Wednesday, March 29, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-46’'మైనే పూచా చాంద్ సే ' 3 March at 13:02
“మీర్ కీ ఘజల్ కహూ తుఝే మై, యా కహూ ఖయాం కీ రుబాయీ”
(నిన్ను మీర్ రాసిన ఘజల్ అందునా,లేక ఖయ్యాం రాసిన రుబాయీ అందునా?)
...
మహమ్మద్ రఫీ పాడిన 'మైనే పూచా చాంద్ సే " పాటలో భాగం.సినిమా పేరు 'అబ్దుల్లా'
ఏలూరులొ కలెక్టరు ఆఫీసు పక్కనున్న గ్రౌండు లో ప్రతీసంవత్సరం పారిశ్రామిక/వ్యవసాయ ప్రదర్శన పేరు తో 'ఎగ్జిబిషన్ ' జరిగేది.చుటుపక్కల వూర్లకు అదో పెద్ద ఆకర్షణ.80లో కాలేజిలోజేరినాక తొలిసారి ఎగ్జిబిషన్ చూసాను. బాగా గుర్తుండిపోయింది మాత్రం అక్కడ చూసిన మ్యూజికల్ నైట్. సినిమాలోనో,రేడియోలోనో మాత్రమే విన్న గాయకుడిని ప్రత్యక్షంగా తొలిసారి చూడటం. ఆ గాయకుడు కె.బి.కె.మోహన్ రాజు.అతను పాడింది ఒక హిందీ పాట. ఆ పాట 'మైనె పూచ చాంద్ సే కి దేఖ్ హై కహి '.ఒరిజినల్ గా పాడింది మహమ్మద్ రఫీ( ఆ సంవత్సరమే రఫీ కాలం చేశాడు).
ఆ సినిమా నిర్మాతా దర్శకుడూ కథానాయకుడు 'సంజయ్ ఖాన్ '.అబ్దుల్లా సినిమాను చాలా ఇష్టంగా తీసాడంటారు.మధ్యయుగాలనాటి,అరబ్బీ ప్రాంతపు నేపధ్యంలో సినిమా సాగుతుంది.అందులోనూ మతసామరస్యాన్ని ప్రబోధిస్తాడు. అబ్దుల్లా పాత్ర సీనియర్ నటుడు'రాజ్ కపూర్ ' ధరించాడు.పెద్ద తారాగణం, మంచి పాటలు (మైనే పూచా చాంద్ సే (రఫీ),యే ఖుదా హర్ ఫైస్లా (కిశోర్ కుమార్),భీగా బదన్(ఆశా భోంస్లే) వంటివి వున్నా సినిమా జనాన్ని రంజింపజేయలేదు.
ఐతే ఇప్పటికీ ఈ సినిమా అంటే గుర్తొచ్చేది రఫీ పాడిన 'మైనే పూచా చాంద్ సే ' పాటే.రఫీ రెండిషను,ఆనంద్ బక్షి సాహిత్యం,ఆర్ డి బర్మన్ సంగీతం, ఎప్పుడు విన్నా చివరిదాకా వినాలనిపించేలా చేశాయి.
ముఖ్యంగా చివరి చరణం ' మీర్ కీ ఘజల్ కహూ తుఝే మై, యా కహూ ఖయాం కీ రుబాయీ ' బాగా నచ్చుతుంది. మీర్ తఖి మీర్ గజళ్ళు, ఒమర్ ఖయ్యాం రుబాయీ పట్ల ఆసక్తి పెరగటానికి ఈ పాట కొంత కారణమయ్యిందేమోననిపిస్తుంది. ఆరకంగా ఈ పాటకు నేను ఋణపడినట్టే.
“చంద్రుడిని అడిగా
ఎక్కడైనా చూసావా
నా ప్రేయసి వంటి అందాన్ని?
చంద్రుడు అన్నాడు
వెన్నెల మీద ఒట్టు..ఉహూ..లేదు.
ముసుగులో ఉన్న నీకై వెతికాను
ప్రతిచోటా నీ యవ్వనాన్ని వెతికాను
మొగ్గలను నీతోపోలికా అని అడిగాను
పువ్వుల్లో నీ సరి ఉందా అని వెతికాను.
తోటను అడిగా
గగనంలో,ఇలలోనూ
ఇలాంటి కుసుమం ఉందా ఎక్కడైనా?
తోట అన్నది
ప్రతీ మొగ్గ మీద ఒట్టు...ఉహూ..లేదు.
అవి నడకలా? అలల కదలికలా?
అవి కురులా ? నిశీధి కథలా?
అవీ అధరాలా? కలువ రేకులా?
అవి కన్నులా? మధుశాల పాలికలా?
మధుపాత్రని అడిగాను
గగనంలో,ఇలలోనూ
అలాంటి మధువు ఉందా ఎక్కడైనా
మధుపాత్ర అన్నది
మైకం మీద ఒట్టు...ఉహూ..లేదు.
నువ్వు పొందిన ఈ అందం మేరా
దేవుడు తన దైవత్వాన్ని పోగోట్టుకున్నాడు.
నిన్ను మీర్ రాసిన ఘజల్ అందునా
లేక ఖయ్యాం రాసిన రుబాయీ అందునా?
కవులనడిగా
అలాంటి కవిత ఉందా ఎక్కడైనా
కవులు చెప్పారు
కవిత్వం మీద ఒట్టు..ఊహూ...లేదు.”
-ముళ్ళపూడి సుబ్బారావు




No comments:

Post a Comment