Wednesday, March 29, 2017

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-13: 'సోలా బరస్ కీ బాలీ ఉమర్ కో సలామ్
'Subbarao Mullapudi
'బీతే హుయె లమ్హోంకి కి కసక్ సాత్ తో హోగి ' (గడచిన క్షణాల తాలూకూ బాధ వెంట వుంటునే వుంటుంది)..ఇదొక గజల్ లో పదం. 'బీతీ హుయీ గలియోంసే ఫిర్ సే గుజర్నా' (నడిచొచ్చిన వీధుల్లో తిరిగి తిరుగాడాలి) .ఇదొక పాటలో భాగం.మొదటిదానిలో గడిచిన కాలంపట్ల ప్రేమ.రెండవ దానిలో తిరుగాడే స్థితి పట్ల విరక్తి.
ఈ రెండు స్తితులు ఒకేసారి అనుభవించవలసి వస్తే??
హృదయభాష తో మాటాడుకుంటూ దగ్గరైన ప్రేమికులకు పరీక్షపెట్టి వేరుగావుంచారు.ఆ పరీక్ష కొంత ఎడబాటును భరి...ంచి ప్రేమనిలుపుకోవటం.అమ్మాయి సొంతవూరిలోవుంది.అబ్బాయి దూరంగా వేరేవూరిలో ఉన్నాడు.అమ్మాయి తల్లికి ఈ కాలంలో కూతురు అతన్ని మరిచిపోవాలని ఆశ.
బాధలోఉన్న అమ్మాయి ,అంతకుముందు అతనితో కలసి తిరిగిన చోటులన్నీ తిరుగుతుంది.తల్లి ఆమెకు కాపలా. ఈ నేపధ్యంలో ఈ కింది పాట. అంతకుముందు అమితానందాన్ని అందించిన స్థలాలు, కొండలు,శిధిల భవనాలు, సాగరతీరాలు, కొండదారులు, రహదారులు...అన్నిచోట్లా తిరుగాడుతూ అప్పటి ఆనందాల్ని,ఇప్పటి విషాదాన్ని ఒకేసారి అనుభవిస్తుంది. తనకేవైతే ఆనందకారకాలయ్యాయో వాటన్నింటికీ సలాము చేస్తుంది.
ప్రేమసినిమాలలో ఒక మైలు రాయిగా నిలిచినసినిమాఏక్ ధూజే కేలియే(తెలుగు లో మరోచరిత్ర).అందులో ఈ పాట భజన్ గాయకుడు అనూప్ జలోటా గొంతుతో ఒక్కసారి ఉలికిపడేట్టు మొదలై లతామంగేష్కర్ స్వరంతో సాగుతుంది.
పాట అర్ధం సుమారుగా
“సరస్సులూ,నదులూ కార్చిచ్చు ని ఆర్పగలవు గాని ఎంత యత్నించినా ప్రేమజ్వాల ను ఆర్పలేవు.....
పదహారేళ్ళ లేత ప్రాయానికి సలాం,ఓ ప్రేమా నీ తొలిచూపుకు సలాం
లోకంలో తొలిసారిగా ఎవరు హృదయాన్నిచ్చారో,ఈ లోకపు తొలి ప్రేమికునికి సలాం
గుండెలో పుట్టిన ప్రేమపథాలకు,గుండెలను చేరే దారులకు సలాం
ఎక్కడైతే యవ్వనంలోకి వచ్చి,ప్రేమనింద మోసామో,ఆ వూరికి,ఆ వీధికి,ఆ ఇంటికి సలాం.
ఎక్కడకలిసామో,ఎక్కడవిడిపోయామో,ఆ కాలానికి,గంటలకు,నిముషాలకు సలాం
మనంకలిసిన చోటి శిలలకు,వాటిపైని చెరిగిపోని రాతలకు సలాం.
నా మనసులో రేగే అలల్లా,సాగరంలో రేగే ప్రతి అలకూ సలాం.
నా ప్రియుని లోతైన నయన సాగరంలో,నన్ను ముంచిన భ్రమరానికి సలాం
ద్వేషించేవారు ఎన్నిసార్లు యత్నించినా,ఒక్కసారీ కిందికి వాలని చూపుకి సలాం”

--ముళ్ళపూడి సుబ్బారావు

1 comment: