్టనిపిస్తుంది.(మొఘల్ ఎ అజమ్ సినిమా)

చిత్రపరిశ్రమతో పాటు పెరిగిన షంషాద్ బేగమ్ 60ల వరకూ తన ఉనికిని ‘గట్టిగా’ చాటుకుంది.
వెల్లువలాంటి లతామంగేష్కర్ గాన ప్రవాహానికి ఎదురునిలబడి పదేళ్ళపాటు పోటి ఇచ్చింది. పెద్దవయసులో తన లిమిటేషన్ తెలుసుకుని శాస్త్రీయ సంగీతం అభ్యసించింది.

ఆమె పాట ప్రాకృతం గా ఉంటుంది. పెద్ద షాపింగ్ మాల్ లో  పెర్ ఫ్యూమ్స్ అమ్మేచల్లనిచోటులో వచ్చే సుగంధం లతామంగేష్కర్ పాట అనుకుంటే వేసవి సాయంత్రం,వెన్నెలవేళ  అడవి మల్లెల గుబాళింపు షంషాద్ బేగం పాట.

 
సంగీత దర్శకుడు ఓ.పి.నయ్యర్ కి నేను పెట్టుకున్న కొండగుర్తు ,పాటలో ‘చిడతల ‘శబ్దం. చేతిలో ఇమిడే రెండు చిన్న చెక్క ముక్కలను సంగీత వాద్యం  చేసే విద్యను చిన్నప్పుడు సంతలో చూసాను. అదే శబ్దం ఓ.పి. నయ్యర్ అనేక పాటల్లో విన్నాను. ఆ  చిడతల శబ్దం పాటకొక  అశ్వ వేగాన్ని ఇస్తుంది.

వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ పాట ‘సి. ఐ.డి’ సినిమాలోనిది.రచన మజ్రూహ్ సుల్తాన్ పురి. సినిమాలో హీరో హీరోయిన్లు నగరీకులు. వారు పల్లెకు వచ్చినప్పుడు వారికి ఎదురైన పాట. అప్పటివరకూ వున్న నగరవాతావరణానికి భిన్నమైన వాతావరణం.భిన్నమైన సంగీతం,గానం,అభినయం.


“నాపేరు చెప్పుకో
నది ఒడ్డున మా వూరు
మా వాకిట్లో ఉన్న రావిచెట్టు ఊగుతూ
చల్లని నీడ నిస్తుంది

లోకులంటారు నన్నువెర్రిదానినని
నా ఎగిరే కురులు..
నా నల్లని పుట్టుమచ్చ ..
నా ఎర్రని ముఖం తో
నేను వీధుల్లో తిరిగితే నాతో ఊరంతా ఊగుతుంది


నా వంక జాగ్రత్తగా  చూడు
నా కురుల్లో నీ గుండె చిక్కుకుండా చూసుకో
చంచలిని.. నేను కదిలితే
అందరూ మనసుపడతారు.

మనసుపారేసుకునే వారిమధ్య
నా కళ్ళకు మంచిపేరు లేదు
ఐనా నేనొక చిక్కుముడిని
.. నాపేరెందుకు చెప్పలేరు.

నే వెళుతున్నాను
ఎక్కడికెళుతున్నానో చెప్పగలవా?”

-ముళ్ళపూడి సుబ్బారావు


Monday, May 1, 2017

ఇక్ హసీన్ షామ్ కో దిల్ మెరా ఖోగయా

నచ్చిన పాటలు-లోపలి మాటలు-74


ఇక్ హసీన్ షామ్ కో దిల్ మెరా ఖోగయా”(ఒక అందమైన సాయంత్రం హృదయాన్ని పోగొట్టుకున్నాను)
దుల్హన్ ఎక్ రాత్ కి  సినిమాలో మొహమ్మద్ రఫీ పాడిన పాట. మదన్ మోహన్ సంగీతం,రాజా మెహ్ది అలి ఖాన్ రచన.

