లాస్ట్ మొఘల్ బహాదుర్ షా జఫర్ చివరికాలానికి చెందిన ఛాయా చిత్రాలు చూసినపుడు కలిగే భావాలు అనేకం.పరస్పర విరుద్ధ భావాలు.చివరి భావం ఇంగ్లీషులో ఐతే లంప్ ఇన్ ది థ్రోట్..గొంతుకకేదో అడ్డం పడటం.
తరతరాలుగా జరిగినదాని సకల పర్యవసానాలకి చిట్టచివరి వాడు బాధ్యత వహించాల్సిఉంటుంది.
అసంకల్పితంగా జల్సా ఘర్,షత్రంజ్ కే ఖిలాడి సినిమాలు గుర్తొస్తాయి.సామ్రాజ్యాధీశులు,ప్రభుత్వాధినేతలు,సంస్థల అధిపతుల నుండి కుటుంబ అధిపతులదాక అధికారాంతంలో ప్రతిఫలాన్ని అనుభవిస్తున్న అనేకమంది కళ్ళముందు రూపుకడతారు.
ఇలాంటిస్థితి ఎదురైతే అందరి ప్రతిస్పందనా బహాదుర్ షా జఫర్ పద్ధతిలోనే ఉంటుందా?
కళో సాహిత్యమో..అది జఫర్ కు పలాయన మార్గమయ్యిందా? లేదా తన స్థితిని తెలుసుకునే ఎరుక నిచ్చిందా?
ఫోటొగ్రాఫులో కెమేరావంకే చూస్తున్న అతని చూపులు వెంటాడుతూనే వుంటాయి.అవి కెమేరానే కాదు భావి తరాల వంక చూస్తున్నాయి.మౌనంగా పాఠాలు చెబుతున్నాయి.
గతంనుండి బంధ విముక్తులం కావడం అసాధ్యం కాదేమో కాని బహు కష్టం.విముక్తికై విఫలయత్నాలు బహాదుర్ షా జఫర్ చేసాడేమోనని సందేహాత్మక ప్రతిఫలం (బెనిఫిట్ ఆఫ్ డౌట్) ఇవ్వాలని పిస్తుంది అతనివని చెప్పబడే కవితలు చూస్తే.
ఆయన రాసిన ఒక ఘజల్ అర్ధం ఇలా సాగుతుంది.
‘నేనెవరి కంటికి కాంతిని కాను,ఎవరి గుండెకు ఓదార్పు ను కాను
నేనెవరికి ఆసరా కాలేను,నేనోక పిడికెడు ధూళిని.
నా రంగూ రూపూ నశించాయి,నా ప్రేమ నన్ను విడిచి పోయింది
ఆకురాలు కాలంలో ధ్వంసమైన తోటలో వసంతంలో పండిన పంటను
నేనెవరికి మిత్రుణ్ణికాని నేనెవరి శతృవుని కాను
శిధిలమైనట్టి విధిని,బీడుపడ్డ నేలను
ఎవరో వచ్చి శోకగీతం ఎందుకు ఆలపిస్తారు?నాలుగు పూలు ఎందుకుచల్లుతారు?
ఎవరో వచ్చి దీపం ఎందుకు వెలిగిస్తారు? నేనోక దారిద్ర్యపు సమాధిని”
ఈ ఘజల్ ను ‘లాల్ కిలా’ సినిమాలో మహమ్మద్ రఫీ పాడారు. ‘బహాదుర్ షా జఫర్’ పేరుతో వచ్చిన టీ వీ షో లో ‘మహేంద్ర కపూర్ ‘ పాడారు.
రెండూకూడా విన్నవారి నయనాలని బహదూర్ షా కోసం చెమ్మగిలజేస్తాయి.
జఫర్ నిరాసక్తుడైన ప్రభువు.తనకాలంలో కానికాలం వచ్చినందుకు కలతపడ్డాడు.అంతిమంగా యధాతధస్థితి లోనే సాగాడు.అందుకే విషాదం.దీనిపై ఎవరి అవగాహనను బట్టి వారు అనుకుంటారు.బ్రిటిష్ పాలనకు తలవంచని యోధుడని కొందరు కీర్తిస్తారు.కాలాన్ని బట్టి నడచుకోనివానిగా కొందరు తలుస్తారు.
అంతిమంగా జఫర్ తన మహా సంఘర్షణను కవితారూపంలో వెలిగక్కగలిగిన ఓ ఫ్యూడల్ ప్రభువు.
ముళ్ళపూడి సుబ్బారావు
No comments:
Post a Comment