Wednesday, March 29, 2017

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-36’
“తుమ్హే యాద్ కర్ తె కర్ తె , జాయేగి రైన్ సారీ”8 February

(నీ జ్ఞాపకాలతో రాత్రంతా మెలుకువతోనే ఉండిపోతాను.)
'అమ్రపాలి ' సినిమాలో లతా మంగేష్కర్ పాడిన పాట.శంకర్ జైకిషన్ సంగీతం,శైలేంద్ర రచన.నటి వైజయంతిమాల.
...
ఈపాటంటే గుర్తుకొచ్చేవి సితార్,వయొలిన్ల వాదనలు. పాట మధ్యలో వచ్చే సితార్ ధ్వని కొన్నిక్షణాలు మైమరపు కలుగజేస్తుంది. పాట అర్ధం తెలియకుండా విని తర్వాత అర్ధం తెలుసుకుంటే మొత్తంతెలిసిందే అనిపించేంతగా లతా మంగేష్కర్ ఆలపించిందనిపిస్తుంది.
యుద్ధము-శాంతి
అమ్రపాలి కథ గౌతమ బుద్ధుని కాలం నాటిది. అజాతశత్రు మగధ రాజ్యాధిపతి.వైశాలి నగర ఆక్రమణ అతనికోరిక.అది వీలుకాలేదు.మారువేషంలో వైశాలికి వచ్చి అక్కడ రాజనర్తకి 'అమ్రపాలి 'పట్ల ఆకర్షితుడయ్యడు.ఇప్పుడు నగరమే కాదు అమ్రపాలి ని కూడా అజాత శత్రు పొందాలి.
శత్రువును ప్రేమించినందుకు అమ్రపాలి ని రాజు ఖైదు చేశాడు. అజాతశత్రు వైశాలిపై దండెత్తి విధ్వంసానంతరం నగరాన్ని చేజిక్కించుకున్నాడు.అమ్రపాలి ని రాణిని చేస్తానన్నాడు. విధ్వంసం,హింస,జననష్టం చూసిన అమ్రపాలి అన్నింటిని తృణికరించి గౌతమ బుద్ధుని చెంత స్వాంతన చెందింది.
అజాతశత్రు రాజ్యసీమ గెలిచాడు కాని అమ్రపాలి హృదయసీమలో చోటుకోల్పోయాడు.
'అమ్రపాలి ' అజాతశత్రు ను సాధారణసైనికునిగా భావించి అతని ప్రేమలో ఉన్నప్పుడు వచ్చే పాట ఇది.
“నీ జ్ఞాపకాలతో రాత్రంతా మెలుకువతోనే ఉండిపోతాను.
నీతోనే నా నిద్రనూ తీసుకుపోయావు
మనసు నాకేతెలియని నగరంలో బస చేసింది.
తప్పిపోయిన దారుల్లో ఏదో వెతుకుతుంది.
ఇంత పెద్ద భవనంలో ఏదో భయం కలుగుతుంది
ఈ విరహపు చితి నుండి నీవే నన్ను తప్పించు
నువ్వు రాలేకపోతే నన్ను స్వప్నంలోకైన పిలువు.
నన్నిలా కాల్చేయకు, చిరుప్రాయపు ప్రేమ నాది.”
-ముళ్ళపూడి సుబ్బారావు

No comments:

Post a Comment