రేడియో తనపని తను చేసుకుంటూ మననీ పనిచేసుకోనిస్తుంది.  సిడి ప్లేయరో, ఐ పాడ్ వంటి మ్యూజిక్ ప్లేయరు కూడా తమమానాన తమ పని చేసుకుంటాయి. కానీ ఒక తేడా వుంది. రేడియో లో రాబోయే పాటలలో ఒక రకమైన ‘సర్ప్రైజ్ ఎలిమెంటు’ ఉంటుంది.ఏ పాట రాబోతుందో నన్న ఒక ఎదురు చూపు ఉంటుంది. . కొన్నిసార్లు రేడియో నడుస్తూ ఉంటుంది. మనం రెండు అవస్థల (జాగృత,సుశుప్త) మధ్య ఉంటాము. ఆ స్థితిలో ప్రత్యేకమైన ఇష్టంలేని పాటలు వచ్చిపోతుంటాయి. ‘అన్ నోటీస్డ్’గా కొన్ని పాటలు సాగిపోతుంటాయి.
కొన్ని పేర్లు విన్నప్పుడో,కొన్ని కాంబినేషన్లు విన్నపుడో హఠాత్తు గా పూర్తి మెలకువ వచ్చి పాటమీద మనసు లగ్నమౌతుంది.


నావరకూ సంగీత దర్శకుడు మదన్ మోహన్, గీత రచయిత  రాజా మెహ్ది అలి ఖాన్ కాంబినేషన్ అలాంటిది. ఆ కాంబినేషన్ కూ మహమ్మద్ రఫీ  కలిస్తే  మరింత ప్రత్యేకం.

రాజా మెహ్ది అలి ఖాన్ పాటలకు  మిగతా సంగీత దర్శకులు చాలానే వరుసలు కట్టారు కాని రేడియో లో వినిపించే  రాజా మెహ్ది అలి ఖాన్ పాటలకు సంగీతకారుడు ఎనభై శాతం మదన్ మోహనే.

దుల్హన్ ఎక్ రాత్ కీ సినిమాలో ఈ పాట ధర్మేంద్ర ,నూతన్ మీద చిత్రీకరించారు.సాధారణంగా నలుపు తెలుపు సినిమాలు ,పాటల్ని అలసట తీర్చేవి (stress busters) గా చెబుతారు. ఇలాంతి పాటలు విన్నప్పుడు అది నిజమనిపిస్తుంది.


“ఒక అందమైన సాయంత్రం హృదయాన్ని పోగొట్టుకున్నాను
ఇంతకు ముందు నీదాననే అనేది, ఇప్పుడు వేరే వారిదైపోయింది


ఎప్పటినుండో కోరిక
జీవితంలోకి ఎవరో రావాలి
శూన్యం గా ఉన్న జీవితంలో ఒక దీపం వెలిగించాలి
తనొస్తే లోకం వెలుగులమయం ఔతుంది.


నా హృదయ గమనాన్ని
ఎవరో చేతుల్లోకి తీసుకున్నారు.
ఎవరివో మంచుతెరలు కట్టిన కళ్ళు
కొద్దిగా మెలకువతో,కొద్దిగా నిద్రతో ఉన్నాయి
తనని చూసి ఋతువు అహ్లాదకరమౌతుంది.”

-ముళ్ళపూడి సుబ్బారావు

Saturday, April 29, 2017

ఆజ్ సె పెహ్లే ఆజ్ సె జ్యాదా ఖుషీ ఆజ్ తక్ నహీ మిలీ

నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-73’
ఆజ్ సె పెహ్లే ఆజ్ సె జ్యాదా ఖుషీ ఆజ్ తక్ నహీ మిలీ’
(నేటికంటే ఎక్కువ ఆనందం ఇదివరకెన్నడూ కలగలేదు)
చిత్ చోర్ సినిమాలో జేసుదాస్ పాట. రచన, సంగీతం రవీంద్ర జైన్.

రాజశ్రీ ఫిల్మ్స్ వారి సినిమాలు  పాటల కు పెట్టింది పేరు. మంచి కథతో ,చిన్న బడ్జెట్ తో, మరీ పాపులర్ కాని నటులతో, మధ్య తరగతి జీవితాన్ని ప్రతిబింబించే సినిమాలు తీసేవారు.70 లలోనూ,80ల తొలినాళ్ళలోను వారి ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి
. ఐతే తర్వాత వారు తమ పంథా మార్చారు.పెద్ద బడ్జెట్, ఎక్కుమంది తారాగణం తో వైభవోపేతమైన ఎగువతరగతికి కుటుంబ జీవితాన్ని చూపించే సినిమాలు తీయటం మొదలు పెట్టారు.
వారి అప్పటి ,తర్వాతి సినిమాలు చూస్తే  కొన్నిపాత సినిమా కథలనే లనే  మళ్లీ తీసారని అర్ధమయ్యింది. కథ ,పాత్రలు అవే. వారి నేపధ్యం మధ్యతరగతి నుండి  ఎగువతరగతికి మారింది. సాదాసీదా జీవనశైలి నుండి పైపైకి ఎగబాకింది.ఆలోచనలు అవే,సమస్యలు అవే,ఆశలు అవే. కాని చూపించే వాతావరణంవేరు.
1976 లో చిత్ చోర్  సినిమా వారి సంస్థ నుండి వచ్చింది. స్కూల్ టీచర్ రెండొ అమ్మాయి పెళ్లి కి సంబంధించిన కథ. పెద్దమ్మాయి పట్నంలో ఉంది. ఆ పల్లెకి రాబోతున్న ఒక ఇంజనీర్ అమ్మాయికి తగినవాడని, ప్రయత్నించమని ఇంటికి ఉత్తరం రాసింది.
అలా పల్లెకి వచ్చిన ఉద్యోగి ని ఆ కుటుంబం దగ్గర చేసుకుంది. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. అంతలో తెలిసిన విషయం ఆ ఉద్యోగి ,వాళ్ళ పెద్దమ్మాయి చెప్పిన ఇంజనీర్ కాదు,అతనికింద పనిచేసే ఉద్యోగి అని. ఆ ఇంజనీర్ ఇప్పుడు వస్తున్నాడు.
ఇలా సాగిన కథ నెమ్మదిగా కంచికి వెళుతుంది.
2003 లో వారి రాజశ్రీ సంస్థ నుండే వచ్చిన సినిమా ‘మై ప్రేమ్ కి దీవాని హూ’. టౌన్ లో చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయి అక్క అమెరికా నుండి ఇంటికి ఫోన్ చేసి చెప్పింది ‘ఒక అబ్బాయి ఇండియా వస్తున్నాడు ,చెల్లి కి వరుడుగా ప్రయత్నించమని’.
వచ్చిన వ్యక్తి అతను కాదు. మళ్లీ అదేకథ.

చిత్ చోర్ సినిమాలో పాటలు ‘గోరి తెరా గావ్ బడా ప్యారా’,’తుజో మేరే సుర్ మే’,’జబ్ దీప్ జలే ఆనా’,’ఆజ్ సె పెహ్లే ఆజ్ సె జ్యాదా’ ఇలా అన్నీ కర్ణపేయాలే.
‘ఆజ్ సె పెహ్లే ‘ పాట పట్ల నా ఇష్టానికి కారణం అది రోడ్ సాంగ్ కావటం.
అసలైన ఇంజనీర్ పల్లెకు వచ్చాడు. అతను, అతనికింది ఉద్యోగి , అమ్మాయి, అమ్మాయి పొరుగింటి పిల్లాడు కలిసి జీప్ లో ప్రయాణిస్తున్నారు. ఇది ఆ సందర్భంలో  పాట. సాగిపోతున్న చక్కటి అటవీ నేపధ్యం,  శ్రావ్యమైన జేసుదాస్ గానం,చక్కని సంగీతం, మధ్యలో ఈలపాట తో ఇది నిలబడిపోయే పాట అయ్యింది.

“నేటికంటే ఎక్కువ ఆనందం
ఇదివరకెన్నడూ కలగలేదు
ఇంత ఆహ్లాదకరమైన ,ఇంతకంటే తీయని
ఘడియలు నేటివరకూ దొరకలేదు

దీనిని యాదృచ్చికమనాలా? విధి అనాలా?
మనసుకిష్టమైన వారిని కలిసిన మనందరి ముఖాలు
ఎలా వికసించాయో చూడండి.
విధి కలిపిన ఈ జత
ఇలాంటి కలయిక  నేటివరకూ దొరకలేదు.

మనమంతా కన్న కల సఫలమౌతుంది
ఇది నా మనసు కోరుతుంది.
గడుస్తున్న ఈ క్షణాలు కలిగించే మైమరపుతో
నా మనసు పాడటం మొదలుపెట్టింది
ఇలాంటి సంతోషం కోసం వెతుకుతున్నాను
అది ఈ రోజువరకు దొరకలేదు.”

-ముళ్ళపూడి సుబ్బారావు.

Thursday, April 27, 2017

'కోయీ హోతా జిస్కో అప్నా '


'కోయీ హోతా జిస్కో అప్నా '
నావాళ్ళు అనుకునేవాళ్ళు ,ఎవరైనా ఉంటే బాగుండును
(మేరే అప్నే సినిమాలో పాట గుల్జార్ రచన, సలీల్ చౌధరి సంగీతం)

కొన్ని అభిమానాలు అనుకోకుంకుండానో,యాదృచ్చికంగానో కలుగుతాయనిస్తుంది. వెతికితే వాటికి కారణాలు కనిపిస్తాయేమో.


నాకు పదిహేనేళ్ళ వయసపుడు వినోద్ ఖన్నా సినిమాలు చూడటం మొదలు పెట్టాను. నేనతని అభిమానినా అంటే అప్పుడు ఔననే చెప్పాలి.


కనీసం పది సంవత్సరాలు (80- 90) అతనివి పాతవి కొత్తవి అనేక సినిమాలు చూసి ఆనందించాను. ఇప్పటి వరకూ అతనికి సంబంధించిన న్యూస్ ను ఫాలో ఔతూనే వున్నాను.
అతని నటజీవితానికి,వ్యక్తిగత జీవితానికి, రాజకీయ జీవితానికి సంబంధం వుండే వుంటుంది. నావరకు వినోద్ ఖన్నా అంటే డెబ్భైల మొదలుకుని 90 వరకూ సాగిన అతని తెర జీవితమే. అది నాకు ఆనందాన్ని ఇచ్చింది. మేరె అప్నే,కచ్చే ధాగే, ఇంతిహాన్,అమర్ అక్బర్ ఆంథొని,కుర్బాని సినిమాలలో అతని పాత్రలతో ఎక్కడో ఐడెంటిఫై ఔతానని పిస్తుంది.


అతని నట జీవితాన్ని చూస్తే రెండు ఫేజ్ లు కనిపిస్తాయి.
సపోర్టింగ్ ఆర్టిస్ట్ గామొదలై,విలన్ గా  నటించి ,హీరోగా మారి హఠాత్తుగా నటనను విరమించుకున్నంతవరకూ ఉన్నకాలం, ఐదేళ్ళ విరామమ్ తర్వాత తిరిగి నటించిన కాలం.


70 కి అటూ ఇటుగా సినిమాలలోకి వచ్చి  కమర్షియల్ సినిమాల్లో రాణిస్తూనే మేరే అప్నే,అచానక్,మీరా వంటి ఆఫ్ బీట్ సినిమాల్లో నటించి దర్శకుల నటుడనిపించుకున్నాడు.


మల్టిస్టారర్ సినిమాలలో సునీల్ దత్,ధర్మేంద్ర,రాజేశ్ ఖన్నా,జితేంద్ర,అమితాబ్ బచన్ వంటి నటులతో తెర పంచుకున్నాడు.


సునీల్ దత్ తన సొంత సినిమా రేశ్మా ఔర్ షేరా సినిమాలో సపోర్టింగ్ కారక్టర్ ఇచ్చి వినోద్ ఖన్నా ను ప్రోత్సహించాడు.తరువాత వారిద్దరు నెహ్లే పె డెహ్లా, డాకూ ఔర్ జవాన్ వంటి సినిమాల్లో నటించారు.


ధర్మేంద్ర తో నటించిన సినిమాలలో మొదట్లో విలన్ గాను తరువాత సమానమైన పాత్రలలోనూ నటించాడు. వారు నటించిన సినిమాలలో ఎమోషనల్  కంటెంట్ ఎక్కువ వుండేది. మొదటగా వారు కలిసి నటించిన మేరా గావ్ మేరా దేశ్ సినిమా ఒక మైలు రాయి లా నిలిచింది. వినోద్ ఖన్నా పునఃప్రవేశం తర్వాతకూడా వారుబట్వారా, క్షత్రియ    వంటి  ఆక్షన్ ఓరియంటెడ్ సినిమాల్లోనే కనిపించారు.


కబీర్ బేడి తో అతను కలసి నటించిన ‘కచ్చే ధాగే ‘ సినిమాకు కొందరు వీరాభిమానులున్నారు.


డెభై ఐదు -డెబ్భై ఎనిమిది మధ్య అమితాబ్ తో కలిసి వినోద్ ఖన్నా ఎనిమిది సినిమాల్లో నటించాడు. జమీర్,పర్వరిష్, అమర్ అక్బర్ ఆంథనీ ,ఖూన్ పసీనా, ముకద్దర్ కా సికందర్ ఇలాంటి సినిమాలు అన్నీ విజయంసాధించాయి.


86/87 లో తిరిగి చిత్రరంగ ప్రవేశం చేసి మరో పదేళ్ళు కథానాయక పాత్రలు ధరించాడు.అప్పుడు వచ్చిన సినిమాలలో ఇన్సాఫ్,సత్యమేవ జయతే వంటి హిట్లు ఉన్నాయి.కమల్ హసన్ ‘నాయకన్’ సినిమాను వినోద్ ఖన్నా తో అతని మిత్రుడు ఫిరోజ్ ఖాన్ నిర్మించాడు. కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా హిట్ అయ్యింది. మరో చెప్పుకోదగ్గ సినిమా ‘ యాష్ చోప్రా నిర్మించిన చాందిని’. అదే కాలంలో వచ్చిన మహేష్ భట్ సినిమా ‘జుర్మ్ ‘ కూడా మంచి గుర్తింపు పొందింది.


70 లలో వినోద్ ఖన్నా తో తన తరహా సినిమాలు తీసిన ‘గుల్జార్’  90లలో కూడా డైరెక్టర్ మూవీ అనదగ్గ ‘లేకిన్’ సినిమా తీశాడు.


తర్వాత రోజుల్లో వినోద్ ఖన్న చాలా సినిమాల్లో నటించినా అతనిదైన మార్క్ వాటిల్లో కనపడదు. తండ్రి తరహా పాత్రలలోకి మళ్లి కొన్ని సినిమాల్లోనూ,టివీ సీరియళ్లలోనూ కనిపించాడు.ఐతే అవేవీ నావంటి అభిమానుల్ని అలరించేవికావు.


ఈ రోజు (27/04/2017) తన డెబ్భైఒకటో సంవత్సరంలో అతను చనిపోయాడు.


1971 లో గుల్జార్ దర్శకత్వం లో వచ్చిన ‘మేరే అప్నే’ సినిమా అతనికి మంచి గుర్తింపు నిచ్చింది. అప్పటి నగరజీవితం,యువత ఆలోచనలు,నిరుద్యోగం, నేరప్రపంచం వైపు యువత చూపు వంటి విశయాలను చర్చించిందా సినిమా. అందులో పాట ఇది.


“నావాళ్ళు అనుకునేవాళ్ళు
ఎవరైనా ఉంటే బాగుండును
దగ్గరగా కాకున్నా దూరంగానైనా
ఎవరో నావాళ్ళు


కళ్ళకు నిద్రలేదు
అది కన్నీటిలో ఈదులాడుతుంది
రాత్రంతా కలల్లో మెలకువగా ఉంటాను
ఎవరో బాధ పంచుకొనేవారు
ఎవరో వెంట నడిచేవారు


మరచిపోయిన కొన్ని వాగ్దానాలు..  
గడచిపోయిన కొన్ని జ్ఞాపకాలు..
ఒంటరితనం రాత్రంతా వాటిని తిరిగి చెబుతుంది
ఏదో ఓదార్పు దొరికితే

ఎవరో నావారు దొరికితే”